ఐఐటి విద్యార్థుల ప్రతిభ…

ఐఐటి విద్యార్థుల ప్రతిభ…

సహజ వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. కాని నేడు వాటికి రక్షణ లేకుండా పోతోంది. అభివృద్ధి పేరుతో సమాజం ప్రకృతి వినాశనం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.

అయితే కొందరు విద్యార్థులు మాత్రం ప్రకృతిని రక్షించేందుకు.. పర్యావరణ సమతుల్యాన్ని నిలిపేందుకు కృషి చేస్తున్నారు. తమ ప్రయోగాల ద్వారా సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు వ్యర్థాల పునర్వినియోగం ద్వారా ప్రకృతిని కాపాడేందుకు తమ వంతుగా పాటుపడుతున్నారు.

సాంకేతిక విద్య సహకారంతో, సూర్యరశ్మి సౌజన్యంతో ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేస్తున్న వారు కొందరైతే… అవే ప్లాస్టిక్‌ వ్యర్థాలకు వంటింటి సామాగ్రి, వెంట్రుకల వంటి పదార్థాలను కలిపి ఇటుకలు, టైల్స్‌ వంటి వాటిని రూపొందిస్తున్నవారు మరికొందరు.. మరి వారి విజయాలను మనం కూడా తెలుసుకుందామా..!

మద్రాస్‌ ఐఐటికి చెందిన విద్యార్థులు సౌరశక్తి సహకారంతో ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఇందుకు వారు ఎన్నో ప్రయోగాలు చేశారు. పైరోలసిస్‌ అనే విధానాన్ని కనుగొన్నారు. ఈ విధానంలో ప్లాస్టిక్‌ను అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. 350 నుంచి 500ల డిగ్రీల సెల్సియస్‌ వద్ద ప్లాస్టిక్‌ నుంచి పాలీమర్లు వేరై తక్కువ సాంద్రత కలిగిన చమురు ఉత్పత్తి అవుతుంది. అలా ఒక కేజీ ప్లాస్టిక్‌ నుంచి 0.7 లీటర్ల ఇంధనం లభిస్తుంది. అయితే ప్లాస్టిక్‌ నుంచి మరింత చమురు ఉత్పత్తి చేసేందుకు ప్రస్తుతం విద్యార్థులు కృషి చేస్తున్నారు.

అదే ఇనిస్టిట్యూట్‌కి చెందిన ప్రొఫెసర్‌ ఇందుమతి నంబి ప్రయోగం చేసిన విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ప్రయోగ టీం దివ్య సారథ్యంలో ముందుకు సాగింది. ప్రయోగాలకు కావలసిన ముడి సామాగ్రిని అందించేందుకు చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శ్రీరామ్‌ నరసింహన్‌ తన సమృద్ధి ఫౌండేషన్‌ ద్వారా సహకరించారు. ఈ విధంగా విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు.

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్స వంలో విద్యార్థులు తమ ప్రాజెక్టును ప్రదర్శించి అందరి మెప్పును పొందారు. అంతేకాకుండా జీరో కార్భన్‌ ఛాలెంజ్‌-2018లో భాగంగా ఐదు లక్షల రూపాయలను బహుమతిగా గెలుచుకున్నారు. తమ ప్రణాళికలను కార్యరూపంలోకి తెచ్చేందుకు మరో 10 లక్షలను పొందారు.

ఐఐటిలో రిసెర్చ్‌ విద్యార్థిని రమ్య సెల్వరాజ్‌ తాము నిర్వహించిన ప్రయోగం గురించి గర్వంగా చెబుతూ ‘ప్లాస్టిక్‌ వల్ల ఎన్నో నష్టాలు వాటిల్లు తున్నాయి. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడంతో పాటు.. దాని పునర్వినియోగంతో ప్రయోజనం పొందేలా చేయాలని మా టీం నిర్ణయించింది. అందుకు మా ఇనిస్టిట్యూట్‌కి చెందిన ప్రొఫెసర్లు, సమృద్ధి ఫౌండేషన్‌, కొంతమంది విద్యార్థులు ప్రోత్సాహం అందించి విజయవంతం అయ్యేలా చేశారు. ప్లాస్టిక్‌ పునర్వినియోగానికి పరిశ్రమలే ముందుకొచ్చేలా చేయాలనే మా సంకల్పం విజయవంతమైంది’ అని తెలిపింది.

అయితే ఇందుకు ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని రమ్య స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్‌ నిర్వహణ విధానం పూర్తిగా మారితే తప్పితే అధిక మొత్తంలో చమురును ఉత్పత్తి చేయడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చని ఆమె పేర్కొంటోంది.

ప్రయోగానికి సంబంధించిన ప్రతిపాదనలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ మున్సిపాలిటీలకు పంపినట్లు రమ్య చెబుతోంది.

ప్లాస్టిక్‌ సేకరణకు ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా చెత్తను సేకరించేందుకు చిన్న చిన్న కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తమ ప్రతిపాదనల్లో ప్రభుత్వానికి సూచించారు. తద్వారా ఇంధన ఖర్చులు తగ్గడంతో పాటు ప్లాస్టిక్‌ కారణంగా జరిగే నష్టాన్ని నివారించవచ్చని విద్యార్థులు చెబుతున్నారు.

ప్లాస్టిక్‌తో ఇటుకలు.. టైల్స్‌..

అవును ఇది నిజమే.. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇటుకలు, టైల్స్‌ తయారు చేస్తున్నారు. ఐఐటి రూర్కేలాకి చెందిన విద్యార్థులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు.

చెట్లలోని ఫైబర్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాల సమ్మేళనంతో ఇటుకలు, టైల్స్‌ను తయారు చేశారు. బియ్యం, గోధుమలు, గడ్డి, జనపనారలను కూడా ప్లాస్టిక్‌తో ఇటుకలు, టైల్స్‌ తయారు చేసేందుకు వాడొచ్చని నిరూపించారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఇందు కోసం మనిషి వెంట్రుకలను కూడా వినియో గించేందుకు పూర్తి స్థాయిలో ప్రయోగాలు నిర్వహిస్తూ విజయం సాధిస్తున్నారు.

ఐఐటి రూర్కేలాలో రసాయన శాస్త్ర ఇంజనీరింగ్‌ హెడ్‌ శిశిర్‌ సిన్హా నేతత్వంలో ఈ విద్యార్థులు ప్లాస్టిక్‌ నుంచి ఇటుకలు తయారు చేసే ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందుకు ఫైబర్‌ కలిగిన పదార్థాలను ఎంచుకున్నారు. తయారీ విధానాన్ని రూపొందించు కున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. 110 నుంచి 140 డిగ్రీల వేడి వద్ద ప్లాస్టిక్‌, ఫైబర్‌ ఉన్న పదార్థాలను తాము తయారుచేసిన రసాయనంతో కలిపి కరిగించారు. ఆ వేడి మిశ్రమాన్ని తమకు కావలసిన ఆక్కతుల్లోకి పోశారు. వాటిని చల్లార్చిన తరువాత పరిశీలించారు. వారు అనుకున్న ఫలితాలు లభించాయి. ప్లాస్టిక్‌, ఫైబర్ల మిశ్రమంతో ఏర్పడిన ఇటుకలు, టైల్స్‌ చాలా నాణ్యతను కలిగి ఉన్నాయి. దీనిని నిర్ధారించుకున్న తర్వాతే వారు వీటిని వెలుగులోకి తెచ్చారు.

ప్లాస్టిక్‌, ఫైబర్‌ మిశ్రమాల్లో కలిపే రసాయనాన్ని స్థానికంగా దొరికే పదార్థాలతోనే తయారు చేస్తారు. ప్రతి వంద గ్రాముల రసాయనం తయారీకి కేవలం 50 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది.

కేవలం ప్లాస్టిక్‌ ఇటుకల తయారీకే కాకుండా.. వ్యర్థాల నుంచి ఉత్పత్తులు తయారు చేసేందుకు కూడా ఈ రసాయన మిశ్రమాన్ని వాడొచ్చని పరిశోధకుల బృందం చెబుతోంది. కేవలం 100 రూపాయల ఖర్చుతో 10 చదరపు అడుగుల టైల్స్‌ను తయారు చేయవచ్చని సిన్హా అంటున్నారు.

సిన్హా నేతృత్వంలోని బృందం ప్రధానంగా మనుషుల వెంట్రుకలపై దృష్టి పెట్టింది. ఎందుకంటే గ్రామాలలో సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు ముడిసరుకుగా దొరుకుతాయి.

అత్యంత పేదలకు కూడా తమ పరిశోధన ఫలాలు దక్కేలా చేయడమే తమ లక్ష్యం అంటున్నారు ఈ విద్యార్థులు.

– విజేత

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *