అలా చేశాడు.. ఆదర్శంగా నిలిచాడు..

అలా చేశాడు.. ఆదర్శంగా నిలిచాడు..

– స్ట్రాబెర్రీ పంటతో అధిక లాభాలు సాధిస్తున్న యువరైతు

– దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న దీపక్‌

సంప్రదాయ పద్ధతులకు తోడు వైవిధ్యాన్ని అందిపుచ్చుకోగలిగితే వ్యవసాయం కూడా లాభదాయకమేనని రాజస్థాన్‌కు చెందిన ఓ యువరైతు నిరూపించారు. రొటీన్‌కు భిన్నంగా స్ట్రాబెర్రీ పంటను సాగుచేసి అధిక లాభాలు పొందుతూ చుట్టు పక్కల గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు దీపక్‌.

ఆయన వెబ్‌ డిజైనింగ్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లోని క్లైంట్లకు సేవలందిస్తున్నారు. అయినా అతనిలో ఏదో తెలియని అసంతప్తి. చిన్నతనంలో పొలాల్లో ఆడుకున్న మధుర జ్ఞాపకాలు ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రకతి మధ్యలో గడచిన కాలం అతనికి మానసిక ఆనందాన్నిచ్చింది. ఎలాగైనా ప్రకతికి దగ్గర కావాలనుకున్నారు. అందుకోసం మార్గాలను వెతకడం ఆరంభించారు. కేవలం వ్యవసాయంతోనే ప్రకతికి చేరువకావచ్చని నిర్ధారించుకున్నారు. వెబ్‌ డిజైనర్‌ నుంచి రైతుగా తనని తాను మలచుకున్నారు. నేడు రాజస్థాన్‌ పాలీ జిల్లాలోని బిరంతియ కల్లన్‌ గ్రామంలో ఎంతో మంది రైతులకు అతనే స్ఫూర్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు యువ రైతు దీపక్‌.

పాలీ జిల్లాలో బిరంతియా కల్లన్‌ అనే ఓ సాధారణ గ్రామముంది. అక్కడి రైతులు సంప్రదాయ వ్యవసాయానికి అలవాటు పడిపోయారు. ప్రతి సంవత్సరం ఒకే రకమైన పంటలను పండిస్తారు. వ్యవసాయంలో పెద్దగా లాభాలు గడించలేకపోయినా ఆ గ్రామ రైతులు సంప్రదాయ విధానాలనే అనుసరిస్తూ వచ్చారు. ఇక్కడ ప్రధానంగా శనగ, మినప, భాజ్రా పంటల్ని పండిస్తున్నారు. అయితే దీపక్‌ వారి జీవితాలను మార్చేశారు. పంటమార్పు పద్ధతి వల్ల అధిక లాభాలు పొందొచ్చని వారికి తెలియజెప్పారు.

దీపక్‌ తన సొంతూరులోనే వ్యవసాయం చేయాలనుకున్నారు. స్ట్రాబెర్రీ పంటను పండించాలనే ఉత్సుకతతో రైతులను ఆ పంటకు సంబంధించిన వివరాలు అడిగేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు నిరాశే మిగిలింది. ఎందుకంటే సంప్ర దాయ పంటలకు అలవాటు పడిన అక్కడి రైతులకు స్ట్రాబెర్రీ పంట గురించి తెలియదు. అసలు అలాంటి పండ్లు ఉంటాయని కూడా వారెప్పుడూ వినలేదు.

కాని స్ట్రాబెర్రీ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండున్న విషయం దీపక్‌కు ముందే తెలుసు. వ్యవసాయాన్ని లాభసాటిగా మలిచే పంటల్లో స్ట్రాబెర్రీ ఒకటని ఆయన గుర్తించారు. కేవలం మొక్కలు నాటిన నలభై నుంచి యాభై రోజుల్లో పంట చేతికొస్తుంది. రోజు విడిచి రోజు ఇరవై కేజీల వరకు పండ్లు పండుతాయి. అంటే ఒకనెలలో ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడిని సాధించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందొచ్చు. దాంతో దీపక్‌ వ్యవసాయంలో తన తొలిగి అడుగు స్ట్రాబెర్రీ పంటతోనే వేయాలనుకున్నారు.

ఒకసారి దీపక్‌ విహారయాత్రకు మహారాష్ట్ర వెళ్ళారు. సతార, జలగావ్‌ జిల్లాల్లో రైతులు స్ట్రాబెర్రీ పంటలను పండిచడం గమనించారు. అదే అతనికి స్ఫూర్తిదాయకమైంది. తానూ స్ట్రాబెర్రీ పంటను వేయాలని నిశ్చయించుకుని అక్టోబరు నెల 2017లో తన గ్రామం బిరంతియా కల్లన్‌లో తొలుత ఎకరం స్థలంలో పంట వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ స్టడీ చేసి పంట పండించే విధానంపై అవగాహన పెంచుకున్నారు. పంట వేసే ముందు భూసార పరీక్షలను చేయించారు. స్ట్రాబెర్రీ పంటకు భూమిలో పిహెచ్‌ విలువ 7 శాతం వరకు ఉండాలి. తేమ 0.7 శాతం ఉండాలి. ఉష్ణోగ్రత కనిష్ఠంగా 10 డిగ్రీల సెల్సియస్‌ నుంచి గరిష్ఠంగా 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండొచ్చు. వాతావరణం తనకు అనుకూలంగా ఉండడం వల్ల స్ట్రాబెర్రీ పంటను సాగుచేశారు దీపక్‌.

ముందు నుంచి సేంద్రియ వ్యవసాయంపై అతనికున్న ఆసక్తి రసాయనాలకు దూరంగా ఉండేలా చేసింది. ఎకరం భూమిని చదును చేసి గ్రామస్థుల సహకారంతో ఆ భూమిలో ఆవుపేడతో చేసిన ఎరువులను చల్లారు. మొక్కలను నాటారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతి ద్వారా ఆ మొక్కలకు నీటిని అందించడం ప్రారంభించారు. పంట ప్రారంభంలో ఫంగస్‌ సమస్య తలెత్తింది. దానిని నివారించడానికి దీపక్‌ సేంద్రియ మందులనే ఉపయోగించారు. అనుకున్నట్లుగానే రెండు నెలల్లో పంట పండింది. ఎర్రని స్ట్రాబెర్రీ పండ్లు నోరూరించేలా పెరిగాయి. ఇక మిగిలింది వాటిని మార్కెట్‌ చేసుకోవడమే. వ్యవసాయ ఆధారిత వ్యాపారానికి దీపక్‌ పునాదులు వేశారు. అసలు స్ట్రాబెర్రీలంటే పరిచయమే లేని ఆ ప్రాంత ప్రజలకు వాటిని పరిచయం చేశారు.

‘నేను పంట వేసేటప్పుడు చాలా మంది రైతులు నన్ను చూసి నవ్వారు. అయినా నిరుత్సాహపడలేదు. స్ట్రాబెర్రీ పంటను పండించి అందరినీ ఆశ్చర్యంలో ముంచాను. ఈ రోజు మా ప్రాంతవాసులకు తాజా స్ట్రాబెర్రీలను అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. నాలానే చాలా మంది రైతులు కొత్త రకం పంటలను పండించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వారి కోసం, వారి అభ్యున్నతి కోసం నా వంతు కషి చేస్తాను’ అని దీపక్‌ సంతోషంగా చెప్పారు.

ఎందుకంటే పాలీ జిల్లాలో చాలా మందికి స్ట్రాబెర్రీలంటే దీపక్‌ వచ్చి చెప్పే వరకు అంతగా పరిచయం లేని పండ్లు. శీతాకాల పంట కావడంతో అక్కడి రైతులకు తెలిసే అవకాశాలు కూడా తక్కువే. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేయాలన్నా తాజా స్ట్రాబెర్రీ పండ్లు దొరకడం కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి అహ్మదాబాద్‌ మార్కెట్‌కు దిగుమతి అయిన తరువాతే ఇతర మార్కెట్లకు స్ట్రాబెర్రీలు సరఫరా అవుతాయి. ఇదంతా వారం రోజుల వ్యవహారం. దాంతో పాలీ జిల్లాలో తాజా స్ట్రాబెర్రీలు దొరకడమనేది అసాధారణ విషయంగా మారేది. దానిని అధిగమిస్తూ దీపక్‌ చేపట్టిన ప్రయోగం ఫలించి నేడు కేవలం గంటల వ్యవధిలో చెట్టు నుంచి సేకరించిన పండ్లను వినియోగదారులు కొనుగోలు చేయగలుతున్నారు. అందులోనూ సేంద్రియ పద్ధతిలో పండించి తక్కువ ధరకే దీపక్‌ మార్కెట్లో పండ్లను విక్రయిస్తున్నారు. అలా రైతులకు అధిక ఆదాయాన్ని చేకూర్చే మార్గాన్ని దీపక్‌ ఏర్పరిచారు.

సంప్రదాయ పద్ధతులకు తోడు వైవిధ్యాన్ని అందిపుచ్చుకోగలిగితే వ్యవసాయం కూడా లాభదాయకమేనని దీపక్‌ తన చేతల ద్వారా నిరూపించారు. కేవలం స్ట్రాబెర్రీలే కాకుండా విదేశాల్లో మాత్రమే పండగలిగే కూరగాయలను కూడా తన వ్యవసాయ క్షేత్రంలో పండించేందుకు సన్నద్ధమయ్యారాయన.

– విజేత

– ది బెటర్‌ ఇరడియా సౌజన్యరతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *