గిడుగు వెంకటరామమూర్తి

గిడుగు వెంకటరామమూర్తి

శ్రీకాకుళంలో 1988 మే నెలలో గిడుగు వెంకటరామమూర్తి పంతులు, ఆయన కుమారుడు వెంకట సీతాపతి గారి స్మృతి సంవర్థన సభలు జరిగాయి. అప్పుడు హైదరాబాద్‌ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తూమాటి దొణప్పగారు శ్రీకాకుళంలో ఒక గొప్ప విద్యా సంస్థ ఆవరణలో ఈ తండ్రీ, కొడుకుల ఉరఃశిల్పాకృతికమూర్తి ప్రతిష్ఠలు జరపాలని ఈ ఉత్సవ సంఘ కార్యనిర్వాహక వర్గం తీర్మానించి ఉండవచ్చు. ఆచార్య తూమాటి దొనప్ప నాకు ఫోన్‌ చేసి గిడుగు రామమూర్తిపై ఒక పుస్తకం మీరు రాయాలి, దానిని మనం శ్రీకాకుళంలో ఆవిష్కరించాలి అని నన్నెంతో ఉత్సాహ పరిచారు. యథాశక్తి ప్రయత్నిస్తానని వారికి మనవి చేశాను. ఆ పని చేయగలిగాను. నాకీ పని అప్పగించినప్పుడు ఉరఃశిల్పమూర్తుల ప్రతిష్ఠాపనకు అంతా రెండు నెలల వ్యవధి కూడా ఉన్నట్లు లేదు. రాస్తూ ఉండగానే అచ్చు కూర్పు కూడా జరుగుతూ వచ్చింది.

నేను శ్రీకాకుళం ప్రయాణమై వెళుతూ విజయవాడలో ఒక రోజు ఆగాను. నా ఆరోగ్యం ఏమీ బాగా లేదప్పుడు. మే నెల విపరీతమైన ఎండలు. తెలుగు భాషా సాహిత్యాలకు జవసత్వాలు పునరుద్ధరించిన మహాత్ముడు గిడుగు వారి సంస్మరణ సభకు హాజరు కావటం నా పురాకృత పుణ్యం అన్నంత వేడుకతో వెళ్ళాను. విజయవాడలో ఆంధ్రజ్యోతి అప్పటి సంపాదకులు నండూరి రామమోహన్‌రావు గారిని కూడా చూసిన జ్ఞాపకం. ఈ చరితార్థ సంఘటన గూర్చి పత్రికలో ప్రకటించ వలసిందని ఒక రచన కూడా ఆయనకిచ్చినట్లు, ఆయన సంపాదకీయం కూడా రాసినట్లు జ్ఞాపకం.

తీరా శ్రీకాకుళం సభకు తూమాటి దొణప్పగారు రాలేదు. అందువల్ల నా పుస్తకం ఆవిష్కరణ ఆలోచనే రాలేదు. ఈ తండ్రీ, తనయుల సంస్మరణ సభలను కనసొంపుగా, వినఇంపుగా జరగాలని నిర్వాహకుల మహితాశయం కావచ్చు. అలనాటి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్డు జడ్జి కొత్తపల్లి పున్నయ్యగారు ఈ మహత్కార్య నిర్వహణ సంఘం అధ్యక్షులు. వారి కుమార్తె శ్రీమతి ప్రతిభాభారతి (అప్పటి శాసనసభ స్పీకరామె) ముఖ్య అతిథి కాబోలు. పున్నయ్యదొర అప్పటి డిఐజి. వీరంతా కార్యనిర్వాహక వర్గ విశిష్ట సభ్యులు. ఆచార్య సి.నారాయణరెడ్డిగారు ఉండవలసిందే కదా ! అదనపు ఆకర్షణలుగా మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు గారిని సత్కరించారు. ఈ సభల సందర్భంగానే నేను రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారితో మొదటిసారి మాట కలిపాను. శంకరాభరణం శంకర శాస్త్రిగారు నన్ను గొప్పవాణ్ణి చేసి అభినందించారు. నారాయణరెడ్డి గారితో నాకు అప్పటికే పాతికేళ్ల సాన్నిహిత్యం. దానికేమి! ఆయన నన్ను గౌరవాదరించారు. తమ ప్రతిభకు తార్కాణంగా కొన్ని విషయాలు ప్రస్తావించారు. పక్కపక్కనే ఫలహారాలు, భోజనాలు నిర్వర్తించాం కదా !

సాయంకాలం బ్రహ్మాండంగా సభా స్థలం కిక్కిరిసి పోయింది. శ్రీకాకుళమంతా అక్కడే ఉన్నదా ? అన్నట్లు. వేసవికాలం కదా ! మల్లెపూల గజమాలల గుబాళింపులు వేదికపైనా, వేదికముందూ. అయితే ఏం ! గిడుగు రామమూర్తి ఘనత ఆ తిరుణాల వారికెందుకు ? ఈలలు, చప్పట్లు, ఉత్కంఠమైన అర్థింపులు మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వర రావులు తక్షణం సినీగీతాలాలపించాలని. వేదిక మీద ఆచార్య నారాయణరెడ్డిగారిని, రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారిని, శంకరాభరణం శాస్త్రిగారిని, అధ్యక్షులనూ, శాసనసభా స్పీకరును ప్రజాసందోహం మాట్లాడనివ్వలేదు. ఇక నేనొక లెక్కాపత్రమా వాళ్లకు. గిడుగు రామమూర్తి పంతులుగారు తాను పండితుణ్ణి అనుకునేంత అవివేకిని కాను అన్నారొకసారి. ఈ ప్రసంగంలో మాట్లాడేంత అవివేక సాహసం నాకు లేదు అని నా ప్రసంగం ముక్తసరీకరించినట్లు నాకు గుర్తు. మరోనాడు రైలు ప్రయాణం వేళ మాధవపెద్ది, పిఠాపురం నన్ను అభినందించినట్లు జ్ఞాపకం. కాని ‘గిడుగువారి జీవితం – ఉద్యమం’ అనే నా పుస్తకం మాత్రం ఆవిష్కరణ కాలేదు.

– డా|| అక్కిరాజు రమాపతిరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *