వేటూరి ప్రభాకరశాస్త్రి

వేటూరి ప్రభాకరశాస్త్రి

1988వ సంవత్సరంలో వేటూరి ప్రభాకరశాస్త్రి గారి శత జయంతి ఉత్సవాలు ఆంధ్రదేశమంతటా ప్రధాన నగరాలలో జరిగాయి. ప్రభాకరశాస్త్రి గారి స్వీయ చరిత్ర ‘ప్రజ్ఞా ప్రభాకరం’ తెలుగులో వచ్చిన స్వీయ చరిత్రలన్నిటిలో విశిష్టమైనది. చదవటం ప్రారంభిస్తే దానిని వదిలిపెట్టలేము. ఆయనకు అన్ని విధాలా తగిన తనయుడు ఆనందమూర్తిగారు. వేటూరి శత జయంతి ఇంకా నాలుగైదు సంవత్సరాలకు సందర్భపడుతున్నదనగా మొదలు పెట్టి పూజ్య పాదుల రచనలు సంపుటీకరించటానికి సంకల్పించి కృతకృత్యులైన వారు ఆనందమూర్తిగారు. శాస్త్రిగారు సాహిత్య సుగతు(తథాగతుడు)డైతే ఆనందమూర్తిగారు ఆయన యశోమూర్తిని సేవించుకున్న ఆనందుడనాలి.

అప్పట్లో ఆనందమూర్తిగారు నన్ను పదేపదే కోరగా ఆంధ్రప్రభలో ‘సాహిత్య మేరువు ప్రభాకర శాస్త్రిగారు’ అనీ ఆనందమూర్తి గారే ప్రకటించిన శాస్త్రిగారి సర్వ రచనల సంకలనాలలోనూ నేను నాలుగు రచనలు చేశాను. ఒక సంపుటానికి ప్రధాన సంపాదక వ్యాసకుణ్ణి నేను.

ఒకసారి హైదరాబాద్‌ నగరంలో త్యాగరాజ గాన సభలో స్మృతి సంవర్ధన మహాసభ జరిగింది. అందులో సత్యనారాయణ శాస్త్రిగారు ప్రధాన ప్రసంగం చేశారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావుగారు ప్రారంభోపన్యాసం హృద్యంగా చేశారు. అవి మరుపురాని సాహిత్య తిరునాళ్ళు.

శాస్త్రిగారి శత జయంతి సమాపనోత్సవం వేటూరి వంశ విభూషణలు జన్మించిన పెదకళ్ళేపల్లిలో జరపాలని ఉత్సవ సంఘం నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరం నుంచి ఒక ప్రత్యేక పెద్ద బస్సు మాట్లాడుకొని మేమంతా పెదకళ్ళేపల్లి బయలుదేరాము. ఆనందమూర్తిగారి సోదరీ, సోదరులు, కుటుంబ సభ్యులు, తిరుమల రామచంద్రగారు, నేను, ఉప్పలూరి కాళిదాసు దంపతులు ఈ బృందంలో ఉన్నాము. పెదకళ్ళేపల్లి చారిత్రక ప్రసిద్ధి చెందిన ఊరు. ఈ ఊరు చిన్నదే కాని ఇక్కడున్న శివాలయం మాత్రం అతి ప్రాచీనమైంది. ఈ శివాలయం పుట్టు పుర్వోత్తరాల గురించి ప్రభాకర శాస్త్రిగారు స్వీయ చరిత్రలో చెప్పారు.

పెదకళ్ళేపల్లిలోనూ, అక్కడికి దగ్గరే ఉన్న అవనిగడ్డలోనూ స్వాగత అతిథి సపర్యా, విశిష్టాన్న వసతి సౌకర్యాలు కల్పించినది మండలి బుద్ధప్రసాద్‌గారు. కళ్ళేపల్లి గ్రామంలో ప్రభాకరశాస్త్రి బృహత్పరిమాణ ఛాయా చిత్ర పురస్సర మెరవణి (ఊరేగింపు) జరిగింది. ఈ ఛాయా చిత్ర పటాన్ని హృదయానికి చేర్చుకుని ఊరంతా ఊరేగింపులో పాల్గొన్న వాణ్ణి నేను.

అక్కడి కాశీ విశ్వేశ్వరాలయంలో కూడా పూజలు, పురస్కారాలు జరిగాయి. మధ్యాహ్నం, కొంత పొద్దు ఉండగానే సంగీత సాహిత్య సభ జరిగింది. శ్రీమతి కాళిదాసు (పేరు ప్రభావతి) త్యాగరాజ స్వామి కృతులాలపించారు.

ఈ సంగీత సాహిత్య సభకు నయనానందకర ప్రధాన ఆకర్షణ వేటూరి సుందరరామమూర్తి. ఆయన సంగీతం సాహిత్యం చందన చర్యిత ప్రసంగ నర్తనం చేశారు. ‘మనుచరిత్ర’ నుంచి చాలా అందమైన పద్యాలు ఆయన చదవగా, ఈ పద్యాలు ఎందులోనివి ? అని నేను అజ్ఞాన (లేదా అమాయక) సందేహ నివారణం చేసుకున్నాను. బహుశా దీనికాయన విస్తుపోయి ఉండవచ్చు. అప్పుడు తీసిన ఛాయా చిత్రాలు కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి.

ప్రభాకర శాస్త్రిగారి గూర్చి తిరుమల రామచంద్ర స్వీయ చరిత్ర ‘హంపీ నుంచి హరప్పా దాకా’ లో చదవాలి. ప్రభాకర శాస్త్రిగారిని అత్యంత సన్నిహితంగా సేవించుకున్నవారు తిరుమల రామచంద్ర.

తిరుమల రామచంద్రగారి వంటి సాహితీ సుగతుడి వెంట ఎన్నో సందర్భాలలో కనపడిన ఆనందుణ్ణి నేను.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *