జ్ఞానవిజ్ఞాన యోగీశ్వరుడు స్వామి జ్ఞానానంద

జ్ఞానవిజ్ఞాన యోగీశ్వరుడు స్వామి జ్ఞానానంద

(డిసెంబర్‌ 5 జ్ఞానానంద స్వామి జయంతి సందర్భంగా)ఐదువేల సంవత్సరాల భారతీయ ఆధ్యాత్మికత పథగవేషలో, తపస్వితలో యోగసిద్ధిలో, పరిపూర్ణ భగవతత్త్వావిష్కరణలో స్వామి జ్ఞానానందునిది విశిష్టస్థానం. శంకరభగవత్పాదుల బ్రహ్మసూత్రాలు, పతంజలి మహర్షి యోగ సూత్రాల ఆవిష్కరణ తర్వాత కర్మ, భక్తి, జ్ఞాన, యోగాలను సూత్రబద్ధం చేసి, భాష్య వివరణం చేసినది స్వామి జ్ఞానానంద.

దైవ స్వరూపులకు, పరమయోగులకు, మహా తపస్వులకు, పరతత్త్వ నిర్ణాయకులకు ఒక ప్రాంతం, ఒక భాష, ఒక జాతి, ఇది వారిది అని చెప్పటం ఔచిత్యం కాకపోయినా వీరు తెలుగువారు అని చెప్పుకోవటం తెలుగు వారికి ఆనందదాయకం. ఆత్మోత్తేజకరం కదా ! జ్ఞానానంద స్వామి తెలుగులో గ్రంథ రచన చేయలేదు. కాని మహాద్భుతమైన లేఖలు రాశారు. అవి శ్రీ స్వామి జ్ఞానానంద లేఖావళి పేరుతో రెండు సంపుటాలు అచ్చైనవి. గత రెండు శతాబ్దాలలో భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని పునరుజ్జ్వలం చేసిన రామకృష్ణ పరమహంస, భగవాన్‌ రమణ మహర్షి, స్వామి వివేకానంద, నారాయణ గురులతో పోల్చదగిన గొప్పవ్యక్తి స్వామి జ్ఞానానంద. అయితే స్వామి జ్ఞానానంద దివ్యాన్వేషణపథ యాత్రలో తారసిల్లిన అత్యద్భుత సంఘటనలు, సన్నివేశాలు తక్కిన వారి దివ్యావతార చరిత్రలలో కనపడవు.

కైలాస మానస సరోవర తీరంలో స్వామి జ్ఞానానంద దిగంబరంగా (6వ ధూతగా) నిర్వికల్ప సమాధిలో వారం రోజులు తన అస్తిత్వాన్ని భగవన్మయం చేశారు. ఎవరో జిజ్ఞాసి ‘భగవంతుడు లోకంలోకి ఎందుకు దిగి వస్తాడు ?’ అని భగవాన్‌ రమణ మహర్షిని అడగగా ‘ప్రేమవశుడై నిజేచ్ఛతో అవతరిస్తాడు’ అని ఆయన చెప్పారు. లేకపోతే ఇటువంటి దివ్యపురుషులు ఈ లోకంలోకి రావలసిన అవసరం ఏముంది?

బుద్ధభగవానుడు అవతరించిన నేపాల్‌, భారతదేశ సరిహద్దులలో గండకి నదీ తీరారణ్యంలో స్వామి జ్ఞానానంద తపస్సు చేశారు. తరువాత యమునా తీరంలో (ఢిల్లీ), మౌంట్‌అబూలోని గురుదత్తాత్రేయ శిఖరంలో, కాశ్మీరులో, హృషీకేశ్‌లో, హిమాలయ శ్రేణులలో, గంగోత్తరి, యమునోత్తరి, బదరికాశ్రమం, జ్యోతిర్మఠం, పుణ్యతపోవనాలలోని గుహలలో తపస్సు చేశారు. తన తపోనుభవాలు తెలియచేయ వలసిందిగా తన పూర్వాశ్రమ కుటుంబీకులు, తన వద్ద తపోదీక్షీ స్వీకరించిన యతులు, ఆరాధకులు పదే పదే కోరగా ఆ దివ్య తపస్వి వాటిని ఒక సందర్భంలో సంగ్రహంగా వివరించారు. దీనిని ఒక గొప్ప అదృష్టంగా, అనుగ్రహంగా భావించి స్వామీజీ ప్రేమ పాత్రులు ఆ తపోనుభవాలను రికార్డ్‌ చేసి భద్రపరిచారు. ఆ తరువాత అచ్చు వేయించారు. హిమాలయ పర్వత దివ్యకథనం రెండు పుటలలో చెప్పటం ఎంత అసాధ్యమో! స్వామి జ్ఞానానందను గూర్చి చెప్పటం కూడ అటువంటిదే.

స్వామీజీ చెప్పిన తన చరిత్రను ఆయన కుటుంబ సభ్యులు స్వామి జ్ఞానానంద స్వీయ చరిత్ర పేరుతో రెండు మూడు సార్లు ప్రచురించింది. మొదటిసారి ఆర్ట్‌ పేపరు మీద తళతళలాడే కాగితంపై అద్భుతమైన చిత్రపటాలతో ముద్రించిన స్వామి జ్ఞానానంద దివ్య చరిత్రను చదవడం అద్భుత సాహిత్యానుభవం.

జ్ఞానానంద గొప్ప ఆధ్యాత్మిక వేత్త, తపస్వి అంతేకాకుండా మహమహి మాన్వితుడైన విశ్వవిజ్ఞాన శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. స్వామి జ్ఞానానందుని జన్మ నామం భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు. 1896లో భీమవరం (ప.గో.జిల్లా) సమీప గ్రామమైన గొరగనమూడిలో జన్మించారు. తల్లిదండ్రులు భూపతిరాజు రామరాజు, సీతాయమ్మ.

నరసింహరాజు తన 17వ ఏటనే ఇల్లు విడిచి పవిత్ర భారతావని పతో యాత్రాగమనోన్ముఖు డయ్యాడు. స్వామి జ్ఞానానంద స్వీయ చరిత్ర నుంచి ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. మహాద్భుతమైన విషయం ఏమంటే ఈయనకు నిర్వికల్ప సమాధి కాశ్మీరులో అహరబన్‌ జలపాతం దగ్గర అలిక్‌తపో క్షేత్రంలో తపోనుభూతం కావటం. జ్ఞానానందునికి పది సంవత్సరాలోనే అత్యద్భుతమైన పరిపూర్ణ తపస్సిద్ధి లభించింది. హిమాలయాలలో తపోదీక్ష పరిపూర్ణం కాగానే భక్తి జ్ఞాన కర్మయోగ పరతత్త్వాను భూతులు సూత్రీకరించాలని కోరిక కలిగింది. ఈ గ్రంథానికాయన ‘పూర్ణసూత్రాలు’ అని పేరు పెట్టారు. ఇవి మొత్తం నాలుగు వందల అరవై సూత్రాలు. ఆధ్యాత్మిక జ్ఞాన పరివ్యాప్తిని, భారతీయ యుగయుగాల తత్త్వచింతన విశిష్టతను ప్రపంచ వ్యాప్తం చేయాలని ఈ గ్రంథాన్ని ఈయన ఇంగ్లీషులో ప్రచురించారు. తరువాత కాలంలో సంస్కృతంలోకి అనువదించారు. గ్రంథాన్ని అచ్చువేయించటానికి జ్ఞానానందుడు 1927లో జర్మనీ వెళ్ళారు. అక్కడ జర్మన్‌ నేర్చుకున్నారు. జర్మనిలో ఉండగా నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ఈయనను తమతో విందారగించ వలసిందని ఆహ్వానించారు. ఈ వార్త మోడరన్‌ రివ్యూ పత్రికలో ప్రచురించారు. తరువాత ఆయన జకొస్లోవేకియా వెళ్లారు. ప్రాహ్‌ విశ్వవిద్యాలంలో పరిశోధనలు చేశారు. 1934లో డి.ఎస్‌.సి.లో పట్ట భద్రుడయ్యారు. తరువాత ఇంగ్లండు, అమెరికా దేశాలకు కూడా వెళ్ళారు. అక్కడ భౌతిక పరమాణు విజ్ఞానశాస్త్రంలో గొప్ప పరిశోధనలు జరిపారు. ఆ రెండు దేశాలు జ్ఞానానంద స్వామి పరిశోధలనకు అత్యున్నత విజ్ఞాన శాస్త్ర పరిశోధన పట్టాలనిచ్చాయి. ఇంగ్లండులో ఉన్నప్పుడు భారత స్వాతంత్య్రో ద్యమంలో ప్రసంగాలు చేశారు. స్వతంత్య్రం రాగానే ఇండియాకు వచ్చారు. మొదట ఢిల్లీలో నేషనల్‌ ఫిజికల్‌ లేబరేటర్‌లోనూ, తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు, భౌతిక, విజ్ఞానశాస్త్ర ఆచార్యుడిగా ఉద్యోగం చేశారు. జ్ఞానానందస్వామి 1969లో మరణించారు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *