శివానంద మూర్తిమత్వం

శివానంద మూర్తిమత్వం

నిన్న మొన్న అనిపిస్తున్న, కైలాసవాసులైన పరమశివాంతఃకరణులు కందుకూరి శివానంద మూర్తి మహనీయుల గూర్చి తెలుగునాట అన్ని ప్రాంతాలలోనూ తెలియనిదెవరికి ? వారిది వంశోన్నతి గల చరిత్ర. భక్తి జ్ఞాన లోక క్షేమంకర ఏకీకరణ నివిష్ట సందేశ జీవితం వారిది. భారతీయాత్మ స్వరూపులు వారు. మన పురాణేతి హాసాలు, ఋషుల చరిత్రలు, గుళ్ళు, గోపురాలు, దార్శనిక సంప్రదాయాలు, నేటి దురదృష్టకర సామాజిక, రాజకీయ పరిభ్రష్టతలు వారికి అవగతమైనంతగా వీటిని గూర్చి ప్రబోధ పరత్వం నేటి సమాజానికి ఎందుకు? ఎంత ? అవసరమో వారికి తెలిసినంతగా, తెలియటమే కాదు సంస్థాగత కృషికి వారు నిశ్శబ్ద ఉద్యమం సాగించినంతగా మరొకరి ప్రస్తావన వీరితో కలిపి తేవడం కష్టం. వీరి గ్రంథాలన్నీ చదివిన వారికి వీరి సారస్వత జీవన మూర్తిమత్వం ఎంత మహత్వమైనదో తెలుస్తుంది. సహస్రాధికంగా వీరి ఉదార వదాన్య హస్తం సత్కార్యక్రమాలకు స్పందించి ఉంటుంది. సంగీతం, సాహిత్యం రెండూ వారి దానహస్తాలే. దాక్షిణ్య విన్యస్తాలే. కొన్ని కోట్ల రూపాయలు వీరు గిరిజన వయోజన విద్యా వికాస కార్యక్రమాలకు ఇచ్చి ఉంటారు. ఆసేతు శీతాచలం వారు ఎన్నోసార్లు పరివార బృందంతో తీర్థయాత్రలు చేశారు.

హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఈ భరతభూమి సంసిక్త దేహుణ్ణి కావాలని నాకు అభిలాష అని ఒకసారి వారు అన్నారని వారి ఆంతరంగికులు మురిసిపోతూ ప్రస్తావించారని నేను అప్పుడప్పుడు వింటూ ఉండేవాణ్ణి. వీరి స్థిరావాస ప్రధానాశ్రమమైన భీమిలి నేను నాలుగుసార్లు వెళ్ళి వారి ప్రేమాభిమాన పాత్రుణ్ణి అయ్యాను. ఓరుగల్లులో కూడా ములుగు రోడ్డులో వారు ప్రత్యేక కార్య క్రమాలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు నిర్వహించేవారు. ఓరుగల్లు ఆశ్రమం కూడా నేను మూడుసార్లు దర్శించాను. నన్నెంతో ఆదరించారు వారు. భీమిలి (భీముడి పట్నం) లోని వారి ఆవాసాశ్రమ గ్రంథాలయంలో వేల పుస్తకాలు, చరిత్ర, మతం, సంస్కృతి, సాహిత్యం, యాత్రా చరిత్రలు, అనుభవాలు, జ్ఞాపకాలకు సంబంధించినవి ఉన్నాయి. అవి బహుశా విశ్వవిద్యాలయాలలో కూడా ఉండకపోవచ్చు. వీరితో నాకు రెండు దశాబ్దాల చనువు, వినయ సాన్నిహిత్యం ఉండేది. కొత్త సహాస్రాబ్దానికి కొంచెం అటు ఇటు శివానందమూర్తి మ¬దయులు సంగీత ప్రజ్ఞుల, సాహిత్య ప్రతిభావంతుల సత్కారాలు సంస్థాపరంగా చేయటం ప్రారంభించారు. వారు కైలాసవాసులయ్యే వరకు శతాధికంగా ఈ సంగీత, సాహిత్య కార్యక్రమాలు పరమోల్లాసంగా జరిగేవి. శ్రీరామనవమి నాడు సాహిత్య, లలితకళా, చరిత్రాభిజ్ఞ, చలన చిత్ర విశిష్టమూర్తి మంతులకు సత్కారాలు చేస్తూ వచ్చారు.

1995 ప్రాంతంలో నా స¬ద్యోగి, సన్నిహిత మిత్రుడు అయిన ఎం.ఎల్‌.నరసింహారావు నన్ను తీసుకొని వెళ్లి శ్రీ శివానందమూర్తి గారి దర్శనం చేయించారు. నా పట్ల వీరికి తదాది వాత్సల్యం ఉండేదేమోననిపిస్తుంది. శ్రీరామనవమి ప్రతిభామూర్తి పరిగణనల ఉత్సవానికి అర్హులు, యోగ్యులు, వెంటనే పరిగణించాల్సిన వారి పేర్లు కొన్ని చెప్పవలసిందని వారు నన్ను ప్రోత్సహించారు. నేను చెప్పిన వారికి 20 మంది దాకా వారు పురస్కృతులను చేశారు. అదీకాక వారి పేర్లు చెప్పినందుకు ఎంతో సంతోషపడేవారు. కొమర్రాజు వారి హిందూ మహాయుగం, మహర్షి దయానంద మహాయుగం, పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, పోతనగారి రామాయణం వంటి నా గ్రంథ ప్రకటనకు వారెంతో ఉదారంగా ప్రచురణ ఖర్చులిచ్చారు.

ఒకసారి ఆషాడభూతి, సాహిత్యధూర్తుడు, వయసేమీ పరిగణనార్హం కాని వాడూ అయిన ఒక దాంభికుడికి ఆయన శ్రీరామనవమి పురస్కారం ఇవ్వడం నాకు చాలా కష్టం వేసింది. వారిని సాహసంతో ప్రశ్నించాను ఔచిత్యానౌచిత్య ప్రసక్తి తెస్తూ. ఏకాంత సన్నిధి కోరి వారి పాదాల దగ్గర కూర్చుని అపాత్ర దానం తప్పుకదా ! అని ప్రశ్నించాను. వారు పరమశాంతంగా చిరునవ్వుతో నా పట్ల దయాంతఃకరణంతో నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.

‘విద్యతోభూషితుండై వెలయుచున్న దొడరివర్జింప దగు సుమీ దుర్జునుండు, బారు మాణిక్యభూషిత శస్తమస్తకంబైన పన్నగము భయంకరము గాదే’ అని బొకాయించాను కూడా నేమో ! కాని అతీత కరుణాంతరంగులకు ఇత్తడి, పుత్తడి అని భేద దృష్టి ఉంటుందా ? అనిపిస్తుంది.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *