మధురాంతకం రాజారాం

మధురాంతకం రాజారాం

ఈ తరం రచయితలకు, పాఠకులకూ మధురాంతకం రాజారాం కథలతో ఎక్కువ పరిచయం ఉండకపోవచ్చు. వాళ్లు ఆసక్తితో, సమాజ విశ్లేషణపరంగా ఆ కథలు చదువుతున్నారా ? అనేది కూడా సందేహమే. ఆయన కథలలో మానవ సంబంధాల మన్ననలు, సమాజం పట్ల ప్రేమ, గడచిన తరాల పట్ల గాఢానుబంధం, మనుషులలో విశేషించి కనిపించే మంచితనం, సంప్రదాయ నేపథ్యం పట్ల మన్నన, ఆధునికత పట్ల ఆకర్షణ, తరతరాల వారసత్వ సాహిత్యం, సంస్కృతి పట్ల అభిమానం, మనుషులను, జీవితాలను పరిశీలించే విశేష ప్రజ్ఞ, ప్రతిస్పందించే ఆర్ద్రత, విశాల హృదయం, ఆయా పాత్రలతో హృదయ సంవాదం విశేషించి ఆయన కథలుగా రాస్తాడేమో అనిపిస్తుంది.

తిరుపతి వెళితే నేను మళ్ళీ తిరుపతి వదిలిపెట్టే దాకా ఆయన నాతోనే ఉండేవాడు. రచయితలు, రచనలు తప్ప లోకంలో మరే విషయాలు ఏం మాటాడుకుంటాం.. మనకేం తెలుసు.. అనేట్లు ఉండేది ఆయన సాహిత్యాభిలాష. అదొక పిపాస ఆయనకు. సినిమాలు చూడటంలో ఆయనను మించిన సమకాలపు తెలుగు రచయిత మరొకరుండరేమో ! అమాయకంగా లోకాన్ని వీక్షిస్తున్నట్లుండేవాడు, కాని ఆయన గొప్ప మాటకారి. గడుసుగా తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని అర్థం చేసుకొనే చమత్కారి. సరళ హృదయుడు. సాధుశీలుడు.

హైదరాబాదు వస్తే ఏదోవిధంగా నన్ను చూడకుండా ఉండలేకపోయేవాడు. తిరుపతి వెళ్లినప్పుడు తిరుపతి చుట్టు పక్కల ఉన్న దేవుళ్ళను, దేవేరులను నాతో ఉండి దర్శింపజేసేవాడు. నా గురించి నేను చెప్పుకోవటం అంత బాగుండదు కాని రాజారాంగారికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమి, అజోవిభో ఫౌండేషన్‌వారి సత్కారాలు, సన్మానాలు, విశిష్టమైన గుర్తింపులు లోకాదరణ పాత్రం కావటంలో నా ప్రమేయం అంతో ఇంతో లేకపోలేదు.

1960లలో రాజారాంకు అలనాటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అప్పుడు నేను న్యూసైన్స్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తుండేవాణ్ణి. వరిష్టులైన కవిగా, నూతన రీతుల సాహిత్య భావకుడిగా అప్పటికే పేరు తెచ్చుకున్న అరిపిరాల విశ్వం కళాశాలలో నా సహాధ్యాపకుడు. ఆయన ‘రాజారాం కథల గూర్చి నేను ఒక సంస్థ వారికి నివేదిక పంపాలి. మీ దగ్గర ఆయన కథల సంపుటాలు ఉంటే నాకు ఇవ్వండి’ అని అడిగారు. అప్పటికి రాజారాంగారితో నాకు గాఢ పరిచయం లేదు. ఎప్పుడైనా ఉత్తరాలు రాసుకునేవారమేమో ! ఆ సంవత్సరం రాజారాంకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. ఆ తరువాత పాతికేళ్ళకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఈ సందర్భంగా వాకాటి పాండురంగా రావు ‘మన రాజారాంగారికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు రావాలి కదా ! ఆ సంస్థవారు నన్ను అడిగారు’ అని నాకు చెప్పారు. నేను దానిని చాలా ప్రోద్భలం చేశాను. ఆ తరువాత ఏడెనిమిదేళ్ళకు అజోవిభో సంస్థ ప్రభవించింది. ‘ఈ ఏడు ప్రతిభావంతులైన కథా రచయితకు జీవిత సాఫల్య పురస్కారం ఉద్దేశించాం. మీ సలహాలు, సంప్రదింపులు కోరుతున్నాం’ అని అజోవిభోవారు నాతో అన్నారు. అప్పుడు ఇటువంటి పురస్కారం చాలా ప్రతిష్ఠాత్మకంగా ఉండేది. నేను నా సమకాలికులైన కథా రచయితలతో సమాలో చించాను. హేమాహేమీలు కొందరు కాశీపట్నం రామారావుకు హంగు చేశారు. కాని నేను లిఖిత పూర్వకంగా, మౌఖికంగా అప్పటి ప్రథమ శ్రేణి కథా రచయితల అభిప్రాయాలు సేకరించాను. విజయవాడలో అత్యంత శోభాలంకృతమైన పురస్కార వేదికపైనా సమ్మానపత్ర సమర్పణలతో రాజారాంకు ఈ పురస్కారం వచ్చింది. కథా రచయితల సమ్మేళనం కూడా జరిగింది. అటు తరువాత కాలంలో బిర్లాల సరస్వతీ సమ్మాన్‌ కోసం రాజారాంకు నేను పురస్కార నేపథ్య ప్రయత్నం చేశాను. వాకాటి పాండురంగా రావు చేత రాజారాం ఒక కథ ఆంగ్లంలోకి అనువదింపచేసి పురస్కార నిర్ణాయక సంఘం వారికి సమర్పించాను. ఈ విధంగా మధురాంతకం వారు నాకు చాలా ఇష్టులే కాక సన్నిహితులయ్యారు. 2000 సంవత్సరంలో ఆయన చనిపోయారు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *