ఇది కాదా పక్షపాతం..!

ఇది కాదా పక్షపాతం..!

ధరలు పెరిగినపుడు ప్రధాని మోదీని బాధ్యుడిని చేసిన ప్రతిపక్షాలు, మీడియా ధర తగ్గినపుడు దాన్ని మోదీ ఖాతాలో వేయడానికి వెనుకాడు తున్నాయి. ఇది పక్షపాతం కాదా ? జాతి సంక్షేమం, జాతీయ ప్రయోజనాల పట్ల బాధ్యత కల రాజకీయ నేతల స్వభావం ఇలా ఉంటుందా !

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా కూడా పెట్రోలు, డీజిలు ధరలు భారీగా తగ్గాయి. అయితే ఈ తగ్గుదలను నకిలీ లౌకిక మీడియా గుర్తించడం లేదు. ధరలు పెరిగినప్పుడు ప్రతి పైసా పెరుగుదలను ప్రత్యేక బాక్సులో ప్రతిరోజు చూపించిన ఈ మీడియా పెట్రోలు, డీజిలు ధరలు గరిష్ఠస్థాయి నుంచి సుమారు లీటరుకు 13 రూపాయలు తగ్గినా ఆ వార్తకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరుగున పరచడానికి ప్రయత్నిస్తున్నది. అక్టోబరు నెలలో గరిష్ఠ స్థాయికి చేరిన పెట్రోలు, డీజిలు ధరలు నవంబరులో తగ్గుముఖం పట్టాయి. గడచిన రెండు నెలల్లో పెట్రోలు, డీజిలు ధరలు 10 శాతం మేర తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా 30 శాతం మేర తగ్గాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య పెట్రోలు ఉత్పత్తిని పెంచడంతో నవంబరులో సప్లై పెరిగి ఆ మేరకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో నవంబరులో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసినా అమెరికా ఆంక్షల్లో భారత్‌, చైనా దేశాలకు మినహా యింపు ఇవ్వడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడలేదు. ఒపెక్‌ దేశాలు తదుపరి సమావేశంలో ఉత్పత్తిని తగ్గించాలని చూస్తే చమురు ధరలు మళ్లీ యూటర్న్‌ తీసుకునే అవకాశం ఉంది.

అక్టోబరు 4న దిల్లీలో లీటరు పెట్రోలు ధర గరిష్టంగా 84 రూపాయలకి చేరింది. డీజిలు గరిష్టంగా 75.45 రూపాయలకు చేరింది. ప్రస్తుతం దిల్లీలో పెట్రోలు 72, డీజిలు 67 రూపాయలకు చేరాయి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సగటున పెట్రోలుపై 13 రూపాయలు, డీజిలుపై 9 రూపాయల మేర ధర తగ్గింది. ఈ తగ్గుదలను ప్రతిపక్షాలుగానీ, మీడియాగానీ గుర్తించడంలేదు సరికదా దీనికి అంతర్జాతీయంగా ధరలు తగ్గడమే కారణం కానీ మోదీ చేసిందేమీ లేదు అని విమర్శిస్తున్నాయి. ధరలు పెరిగినపుడు ప్రధాని మోదీని బాధ్యున్ని చేసిన ప్రతిపక్షాలు, మీడియా ధర తగ్గినపుడు దాన్ని మోదీ ఖాతాలో వేయడానికి వెనుకాడుతున్నాయి. ఇది పక్షపాతం కాదా ? జాతి సంక్షేమం, జాతీయ ప్రయోజనాల పట్ల బాధ్యత కల రాజకీయ నేతల స్వభావం ఇలా ఉంటుందా !

నిజానికి పెట్రోలు డీజిలు ధరల హెచ్చుతగ్గుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తక్కువగా ఉన్నందున ఆదాయం కోసం ప్రభుత్వం తప్పనిసరిగా పరోక్ష పన్నులను విధిస్తుంది. ఆదాయం కోసం ఎక్కువమంది వినియోగించే పెట్రోలుపై పన్ను విధించక తప్పని పరిస్థితి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలదీ. అదీకాక పెట్రోలుపై కేంద్రం విధించే పన్నులో ఎక్కువ భాగం రాష్ట్రాలకే దక్కుతుంది. కేంద్రానికి లభించేది స్వల్పమే. ఎందుకంటే రాష్ట్రాలకు ఈ పన్నే జీవనాధారం. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోలు డీజిలుపై విధించే సుంకమే ప్రధాన ఆదాయ వనరు. ఇది లిక్కరుపై వచ్చే ఆదాయం కన్నా ఎక్కువగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. అందుకే ఇంధనాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తా మంటే రాష్ట్రాలు వద్దంటున్నాయి.

దీనిపైనే ఎక్కువ ఖర్చు

భారతదేశం ఇంధన రంగంలో స్వయంసమద్ధి సాధించలేదు. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడు తోంది. 2014లో ముడి చమురుధరలు బ్యారెల్‌కు 140 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరినపుడు భారతదేశం చమురు దిగుమతులకు 8 లక్షల 64 వేల కోట్ల రూపాయలను వెచ్చించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 189 మిలియన్‌ టన్నుల ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకుంది. 2018-19లో 228 మిలియన్‌ టన్నుల చమురును దిగుమతి చేసుకునే అవకాశం ఉందని ముందస్తు అంచనాలు తెలుపుతున్నాయి. దీనికోసం సుమారు 8 లక్షల 84 వేల కోట్ల రూపాయలను వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఏటికేడు భారత్‌లో ఇంధన అవసరాల కోసం దిగుమతి చేసుకునే చమురు పెరిగిపోతూనే ఉంది. వివిధ సేవలు, వస్తువుల ఎగుమతి ద్వారా భారత్‌ ఆర్జిస్తున్న విదేశీ మారక నిల్వలు చమురు దిగుమతుల మూలంగా ఆవిరైపోతున్నాయి. భారత్‌ తన చమురు అవసరాల్లో 82 శాతం దిగుమతిపైనే ఆధారపడింది. రూపాయి విలువ తగ్గడం, ముడిచమురు ధర పెరగడం మూలంగా భారత కరెంటుఖాతా లోటు పెరుగుతూ పోతోంది. భారత విదేశీ మారక నిల్వలు వేగంగా హరించుకుపోతున్నాయి. అక్టోబరులో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజు సుంకాన్ని లీటరుకు 1.5 రూపాయల మేర తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం 10 వేల 500 కోట్ల రూపాయలను కోల్పోయింది. అయినా ప్రజలపై భారాన్ని తగ్గించటానికి ప్రభుత్వం వెనుకాడలేదు. కేంద్రం బాటలో కొన్ని రాష్ట్రాలు కూడా పన్నులను కొంతమేర తగ్గించాయి.

అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరల తగ్గుదలే ప్రస్తుతం పెట్రోలు, డీజిలు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. ఆయిల్‌ దిగుమతులు పెరగడం, రూపాయి మారక విలువ పెరగడం, ముడిచమురు ధరలు పెరగడం తదితర కారణాలతో 2018-19లో భారత కరెంటు ఖాతా లోటు 2.5 శాతానికి చేరుతుందని మూడీస్‌ సంస్థ అంచనావేసింది. 2017-18లో ఇది 1.5 శాతంగా ఉంది. పెరుగు తున్న కరెంటు ఖాతా లోటు భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. 2014లో మోదీ నేతత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇంధన రాయితీని భారీగా తగ్గించినా ఇంకా ప్రతి సంవత్సరం 25 వేల కోట్ల రూపాయలను ఇంధన సబ్సిడీగా అందించాల్సి వస్తున్నది. ప్రధాని మోదీ పిలుపుతో వంటగ్యాస్‌పై రాయితీని చాలామంది వదులుకు న్నారు. ఇలా ఆదా అయిన డబ్బుతో గ్రామాల్లో కట్టెల పొయ్యిపై వండుకునే మహిళలకు ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వడానికి, మిగిలిన డబ్బును ఇతర సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌ ప్రతిరోజు 49 లక్షల 30 వేల బ్యారళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంటోంది. చమురు దిగుమతిలో అమెరికా, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. భారత్‌కు ఇరాక్‌, సౌదీ అరేబియా, ఇరాన్‌, వెనుజులా, నైజీరియా, యూఏఈలు ముడి చమురును సరఫరా చేస్తున్నాయి. భారత్‌కు వస్తున్న ముడిచమురులో 65 శాతం మధ్య ఆసియా నుండి, ఆఫ్రికా నుంచి 15 శాతం, దక్షిణ అమెరికా నుంచి 10 శాతం మేర దిగుమతి అవుతున్నాయి. తాజాగా ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించినా భారత్‌కు మినహాయింపులు ఇవ్వడంతో కొంత ఉపశమనం లభించింది. 2014 వరకూ ఇరాన్‌పై ఆంక్షలు ఉన్న సమయంలో భారత్‌కు చమురు ఎగుమతులు చేసే దేశాల్లో మూడో స్థానంలో వెనుజులా ఉండేది. 2014లో ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్‌ మూడో స్థానానికి చేరింది. భారత్‌కు చమురు ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను 2018లో ఇరాక్‌ అధిగమించింది. నాణ్యమైన చమురును తక్కువ ధరకు ఇరాక్‌ అందిస్తుండటంతో ఇరాక్‌తో భారత్‌ భారీగా కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఆ వైపు అడుగులు పడాలి

భారత్‌ బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారు కావాలంటే ఇంధన రంగంలో పెడుతున్న ఖర్చు భారీగా తగ్గాలి. అందుకోసం ఈ రంగంలో భారత్‌ స్వయంసమద్ధి సాధించాలి. చమురుకు ప్రత్యామ్నా యంగా సాంప్రదాయేతర ఇంధన వనరులను అభివద్ధి పరచాలి. ఆ దిశగా భారత్‌ అడుగులు వేస్తున్నా నిధుల కొరత, టెక్నాలజీ అలభ్యత ప్రధాన సమస్యగా ఉన్నాయి. అణు ఇంధనం కోసం పలు దేశాలతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకుని అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నా అది నామమాత్రంగానే ఉంది. పైగా అణు ఇంధనం అంత భద్రమైనదికాదు. ఇక్కడ సౌరవిద్యుత్‌కు, పవన విద్యుత్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయి.

దేశంలో సౌరవిద్యుత్‌ విభాగంలో గడచిన రెండు మూడు సంవత్సరాల్లో మంచి పురోభివద్ధి జరిగింది. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో కీలకంగా ఉన్న సోలార్‌ ప్యానళ్ల విషయంలో టెక్నాలజీ అభివద్ధి జరిగి తక్కవ ధరకే ఈ ప్యానళ్లు లభిస్తున్నాయి. పవన విద్యుత్‌ విషయంలో కూడా కొన్ని రాష్ట్రాలు ముందున్నాయి. ఇటువంటి సాంప్రదాయేతర ఇంధన వనరులను అభివద్ధి చేయడం వలన రెండు రకాల లాభాలు ఉంటాయి. ఒకటి చమురు దిగుమతులు తగ్గి, విదేశీమారక నిల్వలు పెరుగుతాయి. రూపాయి బలపడుతుంది. రెండవది పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. దీనితోపాటు వ్యక్తిగత రవాణా వాహనాలను తగ్గించి, ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా చమురు వినియోగం మరింత తగ్గించవచ్చు. నగరాల్లో మెట్రో రైళ్ల రాకతో వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గిందనే చెప్పవచ్చు. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉంది. దీనికోసం అందరూ మెట్రో పాస్‌లు తీసుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందుకు కొన్ని రాయితీలు ప్రకటించాలి. దేశంలోని అన్ని ఇతర నగరాల్లో ప్రజా రవాణా సేవలు ప్రారంభం కావడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి.

అలాగే వ్యక్తిగత వాహనాలు కూడా విద్యుత్‌తో నడిచేవిగా రూపాంతరం చెందాలి. దీనికి ప్రజలను అలవాటు చేయడంలో ప్రభుత్వం ముందడుగు వేయాలి. దానికోసం కూడా ప్రభుత్వం మొదట్లో రాయితీలు ప్రకటించాలి. విద్యుత్‌ వాహనాలపై పన్నులను తగ్గించాలి. అలాగే ప్రజా రవాణా వాహనాలు కూడా విద్యుత్‌తో నడిచే విధానం అన్ని రంగాల్లోనూ అమలు కావాలి. అది ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో మాత్రమే అక్కడక్కడ కనబడుతున్నది. ఇక బస్సు రవాణా మొత్తం విద్యుత్‌ బాటరీలతో నడిచే విధానం రావాలి.

ఇటువంటి అనేక సంస్కరణలను తేగలిగితే మన దేశం త్వరలోనే ఇంధన రంగంలో స్వయంసమృద్ధి సాధించి ఆర్థికంగా బలంగా తయారవటం సులభం అవుతుంది. అయితే ఇందుకు తగిన సామర్ధ్యం కల పాలకులు అవసరం. జాతి క్షేమం, హితం ఆలో చించే నాయకులు మాత్రమే ఇటువంటి సంస్కరణలు తేగలుగుతారు. మోదీ నేతత్వంలో కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు విషయంలో, జీఎస్టీ విషయంలో అలాంటి నిర్ణయాలనే తీసుకొని విజయం సాధించింది. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు కనిపించకపోయినా రాబోయే రోజుల్లో దీని ఫలితాలు మనకు దక్కుతాయి. ఇంధన విషయంలో కూడా ప్రభుత్వం కఠిన నిర్ణ యాలు తీసుకోవలసిన అవసరం ఉంది. అందుకు ప్రజల సహకారం కూడా అవసరం.

– రామచంద్రారెడ్డి ఉప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *