ఆ విత్తనాలే మేలు…

ఆ విత్తనాలే మేలు…

అధిక దిగుబడి, లాభాల పేరిట కొన్ని విత్తనాల కంపెనీలు రైతులను మోసం చేస్తూ వారికి నాసిరకం విత్తనాలను కట్టబెడుతూ వ్యవసాయ భూములను నిస్సారం చేస్తున్నాయి. అయితే బెంగళూరుకు చెందిన ప్రభాకరరావు ఈ పరిస్థితిని రూపు మాపాలనుకున్నారు. ఆ క్రమంలోనే ప్రాచీన భారతీయ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన విత్తనాలను సేకరించడం ప్రారంభించారు. కేవలం విత్తనాలను సేకరించడమే కాకుండా వాటిని ఉత్పత్తి చేసేందుకు కూడా ఎంతో కషి చేస్తున్నారు.

భారతదేశానికి వ్యవసాయం వెన్నెము వంటిది. మనదేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగం ముఖ్యమైన పాత్ర పోషించిందని చెబితే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం పరిస్థిలు మారిపోయాయి. భారత వ్యవసాయంలో పాశ్చాత్య వ్యవసాయ విధానాలు ప్రవేశించిన తరువాత మనదేశ వ్యవసాయ రంగం కుదేలవ్వడం మొదలైరది. మన నేలలకు పొసగని విదేశీ వ్యవసాయ పద్ధతులు నేల సారాన్ని తగ్గిస్తూ వస్తున్నాయి. హైబ్రిడ్‌ విత్తనాలు భారత నేలలకు తగవని శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. అయినా అధిక దిగుబడి, లాభాల పేరిట కొన్ని విత్తనాల కంపెనీలు రైతులను మోసం చేస్తూ వారికి నాసిరకం విత్తనాలను కట్టబెడుతూ వ్యవసాయ భూములను నిస్సారం చేస్తున్నాయి.

అయితే బెంగళూరుకు చెందిన ప్రభాకరరావు ఈ పరిస్థితిని రూపు మాపాలనుకున్నారు. ఆ క్రమంలోనే ప్రాచీన భారతీయ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన విత్తనాలను సేకరించడం ప్రారంభించారు. కేవలం విత్తనాలను సేకరించడమే కాకుండా వాటిని ఉత్పత్తి చేసేందుకు కూడా ఎంతో కషి చేస్తున్నారు. మనదేశ రైతులను సొంతంగా విత్తనాలను ఉత్పత్తి చేసుకునే శక్తులుగా తయారు చేసేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. మన పొలాలే విత్తన భాండా గారాలుగా మారేలా ప్రణాళికలను రూపొందిస్తు న్నారు. ఎటువంటి లాభాన్ని ఆశించకుండా భారత వ్యవసాయరంగ అభివద్ధి, రైతుల సంక్షేమం, భూమి సారాన్ని కాపాడ్డమే లక్ష్యంగా ప్రభాకరరావు పని చేస్తున్నారు.

‘కోడి గుడ్డంత గోధుమ గింజ’ అనే కథను మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుకొనే ఉంటాం. ఇప్పటి పిల్లలకు ఆ కథ అంతగా పరిచయం లేకపోవచ్చు. అయితే ఆ కథను మరోసారి గుర్తుచేసుకుందాం.

ఆ కథ ఏంటంటే.. ఒకరోజు కొంతమంది పిల్లలకు కోడి గుడ్డంత పరిమాణంలో, గోధుమ గింజ వలె ఉన్న వస్తువు ఒకటి దొరుకుతుంది. దాన్ని చూసిన ఓ బాటసారి పిల్లలకు డబ్బులిచ్చి దాన్ని తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళి చూపిస్తాడు. రాజు దాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దానివైపు గంటల పాటు పరిశీలనగా చూస్తారు. కాని అదేంటో ఆయనకు బోధపడదు. దాని గురించి తెలుసుకోవాలని ఆస్థాన విద్వాంసుల్ని రాజు ఆదేశిస్తారు. వారికీ ఏమీ అర్థంకాదు. అప్పుడు కిటికీలోంచి ఓ పిచ్చుక అక్కడికి వచ్చి దాన్ని పొడిచి రంధ్రం చేస్తుంది. దాంతో అది గోధుమ గింజేనని విద్వాంసులు రూఢీ చేసుకుని రాజుకు చెబుతారు. ఆ ధాన్యాన్ని ఎప్పుడు ? ఎక్కడ ? పండించేవారో తెలుసుకోవాలని రాజు వారిని ఆదేశిస్తారు. ఆ విషయం తమకు తెలీదని, రైతులే చెప్పగలరని రాజుతో విద్వాంసులు చెబుతారు. దాంతో రాజు తన రాజ్యంలోని ఒక రైతును పిలిపించి అడుగుతారు. ఆ సంగతి తనకు తెలీదని, తన తండ్రిని అడగమని చెబుతాడా రైతు. దాంతో రాజు ఆ రైతు తండ్రిని పిలిపిస్తారు. ఆయన కూడా తనకు తెలీదని, తన తండ్రికి తెలిసుండవచ్చని చెబుతాడు. రాజు ఆ ముసలి రైతునూ పిలిపించి ఇలాంటి గోధుమను ఎక్కడైనా కొన్నావా ? లేదా ఎప్పుడైనా పండించావా? అని అడుగుతారు. తమ రోజుల్లో ధాన్యాన్ని స్వతహాగా పండించేవారనీ, ఆ కాలంలో అన్నవిక్రయం మహా పాపమని, తాము ధాన్యం సైతం అమ్మేవాళ్ళం కాదనీ చెబుతాడు ఆ ముసలి రైతు. మీ పొలం ఎక్కడ ఉండేది ? అని అడిగితే ఎక్కడ దున్నుకుంటే అదే తమ చేను అని చెప్తాడు. తమ కాలంలో స్వేచ్ఛగా ఎవరు పడితే వాళ్ళు దున్నుకునే వారనీ, ఈ భూమి నాది.. ఆ భూమి నీదీ.. అనేవారు లేరని, రెక్కల కష్టం ఒకటే మానవుని సొంతమనీ చెబుతాడు. ఆ రోజుల్లోనే అటువంటి గింజలు పండినపుడు ఇప్పుడెందుకు పండడంలేదు? అని అడుగుతారు రాజు. పూర్వం మానవులు శ్రమ మీదే ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు యంతాల మీద ఆధారపడుతున్నారని అందువల్లే పంటలు సరిగా పండటంలేదని ఆ ముసలి రైతు సమాధానం చెప్పి వెళ్లి పోతాడు. అతని మాటలు విన్న రాజు తన సందేహాలను నివత్తి చేసుకొని ప్రాచీన వ్యవసాయ పద్ధతులను తన రాజ్యంలో తిరిగి ప్రవేశపెడతారు.

ఈ కథ వింటే ఎవరికైనా ఏం అర్థమవుతుంది? అన్నం పరబ్రహ్మ స్వరూపంగా కొలిచే మనం నేడు అదే అన్నంతో వ్యాపారం చేస్తున్నాం. అతిథి దేవోభవః అంటూ ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టిన మనదేశం నేడు ఆకలికేకలు వేస్తోంది. ఇంతటి దుఃస్థితి వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భారతదేశానికి పూర్వవైభవం తేలేకపోయినా కనీసం వ్యవసాయ రంగానికి శాస్త్రీయమైన ప్రాచీన విధానాలను ప్రాప్తిరపచేసేరదుకు ఎందరో కషి చేస్తున్నారు. వారిలో ప్రభాకరరావు కూడా ఒకరు.

వంద సంవత్సరాల క్రితం వరకు కేవలం టమాటాలోనే ఐదువందల రకాలను మన భారతీయులు పండించేవారు అంటే మనం నమ్మగలమా? అదే విధంగా మిగిలిన కూరగాయాల్లో కూడా రంగు, రుచి, రూపం వంటి మార్పులతో సహజమైన పంటలు పండేవి. వాటి నాణ్యత కూడా బేషుగ్గా ఉండేది. అలా పండించిన పంట నుంచే మరిన్ని నాణ్యమైన విత్తనాలను సేకరించి మరో పంట కోసం రైతులు వాటిని నిల్వ చేసుకునేవారు. అయితే హరిత విప్లవం అనంతరం ఆ పద్ధతులు మారి పోయాయి. వ్యవసాయ రంగం వాణిజ్య పరమైంది. అందుకే అన్ని రకాల ప్రాచీన విత్తనాలు మనకు అందుబాటులో లేవు. కనీసం ఉన్న వాటినైనా అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో బెంగళూరు నగర శివారుల్లో హర్యాలీలో ప్రాచీన విత్తనాల తోటలను ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రభాకరరావు.

డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌, డాక్టర్‌ నార్మన్‌ బోర్లాగులు భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి శాస్త్రవేత్తలే హైబ్రిడ్‌ విత్తనాలను అధిక దిగుబడి, రాబడుల కోసం వ్యవసాయరంగానికి పరిచయం చేశారు. రైతులు హైబ్రిడ్‌ విత్తనాలపైనే ఆధారపడేలా చేశారు. దీంతో విత్తన కంపెనీల స్వార్థానికి రైతులు బలికావడం ప్రారంభమైంది. కేవలం ఒక కాలానికి ఒకే పంట పండేలా విత్తనాలను రూపొందించడం ప్రారంభిం చాయి విత్తన ఉత్పత్తి కంపెనీలు. దీంతో ప్రతిసారి పంటను వేయడానికి విత్తన విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరడం రైతులకు పరిపాటైంది. అలా వైవిధ్యమైన పంటలు నెమ్మదిగా కనుమరుగై నేడు మనం మార్కెట్లో చూస్తున్న కూరగాయాలు, ధాన్యాలకే పంటలు పరిమితమయ్యాయి. ఆ సమస్యలను అధిగమించేందుకే ప్రభాకరరావు నడుంబిగించారు. 2011లో విత్తన ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని మారుమూల గ్రామాలు తిరుగుతూ ప్రాచీన విధానాలతో పండించిన వివిధ రకాల విత్తనాలను సేకరించడం, వాటిని ఇతర ప్రాంతాల రైతులకు పంచడం వంటి ప్రక్రియను మొదలుపెట్టారు. తాను అనుకున్నట్లుగానే లక్ష్యానికి కొద్దిగా చేరువయ్యారు. ప్రస్తుతం ప్రభాకరరావు దగ్గర 540 రకాల ప్రాచీన విత్తనాలున్నాయి.

బెంగళూరు శివారులో ప్రభాకరరావు స్థాపించిన విత్తన కేంద్రంలో తాను సేకరించిన విత్తనాల జన్యు స్థిరత్వం, అవి ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే తన పరిశోధనలో భాగంగా ఆ విత్తనాల నుంచి మరో 148 కొత్త విత్తనాలను ప్రభాకరరావు ఆవిష్కరించారు. ఆయన వద్ద ఉన్న విత్తనాలతో భారతదేశంలో ఏ ప్రాంతంలోని వారైనా పంటలు పండిచవచ్చని, ఎంతో గర్వంగా చెబుతున్నారు ప్రభాకరరావు.

బెంగళూరులోని ప్రభాకరరావు తోటకు వెళ్ళి చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అక్కడ 19 రకాల టమోటాలు, 24 రకాల కాప్సికమ్‌, మిరపకాయలు, ఆరురకాల వంకాయలు, ఐదు రకాల సారాస్‌ 11 రకాల బేసిల్స్‌, 15 రకాల ఆవాలతో పాటు ఎన్నో పోషక విలువలతో కూడిన కూరగాయలు మనకు కనిపిస్తాయి.

గత రెండు సంవత్సరాలుగా ప్రభాకరరావు తన పొలంలోని విత్తనాలను రైతులకు, పట్టణాల్లో తోటలను పెంచేవారికి, ఔత్సాహికులకు అందిస్తున్నారు. వాటిని పండించిన వారు నాణ్యమైన విత్తనాలను పొందుతున్నట్లు ప్రభాకరరావు చెబుతున్నారు. తనకు పరిచయమున్న ఓ రైతు అంగుపండ్ల పరిమాణంలో టమాటాలను పండిస్తూ కిలో మూడు వందల రూపాయలకు విక్రయిస్తు న్నాడని ప్రభాకరరావు ఎంతో గర్వంగా చెబుతున్నారు.

ఈ విషయం గురించి ప్రభాకరరావు మాట్లాడుతూ ‘స్వదేశీ విత్తనాలు చాలా దృఢంగా ఉంటాయి. అవి ఎంతో తేలికగా ఎదుగుతాయి. వేలాది సంవత్సరాల నుంచి అవి భారతీయ వాతావరణానికి అలవాటు పడి శక్తివంతంగా తయారయ్యాయి. అందుకే విదేశీ పద్ధతుల్లో పండించిన విత్తనాల కంటే భారతీయ వ్యవసాయ మూలాలే ఎంతో ఉత్తమం. అవి అధిక దిగుబడితో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాయి. మారుమూల ప్రాంతాల్లోని రైతులు సైతం దేశీయ విత్తనాలతో ఎంతో తేలికగా పంటలను పండించి అధిక ఉత్పత్తి సాధించవచ్చు. దేశీయ విత్తనాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా అవి భారత వ్యవసాయ రంగానికి ఊతమిస్తాయి’ అన్నారు.

స్వదేశీ విత్తన ఉత్పత్తిదారుల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభాకరరావు పిలుపునిస్తున్నారు. ఇందుకోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెబుతున్నారు. భారత వ్యవసాయ రంగానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రభాకరరావు పేర్కొన్నారు.

–   విజేత

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *