భారతదేశం సర్వాంగీణ స్వతంత్రత

భారతదేశం సర్వాంగీణ స్వతంత్రత

ఆర్‌.ఎస్‌.ఎస్‌. పూర్వ ప్రచారక్‌, విలేకరి అయిన నరేంద్ర సహగల్‌ డా|| హెడ్గేవార్‌ గురించి ఒక పుస్తకం రచించారు. దానిపేరు ‘భారత్‌ వర్షకే సర్వాంగ స్వతంత్రతా’.

రచయిత ఈ పుస్తకంలో సంఘ విరోధులు సంఘంపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని రుజువులతో సహా పేర్కొన్నారు. డా||హెడ్గేవార్‌, స్వయంసేవకులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈ విషయాలను రచయిత ఆధారాలతో సహా వివరించారు.

రచయిత ఈ పుస్తకాన్ని సరళమైన వాడుక భాషలో రచించారు. 270 పుటలున్న ఈ పుస్తకంలో 17 అధ్యాయాలున్నాయి. ఈ పుస్తకంలో ‘సర్వాంగ స్వతంత్రత’ గురించి సంపూర్ణంగా వివరించారు. డాక్టర్జీ దేశాన్ని సనాతనమైన, అద్భుతమైన ఒక దివ్య స్వరూపంగా భావించారు. ఈ దేశానికి హిందూ శక్తి (ఐక్యత) అవసరమని ఆయన భావించారు. హిందూ దేశాన్ని అత్యంత ఉన్నత స్థితికి తీసుకెళ్ళే ఉద్దేశంతోనే ఆయన 1925లో ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను ప్రారంభించారు. ఆనాడు డా|| కేశవరావ్‌ బలిరాం హెడ్గేవార్‌ ఖండిత భారత సర్వతోముఖాభివృద్ధిని కాక, సంపూర్ణ భారత సర్వతోముఖాభివృద్ధిని కోరుకున్నా రని ఈ పుస్తకంలో రచయిత పేర్కొన్నారు. దేశం బ్రిటిష్‌ పాలకుల చేతిలో ఉన్నప్పుడు జరిగిన అన్ని స్వాతంత్య్ర పోరాటాలకు డాక్టర్జీ మద్దతు ఇవ్వడమే కాకుండా స్వయంసేవకులు స్వతంత్ర ఉద్యమాలలో పాల్గొనాలని ఆదేశించారు కూడా. స్వాతంత్ర ఉద్యమంలో డా||హెడ్గేవార్‌ స్వయంగా పాల్గొని రెండుసార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు.

డాక్టర్జీ నిరంతరం దేశం గురించే ఆలోచించే వారు. డాక్టర్జీ ఒక రకంగా ఆజ్ఞాతసేనాని. ఆయన ఎంతోమంది సైనికులను తయారు చేశారు. డాక్టర్జీ నుండి స్ఫూర్తి పొందిన లక్షలాదిమంది యువకులు అఖండ హిందూ దేశ సంపూర్ణ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు.

స్వాతంత్ర ఉద్యమంలో డాక్టర్జీ, ఆయన వెంట పనిచేసేవారి వివరాలను అప్పటి ప్రభుత్వం గూఢచారుల ద్వారా సేకరించేది. వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా డాక్టర్జీ ఆ రోజుల్లో విప్లవ కారులతో, ఆర్యసమాజ్‌, హిందూ మహాసభ, అభినవ భారత్‌, ఆజాద్‌ హిందూ ఫౌజ్‌ నాయకులందరితో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని తెలుస్తోంది. అయితే డాక్టర్జీ ఒక ప్రత్యేక మార్గంలో దేశానికి స్వతంత్రం సాధించాలనే దిశలో పురోగమించారు. 1915లో అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయం లోనే దేశం నుండి ఆంగ్లేయులను తరిమి వేయాలన్న యోజన జరిగింది. దేశంలోని పలు ప్రాంతాలలో విప్లవకారులకు ఆయుధాలు సమకూరాయి. కాని ఆ సమయంలో కాంగ్రెస్‌ అగ్ర నాయకులు వీరితో సహకరించకపోవడం వల్ల ఆ ప్రయత్నం విఫల మైంది. రచయిత నాటి పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా 1885లో కరుడుగట్టిన క్రైస్తవుడు ఏ.ఓ.హ్యూం దేశంలో పెరుగుతున్న హిందుత్వ భావనను చూసి భయపడి దాన్ని అణచి వేయడానికి కాంగ్రెస్‌ను స్థాపించాడని వివరించారు. ‘హ్యూం’ ఒకవేళ కాంగ్రెస్‌ను స్థాపించి ఉండకపోతే మన దేశానికి 1915లోనే స్వాతంత్రం వచ్చేదని స్పష్టం చేశారు. మనకు 1915లోనే స్వతంత్రం వచ్చి ఉంటే దేశ విభజన జరిగేది కాదు.

డాక్టర్జీ 1940లో పరమపదించారు. తను మరణించడానికి పూర్వమే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిద్దని చెప్పారు. ఆ సమయంలోనే దేశాన్ని స్వతంత్రం చేయడానికి దేశవ్యాప్తంగా మహాక్రాంతి నిర్మాణం చేయాలన్న యోజనను డాక్టర్జీ రూపొందిం చారు. ఈ యోజనను సుభాష్‌ చంద్రబోస్‌, వీరసావర్కార్‌లతో కలిసి తయారు చేశారని డాక్టర్జీ స్నేహితుల వలన, గూఢచారుల నివేదికలవల్ల తెలుస్తోంది. ఆజాద్‌ హింద్‌ సైన్య నిర్మాణం, భారతీయ సైన్యంలో విద్రోహం, అభినవ భారత్‌, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ల పూర్తి తయారీని ఆనాటి బ్రిటన్‌ తాత్కాలిక ప్రధాని ఎటోలీ రూఢీపరిచాడు. ఇలా దేశవ్యాప్తంగా నిర్మాణ మైన తిరుగుబాటును చూసిన తర్వాతే ఆంగ్లేయులు దేశం విడిచిపోవాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్‌ నాయకుల సమ్మతితో భారత్‌ను విభజించి, పాకిస్థాన్‌ను ఏర్పరచి ఆంగ్లేయులు వెళ్ళిపోయారు. దేశ విభజనకు ఒప్పుకునే ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆర్‌.ఎస్‌.ఎస్‌., ఆర్యసమాజ్‌, ఆజాద్‌ హిందూఫౌజ్‌లతో ఎందుకు చర్చించలేదు ? కనీసం ఈ విషయంలో కాంగెస్‌ ఒక్క సలహా కూడా తీసుకోలేదు. ఒకవేళ అలా తీసుకొని ఉంటే దేశ విభజన జరిగేది కాదు. దేశ విభజనకు ముందు గాంధీజీ దేశ విభజన జరగాలంటే నా శవంపైనే జరగాలన్నారు. గాంధీజీ అభిప్రాయానికి విరుద్ధంగా ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు ? ఇది గత 1200 సంవత్సరాలుగా ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తులను మోసం చేసినట్లు కాదా ? అఖండ భారతదేశం కోసం తమ జీవనాన్ని అర్పించిన సుభాష్‌చంద్రబోస్‌, వీరసావర్కార్‌, డా||హెడ్గేవార్‌ వంటి వందలాది స్వాతంత్య్ర సమర యోధులను కాంగ్రెస్‌ నాయకులు మోసం చేసినట్లే కదా !

అఖండ భారతదేశ సర్వాంగ స్వాతంత్య్రం కోసం వందలాది సంస్థలు, వేలాది విప్లవకారులు, సాహిత్యకారులు, జాతీయవాదులైన రచయితలు, మహాత్ములు కృషి చేశారు. వీరందరి పోరాటాలను కాదని స్వాతంత్య్ర ఉద్యమ శ్రేయస్సును ఒకే నాయకుడికి, ఆ నాయకుని పార్టీ ఖాతాలో వేయడం చారిత్రక కుట్రే కాక, ఘోర అన్యాయం, అనైతిక చర్య కూడా.

1947లో ఖండిత భారతదేశానికి స్వాతంత్య్రం పొంది, ఉద్యమాన్ని ఆపేసి కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. కాని డాక్టర్‌ హెడ్గేవార్‌ లక్ష్యమైన అఖండ భారత సర్వాంగ స్వతంత్ర సంగ్రామం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. దేశ విభజన తర్వాత కశ్మీర్‌, హైదరాబాద్‌, గోవా మరికొన్ని ప్రాంతాల్లో స్వాతంత్య్రం కోసం, ప్రజల భద్రత గురించి స్వయంసేవకులు ప్రాణాలను త్యాగం చేశారు. గోరక్ష అభియాన్‌, రామజన్మభూమి ముక్తి ఆందోళన, 1975లో అత్యవసర పరిస్థితికి విరుద్ధంగా జన సంఘర్షణను సంఘం విజయవంతంగా నిర్వహించింది.

ఈ పనులు చేసి సంఘం తన ధ్యేయం పట్ల నిబద్ధత కలిగి ఉందని రుజువు చేసింది. భారతదేశం పరమవైభవ స్థితిని సాధించడమే సంఘం అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సంఘం వంటి సంస్థలు సక్రియంగా ఉన్నాయి. ఈ పుస్తక రచయిత మాటల్లో చెప్పాలంటే భారతీయులకు అఖండ భారతదేశం ఒక మట్టి ముద్ద కాదు. ఒక చైతన్యమైన దేవి. ఆమే భారతమాత. భారతదేశ పరమవైభవ స్థితి కోసం సంఘం నిరంతరం చేస్తున్న కృషితో మార్పు అనే అలలు ఎగిసి పడుతున్నాయి. దేశ సర్వాంగ స్వతంత్రత సంభవమే ! ఈ పుస్తక రచయిత భారతీయ సమాజం ముందు మహత్వపూర్ణమైన నిజాలను ఉంచే ప్రయత్నం చేసి సఫలమయ్యారు.

భారతదేశం సర్వాంగీణ స్వతంత్రత

రచన : నరేంద్ర సెహగల్‌

ప్రతులకు :

1) ఇమెయిల్‌ : prahatbooks@gmail.com
Amazon.in లేదా Flipkart.com ద్వారా ఆన్‌లైన్‌లో

(Bharatvarsh Ki Sarvang Swatantrata అని టైప్‌ చేసి) కొనుగోలు చేయవచ్చు.

– నరేంద్ర ఠాకూర్‌, అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *