తెలుగు భాష ప్రయోజనాలు

తెలుగు భాష ప్రయోజనాలు

తెలుగు భాషలో మాట్లాడటం, రాయడం, తెలుగును విజ్ఞాన మాధ్యమంగా అభివృద్ధి పరచడం వలన తెలుగు వారికి కొత్తగా చేకూరే ప్రయోజనం ఏమిటని కొందరు శంకించవచ్చు. ఇట్లా సందేహం వ్యక్తం చేయడం చాలా తప్పు. అమ్మ, నాన్నలను ప్రేమాభిమానాలతో ఆదరించడం, మన ఊరి పట్ల, మన ఇరుగు పొరుగుల పట్ల, మనకు విద్యనిచ్చిన సంస్థల పట్ల, మెప్పు, అభిమానం, కృతజ్ఞత కనబరచడం, కనబరచాలనుకోవడం వల్ల కూడా సిద్ధించే ప్రయోజనం ఏమిటని ఎవరూ అనరు కదా!

మానవీయ అనుబంధాలు, హార్ధిక సంబంధాలను సంఘంలో పెంపొందిచేది భాషే. కాబట్టి మన భాషలో మన భావాన్ని, మన హృదయాన్ని, మన సంస్కారాన్ని, సంస్కృతిని వ్యక్తీకరించగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే మానవ సంబంధాలు దృఢపడతాయి. ఇతర భాషల ద్వారా కంటే మనుషులు సొంతభాష ద్వారానే ఒకరికొకరు దగ్గరవుతారు. తెలుగులో వ్యవసాయ విజ్ఞానం, బ్యాంకు వ్యవహారాలు, ఆరోగ్య పరిరక్షణ, తెలుసుకోగలిగితే, నిర్వహించుకో గలిగితే తెలుగు వారి సమాజ జీవనంలో ఎంతో మేలు కలుగుతుంది. న్యాయ స్థానాలలో వ్యాజ్యాల సంఖ్య తగ్గిపోతుంది. సంవత్సరాల తరబడి పరిష్కారానికి నోచుకోని, తీర్పుల కోసం అలవిమాలిన నిరీక్ష అవసరమైన వ్యాజ్యాలు, వాద వివాదాలు ఉండవు. న్యాయవాదులను, న్యాయస్థానాలను ఆశ్రయించవలసిన అవసరం ఉండదు కక్షిదారులకు.

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు స్వీయ చరిత్రలో తన చిన్నతనంలో కోర్టు భాష తెలుగే అని రాసుకున్నారు. ఆ కాలంలో న్యాయ సభలలో తీర్పులు, వ్యాజ్యావాద వివాదాలు తెలుగులో చెప్పే పత్రికలుండేవి. వ్యవహార తరంగిణి, జిల్లాకోర్టు తీర్పుల సంగ్రహం వంటి పత్రికలు వెలువడేవి. 1972 నాటికే అంటే నూటనలభై ఏళ్ళ కిందటే ప్రీవీకౌన్సిల్‌ తీర్పుల సంగ్రహం అనే పుస్తకం తెలుగులో బళ్ళారి నుంచి వెలువడింది. తెలుగులోనే వాదించే న్యాయవాదులుండే వారని ఆ కాలపు కొందరి స్వీయ చరిత్రల ద్వారా తెలుసుకోవచ్చు. తూర్పు ఇండియా కంపనీ పరిపాలన కాలంలో ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరుపుకోగల సౌకర్యం, సౌలభ్యం ఉండేది. అటు తర్వాత కాలంలో క్రమంగా ఈ సౌలభ్యం, సౌకర్యం సన్నగిల్లాయి. పరభాష పట్ల, పరదేశ సంస్కృతి పట్ల మోజు, వ్యమోహం ఎక్కువైంది. అందువల్ల పరిపాలనకు, ప్రజలకు క్రమేణా సత్సంబంధాలు కనుమరుగవటం ప్రారంభమైంది. ఆరోగ్యం చెడిపోతే శరీరం బలహీనమవుతుంది. జవసత్వాలు క్షీణిస్తాయి. అనుదిన జీవిత చర్యలో విసుగు, బరువు అనుభవంలోకి వస్తాయి. శరీరం రోగగ్రస్తమైతే అది వెంటనే తెలియదు. క్రమంగా తెలుస్తుంది. దీర్ఘకాలికమైన వ్యాదులు ఒక పట్టాన నయం కావు. అసలు నయం కాకపోవచ్చు కూడా. స్వాతంత్య్రం అంటే స్వభాషలో జీవన వ్యవహారాలు సాగించుకోవడమే అన్నాడు గాంధీజీ. ఆయన తన ఆత్మకథను ఇంగ్లీషులో రాసుకోలేదు. తన సొంత భాష అయిన గుజరాతీలోనే రాసుకున్నాడు. ఇంగ్లండులో బారిస్టర్‌ విద్యను అభ్యసించినా మాతృభాషే సరైన సాధనం కాగలదనుకున్నారాయన.

స్వాతంత్య్రం రాగానే విద్యా రంగం పట్ల చూపవలసిన శ్రద్ధాసక్తులు, తీసుకోవలసిన జాగ్రత్తలు దేశీయ పాలకులు కనబరచలేదు. పరపాలకుల పంథానే అనుసరించారు. అందువల్ల అరవై ఏళ్ళుగా భారతీయ భాషల స్వీయ వ్యక్తిత్వానికి హాని కలిగింది. భారతదేశంలో ప్రాంతీయ భాష ఒక్క సాహిత్యానికే పరిమితం కాదు. సంగీతం, నృత్యం, తత్త్వ చిందన, సంస్కృతి, చరిత్ర వంటి జీవధాతువులతో ముడిపడి ఉంది. త్యాగరాజ కృతులను ఇంగ్లీషులో అనువదించవచ్చు కాని ఆలాపింప చేయగలమా ? కూచిపూడి నృత్యాన్ని, కేరళ కథాకళిని, కన్నడం బయలాటలను పోగొట్టుకోగలమా ? దేశీయ భావ సమైక్యాన్ని, జన జీవన సంస్కృతి అవిచ్ఛిన్నతను భారతీయ భాషలు పరిపోషిస్తున్నాయి. పరిరక్షిస్తున్నాయి. కాబట్టి ప్రాంతీయ భాషల సమగ్రాభివృద్ధి దేశీయ ప్రయోజనాలలో ప్రథమ గణ్యమైనది. తెలుగు నాట 2700 గ్రామాలు, 200 నగరాలు ఉన్నాయని జనాభా లెక్కల పరిగణనలో అంచనా వేశారు. కాబట్టి ఇంకా 80 శాతం ప్రజలు గ్రామీణ జీవితాన్నే గడుపుతున్నారు. గ్రామీణ వికాసానికి మాతృభాషలో విద్యను, పాలనను అందించటం కన్నా మార్గాంతరం లేదు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *