తెలంగాణ మలయాళ స్వామి శ్రీశ్రీశ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి జీవిత చరిత్ర

తెలంగాణ మలయాళ స్వామి  శ్రీశ్రీశ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి జీవిత చరిత్ర

సనాతన ధర్మం మానవునికి నిర్దేశించిన బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వాన ప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమాలను అత్యంత నిష్ఠతో నిర్వహించిన ఆదర్శమూర్తి జీవిత చరిత్ర ఇది.

జడ్చర్ల మండలంలోని గంగాపురంలో గత సంవత్సరం (2016 డిసెంబరు) శతజయంతి జరుపుకొన్న వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు శ్రీశ్రీశ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి జీవిత విశేషాల పుస్తకానికి ద్వితీయ ముద్రణ ఇది (2017, మే).

పూర్వాశ్రమంలో గంపానర్సిములుగా లౌకిక జీవనం గడిపి, పది మందికి తలలో నాలుకగా మెలగిన ఆ మహాత్ముని జీవిత విశేషాలతో పాటు స్వామిజీ నిర్వహించిన జ్ఞానయజ్ఞ విశేషాలు, ఆయన చేసిన ప్రసంగ పాఠాలు, స్వామివారు వివిధ సందర్భాలలో చెప్పిన ఆసక్తి కరమైన కథలు ఈ 280 పేజీల పుస్తకంలో చోటు చేసుకొన్నాయి. అక్షర శిల్పి డా|| కసిరెడ్డి వెంకటరెడ్డిగారు ఆద్యంతం ఆసక్తిని కల్గించే రీతిగా రచించారు.

1926 సెప్టెంబర్‌ 5వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలంలోని సాయిరెడ్డి గూడెంలో జన్మించిన గంపానర్సిములు బాల్య విశేషాలను రచయిత వివరించారు. తండ్రి చేస్తున్న వ్యాపారాన్ని అందిపుచ్చుకొన్నాక తన జన్మభూమిలో ఎన్నో సామాజిక పరమైన సేవలు అందించారాయన. గ్రామ సర్పంచిగా రెండుసార్లు ఎంపికయ్యారు. గృహస్థు నుంచి వానప్రస్థం వైపుకి వెళ్లాలని నిశ్చయించుకొని రాజకీయాలకు దూరంగా జరిగారు.

1980లో వ్యాసాశ్రమ పీఠాధిపతులైన శ్రీ విద్యానందగిరి స్వామిని దర్శించాక ‘ఎంతో మంచి గురువు లభించారని’ భావించారు గంపానర్సిములు. ఆయన ప్రేరణతో 113 జ్ఞానయజ్ఞాలను నిర్వహించారు. 1992 మార్చిలో సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు. గంపానర్సిములు శ్రీశ్రీశ్రీ నిత్యశుద్దానంద స్వామిగా దీక్ష స్వీకరించారు.

సాధారణ పౌరులకు అర్థమయ్యేలా తెలంగాణ యాసతో వీరి ప్రసంగాలు, రచనలు ఉంటాయి. పుస్తకం చివరిలో ఇచ్చిన స్వామీజీ చెప్పిన సూక్తులు పాఠకుల చేత ఆసక్తితో చదివిస్తాయి. 1991, నవంబరు నుంచి ప్రారంభించిన ‘గీతా జ్ఞాన యోగ సమాచార పత్రిక’ ఆశ్రమం ప్రచురణగా నిరంతరాయంగా కొనసాగుతోంది.

చిత్తూరు జిల్లా వేర్పేడులో ఉన్న మళయాల స్వామి శిష్యుడైన ఈయన్ను ‘తెలంగాణ మలయాళ స్వామి’ గా భక్తులు పిలుస్తారు. షాద్‌నగర్‌లో, జడ్చర్ల మండలంలోని గంగాపురంలో వీరు ఆశ్రమాలు నెలకొల్పి ప్రజల కొరకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నిత్యశుద్ధ ఆనందమూర్తులవటం కోసం ఈ పుస్తకం చదవాలనే ఫలశ్రుతితో రచయిత ఈ పుస్తకాన్ని పూర్తి చేశారు.

తెలంగాణ మలయాళ స్వామి

శ్రీశ్రీశ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి జీవిత చరిత్ర

కూర్పు : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

పుటలు : 296

వెల : రూ.125/-

ప్రతులకు :

శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణాశ్రమం

గంగాపురం, జడ్చర్ల మండలం

చరవాణి : 9177743454

 –   బి.ఎస్.శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *