విశిష్ట సాహితీవేత్త చక్రవర్తి రంగస్వామి

విశిష్ట సాహితీవేత్త చక్రవర్తి రంగస్వామి

శ్రీ చక్రవర్తి రంగస్వామి స్వాతంత్య్రానంతరం తెలుగు సాహిత్యంలో విశిష్ట కథకుడు. గొప్ప ఆర్ధ్ర భావనాశీలియైన కవి. ‘విరిగి పెరిగితి, పెరిగి విరిగితి, కష్టసుఖముల పారమెరిగితి’ అనే మహాకవి వాక్కుకు అక్షర రూపమిచ్చాయి ఆయన కథలు, కవితలు.

స్వాతంత్య్రానంతరం బాల సాహిత్య నిర్మాతగా ఆయనకు గణనీయమైన స్థానముంది. బాల సాహిత్య నిర్మాతలను ఒక పదిమందిని పేర్కొనవలసి వస్తే చక్రవర్తి రంగస్వామి పేరు తప్ప ప్రసక్తం చేయాల్సి ఉంటుంది.

సంప్రదాయానికి, ఆధునికతకు సమన్వయ స్థానం ఆయన హృదయం. ఆయన సుమారు నూరు కథలు రాసి ఉంటారు. భక్తి భావ సంభరిత హృదయంతో ‘శ్రీరామ పాద అమృత తరంగిణి’ అనే గేయకావ్యం రంగస్వామి రచించారు. నిజమైన మనుషులు, చక్రవర్తి కథలు, రాలిన పూలు అనే పేర్లతో ఆయన కథా సంపుటాలు వచ్చాయి.

‘అంతరంగ గంగ’ అనే ఆయన కవితా సంపుటిని భావుకులు మెచ్చుకున్నారు. ఆకాశవాణి ‘బాలానంద’ కార్యక్రమ నిర్వాహకులుగా తెలుగువారి ప్రేమాభిమాన కృతజ్ఞతకు పాత్రులైన శ్రీ న్యాపతి రాఘవరావు, శ్రీమతి కామేశ్వరి దంపతులు వీరి బాల సాహిత్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అద్భుతమైన శైలిలో, అచ్చ స్వచ్ఛమైన పిల్లల అంతరంగాన్ని వీరు తమ బాల గేయాల ద్వారా స్పృశించ గలిగారు.

బతుకు బరువును, సాహిత్యపు పరువును కౌమార జీవితం నుంచే బాగా ఆకళించుకున్నందు వల్ల శ్రీ చక్రవర్తి రంగస్వామి రచనలలో వాస్తవిక మనోజ్ఞత దృశ్యమానమవుతుంది. వీరి బాల్య, కౌమారాలు ఇప్పటి ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఉన్న పేటపాలెంలో గడిచాయి. యువకులుగా ఉన్నప్పుడే వయోజన విద్యా వ్యాప్తి కార్యక్రమాలు వీరినాకర్షించాయి. ఆ రంగంలో గురు వృద్ధులైన శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారిని వీరు ఆకర్షించగలిగారు. వేటపాలెంలో ప్రభావశీలమైన వయసు గడిపినందువల్ల అక్కడి సారస్వత నికేతనం వీరిని చాలా ఆకర్షించింది. స్వచ్ఛంద సేవలందిస్తూ ఎన్నెన్నో పుస్తకాలు చదివారు అక్కడ శ్రీరంగ స్వామి. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద గ్రంథాలయం నేటి వేటపాలెంలోని సారస్వత నికేతనం. ఈ గ్రంథాలయ నిర్వాహకులైన శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులుగారు రంగస్వామిని ఎంతగానో ఆదరించారు. ‘విద్య వలన వినయమ్ము, వినయమ్ము వలన పాత్రత’ అనే సూక్తిని ఆదర్శంగా తమ జీవితయాత్ర సాగించారు రంగస్వామి.

‘నా మొదటి కథ ఎప్పుడు ? ఎలా ? ఎందుకు? రాశానో నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఆ కథ పేరు ‘అన్యాయం’. హృదయం కదిలిపోగా రాశాను. ప్రతీ కథా అంతే. నేనప్పుడు కలం చేత పట్టనేలేదు. కథ రాస్తున్నప్పుడు భాషా, శైలి, వస్తువు, శిల్పం అంటూ ఆలోచనలే లేదు. ఆ తరువాత ఎప్పుడైనా నెమ్మదిగా చూసుకోవలసిందే’ అన్నారు ‘కథలు’ అనే సంపుటానికి ముందుమాట రాస్తూ రంగస్వామి.

అంటే శ్రీ రంగస్వామి ఆసాంతం సాహిత్యంలో హృదయవాది అన్నమాట. అందువల్లనే ‘నిజమైన మనుషులు’ వంటి మంచి కథలు రాశారు. వీరి శ్రీరామ పాద అమృత తరంగిణి గేయ సంపుటిని సాహితీ రంగ ప్రముఖులైన శ్రీ తిరుమల రామచంద్ర, శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులు బహుథా ప్రశంసించారు.

శ్రీ చక్రవర్తి రంగస్వామి జన్మస్థలం చీరాల. ఈయన బాల్యం అగ్రహారం లోనూ, వేటపాలెంలోనూ గడిచింది. సుమారు 4 దశాబ్దాలు ఈయన పత్రికారంగంలో జీవనం సాగించారు. జూలై 17, 1917లో జన్మించి, మార్చి 17, 1999లో కాలగతి చెందిన శ్రీ చక్రవర్తి రంగస్వామి తన 82 సంవత్సరాల జీవితాన్ని సాహిత్యానికి అంకితం చేశారు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *