జమ్మూ కశ్మీర్‌లో పద్మావతుల బలిదానం

జమ్మూ కశ్మీర్‌లో పద్మావతుల బలిదానం

జౌహార్‌ అంటే అగ్గిని ఆలింగనం చేసుకునే ఆత్మశక్తి. జౌహర్‌ అంటే పరకీయుడి చెరలో పసిడిపాన్పుపై పడుకునే కన్న నిప్పుల నిచ్చెనలెక్కి స్వర్గారోహణం చేసే అత్యంత సాహసం. జౌహర్‌ అంటే రాణి పద్మిని, పద్నాలుగు వేల మంది మహిళలతో చిత్తోడ్‌ దుర్గంలో అగ్ని కీలల్లో నవ్వుతూ ఆహుతైపోయిన ఘట్టం. జౌహర్‌ అంటే పరకీయుడి నుంచి కాపాడుకునేందుకు రాణి కర్ణావతి చేసిన అపురూప త్యాగం.

ఆధునిక యుగంలో అలాంటి జౌహర్‌ జమ్మూ కశ్మీర్‌లోనూ జరిగింది. దురదష్టం ఏమిటంటే ఇది పుస్తకాలకెక్కలేదు. చరిత్రలో రాయలేదు. ఆ సంఘటల్ని చూసిన వారు తప్ప, చెప్పేవారు లేరు. ఆ తరం అయిపోతే ఈ అపురూప ఆత్మ త్యాగాల కథ అంతరించిపోయినట్టే.

బాల్‌ కుమార్‌ గుప్త

నేడు పాకిస్తాన్‌ ఇనుప గుప్పెట్లో ఉన్న ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్‌ 25, 1947. మీర్పూర్‌ పాకిస్తానీ సేనల కబ్జాలోకి వెళ్లిపోయింది. నవంబర్‌ 28న థాథాల్‌ గ్రామంలో పాకిస్తానీ సైనికులు ప్రవేశించారు. ఊళ్లో ఉన్న మగవారినందరిని కొంత దూరంలో ఉన్న క్యాంప్‌కి తరలించారు. ఈ తరలింపు రాత్రి పూటే జరిగేది. పగలైతే భారతీయ సైన్యం విమానాలు వారిని గుర్తిస్తాయని రాత్రి మాత్రమే తరలించేవారు. అదే విధంగా హిందూ మహిళలను కూడా నడిపించు కుని తీసుకువెళ్లారు. తెల్లవారే సరికి ఎగువ జీలం కాలువ వద్దకు చేరుకున్నారు. అది కశ్మీర్‌కి, పాకిస్తాన్‌కి సరిహద్దు. ఒక్కసారి సరిహద్దును దాటితే వారు పాకిస్తాన్‌ గుప్పెట్లోకి వెళ్లిపోతారు. ఇక బలాత్కారాలు, అత్యాచారాల దుష్టక్రీడ ప్రారంభమవుతుంది.

అందుకే మహిళలు ఒక్క ఉదుటున శరవేగంతో ప్రవహిస్తున్న కాలువలోకి దూకేశారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఇలా మొదలైన జౌహార్‌ వందల సంఖ్యకు చేరింది. పిల్లలను ముందు నీటిలోకి విసిరి ఆ తరువాత తల్లులు కూడా దూకారు. పాకిస్తాన్‌ సైనికులు వారిని ఆపేందుకు ప్రయత్నించినా, రక్కసుల బారిన పడటం కన్న ప్రాణాలు విడవడమే మేలనుకుని వారు ప్రాణత్యాగం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క రాణి పద్మినిలా, రాణి కర్ణావతిలా నీటిలోకి దూకేశారు. జీలం నది ప్రవాహ వేగానికి కొట్టు కుపోతున్న మహిళల శవాలతో నిండిపోయింది.

ఈ సంఘటలకు ప్రత్యక్ష సాక్షి అయిన బాల్‌ కుమార్‌ గుప్త ‘ఫర్గాటెన్‌ అట్రాసిటీస్‌: మెమోరీస్‌ ఆఫ్‌ ఎ సర్వైవర్‌ ఆఫ్‌ 1947 పార్టిషన్‌ ఆఫ్‌ ఇండియా’ (మరిచిపోయిన అత్యాచారాలు. దేశ విభజన హింసలో బతికి బట్టకట్టిన ఒక వ్యక్తి స్మతులు) అన్న పుస్తకంలో ఈ వివరాలన్నీ రాశారు. ఆయన తాత ఖేమ్‌ చంద్‌ భగోత్రా తన కోడలిని కిరాతకుల బారి నుంచి కాపాడే ప్రయత్నం చేశాడు. ఆయన్ని పాక్‌ సేనలు కాల్చి చంపేశాయి. ఆయన తరువాత ముకుందలాల్‌ సూత్‌ వాలా అనే మరో వ్యక్తి తన కోడలిని కాపాడేందుకు ప్రయత్నించినందుకు పాకిస్తానీల తూటాలకు బలయ్యాడు.

బాల్‌ కుమార్‌ గుప్త తన పుస్తకంలో డాక్టర్‌ నానక్‌ చంద్‌ గుప్త భార్య శాంతి దేవి గురించి కూడా రాశారు. ఆమె అకాల్‌ గఢ్‌లో అగ్నిలోకి దూకి బలిదానం చేసేందుకు ప్రయత్నించింది. కానీ పాకిస్తానీలు ఆమెను బందీగా పట్టుకుని తీసుకువెళ్లారు. జీలం నది సమీపంలోకి రాగానే ఆమె నదిలోకి దూకేసింది. మరో మహిళ స్వరణ్‌ దేవీ తన కుమార్తె నిర్మల్‌తో కలిసి నీటిలోకి దూకేసింది. పాకిస్తానీలు వారిని నీటి నుంచి వెలికి తీశారు. అప్పటికే శాంతిదేవి చనిపోయారు. నిర్మల్‌, స్వరణ్‌ దేవిలు మాత్రం బతికి ఉన్నారు. ఆ తరువాత ఏమనుకున్నారో తెలియదు కానీ, పాకిస్తానీ సైనికులు వారిని వదిలేశారు. స్వరణ్‌ దేవి గర్భవతిగా ఉండటం, నిర్మల్‌ వయసు కేవలం ఏడేళ్లు కావడంతో వారిని వదిలేశారేమో. వారి పిల్లలు రమేశ్‌, భూషణ్‌, రాజేందర్‌లను కూడా వదిలేశారు. అలాగే పుస్తక రచయిత బాల్‌ కుమార్‌ గుప్త అప్పటికి చిన్నపిల్లవాడు కావడంతో వదిలేశారు. అలా వారంత భారత్‌కు చేరుకోగలిగారు.

ఇలాంటి బలిదానాలు జమ్మూ కశ్మీర్‌లో కోకొల్లలు. దురదష్టం ఏమిటంటే ఇవేవీ చరిత్రలోకి ఎక్కలేదు. స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న నేటి జమ్మూ కశ్మీర్‌ వీటిని చరిత్రకెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– ప్రభాత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *