పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి నారాయణాచార్యులు

20వ శతాబ్ది తెలుగు సాహిత్య ప్రముఖులలో అగ్రగణ్యులలో పదిమందిని తలచుకుంటే అందులో శ్రీమాన్‌ పుట్టపర్తి నారాయణాచార్యులను ఎవరైనా పోల్చుకుంటారు. కోస్తా ఆంధ్రంలో విశ్వనాథ సత్యనారాయణ గారి సమస్కంధుడు రాయలసీమలో నారాయణాచార్యుల వారు.

పుట్టపర్తి వారికి అనేక విశిష్టతలున్నాయి. పుట్టపర్తివారికి వచ్చినన్ని భారతీయ భాషలు ఆయనకు సమకాలీనులైన భారతీయ సాహిత్య మూర్తులలోనే మరెవరికి రావనటం అతిశయోక్తి కాదు. పాల్కురికి సోమనాథుడి తర్వాత మళ్ళీ అంతటివాడు నారాయణాచార్యుల వారు. విజయ నగర సామాజ్య చరిత్ర, సంస్కృతి, నృత్యగానాది లలితకళలు శ్రీమాన్‌ పుట్టపర్తి వారికి వాచో విధేయాలు. ఆయన ఒక పెద్ద సారస్వతీయ మహానది వంటివాడు. ఆయన స్వీయ చరిత్ర మొదలుపెట్టి నాలుగు ప్రకరణాలు రాశారు కాని దానిని ఆసాంతం నిర్వహించలేదు. దానిని ఆయన పూర్తి చేసి ఉంటే తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు అది నిస్తులాభరణమై ఉండేది. మన దురదృష్టం వల్లనో, ఆయన జీవనంలో తారసిల్లిన ఒడిదుడుకుల వల్లనో దానిని ఆయన పూర్తిచేయలేదు. అదే ఆయన అక్షరాలంకృతం చేసి ఉంటే భారతీయ స్వీయ చరిత్రలలోనే దానికి సాటిరాగల స్వీయచరిత్ర మరొకటి ఉండేది కాదేమో !

నేను స్వీయ చరిత్రల పట్ల ఎంతో ఆసక్తి, ఉత్సాహం కలవాణ్ణి కాబట్టి ఆచార్యులవారిని దర్శించినప్పుడల్లా అయ్యా ! మీరు ఈ రచన పూర్తి చేయక తప్పదు. నేను కడపవాణ్ణి కాను కదా ! లేకపోతే అహర్నిశం మిమ్ముల్ని వేడుకునేవాణ్ణి. మీరు చెపుతుండగా విలేకరిగా మిమ్మల్ని సేవించుకొనేవాణ్ణి అంటూ ఉండేవాణ్ణి. వారికి నా పట్ల చాలా ఆదరాభిమానాలుండేవి. విజయనగర గాథలు ఏ మాత్రం పుస్తకమైనా ఆ తాత, తాతలనాటి కథలను తవ్విపోసేవారు.

ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు తల పెట్టిన తెలుగు కవితా వతంసుల, పండితుల, సారస్వతీ మూర్తుల సంస్మరణ సభలు తెలుగు నాట ఆయా చోట్ల జరిపినపుడు నేను పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రిగారి సంస్మరణోపన్యాసం కడపలో చేశాను. ఆనాటి ఆం.ప్ర. సాహిత్య అకాడమీ తన కార్యవర్గ నియత సమావేశాలు తెలుగునాట ఆయా ప్రసిద్ధ నగరాలలో జరిపేది. ఇట్లా నేను కడపలో పంచాగ్నుల వారి గూర్చి ప్రధాన సంస్మరణ ప్రసంగం చేశాను. ఈ సన్నివేశం ఒక మరుపురాని అనుభూతి. ముందుగా ఈ సంస్మరణోపన్యాసం ఎవరికో నిర్దేశించగా అది వారు చేయకపోగా ఇది నా పాలబడింది. నేను స్థిరంగా నా సాహిత్య జీవితంలో గుర్తు పెట్టుకోవలసిన సంఘటన ఇది. వేదిక ముందు నా శ్రోతలలో మహాకవి గడియారం వేంకటేశశాస్త్రి, సరస్వతీపుత్ర శ్రీ పుట్టపర్తి నాయారాణాచార్యులు, శ్రీ బోయిభీమన్న, శ్రీ పురిపండ అప్పలస్వామి, కడప రామసుబ్బమ్మ (కడప కోటిరెడ్డి గారి ఇల్లాలు) మొదలైన హేమాహేమీలున్నారు. నా అదృష్టం వల్ల పంచాగ్నుల వారి గూర్చి సమగ్ర సముచిత సమాచారం నేను సేకరించగలిగాను. ఆయన రచనలు ప్రచురించిన పాత పత్రికలు చూశాను. ఆయన రచించిన గొప్ప గ్రంథాలు చదివాను.

భారతీయుల విద్యల నగరం వారణాసి.. జీవితసార్థక దర్శన పుణ్యక్షేత్రం ‘కాశి’ అని భావోద్వేగంతో నేను ప్రసంగిస్తున్నాను. ఎందుకంటే పంచాగ్నుల వారు 16 ఏళ్లకే కాశి వెళ్ళి మానవల్లి గంగాధర శాస్త్రి మ¬దయుల వద్ద శుశ్రూషించి వ్యాకరణ తీర్థ, కావ్య తీర్థ అనే రెండు విద్యాపట్ట భద్రతలు సాధించారు. తెలుగువారిలో ఇట్లా రెండు సాధించిన వారు వీరొక్కరేనేమో ! ఆ రోజుల్లో కాశీ పండితులంటే తెలుగు నాడులో గొప్ప.

ఇట్లా నేను భావోద్విగ్నంగా కాశీ ప్రస్తావన తెస్తే సభాధ్యక్షత వహించిన బెజవాడ గోపాలరెడ్డిగారు ‘ఆహా! కాశీలో ఏముంది ? మురికి గంగ, కశ్మలనగరం, చావటానికి పోవాలి’ అని తన పాండిత్యం చూపుకోబోయినారు. తాను యు.పి. గవర్నర్‌ గిరి వెలిగించిన ప్రజ్ఞను వెల్లడించు కోవటానికి కాబోలు ! అప్పుడు నేను ఓర్పు వహించలేక అయ్యా ! చావటానికైతే 71 ఏళ్ళప్పుడు పోవాలి ? 17 ఏళ్లకు ఎందుకు వెళతారెవరైనా? అని తిప్పికొట్టాను. సభ అంతా ఆశ్చర్య నయన చకితమైంది. అందరూ నన్ను మెచ్చారు. నారాయణాచార్యుల వారు నా దగ్గరకు వచ్చి అభినందించారు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *