అబలలు కాదు.. ఆడ పులులు…

అబలలు కాదు.. ఆడ పులులు…

అటవీశాఖలో, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగ నిర్వహణ అంటే ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. కాని అలాంటి భయంకర పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కూడా మహిళలు పనిచేస్తున్నారు. అలారటి వారిని ధీరవనితలు అనడం అతిశయోక్తి కాదు. మనుషులు కనిపిస్తే వేటాడి చంపే క్రూర మగాలు ఒకవైపు.. మగాల రూపంలో ఉన్న మనుషులు మరోవైపు.. ప్రాంతాలు వేరు.. కాని వారు చేసే పని మాత్రం ఎంతో సాహసంతో కూడుకున్నది.

ఒకరేమో అటవీ ప్రాంతంలో సింహాలు, పులులు, చిరుతలను రక్షిస్తారు. మరొకరేమో చల్లని గడ్డ కట్టే చలిలో తీవ్రవాదులు.. ఉన్మాదుల నుంచి దేశానికి, తమ గ్రామాలకు రక్షణ కల్పిస్తారు.

అయితే ఈ రెండు ప్రాంతాల్లో వారు కలిసి పనిచేసేది పురుషులతోనే.. వారికి పోటాపోటీగా రక్షణ రంగంలో భాగస్వాములవుతూ.. తాము కూడా దేనిలోనూ తీసిపోమని మహిళలు నిరూపించు కుంటున్నారు.

వీరిలో మొదటి దళం గుజరాత్‌లోని గిర్‌ అడవి ప్రాంతంలో పనిచేస్తోంది. ఆసియా జాతికి చెందిన అరుదైన సింహాల పరిరక్షణ ఈ మహిళల బాధ్యత. అయితే దేశంలోనే వీరిది ఏకైక మహిళా అటవీ అధికారులు దళం కావడం విశేషం. ఈ దళానికి రసిలా వాదేర్‌ నాయకత్వం వహిస్తున్నారు. తమ దళం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 800లకు పైగా రెస్క్యూ ఆపరేషన్లలో వీరు పాల్గొన్నారు. వాటిలో 200ల వరకు సింహాలను రక్షించినవే.

వీరిలో 26 సంవత్సరాల కిరణ్‌ పతిజా తాను గర్భం దాల్చినప్పడు కూడా విధులను నిర్వహించారు. వన్య ప్రాణుల మధ్య సాధారణంగా జీవించడానికే భయపడే చోట.. వీరు ఉండడం గొప్ప విషయమే కదా..!

ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోది గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007 సంవత్సరంలో అటవీ శాఖలో మహిళలకు 33 శాతం అవకాశం కల్పించారు. అందులో ఎంపికైన తొలి 43 మంది మహిళా అధికారులను వివిధ ప్రాంతాల్లో నియమించారు. వారిలో 12 మంది గిర్‌ అడవులకు వచ్చి సేవలందిస్తున్నారు. సింహాల నుండి గ్రామస్తులను, వేటగాళ్ల నుండి వన్యప్రాణులను రక్షించడంలో ఏ మాత్రం తగ్గకుండా ఈ మహిళా దళం పనిచేస్తుంది. నేషనల్‌ జియోగ్రఫీ, డిస్కవరీ ఛానెళ్ళలో వీరికి సంబంధించిన కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.

ఇక రెండవ దళం గ్రామ మిలీషియా దళం. వీరు కరుడుగట్టిన ఉగ్రవాదులను సైతం మట్టుపెడుతారు. ఆయుధాలను అవలీలగా వాడుతారు. దేశ సరిహద్దుల్లో ఉండి సైనికులకు తోడ్పాటును అందిస్తారు. ఇందులో ఉండే వారంతా మహిళలు కావడం విశేషం.

19వ దశకంలో జమ్ము, కాశ్మీర్లలో మహిళల మాన, ప్రాణాలకు ఉగ్రవాదుల నుంచి తీవ్రముప్పు ఉండేది. అంతేకాకుండా గ్రామాలను సర్వనాశనం చేసేవారు. ఇలాంటి దుశ్చర్యల నుండి గ్రామాలను రక్షించడానికి, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి భారత సైనిక దళం గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసింది. వారికి యుద్ధ విద్యలతోపాటు ఆయుధాలను కూడా అందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో కరుడుగట్టిన తీవ్రవాదులను కాశ్మీర్‌ లోయల్లోని మారుమూల గ్రామాల్లో ఈ గ్రామ రక్షణ దళాల సభ్యులు మట్టుబెట్టారు. పూంచ్‌, రాజౌరి, ఖతా, రెక్కాన్‌ వంటి అత్యంత సంక్లిష్ట వాతావరణ పరిస్థితులు ఉన్న చోట కూడా ఈ ధీరవనితలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు.

– విజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *