అలా చేస్తే అధిక లాభాలు…

అలా చేస్తే అధిక లాభాలు…

మనం సంతకు వెళ్ళి కూరగాయలు కొంటున్నామో ! పండ్లు కొనుక్కుంటున్నామో ! లేదా విషాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నామో ! గత కొన్ని సంవత్సరాలుగా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనదేశంలో రకరకాల కృత్రిమ రసాయనాలతో కూరగాయలు, పండ్లను పండిస్తున్నారు. ప్రజలు వేరే గత్యంతరం లేక వాటినే తింటూ అనేక రోగాల పాలవుతున్నారు. మనం నేలకు ఏది అందిస్తే అదే ఫలరూపంలో మనకు లభిస్తుంది. దానినే మనం ఆహారంగా తీసుకుంటాం. అంటే కత్రిమ ఎరువుల సంస్థలు, విత్తన సంస్థలు భారతీయ రైతుల్ని అధిక దిగుబడి, లాభాల పేరుతో రసాయనాలు వాడిరచేందుకు ప్రోత్సహిస్తూ ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్నాయన్న మాట.

రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బతింటుంది. దీంతో మరో పంటకు రసాయనాలను వాడక తప్పని పరిస్థితి రైతులకు ఏర్పడుతుంది. విత్తన తయారీ సంస్థలు కూడా నేలసారాన్ని దెబ్బతీసే విధంగా విత్తనాలను రూపొందిస్తున్నాయనే చర్చ కూడా వ్యవసాయ వర్గాల్లో లేకపోలేదు. ఎందుకంటే కేవలం ఒక్క పంటకు మాత్రమే పనికొచ్చే విధంగా విత్తనాలను ఆ సంస్థలు తయారు చేస్తున్నాయి. ఈ లెక్కన మనం తినే కూరగాయలు, పండ్లు ఏవీ సహజంగా పండినవి కాదు. అన్నీ రసాయనపూరితమైనవే.. అందుకేనేమో దేశంలో వీధికొక ఆసుపత్రి, డివిజన్‌కు రెండు కార్పొరేట్‌, నాలుగు ప్రైవేటు ఆసుపత్రులు వెలుస్తున్నాయి. వాటికి ఏ మాత్రం తక్కువ కాకుండా రోగులు వెళ్తున్నారు. నిత్యం అనారోగ్యంతో బాధపడేవారితో అవి కిటకిటలాడుతున్నాయి. వాటన్నిటి గురించి లోతుగా చర్చించే కంటే వాటి నుంచి బయట పడే మార్గాలను అన్వేషించడం ప్రస్తుత అవసరం. సమస్యను తెలుసుకొని చింతించే కంటే దాని పరిష్కారాన్ని కనుగొనడం ముఖ్యం. మరి భారతీయ వ్యవసాయంలో రసాయన రహిత, సహజమైన వ్యవసాయ విధానం లేదా అంటే ? ఎందుకు లేదు మనం ఎంతో గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంది. అదే గో ఆధారిత వ్యవసాయం. కేవలం పాలు, పాల పదార్థాల కోసమే గోవులను పెంచుతారనే భ్రమలో నేటి తరం బ్రతికేస్తుంది. కాని గోవు వ్యవసాయంలో రైతుకు అండ అని చాలా మందికి తెలియదు. అందుకేనేమో ఆ గోవును కబేళాలకు తరలించినా నోరు మెదపలేకపోతోంది ఈ తరం. ఏది ఏమైనా గో ఆధారిత వ్యవసాయం ఎంతో లాభసాటిగా ఉంటుంది. రైతుకు అధిక దిగుబడితోపాటు నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు సహకరిస్తుంది. గో మయం, గో మూత్రం వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తాయి. అవి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.

గో ఆధారిత వ్యవసాయం ప్రకతి ఆధారిత సేద్యంలో భాగంగా చెప్పుకోవచ్చు. ఇందులో పంచగవ్యతో చేసిన ఎరువులను వాడతారు. అవి భూమికి ఎటువంటి హాని కలిగించవు. అంతేకాదు నేలను మరింత సారవంతంగా మారుస్తాయి. మొక్కలకు బలాన్ని చేకూరుస్తాయి. ప్రతిఫలంగా ఆరోగ్యవంతమైన కూరగాయలు.. పండ్లు లభిస్తాయి. ఈ విషయానికి ప్రకతి వ్యవసాయం పేరిట పద్మ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ ప్రచారం కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో విజయాలను సాధించి సాక్ష్యంగా నిలుపుతున్నారు. మరి అంతటి ప్రాధాన్యం ఉన్న మన వ్యవసాయ విధానాలు ఎందుకు మరుగునపడ్డాయనే ప్రశ్నకు సమాధానం ఉండదు. కాని మన వారసత్వ సంపద అయిన ప్రకతి వ్యవసాయాన్ని అందిపుచ్చుకునే సమయం మనకు ఇంకా ఉంది. గో ఆధారిత వ్యవసాయం ద్వారా గో సంరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ రెండూ సాధ్యపడతాయి. భావి తరాలకు సహజ సంపదను అందించిన వారం అవుతాము.

గో ఆధారిత వ్యవసాయం :

ముందుగా మనం గో ఆధారిత వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకుందాం. దీనినే పంచగవ్య విధానం అంటారు. ఈ విధానంలో ఔషధాలను కూడా తయారు చేస్తారు. అయితే వ్యవసాయం కోసం పంచగవ్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకు గో మయం, గో మూత్రం, గో క్షీరం, గోవు నెయ్యి, పెరుగులను అరటి పళ్ళు, బెల్లం వేసి పులియబెడతారు. ఆ ద్రావణాన్ని పంచగవ్యం అంటారు. దాని నుంచి వెలువడే ద్రావణాన్ని పంటలపై పిచికారి చేస్తే మంచి దిగుబడి లభిస్తుంది. అంతేకాకుండా ఈ మిశ్రమం నుంచి వచ్చిన పదార్థాన్ని ఎరువుగా వాడితే నేల సారం కూడా పెరుగుతుంది.

గో ఆధారిత వ్యవసాయం ద్వారా దేశవ్యాప్తంగా ఎందరో రైతులు లాభాలను గడిస్తున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించగలుగుతున్నారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన కథనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మనం తెలుసుకుందాం.

చెన్నైకి చెందిన శక్తికుమార్‌ కథ కూడా అదే కోవకు చెందినది. శక్తికుమార్‌ డిగ్రీ పూర్తి అయిన అనంతరం వ్యవసాయం చేయాలనుకున్నాడు. రైతుగా మారి ప్రజలకు ఆహారాన్ని అందించాలను కున్నాడు. అందుకు సేంద్రీయ వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. 2006లో తన రైతు జీవితాన్ని ప్రారంభించాడు. తొలిసారి 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. మొదటి ఏడాది నష్టాలను చవి చూశాడు. 8 లక్షల రూపాయల వరకు అతనికి అప్పులే మిగిలాయి. అయినా శక్తికుమార్‌ నిరాశ పడలేదు. వేరే ప్రాంతంలో 4.5 ఎకరాలను కౌలుకు తీసుకొని తిరిగి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. అందులో ముళ్ళకాడ పంటను వేశాడు. మొక్కలకు నీరు సరఫరా చేసేందుకు బిందు సేద్యం పద్ధతిని అనుసరించాడు. అక్కడ కూడా నష్టమే వచ్చింది. అంతేకాకుండా కౌలు డబ్బును కూడా భూయజమాని తిరిగి ఇవ్వలేదు. ఆ నిరాశలో నుంచి అతనికి కొత్త ఆలోచన పుట్టింది. గో ఆధారిత వ్యవసాయానికి ముందడుగు వేశాడు. అక్కడి నుంచి అతని జీవితమే మారిపోయింది. ఈసారి థాయ్‌లాండ్‌ రెడ్‌ లేడీ రకం పపయా పంటను వేశాడు. ఎకరానికి 900ల మొక్కలను నాటాడు. గో మయం, గో మూత్రంతో చేసిన ఎరువులను వాడాడు. చెట్లు ఏపుగా పెరిగాయి. అనుకున్నట్లుగానే ఒక్కో చెట్టుకు 50 నుంచి 60 పండ్లు కాశాయి. ఒక్కో కాయ 4 కిలోలకు పైనే బరువుతూగింది. అలా ఏడాదికి ఎకరానికి 2 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందాడు.

ప్రస్తుతం శక్తికుమార్‌ 18.5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆరు ఎకరాల్లో పపయా, ఏడు ఎకరాల్లో అరటి పండ్లు, మూడు ఎకరాల్లో పుచ్చకాయ, రెండు ఎకరాల్లో జామ పండ్లను పండిస్తున్నాడు. వాటికి పంచామతం, జీవామతా లను అందిస్తూ లాభాలను గడిస్తున్నాడు. చెన్నైలో వ్యాపారం నిర్వహిస్తూ స్థిరపడ్డాడు. సొంతింటిని నిర్మించుకున్నాడు. సొంతగా వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నాడు.

అయితే ఎరువులను, పురుగు మందులను తయారు చేయడానికి శక్తికుమార్‌ పూర్తిగా స్వదేశీ ఆవుల గో మూత్రం, గో మయాలను మాత్రమే ఉపయోగించాడు. విదేశీ ఆవులకు, భారతీయ ఆవులకు ఎంతో తేడా ఉంటుంది. అందుకే స్వదేశీ గోవుల సహకారంతో పంచగవ్య, పంచామతాలను తయారు చేసుకున్నాడు. తన పొలానికి సరిపడ తయారు చేసుకొని మిగిలినది అవసరమైన రైతులకు అందిస్తున్నాడు. మొత్తం ఐదు రకాల గోవులను శక్తికుమార్‌ తన పశువుల పాకలో ఉంచాడు. అందులో ముఖ్యమైనది గిర్‌ గోవు. అలా గో ఆధారిత వ్యవసాయం తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, అంతేకాకుండా ఎంతో లాభదాయకమైనదని చేతల్లో నిరూపించాడు శక్తికుమార్‌. అతడిని ఆదర్శంగా తీసుకొని రైతులందరూ గో ఆధారిత వ్యవసాయం వైపు మొగ్గుచూపి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తితో పాటు లాభాలను పొందే భారతీయ వ్యవసాయ విధానాన్ని అలవరచుకోవాలి. తద్వారా ‘సుసంపన్న భారత్‌.. ఆరోగ్య భారత్‌..’ అతికొద్ది రోజుల్లోనే సాధ్యపడుతుంది.

మనవంతుగా గో ఆధారిత వ్యవసాయానికి ప్రచారం కల్పిద్దాం.. ! రైతులను, నేల తల్లిని కాపాడుకుందాం…!

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

– విజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *