మొక్కల పెంపకంపట్ల ఆసక్తితోనే…

మొక్కల పెంపకంపట్ల ఆసక్తితోనే…

చాలా మంది తమ ఇంట్లో ఉండే ఖాళీ స్థలంలో రంగు రంగుల, అందమైన పూల మొక్కల్ని పెంచుతుంటారు. అయితే పుణెలో నివాసముంటున్న మంజు మాత్రం కాస్త కొత్తగా ఆలోచించారు. ఆమె ఆరు పదుల వయసులో కూడా తన ఇంటి ముందున్న పెరట్లో కేవలం పూల మొక్కల్ని మాత్రమే కాకుండా కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కల్ని కూడా పెంచుతున్నారు. తన ఇల్లును ఓ తోటలా మార్చేశారు. సేంద్రీయ పద్ధతుల్లో మొక్కల్ని పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఒకప్పుడు పల్లెటూళ్లో ప్రతి ఇంట్లో పెరడు ఉండేది. వాటిలో కూరగాయలు, పూల మొక్కలను పెంచుకునేవారు. కాలం అభివద్ధి పథంలో ఉరకలేస్తున్న కొద్దీ అలవాట్లలో మార్పులు వచ్చాయి. చివరికి పల్లెలే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కాలంలో కూడా మహారాష్ట్రలోని పుణెలో నివాసముంటున్న మంజు తన ఇంటి పెరట్లో రకరకాల మొక్కల్ని పెంచుతున్నారు. ఇంటి చుట్టూ పచ్చదనాన్ని పెంపొదిస్తున్నారు. ఆ పరిసరాల్లో నివసించే వారు ‘ఔరా !’ అనేలా చేస్తున్నారు. అందులోనూ పర్యావరణ హితమై సేంద్రీయ పద్ధతిలో మొక్కలు పెంచుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

తొమ్మిదేళ్ళ వయసు నుంచే మంజుకు మొక్కల పెంపకం పట్ల మక్కువ పెరిగింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ ఆమె సొంతూరు. తమ ఇంటి ముందు బాల్కనిలో ఉన్న గులాబీ, సన్నజాజి చెట్లకు మంజు ప్రతిరోజు రెండు పూటలా నీరు పోసేవారు. మొక్కల బాగోగులు బాధ్యతగా చూసుకునేవారు. వాటికి పువ్వులు పూసిన ప్రతిసారి మురిసిపోయేవారు. అలా చిన్నతనం నుంచే మొక్కల పెంపకాన్ని అలవరచుకున్నారామె.

మంజు భర్త ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటారు. ప్రస్తుతం ఆయన పుణెలోని మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పనిచేస్తున్నారు. క్యాంపస్‌ ఆవరణలోనే వారికి నివాసాన్ని కేటాయించారు. మంజు 2015 నుంచి 2017 వరకు అస్సాంలో ఉన్నారు. అక్కడ వారికి కేటాయించిన ఇంటి ఆవరణలో రెండు వేల చదరపు అడుగుల భూమి ఖాళీగా ఉండేది. దీంతో ఆ స్థలంలో కూరగాయల మొక్కల్ని పెంచారు. ఆమె పెంచిన సొరకాయ చెట్టుకు ఏకంగా నాలుగు అడుగుల సొరకాయ కాసింది. దీంతో ఆమె ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం ఎంఐటిలోని వారి నివాసంలో గల 1500ల చదరపు అడుగుల స్థలంలో అందమైన తోటను ఏర్పాటు చేశారు. అందులో గింజ చిక్కుడు, వంకాయ, బ్రోకోలి, కాకరకాయ, గుమ్మడికాయ, క్యాలిఫ్లవర్‌, పాలకూర, నిమ్మకాయ, గులాబీతో పాటు ఇతర పూల మొక్కలను కూడా మంజు పెంచుతున్నారు.

మంజు కేవలం ఆవు పేడ, తేయాకు వంటి వాటిని ఉపయోగించే ఎరువులను తయారు చేసుకుంటారు. వాటినే మొక్కలను పెంచేందుకు వినియోగిస్తారు. అంతేకాకుండా పూర్తి సేంద్రీయ పద్ధతిలో మొక్కలను పెంచి అవి ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకుంటారు. ఎటువంటి రసాయనాలను వినియోగించరు.

అప్పుడప్పుడు తమ కుటుంబ సభ్యులందరూ ఆ తోటను చూస్తూ ఎంతో మురిసిపోతుంటారని మంజు చెబుతారు. తమ తోటలో పండిన కూరగాయలనే మంజు కుటుంబ సభ్యులు వంటకు కూడా వినియోగిస్తారు. చుట్టుపక్కల నివసించే వారు పెంపుడు జంతువులను తమ తోటకు తీసుకొస్తారని, అక్కడ అవి పచ్చిగడ్డిని తింటూ సంబరపడిపోతాయని మంజు చెబుతున్నారు. చిలుక, ఉడుత, కుక్క వంటి పెంపుడు జంతువులను కూడా ఆమె తన తోటలో పెంచుకుంటున్నారు.

‘నేను పెంచిన తోట మా కుటుంబ సభ్యులకు ఎంతో ఇష్టం. మా నాన్నగారు ఉదయం వేళ తోటలో ఎండలో కూర్చొని వార్తా పత్రికలను ప్రశాంతంగా చదువుకుంటారు. కోడలు, మనవరాలు వ్యాయామాలు చేస్తారు. నా భర్త, కొడుకు తమ ఖాళీ సమయాన్ని తోటలోనే గడపడానికి ఇష్టపడతారు’ అని మంజు ఎంతో గర్వంగా చెబుతారు.

అంతేకాకుండా బయట నుంచి వచ్చే వారిని కూడా మంజు తమ గార్డెన్‌లోకి అనుమతిస్తారు. సేద తీరేందుకు అవకాశాన్ని కల్పిస్తారు. అక్కడి పరిసరాలను పరిశీలించేందుకు సమయమిస్తారు. ఆ విధంగా ప్రజలకు సేంద్రీయ వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు తన వంతుగా కషి చేస్తున్నారు మంజు. వ్యవసాయాన్ని రసాయనాల బారి నుంచి కాపాడుకోవలసిన అవశ్యకతను పరిచయస్తులకు, తనను కలిసేవారికి ఎంతో చక్కగా వివరిస్తుంటారు. అయితే భర్త ఉద్యోగం కారణంగా ఒకే ప్రాంతంలో ఉండడం మంజు కుటుంబ సభ్యులకు కుదరదు. ఆమె పెంచే తోటలను విడిచి వెళ్లడం తనకు ఇష్టం లేకపోయినా మరోచోట తన ఆసక్తిని కాపాడుకునే అవకాశం లభిస్తుందనే ఆశతో మంజు తరలివెళ్తుంటారు. వెళ్ళిన ప్రతిచోట సేంద్రీయ వ్యవసాయ అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని ప్రచారం చేస్తుంటారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం లభిస్తుందని ఆమె అభిప్రాయం.

– విజేత

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *