జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞా విభవుడు స్వామి జ్ఞానానంద

జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞా విభవుడు  స్వామి జ్ఞానానంద

1945లో ద్వితీయ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అణ్వస్త్ర మహాఘోర వినాశాన్ని గూర్చి ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలంతా కలవరం పొందారు. ఒక మహావిలయం జరిగిపోయిందే అని పశ్చాత్తప్తు లైనారు. అప్పుడు విజ్ఞాన శాస్త్ర అగ్రగణ్యులందరూ కలిసి ప్రపంచ దేశాధిపతులకు ఒక విజ్ఞాపన పత్రం లేదా హెచ్చరిక ప్రకటన రూపొదించి అందజేశారు. సర్‌ ఆల్‌బర్డ్‌ ఐన్‌స్టీన్‌ దీనికి సూత్రధారిత్వం వహించాడంటారు. వివిధ దేశ విజ్ఞాన వేత్తలు ఈ పత్రంపై చేవ్రాళ్ళు చేశారు. అందులో స్వామి జ్ఞానానంద ఒకరు అని అమెరికాలో స్వామివారిపై వెలువరించిన ఒక సమగ్ర వృత్తాంత సంపుటంలో నమోదై ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత స్వామి జ్ఞానానంద అమెరికా నుంచి భారతదేశం తిరిగి వచ్చారు. దీనికి ఒక ప్రేరణ ఉంది. గుజరాత్‌లో గొప్ప దేశభక్తులు లోక్‌సభ తొలి సభాపతి మౌలంకర్‌ మహాశయుల నేతృత్వంలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించటానికీ.. (మదనమోహన మాలవ్య వారణాసి హిందూ విశ్వవిద్యాలయం స్థాపించినట్లు) ఈ విశ్వ విద్యాలయంలో విజ్ఞాన శాస్త్ర పారిశ్రామిక ప్రగతి, మానవ వికాస సమగ్ర సంగతి సమన్వయ పరచే విద్యావిధానం రూపొందించేట్లు.. అంటే విజ్ఞాన శాస్త్రం, మతం మానవ పరిపూర్ణ వ్యక్తిత్వానికి ఒక నాణెపు ఇరు పార్వ్యాశాలు ఎందుకు కాకూడదు ? అని అభిలషించినట్లు ఊహించాల్సి ఉంది. ఈ పరిస్థితులలో ఆనాడు ప్రపంచ స్థాయిలో స్వామి జ్ఞానానంద తప్ప ఇంకొకరు ఎవరూ లేరు అని వాళ్ళు నిర్ధారించారు. వారిని ఆహ్వానించారు. వారు మాతృ దేశం పట్ల ఉండే మమత్వ పూర్ణ మహత్కాంక్షతో వచ్చారు. అయితే స్వాతంత్య్రం సిద్ధించిన తొలి ఘట్టపు రోజులవి. అంతా అల్లకల్లో లంగా ఉన్నది దేశ పరిస్థితి. అందువల్ల ఆ మహదాశ యానికి ఎన్నో ఆటంకాలు ఎదురై ఉండవచ్చు.

అప్పట్లోనే పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ స్వతంత్ర భారతదేశాన్ని వైజ్ఞానిక పథంలో ప్రయాణింపచేయటానికి కొన్ని విజ్ఞాన సంస్థలు ఏర్పాటు చేసే ప్రణాళిక రూపకల్పన చేస్తున్నారు. అందులో ఒకటి నేషనల్‌ ఫిజికల్‌ లేబరేటరీ (జాతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ). దీనిలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ విజ్ఞాన ప్రయోగ కార్యక్రమాల విభాగంలో పనిచేయడానికి స్వామిజ్ఞానానందను జవహర్‌లాల్‌ నెహ్రూ ఆహ్వానించారు. స్వామివారు ఆ సంస్థలో ఏడెనిమిది సంవత్సరాలు పర్యవేక్షణాధికారిగా పనిచేశారు. స్వామి జ్ఞానానంద భారతీయ పురా విజ్ఞాన వేత్తలైన బ్రహ్మగుప్తుడు, కణాదుడు, వరాహమిహిరుడు వంటివారు. స్వతంత్ర భారత దేశపు పరమాణు విజ్ఞాన శాస్త్రవేత్తలలో అగ్రగణ్యులు. జ్ఞాతం నుంచి అజ్ఞాతాన్ని, అజ్ఞాతం నుంచి జ్ఞాతాన్ని ఆవిష్కరింప చేసిన జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాశాలి. సర్వేపల్లి రాధాకృష్ణ వంటి తత్త్వదార్శనికుడు, రవీంద్రనాథ ఠాగూర్‌ వంటి కవితా తత్త్వవేత్త ఒకేచోట మూర్తిమంతమైతే ఎటువంటి అద్భుతం సంభవిస్తుందో అటువంటి దివ్యయోగ పరమాద్భుత ప్రతిభావిష్కారం స్వామి జ్ఞానానంద వ్యక్తిత్వ రూపమూ, స్వరూపమూ.

20వ శతాబ్ధి భారతదేశ మహా పరివ్రాజక ప్రస్థానంలో కాని, నవభారత నిర్మాణ పారిశ్రామిక దార్శనిక ప్రగతి పథంలో కాని మరి ఇంకొకరు స్వామి జ్ఞానానంద వంటి వారు కన్పించరు. నిర్వికల్ప సమాధి, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ ఆయనలో సమన్వయం పొందాయి. ఆయన ఇహపరసేతు నిర్మాత. యోగజ్ఞాన సమాధి స్థితులై ఆయన ‘పూర్ణసూత్రములు’ అనే గ్రంథం భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి భాష్యగ్రంథం వంటిది రచించారు. ఇది బాదరాయణ ఋషి బ్రహ్మసూత్రంతో సమానస్థాయి కలది. ఈ గ్రంథానికి ఇంకొక విశేషం కూడా ఉంది. బాదరాయణ బ్రహ్మసూత్రానికి శంకర భగవత్పాదులు భాష్యరచన చేసి ప్రస్థాన త్రయ వ్యాఖ్యాతగా కీర్తినార్జించినట్లుగానే స్వామి జ్ఞానానంద తమ ‘పూర్ణసూత్ర’ దర్శనానికి తామే భాష్యం సమకూర్చారు. ఈ గ్రంథంలో సుమారు ఐదువందల సూత్రాలు భక్తి, జ్ఞాన, కర్మయోగ అధ్యాయ రూపంలో ఉన్నాయి. ఆధునిక విశ్వ ఆధ్యాత్మిక మాధ్యం ఇంగ్లీషు కాబట్టి స్వామి జ్ఞానానంద ఈ సూత్ర గ్రంథాన్ని ఇంగ్లీషులో రచించారు. ఇది మొదటిసారి జర్మనీలో అచ్చైంది. అదంతా ఒక కథ. ఒక ఇతిహాసం. ఒక షడ్దర్శన భూమిక. అద్వైతం, అణువిజ్ఞానం వీరి కరద్వయం. మహాద్భుత చరిత్ర స్వామి వారిది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శివారు గ్రామం గొరగనమూడి స్వామివారి జన్మస్థలం. 1896వ సంవత్సరం మార్గశీర్ష శుద్ధపాడ్యమి ఈయన జన్మదినం. స్వామి అసలు పేరు భూపతి రాజు లక్ష్మీనరసింహరాజు. రామరాజు, సీతాయమ్మ అనే పుణ్యదంపతులు ఈయన తల్లిదండ్రులు. స్వామివారి జీవిత చరిత్ర శ్రీ రామకృష్ణ పరమహంస దివ్య చరిత్రాన్ని తలపింప చేస్తుంది. 20 సంవత్సరాల లోపే స్వామివారికి పెళ్లి అయింది. రామకృష్ణ పరమహంస వలె స్వామి జ్ఞానానంద గృహస్థ బ్రహ్మచారి. 17, 18 సంవత్సరాల వయస్సులోనే వీరు ఇల్లు విడిచి తపోయాత్రా గమనోన్ముఖులైనారు. నేపాల్‌ సరిహద్దులలో, కాశ్మీరంలో, హృషీకేశంలో, హిమాలయ గంగ్రోతి, యమునోత్రి, మానస సరోవరాలలో పది సంవత్సరాలు తపోధ్యాన యోగ భూమికలలో సమాధి నిమగ్నులైనారు. అప్పుడు వీరికి ‘పూర్ణసూత్రాలు’ రచించాలన్న సంకల్పం జనించింది. అక్కడ స్వామికి కాగితాలు, కలం లభించే అవకాశం లేక మొదటి ప్రకరణాలు భూర్జ పత్రాలపై ఈక కలం సిరాలో ముంచి రచించారు. ఈ అచ్చు పత్రాలు వారి వంశీకుల దగ్గర ఇప్పటికీ ఉన్నాయి.

స్వామి జ్ఞానానంద తొలినాళ్ళ పరివ్రాజక క్షేత్రం గుజరాత్‌. ఈయనకి అక్కడ చాలామంది శిష్యులుండేవారు. ఈ వివరాలన్నీ స్వామివారి స్వీయ చరిత్రలో చదవవచ్చు. స్వామి జ్ఞానానంద స్వీయ చరిత్ర తెలుగులో ఉండటం తెలుగు వారికి గొప్ప అదృష్టం. స్వామివారు తన గ్రామంలోని బంధువులకు, అభిమానులకు, ఆరాధకులకు తెలుగులో ఉత్తరాలు రాసేవారు. 1930 తరువాత ఇవి రెండు సంకలనాలుగా అచ్చైనాయి.

స్వామి జ్ఞానానంద పది సంవత్సరాల పరమాద్భుత తపస్సు ముగిసిన తర్వాత జర్మనీ, జకొస్లొలేకియా, ఇంగ్లండ్‌, అమెరికాలలో 20 సంవత్సరాలు విద్యుదయస్కాంత పరమాణు భౌతికశాస్త్రం, ఎక్స్‌రే విజ్ఞానాలలో పరిశోధనలు నిర్వహించి డిఎస్‌సి, పిహెచ్‌డి, సిగ్మాక్సై వంటి అత్యున్నత పరిశోధన పట్టాలు పొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు భౌతిక విజ్ఞాన శాఖకు స్థాపకాధ్యక్షులైనారు. జర్మనీలో ఉండగా సుభాష్‌చంద్రబోస్‌ ఆతిథ్యం స్వీకరించారు. స్వామిజ్ఞానానంద స్వీయ చరిత్ర తెలుగు వారంతా చదవాలి.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *