‘ఆశాదోషము’ తొలి తెలంగాణ నవల

‘ఆశాదోషము’ తొలి తెలంగాణ నవల

‘ఆశాదోషము’ అనే ఈ చారిత్రక నవలను శ్రీ బరారు శ్రీనివాస శర్మ 1913లో రచించినా కారణాంతరాల వల్ల డిశంబర్‌ 2017 వరకు అచ్చుకు నోచుకోలేదు.

రచయిత ఈ నవల రాసిన సమయంలో శిష్ట గ్రాంధికంలోనే రచనలు సాగేవి. అందువలన జన వ్యావహారిక భాషకు అలవాటు పడిన చదువరులకు ఈ భాష కొత్తగా తోస్తుంది. అయితే రచయిత సరళ, సుబోధమైన గ్రాంధికాన్నే వాడినందున పాఠకులకు చదవడానికి ఉత్సాహం లోపించదు.

ఇది ‘కోయలకొండ దుర్గము’ చరిత్ర. చారిత్రక ఆధారాలతోనే తానీ నవల రాయడానికి ఉపక్రమించినట్లు రచయిత పేర్కొన్నారు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు, సంఘటనలు మన కళ్ళ ముందుంటాయి. సుదీర్ఘమైన ప్రకృతి వర్ణనలున్నాయి. ఆనాటి దుర్భేద్యమైన దుర్గ నిర్మాణాన్ని మనం ఈ నవల ద్వారా తెలుసుకోగలం.

ఒక దేశద్రోహి కారణంగా ఒక స్వతంత్ర హిందూ రాజ్యం పరాధీనమవుతుంది. అయితే రాజ్యాన్ని కాపాడుకోవడానికి హిందూ సేనాధిపతులు, సైనికులు ఎంతగా పరిశ్రమించారో, వారి యుద్ధ కౌశలం ఎలాంటిదో మనం అడుగడుగునా గమనించగలం. ముందుగా వీరు దురాక్రమణా దారుల దాడులను తిప్పికొట్టారు.

గోల్కొండ నవాబు కుతుబ్‌షాహి సుమారు 70 కోటలను జయించాడు. కోయలకొండ నివాసి రంజాన్‌ అలీ దుర్బుద్ధి పూర్వకంగా కోయల కొండ రాజ్యంలో తురకలు (మహమ్మదీయులను ఆ రోజుల్లో తురకలనే వ్యవహరించేవారు) నానా హింసలకు గురి అవుతున్నారని చాడీలు చెప్పకుండా ఉంటే గోల్కొండ నవాబు ఆ దుర్గం వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. రంజాన్‌ అలీ మాటలు విని ‘ముసల్మానుల పట్ల మంచిగా ప్రవర్తించమని, అట్లు కాని పక్షంలో మీ రాజ్యంపై దాడి చేస్తామని దుర్గపు సవాయి బసవ రాజుకు కుతుబ్‌షాహి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరానికి ప్రత్యుత్తరం బసవరాజు పంపుతూ తన రాజ్యంలో తురకలకు అన్యాయం జరగలేదంటాడు. మీరు దండెత్తి వస్తే మేం చేతులు ముడుచుకొని కూర్చోం అని హెచ్చరిస్తాడు.

తురకల సేనలు వచ్చి ఎంత ప్రయత్నించినా దుర్గపు తలుపులను చేధించలేకపోతారు. ఆ పోరులో మహమ్మదీయుల సేనా నాయకుల్లో ఒకడైన జగత్‌సింహుడు నేలకూలగా రెండవ సేనా నాయకుడు యుద్ధం విరమించి వెనుదిరుగుతాడు. చివరకు కుతుబ్‌షాహి స్వయంగా వస్తాడు. అతడు కూడా బసవరాజు సేనల దాడికి ఎదురు నిలువలేక పోతాడు. గాయాలతో వెనుదిరిగి పోతాడు. అయితే ఈ విజయం వల్ల కలిగిన ఉత్సాహం ఎంతో కాలం నిలువలేదు.

రంజాన్‌ అలీ కుమారుడు పీరుమియా దుర్గాన్ని వశపరచుకొనుట కొరకు కుయుక్తిని గోల్కొండ నవాబు చెప్పాడు. ఆ మేరకు మోసపూరితంగా బసవరాజును జట్టీల చేత వధింపజేస్తాడు.

ఈ నవల ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఒక అపరాధ పరిశోధన నవలను చదువుతున్నట్లుంది. ఈ నవల పాఠకులను ఆగకుండా చదివిస్తుంది. ఒక ప్రకరణము చదివి తీరికగా రెండోది చూద్దాం అనుకోలేడు పాఠకుడు. ఆ తరువాత ప్రకరణంలో ఏముందో అన్న కుతూహలం ప్రకరణం ప్రకరణానికి ఉంది. ఈ నవలలో యుద్ధం మన కళ్ళ ముందే జరుగుతున్నట్లు రచయిత చాకచక్యంగా రచించారు.

ఈ నవలలో దుర్గ నిర్మాణ కౌశలం ఉంది. ప్రకృతి శోభల వర్ణననలున్నాయి. ప్రేమలు, వివాహాల ఉదంతం ఉంది. ప్రాణం కన్నా మానమే ముఖ్యం అని తెలియజేసే ధీరవనితను చూడగలము. మాయా పాత్రలు, కపట వేషధారణలు ఉన్నాయి. వెరసి పాఠకులను రంజింపచేసే శైలి, భాష, చిత్రణ లున్నాయి.

ప్రకాశకులు ఈ నవల తెలంగాణలోని మొదటి నవల అన్నారు. ఒక మంచి చారిత్రక నవలను అందించిన రచయిత శ్రీనివాసశర్మ అభినంద నీయులు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన నవల ఇది. వంద సంవత్సరాలు జాప్యం జరిగినా దీనిని ప్రచురించినందుకు రచయితతో పాటు సంపాదకులు డా|| భీంపల్లి శ్రీకాంత్‌ అభినందనీయులు.

‘ఆశాదోషము’

(తొలి తెలంగాణ నవల)

రచన : బరారు శ్రీనివాస శర్మ

పుటలు : 200

వెల : రూ.100/-

ప్రతులకు :

1) శ్రీమతి హేరూర్‌ శోభా విజయ్‌కుమార్‌

ఇ.నెం.3-4-468,

రెడ్డి ఉమెన్స్‌ కళాశాల ఎదురుగా,

బర్కత్‌పుర, హైదరాబాద్‌ – 500002.

సెల్‌ : 9849084918, 9908080999

2) డా|| భీంపల్లి శ్రీకాంత్‌, ఇం.నెం.8-5-38,

టీచర్‌ కాలని, మహబూబ్‌నగర్‌ – 509001,

సెల్‌ : 9032844017.

 

– గుమ్మా ప్రసాదరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *