అమ్మ అజ్ఞానం

అమ్మ అజ్ఞానం

ప్రముఖ కథా రచయిత, వ్యాసకర్త శ్రీ గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు జాగృతి పాఠకులకు సుపరిచితులు. ఓ అచ్చ తెలుగు దేశభక్తులు, దైవ భక్తులు. తెలుగు భాషానురక్తులైన దీక్షితులు గారు అందించిన కథల సంపుటి ‘అమ్మ అజ్ఞానం’. బళ్లో ఏమీ చదువుకోకున్నా పిల్లల్లో సంస్కారాన్ని నింపే నేర్పు, ఏ వయస్సు పిల్లలకి ఆ వయస్సుకి తగిన కథనాలు చెప్పాలనే ఇంగితం ఉన్న బంగారు తల్లి కథ ఇది. డిగ్రీలపై డిగ్రీలు సంపాదించిన వారి కంటే స్కూలు ముఖమే చూడని మన బామ్మలు, అమ్మమ్మలు ఎంత ఇంగితం కలవారో ! పిల్లల్ని తీర్చిదిద్దే నేర్పు ఉన్నవారో ! సోదాహరణగా చెప్పారు ‘అమ్మ అజ్ఞానం’ అనే తొలి కథలో.

ప్రతీ కథను ఆసక్తిగా, ఆతృతతో చదివించేలా రాయటం ఈ రచయిత శైలి. ఈ సంపుటిలోని కొన్ని కథలు నవ్విస్తాయి, కొన్ని కథలు కవ్విస్తాయి. మరికొన్ని ఆలోచింపచేస్తాయి.

‘రంగపూజ’ అనే కథలో ఆపదలో ఉన్న తోటి మానవునికి చేసిన ఉపకారం భగవత్‌ పూజ చేసిన తృప్తిని ఇచ్చిన ఉదంతాన్ని హృద్యంగా వివరించారు. ‘చెప్పనా’ అనే కథలో స్వాతంత్య్ర సాధన తర్వాత హైందవ చరిత్రలో జరిగిన విజయోత్సవ ఘట్టాన్ని అయోధ్య పేరును చెప్పకుండానే చెప్పిన రచయిత చాకచక్యం, చమత్కారం ప్రశంసనీయం. రజాకారుల వంటి ర్షాసుల బారి నుండి రక్షించే సైనికులు ప్రతీ కుటుంబం నుంచీ రావాలనే ఉదాత్త సందేశమిచ్చిన కథ ఇది. దైవ భక్తులు మాత్రమే ఇటువంటి కథలు అల్లగలరు. ‘చిన్నోడా ! నీ రెండో కొడుకును సైన్యంలో చేర్పించు. వాడు ఈ లోకంలో ఆడపిల్లలకి అన్న కావాలి’ అన్న ఘట్టం హృద్యంగా సాగింది. పొట్టకోస్తే ‘తెలుగు పద్యాలు’ తప్ప ఏమీ కనబడని ఓ వ్యక్తి తెలుగు భాషానురక్తిని ‘ఒ-హిం-త-ఇ-తె’ అనే కథలో చూపించారు. ఒరియా, హిందీ, తమిల్‌, ఇంగ్లీషులు కలిపిన తెలుగును పరిహసిస్తూ.

చివరి అరడజను కథలలో రచయిత జరిపిన తీర్థయాత్రలు, అనుభవాలు వాస్తవ కథలుగా, ఆసక్తికరంగా సాగాయి. ఈ దేశంలో అనేక ప్రాంతా లకు యాత్రలు చేస్తున్నప్పుడు నాలో గట్టిపడుతోన్న నమ్మకం ఇది అంటూ రచయిత తన మనోభావాన్ని ఇలా వ్యక్తం చేశారు. ‘కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ మనదేశంలో ఉన్న సంస్కృతి ఒక్కటే. ఇక్కడ నివసించే వారంతా ఒకే జాతి, ఒకే తల్లి బిడ్డలు’ అంటూ ఐక్యతా సూత్రాన్ని గట్టిగా గుర్తు చేశారు. ‘బొట్టు పెట్టెలో దేముని కథ’ రమ్యంగా సాగిన మరో రచన. శ్రీరామున్ని నమ్ముకున్న ఈ కథా నాయకుడు ఎలా బాగుపడ్డాడో తెలియజెప్పిన కథ. ఈ కథ చివరలో రచయిత అందించిన మూడు మ¬ప దేశాలు అందరికీ ఆచరణీయాలు. అవి 1. రాముని కష్టాలు రాముని వ్యక్తిత్వాన్ని సానబెట్టాయని గ్రహించు. 2. ఆత్మ విశ్వాసం ఉన్న వారికే దైవం తోడవుతాడు. 3. గొప్ప వాడివి అవ్వటం కోసమే నువ్వు పుట్టావు.

‘ఒక నాన్న డైరీలో’ అనే కథలో మెకాలే పుత్రుడైన తండ్రికి పాఠాలు నేర్పించిన పిల్లల సంస్కారాన్ని తేట తెల్లం చేస్తారు రచయిత. ఆ తెలివి వెనుక ఉన్న అమ్మ సంస్కారాన్ని శ్లాఘిస్తూ. భారతీయతపై గౌరవాన్ని పెంచే గంగోత్రి, జైపూర్‌, కేదార్‌నాథ్‌ వంటి పవిత్ర స్థలాలకు తనతో పాటు తీసుకెళ్తారు రచయిత. అక్కడెదురైన మహిమలు, చేదు అనుభవాలు అన్నీ తన కథలో వర్ణించారు.

మొత్తానికి ఈ 32 కథల సంపుటి నవరసాలొలి కించే ఫలాలున్న బుట్ట. ఎమెస్కో సంస్థ అందంగా ప్రచురించిన ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత సాహితీవేత్త శ్రీ అక్కిరాజు రమాపతిరావుగారు సైతం మెచ్చుకున్నారు. ఇటువంటి జాతీయవాద కవిత్వాన్ని సాహిత్య అకాడమీలు గుర్తించే ‘స్వర్ణయుగం’ ఎన్నడో ?!

అమ్మ అజ్ఞానం !

గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు

సంపాదకులు :

డా||డి. చంద్రశేఖర రెడ్డి

పుటలు : 154

వెల : రూ.125/-

ప్రతులకు :

సాహితి ప్రచురణలు,

సూర్యారావుపేట

విజయవాడ-520 002, ఆంధ్రప్రదేశ్‌.

ఫోన్‌ : 0866-2436643

– బి.ఎస్‌.శర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *