వృద్ధికి పునాది బ్యాంకింగ్‌

వృద్ధికి పునాది బ్యాంకింగ్‌

ఆర్థిక రంగానికి సంబంధించి అభివృద్ధి అంటే ఆర్థిక కార్యకలాపాలు సమాజంలో లోతుగా చొచ్చుకుపోవడం, సమానత్వం సాధించడం, సుస్థిరత్వం పెంపొండం వంటి అంశాలు పరిగణనలోకి వస్తాయి. అభివృద్ధి చెందుతున్న భారత్‌ వంటి దేశాల్లో ఈ సౌకర్యాలు అరకొరగా ఉంటాయి. భారత్‌లో రెండు రకాల ఆర్థిక వ్యవస్థలను మనం చూడవచ్చు. ప్రపంచీకరణ వల్ల వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకొని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అభివృద్ధి చెందే ప్రజలు ఒక వైపు, ఈ అవకాశాలకు దూరంగా ఉండే గ్రామీణ భారతం ఒక వైపు చూడవచ్చు. 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక అవకాశాలను చేరువ చేయడానికి నిరంతరం కృషి చేసి ఆ దిశలో విజయం సాధిం చింది. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభం అయిన నాటి నుంచి భారత్‌ అధిక ఆర్థిక వృద్ధిని సాధించే బాటలో పురోగమిస్తున్నా ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రయోజ నాలు దేశంలోని ప్రజలందరికీ అందలేదు. సమాజంలోని అధిక శాతం మందికి సమానావ కాశాలు అందుబాటులోకి రాలేదు.

మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజ లందరికి ఆర్థిక అవకాశాలను చేరువ చేయడానికి పలుచర్యలను తీసుకుంది. ఆర్థిక సేవల వ్యవస్థను పటిష్ట పరిచి ప్రజలందరికి ఆర్థిక సేవలు అందించే ఆర్థిక సమ్మిళితత్వానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఆర్థిక సేవల ప్రయోజనాలు అందుబాటులో లేని, ఆర్థిక సేవలు సుదూర స్వప్నంగానే ఉండిపోయిన పేదలు, నిరాదరణకు గురవుతున్న వర్గాల వారందరికీ వాటిని చేరువ చేయడం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధనకు తద్వారా పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంది.

జన్‌ధన్‌ ఖాతాలు

ప్రజలందరినీ ఆర్థికాభివృద్ధి ప్రధాన స్రవంతిలో భాగస్వాములను చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ పథకం కింద బ్యాంకులకు దూరంగా ఉన్న ప్రజలకు సున్నా బ్యాలెన్స్‌ ఖాతాలను ప్రభుత్వం తెరిపించింది. 2014 ఆగస్టు 28న ఈ పథకం అమలులోకి వచ్చింది. మార్చి 2019 నాటికి దేశంలో మొత్తం 35.16 కోట్లకు జన్‌ధన్‌ ఖాతాలు పెరిగాయి. ఈ ఖాతాలలో సుమారు 1లక్ష కోట్ల రూపాయలు జమ అయ్యాయి. జన్‌ధన్‌ ఖాతాలను ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు తెరిచారు. గ్రామాల్లో ఇవి దాదాపు 20 కోట్ల ఖాతాలు అయ్యాయి. జన్‌ధన్‌ ఖాతాల మూలంగా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రాయితీ నేరుగా లబ్దిదారుల ఖాతాలోనే జమ అవుతోంది. దీనివల్ల అవినీతి చాలా మేరకు తగ్గింది. అప్పటివరకు బ్యాంకింగ్‌కు దూరంగా ఉండి, జన్‌ధన్‌ కింద బ్యాంకు ఖాతాలు తెరిచిన బలహీన, అల్పాదాయ వర్గాలకు బేసిక్‌ పొదుపు ఖాతాతో పాటు అవసరానికి రుణం, చెల్లింపుల సదుపాయం, బీమా, పించను మొదలైన ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఖాతాల్లో డిపాజిట్లపై వడ్డీ కూడా ప్రభుత్వం అందిస్తోంది. ఖాతా ఉన్న ప్రతివారికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ ఖాతాలో ఒక్క పైసా కూడా నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు. 30 వేల రూపాయలకు జీవిత బీమా కవరేజీ ఉంది. ఆరు నెలల కాలానికి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కల్పిస్తున్నారు. దీనితో పాటు రూపే డెబిట్‌ కార్డు, ఒక్కో కుటుంబానికి ఒక ఖాతాపై 5 వేల రూపాయల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కల్పించారు.

2014-18 మధ్య కొత్తగా దేశంలో 60 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల మంది వయోజనులకు అంటే 31 శాతం మందికి కనీసం ప్రాథమిక లావాదేవీలు నిర్వహించు కునే ఖాతాలు లేవని అంచనా. ఈ కారణంగా వారు ఆర్థిక సేవలందించే ప్రయోజనాలేవీ అందుకోలేక పోతున్నారు. భారత జనాభాలో 20 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవు. గతంలో దేశంలో బ్యాంకు ఖాతాలు లేని వారి శాతం అధికంగా ఉండేది. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి దేశంలో ప్రజలందరూ బ్యాంకులకు చేరువయ్యారు. 2019-20 బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన రైతులకు పెట్టుబడి సాయం అందించే పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా 12 కోట్ల మంది రైతులకు నేరుగా వారి ఖాతాల్లోకే మొదటి విడుతగా 2000 రూపాయల సాయం అందించబడింది. ప్రధానమంత్రి శ్రమయోగి జన్‌ధన్‌ యోజన కింద 10 కోట్ల మంది కార్మికులకు పింఛను పథకాన్ని అమలులోకి తెచ్చారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను పశు సంవర్ధక విభాగంలోని వారికి కూడా విస్తరించారు. ఇంతకాలం నిరాదరణకు గురైన వర్గాలు వడ్డీ రాయితీ పథకాల ద్వారా సులభంగా రుణాలు పొందుతున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రాయితీలు అన్నీ నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే జమ అవుతున్నాయి. ఆర్థిక సమ్మిళత్వానికి మద్దతుగా రిజర్యుబ్యాంకు రుణాలు అందుబాటులో లేని వారికి రుణాలందించడం తప్పనిసరి చేసింది.

దేశంలో దాదాపు అందరూ బ్యాంకింగ్‌ పరిధిలోకి రావడంతో ప్రభుత్వం ముద్ర యోజన ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద పేద, చిన్న తరహా పారిశ్రామిక వేత్తలకు 10 లక్షల రూపాయల వరకూ రుణసదుపాయం కల్పించారు. ఇది ఉపాధి కల్పనకు, కొత్త ఆవిష్కరణలకు చేయూతనిచ్చింది. అటల్‌ పెన్షన్‌ యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన వంటి పథకాల ద్వారా సామాజిక భద్రత విస్తరించింది. డీమానిటైజేషన్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, దేశంలోని లక్షన్నర తపాలా కార్యాల యాలను బ్యాంకులుగా మార్చడం, 11 పేమెంట్‌ బ్యాంకులకు అనుమతి నివ్వడం వంటి చర్యలతో ఆర్థిక సమ్మిళిత్వం వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వ చిత్తశుద్ధితోపాటు రోజురోజుకు విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేడు మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజలు కూడా మొబైల్‌ ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి ఎదిగారు.

అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు అందించే రుణాలను, ఇంటి నిర్మాణానికి, పిల్లల విద్యకు పేద ప్రజలకు అందించే రుణాలను, అల్పాదాయ వర్గాలకు, బలహీన వర్గాలకు అందించే రుణాలను ప్రాధాన్య రంగాలుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకు సేవలను దేశ వ్యాప్తంగా మరింత విస్తరించడానికి శాఖలను పెంచడంతో పాటు ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు తమకు అందించాలని ఆర్‌బిఐ బ్యాంకులను కోరింది. దేశంలో ఆర్థిక సమ్మిళిత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని దానికి అనుగుణంగా రుణ ప్రణాళికలను సిద్ధం చేసుకోడానికి ఇది ఉపయోగపడనుంది.

ఆర్థిక సేవలను అట్టడుగు వారికి చేరువ చేయడానికి సాంకేతికతను వినియోగించడం తప్పనిసరి. నేడు వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుని ప్రజలను బ్యాంకులకు, ఆర్థిక లావాదేవీలకు చేరువ చేయడానికి వీలు కలుగుతుంది. ఆర్థిక సమ్మిళిత్వం మరింత సమర్థవంతంగా పని చేయాలంటే డిజిటల్‌ మౌలిక వసతులు పెరగాలి. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ అక్షరాస్యత విస్తరించాలి. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారికి రుణాలు అవసరం ఉన్న వారికి అనుసంధానంగా పనిచేస్తూ రుణ విస్తరణకు కృషి చేయాలి. మొబైల్‌ బ్యాంకింగ్‌, ఇన్వెస్టింగ్‌ సర్వీసులు, క్రిప్టో కరెన్సీ, బ్లాక్‌ చెయిన్‌ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞాన సేవలు విస్తరించ వలసిన అవసరం ఉంది.

దేశంలో ఆర్థిక సమ్మిళిత్వానికి సంబంధించిన బీజాలు స్వాతంత్రానికి పూర్వం 1904లో సహకార ఉద్యమం మొదలైన నాడే పడ్డాయి. మరోమారు 1969లో బ్యాంకుల జాతీయకరణతో మరోమారు ఆ దిశగా అడుగులు పడినా తర్వాత ఈ అంశంపై ఎవరూ కృష్టి పెట్టకపోవడంతో పేదలంతా బ్యాంకులకు దూరంగానే ఉన్నారు. 2008లో డాక్టర్‌ సి.రంగరాజన్‌ నేతృత్వంలో ఆర్థిక సమ్మిళిత్వంపై అధ్యయన కమిటీని వేయడంతో ఈ ఆంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్వయం సహాయక బృందాల ఏర్పాటుతో గ్రామీణ ప్రజలు బ్యాంకులు కల్పించే రుణ సౌకర్యానికి దగ్గరయ్యారు. 2011లో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ గ్రామీణ, పట్టణ ప్రాంత ఆర్థిక అంతరాలను తొలగించడానికి స్వాభిమాన్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించి 75 వేల గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందించాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమం అనుకున్నంత విజయ వంతం కాలేదు. 2014లో మోదీ ప్రధానమంత్రి కాగానే మొదటి స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వేదికగా ఆర్థిక సమ్మిళిత్వం కోసం జన్‌ధన్‌ యోజన తెస్తున్నామని ప్రకటించారు. అది మొదలు దేశంలో ఆర్థిక సేవలు శరవేగంగా విస్తరించాయి. వీటికి తోడు ప్రభుత్వం సూక్ష్మ విత్త సంస్థలకు బ్యాంకింగ్‌ లైసెన్స్‌లు ఇవ్వడం, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు బ్యాంకులకు బిజినెస్‌ కరెస్పాండెంట్లుగా పనిచేయడానికి అవకాశం కల్పించడం, చిన్న బ్యాంకులకు, పేమెంట్‌ బ్యాంకులకు లైసెన్స్‌లు మంజూరు చేయడం వంటి చర్యలతో గ్రామీణులకు, చిన్న మధ్య తరగతి కుటంబీకులకు ఇపుడు విరివిగా ఆర్థిక సేవలు, రుణాలు లభ్యం అవుతున్నాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ సంయుక్తంగా జన్‌ధన్‌ దర్శన్‌లనే మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించాయి. దీని ద్వారా సాధారణ ప్రజలు కూడా ఒక్క స్పర్శతో బ్యాంకింగ్‌ సేవలు అందుకుంటారు. దేశవ్యాప్తంగా 5 లక్షల ఆర్థిక సంస్థల టచ్‌ పాయింట్లను ఈ యాప్‌లో అనుసంధానించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు బ్యాంకు ఖాతాలు తెరవబడటంతో వారికి వివిధ పథకాల ద్వారా లభించే రాయితీని నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నారు. డైరెక్టు బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా వివిధ రకాల సామాజిక పించన్లు వారి ఆధార్‌ అనుసంధానిత ఖాతాలో జమ అవుతున్నాయి. దీనివల్ల అవినీతి తగ్గి జవాబుదారీతనం, పారదర్శకత పెరిగాయి. పేమెంట్‌ బ్యాంకుల ద్వారా చిన్న చిన్న వర్తకులకు, అల్పదాయ వర్గాలకు సేవలు అందిస్తున్నారు. తపాలా శాఖ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి రావడంతో మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్‌ సేవలు అందుతున్నాయి.

ఆధునాతన టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయంతో దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఆర్థిక సేవలు వేగంగా విస్తరించాయి. జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు, ఎలాంటి చార్జీలు వసూలు చేయని రూపే కార్డులు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో ప్రజలు సులభంగా రుణాలు పొందుతున్నారు. కేంద్రం ఆర్థిక సమ్మిళిత్వం కోసం రూపొందించిన వ్యూహం విజయవంతం అయ్యింది. గత 70 ఏళ్లలో జరగని దాన్ని ఎన్‌డిఎ ప్రభుత్వం కేవలం ఈ ఐదేళ్లలోనే చూసి చూపించింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక గ్లోబల్‌ ఇండెక్స్‌ డేటాలో ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందించడంలో భారత్‌ మెరుగైన ఫలితాలను సాధించిందని పేర్కొంది. కేంద్రం కృషి వలన ప్రస్తుతం 80 శాతానికి పైగా వయోజనులు బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అంతేకాకుండా ఆర్థిక సేవల్లో లింగ అసమానత్వాన్ని 20 పాయింట్ల నుంచి 6 పాయింట్లకు భారత్‌ తగ్గించగలిగింది. నేడు దేశంలోని కోట్లాది మంది మహిళలు తమ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచి వివిధ ప్రభుత్వ పథకాల రాయితీలను నేరుగా తమ అకౌంట్లలోనే పొందుతున్నారు. నేడు ఉన్న ఆధునిక ఇంటర్నెట్‌ టెక్నాలజీ, మొబైల్‌ టెక్నాలజీలతో ఈ-బ్యాంకింగ్‌ సేవలను మరింత పారదర్శకంగా మరింత మందికి చేరువ చేయవచ్చు. ఈ దిశగానే ప్రభుత్వం కృషి చేసింది. ఈ ఆర్థికి సమ్మిళిత్వం 100 శాతం జరిగి పేదరికం లేని నవ భారతం నిర్మాణం కావాలని ఆకాంక్షిద్దాం.

– రామచంద్రారెడ్డి ఉప్పుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *