అది ధా ర్మిక సంస్థల బాధ్యత కాదా !

ఒక ఇంటికి నిప్పు అంటుకుంటే, దాని పక్క ఇళ్లలో ఉన్నవారు ప్రశాంతంగా విందు ఆరగిస్తూనో, టీ.వీ. చూస్తూనో గడపగలరా? కచ్చితంగా అలా ఉండలేరనే ఎవరైనా చెబుతారు. ఆ నిప్పు ఏ క్షణంలోనైనా ఆ ఇళ్లకు కూడా అంటుకునే ప్రమాదం నూటికి నూరుశాతం ఉంటుంది. ఇంత చిన్న తర్కం మన సమాజంలో ఆధ్యాత్మిక బోధకులుగా చలామణి అవుతున్న వారికి, వివిధ హిందూ ధార్మిక సంస్థలకు ఎందుకు అర్థం కావడం లేదో అంతుబట్టదు. ‘నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష, సమాజంలో ఏ సమస్య ఉంటే నాకేం?’ అనే స్వార్థ చింతన, బాధ్యత రాహిత్య భావన సాధారణ ప్రజలకన్నా ఈ సంస్థలకే ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే అర్థం అవుతుంది. దేశంలో గత కొన్ని నెలలుగా యోజనాబద్ధంగా హిందువులు జరుపుకునే పండుగల మీదా, హిందూ ఆలయాల మీదా, ఆచార సంప్రదా యాల మీద మేధోపరమైన దాడి జరుగుతున్నది. ‘చట్ట సభలలలో మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పించడం’ అనే అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైన మన వ్యవస్థ (అది శాసన వ్యవస్థ కావచ్చు లేక న్యాయస్థానాలు కావచ్చు) శబరిమల అయ్యప్ప దేవస్థానంలో అన్ని వయసుల మహిళల ప్రవేశం విషయంలో ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నది. అయితే హిందూ సంప్రదాయాలు, నిష్టల పట్ల చూపుతున్న ఈ అత్యుత్సాహం ఇతర మతాల వారి విషయంలో ఎందుకు చూపలేక పోతున్నారు ?

ఇటువంటి ‘ప్రభుత్వ చొరబాట్లు’ ఇస్లాం, క్రైస్తవ మతాలవారి విషయంలో జరిగితే ఆయా మతాల నాయకులు, సంస్థలూ భారీ ఎత్తున ఉద్యమాలు లేవదీస్తారు. వారి ముందు మన ప్రభుత్వాలు గజగజలాడుతూ మోకరిల్లడం అనేకసార్లు చూశాం. అంటే హిందూ ధర్మం, హిందూసమాజం స్వాభిమానం కోల్పోయిన చేతకాని వ్యవస్థలా? హిందువులకు ఈ విషయంలో మార్గనిర్దేశనం చేసి ఒక్కతాటిపైకి తెచ్చి ఉద్యమించేలా చేయవలసిన బాధ్యత మన ధార్మిక సంస్థలకు లేదా? ఈ విషయాల గురించి తీవ్రంగా ఆలోచించవలసిన బాధ్యత సాధారణ హిందువులతోపాటు ఈ ఆధ్యాత్మిక సంస్థలకు భారీ ఎత్తున విరాళాలిస్తూ వారి వద్ద శిష్యరికం చేస్తున్న వేలాది హిందువులకు కూడా ఉంది. వారంతా ఆయా సంస్థలకు నాయకత్వం వహిస్తున్న స్వామీజీలనూ, సాధువులనూ ఈ విషయంలో ప్రశ్నించాలి. ‘మేము అందర్నీ సమానంగా చూస్తాము. అన్ని మతాలూ మాకు సమానమే’ అనే ఒక కృతకమైన ప్రకటనను ఈ సంస్థ ప్రతినిధులు ఇస్తూ ఉంటారు. ఇది సమస్య నుండి తప్పించుకునే ప్రయత్నమే తప్ప మరేదీ కాదని వారు గుర్తించాలి. అన్ని మతాలు బోధించేది ఒకే తత్వమైనప్పుడు మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నట్లు? స్వామి ప్రభుపాదుల వారు తన విదేశీ పర్యటనల సందర్భంగా కృష్ణ భక్తిని ప్రత్యేకంగా ఎందుకు ప్రచారం చేశారు? మత సహనం హిందువుల నరనరాలలో ఉన్న భావన. అందుకే ఇన్ని వందల సంవత్సరాలుగా ఇన్ని హిందూయేతర మతాలు ఇక్కడ మనగలుగుతున్నాయి. దీని అర్థం ‘అందరూ సమానమే కాబట్టి, వాళ్లు దాడి చేసినా మనం సహిస్తూ ఉండాలి’ అని కాదు. హిందువులు అనవసరంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టరు. అదే సమయంలో తమపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోరు. అందుకే ఇన్ని వందల సంవత్సరాలుగా ఇన్ని దాడులు జరిగినా హిందూ సమాజం తట్టుకుని నిలబడగలిగింది.

హిందూ ధర్మ పరిరక్షణకు కంకణ బద్ధుడైన ఒక స్వామీజీని శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం నాడు పట్టపగలే నరికి దారుణంగా హత్య చేసినప్పుడుగానీ, గుడి పూజారి మీద అమానుష దాడి జరిగినప్పుడు గానీ మన దేశంలోని ధార్మిక సంస్థలు ‘తమకూ, ఆ సంఘటనలకూ ఎటువంటి సంబంధమూ లేద’న్నట్లు వ్యవహరించాయి. ఇంకా గట్టిగా ప్రశ్నిస్తే ‘ఆ స్వామి మా సంప్రదాయానికి చెందిన సన్య్నాసి కాదు, ఈ పూజారి సాయిబాబాను పూజిస్తాడు. కాబట్టి ఆయన హత్యకు గురవ్వడమన్నది మాకు సంబంధం లేని విషయం’ అనేది వారి వాదన.

ఒక సందర్భంలో దుర్యోధనుడు గంధర్వుల దాడిలో చిక్కుకున్నప్పుడు అతనిని కాపాడమని భీమునికి ధర్మరాజు సూచిస్తాడు. భీముడు అందుకు తన అయిష్టతను ప్రదర్శిస్తాడు. అప్పుడు ధర్మరాజు భీమునితో ఇలా అంటాడు- ‘చూడు భీమా! కౌరవులకూ, మనకు మధ్య వివాదం తలెత్తినప్పుడు కౌరవులు 100 మంది, మనం ఐదుగురం. కానీ పరాయివాడు మన మీద దాడి చేసినప్పుడు మనం కౌరవులం, పాండవులం మొత్తం కలిపి 105 మందిమి. కాబట్టి గంధర్వులు దాడిచేసిన ఈ సమయంలో దుర్యోధనుడు మనవాడు. ఈ పరిస్థితుల్లో నువ్వు దుర్యోధనుడ్ని కాపాడవలసిందే’ అంటాడు. మహాభారతంలోని ఈ తర్కం మనదేశం లోని ఆధ్యాత్మిక సంస్థలకూ, మఠాధిపతులకూ, స్వామీజీలకూ అర్థమయిన నాడు ఏ శక్తీ హిందూ సమాజాన్ని ఏమీ చేయలేదు.

పది సంవత్సరాల క్రితం సికింద్రాబాద్‌లోని ఇస్కాన్‌ మందిరానికి సమస్య వచ్చినప్పుడు యావత్‌ హిందూ సమాజం ఏకమై పోరాడింది. మరి ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఎండనకా వాననకా, కష్టాలు పడుతూ లాఠీ దెబ్బలు తింటూ, అయ్యప్ప స్వామి ఆలయ పవిత్రతను కాపాడటానికి ప్రయత్నిస్తున్న వేలాది మంది హిందూ బంధువులకు సంఘీభావం తెలపడం హిందూ సంస్థల బాధ్యత కాదా?

కశ్మీర్‌లోయలో ఒకప్పుడు కాశ్మీరీ పండిత కుటుంబాలు లక్షల సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు అక్కడ మచ్చుకి కొన్ని కూడా కనిపించవు. ‘సమస్య మా మఠానికో, నా శిష్యులకో వచ్చినప్పుడు చూద్దాంలే!’ అనుకుంటూ కాలం గడిపితే భవిష్యత్తులో మనకూ అలాంటి సమస్యలు ఎదురు కావచ్చు. 500 సంవత్సరాల క్రింద ఇస్లామిక్‌ దండయాత్రలతో నలిగిపోతున్న హిందూ సమాజాన్ని కాపాడటానికి అనేకమంది సాధుసంతులూ, సన్యాసులూ నడుం బిగించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ గ్రామ గ్రామానా తిరుగుతూ ధర్మ ప్రచారం చేస్తూ ప్రజలను తట్టి లేపారు, ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దారు. ఆ వాతావరణమే కృష్ణదేవరాయలకు, ఛత్రపతి శివాజీ మహరాజ్‌ వంటి వీరులకు ఉపయోగపడింది. ఆ వీరుల శౌర్యాన్ని, ఆ సాధుసంతుల త్యాగాన్నీ మఠాలలో బోధించాలి. గ్రామాలలో వ్యాప్తి చేయాలి. లేకపోతే రాబోయే కొన్ని సంవత్సరాలలో మన పరిస్థితికూడా కశ్మీరీ పండితుల లాగే అవచ్చు. కాబట్టి మఠాధిపతులూ, ధార్మిక సంస్థల నిర్వాహకులూ ఈ విషయం పట్ల లోతుగా ఆలోచించాలి.

– లక్ష్మణ సేవక్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *