చలికాలం- ఆరోగ్య సంరక్షణ

చలికాలం- ఆరోగ్య సంరక్షణ

చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. చలికాలం చాలావరకూ వ్యాధుల్ని వెంట తీసుకొచ్చేకాలం. తగ్గిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల చిన్నారులను ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. చర్మం పొడిబారటం, పెదాలు పగలడం, ముక్కు బిగుసుకు పోవటం, తరచూ తుమ్ములూ ఇలాంటి సమస్యలు సహజమే. ఇవి అంతగా ప్రాణాంతకమైతే కావు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని సులభం గానే అధిగమించవచ్చు. కానీ మరికొన్ని రకాల ఆరోగ్య సమస్యలు చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆస్తమా, న్యుమోనియా వంటి శ్వాససంబంధ సమస్యలు, సొరియాసిస్‌ వంటి చర్మవ్యాధులు తీవ్ర మౌతాయి. వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి? చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

శీతాకాలంలో శిశువు వయస్సు నుంచి పిల్లల సంరక్షణ అత్యంత కీలకమైంది. చిన్నారుల శరీరాన్ని చల్లదనం నుంచి కాపాడి, వేడిని కలిగించేందుకు దళసరి నూలు, మెత్తని ఉన్ని దుస్తులు, ఉన్ని మేజోళ్లు, టోపీ వంటివి వారికి తొడగాలి. ఈ సీజన్లో ఎక్కువగా ఉండే చలి వల్ల పసిపిల్లల్లో సైనోసిస్‌ అనే ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. ఆ పరిస్థితిలో పిల్లల వేళ్లు, గోళ్లు, పెదవులు, నాలుక సహజ రంగును కోల్పోయి, నీలంగా మారిపోతాయి. చలిగాలి శరీరానికి తగలడం వల్ల పసిపిల్లలకు శ్వాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలూ వస్తాయి. బ్రాంకైటీస్‌ వల్ల చాలా ఇబ్బందిపడతారు. శ్వాసకోశ వ్యాధులు వైరస్‌ వల్ల, సూక్ష్మక్రిముల వల్ల ఏర్పడతాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిల్లల్ని బయటకు తీసుకెళ్లడం చాలా ప్రమాదం.

డాక్టర్‌కి ఎప్పుడు చూపించాలి?

శీతాకాలంలో వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు అంత తీవ్రమైనవి కావు. చాలావరకూ జాగ్రత్తలు తీసుకుని వెచ్చని వాతావరణాన్ని కల్పిస్తే తగ్గిపోతాయి. అయితే కొంతమంది పిల్లల్లో ఏర్పడే కొన్ని లక్షణాలను బట్టి వారి అనారోగ్యాన్ని గుర్తించి, డాక్టర్‌కి చూపించాలి.

శరీరంలో వెచ్చదనం లోపించి, చల్లగా ఉండడం, గాలిని ముక్కుతో కాకుండా నోటిద్వారా పీల్చుకోవడం. ఊపిరి పీలుస్తున్నప్పుడు పిల్లికూతలు రావడం. ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుండడం, పాలు తాగలేక పోవడం, జలుబు వల్ల గొంతునొప్పి ఏర్పడటం. ఊపిరి బలంగా పీల్చడం, ఆహారం తక్కువగా తీసుకున్నా కడుపు ఉబ్బరంగా ఉండటం. బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలు ఏర్పడినప్పుడు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. లేదంటే వాతావరణంలో మార్పు వచ్చి, చల్లదనం ఏర్పడినప్పుడల్లా అనారోగ్యంతో బాధపడతారు. తద్వారా బాల్యంలో బ్రాంకైటీస్‌, ఆ తర్వాత ఆస్తమాలాంటి దీర్ఘ వ్యాధులు సంక్రమిస్తాయి. న్యుమోనియా, గుండెజబ్బులు, కీళ్ల సమస్యలు, ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాదు చలి నుంచి రక్షణ కోసమే శరీరం చాలా శక్తిని ఖర్చుపెడుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక రోగనిరోధక వ్యవస్థ కొంత బలహీనపడుతుంది. దీంతో జీవక్రియలన్నీ గతి తప్పి రకరకాల ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడతాయి. రోగనిరోధక వ్యవస్థ ప్రాథమిక దశలో ఉండే చిన్నారులకు ఇనెఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంటుంది.

సొరియాసిస్‌, చర్మ సమస్యలు

చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్య సోరియాసిస్‌. చర్మం పొలుసులు పొలుసులుగా తయారై, పొట్టుపొట్టుగా రాలి పోతుండడం దీని లక్షణం. ఇది ఎలా మొదలైనా దీర్ఘకాలిక చర్మ సమస్యగా పరిణమిస్తుంది. ఎన్ని చికిత్సలు చేయించినా కొంతకాలం తగ్గుతూ మళ్లీ బాధిస్తుండటం ఈ వ్యాధి లక్షణం. రాలిపోయే పాతచర్మ కణాల కంటే కూడా కొత్తగా పుట్టుకొచ్చే చర్మకణాలు ఎక్కువగా ఉండటం ఈ సమస్యకు మూలం. దీంతో చర్మం మీద ఎర్రటి మచ్చల్లా వస్తాయి. చర్మకణాలు పొలుసులు పొలుసులుగా రాలిపోతుంటాయి. చలికాలంలో చర్మం పొడి బారటంతో ఇది ఉన్నట్టుండి ఉధతమవుతుంది.

సొరియాసిస్‌ బాధితులు ఈ సీజన్లో చర్మం మదువుగా ఉండేలా చూసుకోవాలి. డాక్టర్‌ సూచన లపై మాయిశ్చరైజింగ్‌ క్రీములు లోషన్ల వంటివి రాసుకుంటూ ఉండాలి. గంటల తరబడి స్నానాలు పనికిరావు. గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. గరుకుగా ఉండే దుస్తులు వేసుకుంటే దురద పెరిగి, సమస్య మరింత వేధిస్తుంది. కాబట్టి మెత్తటి నూలు దుస్తులు వేసుకోవాలి. నీరు, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.

– నయన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *