‘జ్ఞాపకాల వరద’ లో మునకలేద్దాం!

‘జ్ఞాపకాల వరద’ లో మునకలేద్దాం!

‘మా వాడలో మేర రాజయ్య అని ఒకాయన ఉండేవాడు. ఆయనకు ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని చేయాలని తపన. ఒకరోజు నేను ఆయన దుకాణం వద్దకు రాగానే ఆయన హడావుడిగా బయటకు వచ్చి ‘రావయ్యా ! నీ కోసమే చూస్తున్నా’ అన్నాడు. షాపులో ఉన్న వ్యక్తి కృష్ణాపత్రిక ఏజెంట్‌ను పరిచయం చేసి ‘పత్రికకు ఇప్పుడే చందా కట్టాను’ అని చెప్పాడు. ‘నీకు చదువే రాదు కదా ! చందా కట్టి ఏం చేస్తావ్‌’ అని అడిగాను. రాజయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘నాకు రాకపోతే చదువొచ్చినోడివి నువ్వున్నావు కదా !’ అన్నాడు.

ఇలా ఈ పుస్తకం నిండా ‘జ్ఞాపకాల వరద’ పొంగి పొర్లుతూనే ఉంటుంది. ఎందుంటే తెలుగునాట పాత్రికేయ రంగం పుట్టినప్పటి నుంచి నేటి వరకు పాత్రికేయ విలువలకు పట్టం కట్టిన వ్యక్తి డా|| జి.ఎస్‌ వరదాచారి.

ఈ రోజుల్లో మండల స్థాయిలోని విలేకరులు చాలామంది పైరవీలతో, వృత్తి బెదిరింపులతో కనకపు మేడలు కట్టాలనుకొంటున్నారు. కాని తొలితరం పాత్రికేయుల్లో అగ్రగణ్యులు వరదాచారి గారు ఆదర్శాలను జ్ఞాపకాలుగా ఆచరించి చూపారు. ఈ మహానుభావుని జీవితం ఈనాటి పాత్రికేయులు నిత్యపాఠంగా చదువుకోవాలి.

వరదాచారిగారు తన మనుసులోని ఇన్నేళ్ల జ్ఞాపకాలను ఓ పుస్తక రూపంలో ‘జ్ఞాపకాల వరద’ పేరుతో, 276 పుటలతో, 7 శీర్షికలతో రచించగా ప్రసిద్ధ ప్రచురణ సంస్థ ఎమెస్కో దీన్ని ప్రచురించింది. దీనికి ప్రముఖ పరిశోధకుడు డా||పి.చంద్రశేఖర్‌ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు. పాత్రికేయ రంగంలో తెలంగాణ గురించి ఇంత సాధికారికంగా చెప్పేవారు లేరన్నది అతిశయోక్తి కాదు. వార్తలకు మసాల వ్యాఖ్యలను జోడించి రుచి పుట్టిస్తున్నా ఎలక్ట్రానిక్‌ మీడియా ¬రులో వరదాచారి గారి అడుగుజాడలు అత్యంతావశ్యకమైనవి.

ఆయన సియాసత్‌ ఎడిటర్‌తో కలిసి ఉర్దూలో మాట్లాడి మెప్పించగలరు. తన చిన్ననాటి జ్ఞాపకాలను పూసగుచ్చినట్లు చెప్పగలరు. ఆనాటి తెలంగాణ ముచ్చట్లు చరిత్రలా అందించగలరు. పాత్రికేయుల జీవితాల్లోని ఒడిదుడుకులను, చీకటి, వెలుగులను తన జీవితం ద్వారా అందించగలరు. తెలంగాణ భాషా సాంస్కృతిక జీవితాన్ని మన కళ్ల ముందు నాటకీయంగా అందించగలరు. సత్యం కోసం చేసిన సాహసాలను తలపోసుకోగలరు. ఇవన్నీ ఈ ‘జ్ఞాపకాల వరద’లో సజీవంగా ప్రహిస్తున్నాయి.

‘జీవించడం ముఖ్యం కాదు.. ఎలా జీవించామన్నదే ముఖ్యం’ అన్న సత్యాన్ని తన జీవితం ద్వారా నిరూపించారు వరదాచారిగారు. మనిషి ప్రతి మెట్టు ఎంత కఠినంగా ఎక్కాల్సి వస్తుందో, ఎన్నిసార్లు వైకుంఠపాళీలో కిందకు పడతాడో ఈ పుస్తకం చదివితే అర్థం అవుతుంది. మనం చాలాసార్లు మనకు నచ్చిన వ్యక్తులను, సంఘటనలు గోప్యంగా ఉంచడమో, దాట వేయడమో చేస్తాం. అలాకాకుండా తన పరిధిలోని ప్రతి అంశంలోని ఏదో కొత్త విషయాన్ని ఈ పుస్తకం ద్వారా జి.ఎస్‌ పాఠకులకు అందించే ప్రయత్నం చేశారు.

అందమైన ముఖాలతో, పడికట్టు పదాలతో మోసం చేస్తున్న తెరమీది బొమ్మలు ఆయన పాదాలను స్పృశిస్తే చాలు భాషా సామర్థ్యం, విషయ అవగావహన ఎంత బాగా వంట బట్టించుకోగలరో ఆయన జీవితం చూసి నేర్చుకోవచ్చు. అలాంటి జ్ఞాపకాల వరదలో మనం కూడా మునుగుదాం. వెంటనే ఈ పుస్తకాన్ని మన గూట్లోకి తెచ్చుకోందాం!

జ్ఞాపకాల వరద

రచన : డా. జి.యస్‌.వరదాచారి

పుటలు : 276

వెల : రూ.150/-

ప్రచురణ : ఎమెస్కో

ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

సెల్‌ : 9849228018

 

– డా|| పి. భాస్కరయోగి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *