నీరు తాగే విధానం

నీరు తాగే విధానం

మానవ శరీరానికి నీరు ఎంతో అవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నీరు తీసుకోరాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నీరు తీసుకుంటే శరీరం రోగ నిరోధకంగా తయారవుతుంది. నీరు ఎప్పుడెప్పుడు ఎలా తాగాలో చూద్దాం.

మన దినచర్య ఉదయాన్నే మొదలవుతుంది. మనం నిద్ర లేచిన సమయానికి దాదాపు 7 నుండి 8 గంటల ముందు నుండే శరీరానికి నీరు అంది ఉండదు. అంటే రాత్రి పడుకోబోయే ముందు తీసుకొని ఉంటాం. అందుకే శరీరం ఉదయం నిద్ర లేవగానే నీరు కోరుకుంటుంది. అందుకే ఆ సమయంలో ఒక గ్లాసు నుండి 4 గ్లాసుల వరకు నీరు తీసుకోవాలి. 2 లీటర్ల వరకు తాగగలిగితే ఎంతో మంచిది. ఇలా ఉదయం తీసుకున్న నీరు శరీరంలోని అన్నవాహికను, ప్రేవులను శుభ్ర చేసి, మలినాలన్నిటిని మూత్రాశయంలోకి తరలిస్తుంది. అరగంట లేక గంట తరువాత మూత్రం ద్వారా నీరు మలినాలతో సహా బయటకు వెళ్లిపోతుంది. ఇలా రోజూ చేయడం వల్ల గత రోజు చేరుకున్న మలినాలన్నీ ఏ రోజుకారోజు తొలగిపోయి శరీరం శుభ్రమవుతుంది. మల విసర్జన కూడా సాఫీగా అవుతుంది. దీనివలన రక్తం శుభ్రపడి, ఆకలి అవుతుంది. జీర్ణక్రియ మెరుగువుతుంది. సమయానికి ఆకలి వేయడం, తిన్న ఆహారం సరిగా జీర్ణం కావడం అనేది శరీర ఆరోగ్యానికి సరైన సూచిక. కాబట్టి ఉదయం పరగడుపున లీటరు లేక 2 లీటర్ల నీరు తీసుకోవాలి. ఇది కాలకృత్యాలకు ముందు లేక కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత చేయవచ్చు.

ఇక ఆ తరువాత భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేశాక గంట గంటన్నర తరువాత నీరు తీసుకోవాలి. భోజన సమయంలో నీరు తీసుకోరాదు. భోజన సమయంలో నీరు తీసుకునే అలవాటు వల్ల రకరకాల రోగాలు పొంచి ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే భోజనం మధ్యలో నీరు తీసుకుంటే తీసుకున్న ఆహారం లోపల సరిగా జీర్ణం కాక ప్రేవుల గోడలకు గడ్డలుగా గడ్డలుగా అతుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇలా అతుక్కున్న ఆహారం కుళ్లిపోయి రకరకాల రోగాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా గ్యాస్‌, ఎసిడిటి మొదలైనవి రావచ్చు. గ్యాస్‌ అనేక ఇతర రోగాలకు కారణమవు తుంది. అందుకే భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన గంటన్నర తరువాత మాత్రమే నీరు తీసుకోవాలి. ఈ గంటన్నరలో శరీరం లోపలి ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. నీరు తీసుకోగానే అన్నవాహిక, ప్రేవులు శుభ్రమై, మలబద్ధకం కూడా పోతుంది. ఇలా చేసేవారికి పొట్ట రాదు. పైగా కావలసిన దానికన్నా ఎక్కువ బరువు పెరగరు. అంటే సన్నగా, ఆరోగ్యంగా ఉంటారన్న మాట. కానీ భోజనం మధ్యలో పొరపోవటం కానీ, లేదా మంట తగ్గించుకోవడానికి కానీ, ఒకటి లేక రెండు గుక్కలు తాగొచ్చు.

నీరు ఎప్పుడెప్పుడు తాగాలో తెలుసుకున్నాం. ఇక నీరు ఎలా తాగాలో వచ్చే సంచికలలో తెలుసుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *