తెలుగిరటి ప్రతిభాశాలి తల్లాప్రగడ సుబ్బారావు

తెలుగిరటి ప్రతిభాశాలి తల్లాప్రగడ సుబ్బారావు

తల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు చాలామంది తెలుగువాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు. 19వ శతాబ్దిలో జన్మించి ఆ శతాబ్దిని ప్రభావితం చేసిన తెలుగు మహాపురుషులో అత్యంత ప్రతిభాశాలి తల్లాప్రగడ వారు. మహామేధావి. ఈయన కోసమే థియోసాఫికల్‌ సొసైటీ ప్రధాన కేంద్ర స్థానం చెన్నపురి అడయారులో స్థాపించామని ఆ సంస్థ సంస్థాపకులైన కల్నల్‌ ఆల్కాట్‌, మదాంబ్లావట్‌ స్కీల్‌ చెప్పారు. లేకపోతే ఏ లండన్‌లోనో, న్యూయార్క్‌లోనో ఈ దివ్యజ్ఞాన సమాజమనే అంతర్జాతీయ మత సాంస్కృతికోద్యమ కేంద్ర స్థానం నెలకొల్పబడి ఉండేది. సుబ్బారావుగారు విదేశాలకు రానన్నారు. అందుకని ఆ కేంద్ర స్థానం ఆయన దగ్గరకే వచ్చింది. కల్నల్‌ ఆల్కాట్‌, మేడమ్‌ బ్లావట్‌ స్కీలకు ఆయనంటే ఎంతో గురి. థియోసోఫికల్‌ సొసైటీ జర్నల్‌ను వారు సుబ్బారావు గారికే అప్పగించారు. ఇందులో తల్లాప్రగడ సుబ్బారావు భగవద్గీతకు అత్యంత విశిష్టమైన ఇంగ్లీషు వ్యాఖ్యానం ప్రకటించాడు.

భారతీయ పురావిజ్ఞానం (ఇండాలజీ)లో తల్లా ప్రగడ సుబ్బారావు మేధానిధి. గౌతమ బుద్ధుడి, ఆదిశంకరుడి జీవిత కాలాలను, జనన కాలాలను ఆయన నిర్ధారణగా చెప్పారు. ఆ తర్వాత అవే పరమ ప్రామాణికంగా అంగీకృతమైనవి. ఖారవేలుడి శాసన కాలాన్ని ఆయన పరిశోధించి చెప్పారు. లోకమంతా ఆయన నిర్ణయాన్నే తలదాల్చింది.

ప్రాచీన సాంస్కృతిక విజ్ఞాన రహస్యాలు విప్పి చెప్పడంలో ఆయన సామర్థ్యం మరెవరికీ లేదని, శాస్త్రాలలో అఖండ ప్రజ్ఞాధురీణుడు అని కల్నల్‌ ఆల్కాట్‌ అన్నారు. 19వ శతాబ్దం ఉత్తరార్థంలో భారతీయ మహామేధావులలో సుబ్బారావు నిస్సందేహంగా ఒకరు. బరోడా సంస్థానానికి దివానుగా కూడా కొన్నాళ్ళు సుబ్బారావు ఊద్యోగించారు.

దివ్యజ్ఞాన సమాజం స్థాపనం నాటికి సుబ్బారావు గారికి పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు. తల్లాప్రగాడ వారు జీవిచింది 34 సంవత్సరాలే నంటున్నారు కురుగంటి సీతారామయ్య తన నవ్యాంధ్ర సాహిత్య వీదులలో. 40 సంవత్సరాలు కూడా జీవించకుండానే ప్రపంచ ప్రసిద్ధుడైన తల్లాప్రగడ సుబ్బారావు తెలుగువాడని తెలుసుకోవటం తెలుగువారి కర్తవ్యర కాదా? అయితే తెలుగు వారి విజ్ఞాన సర్వస్వంలో ఆయన పేరు కనపడదు. విచారకరమైన విషయం.

ఇటీవల మద్రాసు నుంచి అడయారు దివ్యజ్ఞాన సమాజం వారు తల్లాప్రగడ సుబ్బారావు గురించి ఒక జీవిత చరిత్ర, దివ్యజ్ఞాన సమాజ వ్యాప్తిలో ఆయన కృషి, థియోసాఫికల్‌ సొసైటీ జర్నల్‌లో ఆయన ప్రతిభా సమున్మిషితమైన రచనలు సమీక్షిస్తూ ప్రకటించారు. అయితే ఈ గ్రంథం ఇంగ్లీషులో ఉంది. ఈ గ్రంథం పేరు ‘ది ఎండ్యూరింగ్‌ ఫిలాసఫర్‌’. దీనిని రచించిన వారు ‘శ్రీవిరించి’, ఈ పుస్తకం తెలుగులో కూడా రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ‘శ్రీ విరించి’ ఇప్పుడు తెలుగు కథా రచయితల క్షయవ్యాధి వల్ల మరణించాడు.

తల్లాప్రగడ సుబ్బారావు అతి చిన్న వయస్సులో క్షయవ్యాధి వల్ల మరణించాడు. ఆయన 1856లో జన్మించి 1890లో మరణించినట్లు నవ్యాంధ్ర సాహ్యిత్య వీధులలో కురుగంటి వారు రాశారు. ఈయన రచనలన్నీ ఇంగ్లీషులో ఉన్నందువల్ల తెలుగు వారికీయన గురించి తెలియదంటారు సీతారామయ్యగారు.

ఇంగ్లీషా, తెలుగా అని కాదు. తెలుగు వారికి తమ వారంటే అభిమానం లేదనటానికి బోలెడన్ని నిదర్శనాలున్నాయి. బ్రాహ్మ సమాజం, ఆర్య సమాజం భారతీయ మత సాంస్కృతిక పురా విజ్ఞానంలో లోపాలనును ప్రధానంగా చూపగా దివ్యజ్ఞాన సమాజం భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని, ఋషులు అతీంద్రియ శక్తులను, దేవతల ఉనికిని, అద్బుతాలను, మంత్ర విజ్ఞానాన్ని ప్రచారంలోకి తేవడానికి పూనుకొంది. అరవిందుడు, జిడ్డుకృష్ణమూర్తి వంటి మహనీయులు బ్రహ్మ సమాజాన్ని దివ్యజ్ఞాన సమాజం పథం వైపు తీసుకొని పోయినవారు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *