ఇలా చేయండి.. వేసవిలో హాయిగా గడపండి

ఇలా చేయండి.. వేసవిలో హాయిగా గడపండి

ఎండాకాలం వచ్చేసింది.

ఉక్కపోత మొదలైంది.

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండలు ఎక్కువగానే నమోదవు తున్నాయి. ఇవి ఇంకా ఎక్కువవుతాయి కూడా. దీనికితోడు వేసవిలో అన్ని ప్రాంతా ల్లోనూ నీటికి కరువూ ఏర్పడుతోంది. నీటి కరువుతో విద్యుత్‌ సమస్య మొదలవు తుంది. అసలే ఎండలు, ఉక్కపోత. దానికితోడు విద్యుత్‌ కోతతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు బంద్‌. ఉక్కపోతతో ఇంట్లోనూ ఉండలేక, బయట తిరగలేక నానా అగచాట్లూ పడక తప్పదు. ఉక్కపోతతో, వేడితో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. మరి ఈ వేసవిలో మన ఆరోగ్యం ఎలా కాపాడు కోవాలో చూద్దాం.

నీరే ఔషధం

ఎండాకాలం అంటే వేడిగా ఉండేకాలం. వేడిని నిలువరించే ఆయుధం నీరు. మన శరీరం వేసవితాపానికి తట్టుకోవాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించేవరకు నీరు తాగుతూనే ఉండాలి. నీరు అందరికీ ఉచితంగా లభించే వనరు. ఎండలో బయటికి వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు తమవెంట ఒక నీటి సీసాను తప్పకుండా తీసుకెళ్లాలి. నీరు ప్రతి అరగంటకు ఎంతోకొంత తాగుతూనే ఉండాలి. ఇలా రోజుకు శరీర అవసరాన్ని బట్టి 5 నుండి 10 లీటర్ల వరకు నీరు అవసరం అవుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవటమే వేసవి తాపానికి ఉత్తమ విరుగుడు.

వేసవి ఫ్రిజ్‌

ఇంటికి అతిథి వస్తే ముందు కాళ్లకు నీళ్లు ఇస్తాం. ఆ తరువాత తాగటానికి నీరు ఇస్తాం. ఆ అతిథి వేసవిలో, మంచి ఎండలో వచ్చారనుకోండి. ఆయనకిచ్చిన నీరు చల్లగా ఉంటే ఆ అతిథికి కనిపించేది స్వర్గమే. మరో చెంబు నీరు అడిగి మరీ తాగుతారు. వేసవిలో చల్లని నీటికున్న విలువ అంతటిది. ఇప్పుడంటే అందరి ఇళ్లలోకి ఫ్రిజ్‌లు వచ్చేశాయి కానీ, ఇంతకుముందు మట్టి కుండే వేసవిలో ఫ్రిజ్‌. ఈ ఆధునిక కాలంలో కూడా కుండ తన స్థానాన్ని ఏమాత్రం కోల్పోలేదు. దానికి కారణం కుండ నీటిలో ఉన్న ఆరోగ్య లక్షణమే. ఎండాకాలంలో ఫ్రిజ్‌ నుండి తీసిన చల్లని నీరు తాగితే, ఆ సమయానికి దాహం తీరుతుంది. కానీ శరీరంపై దాని దుష్ప్రభావం పడుతుంది. అంటే ఒళ్లు పేలడం, ఆయాసం పెరగడం, వేసవి తరువాత రకరకాల రోగాల బారిన పడటం జరుగుతుంది. దీనికి కారణం ఫ్రిజ్‌ నీటిలో ఫ్రిజ్‌ నుండి విడుదలైన ఒక రకమైన గ్యాస్‌ చేరడమే. అందుకే ఫ్రిజ్‌ నుండి తీసిన బాటిల్‌ మూత తెరవగానే గ్యాస్‌ వెలువడిన ధ్వని వస్తుంది. డీప్‌ ఫ్రిజ్‌లో ఉన్న బాటిల్‌ గుండ్రంగా ఉండక ముడుచుకుపోయి ఉంటుంది. బాటిల్‌ చుట్టూ తెల్లటి తెట్టు పేరుకుంటుంది. ఇదే గ్యాస్‌. ఈ గ్యాస్‌ ఒకరకంగా విషం వంటిదే. ఇది జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపిస్తుంది. దాంతో జీర్ణవ్యవస్థ చురుకుదనం తగ్గిపోతుంది. మందం అవుతుంది. తిన్నది సరిగా అరగక, ఒంటికి పట్టక, శరీరం మెల్లగా బలహీనం అవుతుంది. అందుకే వేసవిలో ఫ్రిజ్‌ నీరు తాగేవారూ, కూల్‌డ్రింకులు తాగేవారూ వేసవి తరువాత రోగాలకు గురవుతారు. అదీకాక, ఫ్రిజ్‌ నుండి వచ్చే చల్లదనం మన శరీర స్థాయికి మించి ఉంటుంది. దీనివలన మన శరీర సహజ ఉష్ణోగ్రత ఒడుదుడుకులకు లోనవుతుంది. జీర్ణవ్యవస్థ పాడవటానికీ, శరీరం రోగాలకు గురి కావడానికీ ఇది మరొక కారణం. మట్టికుండ నీటిలో ఇటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎందుకంటే కుండ నీరు ప్రకృతి సహజమైనది. కుండ నీరు తాగినందువల్ల శరీరానికి ఎటువంటి హానీ జరగదు. పైగా మట్టి పాత్ర నుండి వచ్చిన నీరు కాబట్టి జీర్ణశక్తిపై ఎటువంటి దుష్ప్రభావం చూపదు. జీర్ణశక్తి మరింత పెరుగుతుంది. చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి వేసవిలో కుండలోని చల్లని నీరు తాగడమే శ్రేయస్కరం.


పిల్లల పట్ల అధిక శ్రద్ధ

మన ఇంటికి వెలుగులు మన పిల్లలే. వేసవిలో వారిపట్ల మరింత శ్రద్ధ తీసుకోవటం అవసరం. పైన చెప్పిన అన్ని జాగ్రత్తలూ పెద్దలతో పాటూ పిల్లల విషయంలోనూ తీసుకోవాలి. అయితే ఎండలు మరీ అధికంగా ఉన్న రోజుల్లో కింద సూచించిన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల విషయంలో కూడా వేసవి హాయిగా గడుస్తుంది.

– ఎండలు ఎక్కువగా ఉన్న రోజుల్లో రాత్రి ఒక గ్లాసు నీటిలో ఒక ఎండు ఖర్జూర లేక 4 ఎండు ద్రాక్షలు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని వడగట్టి ఉంచాలి. కాలకృత్యాలు తీరిన తరువాత ఖాళీ కడుపుతో ఉండగానే పిల్లలకు తాగించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండదు.

– వేసవిలో పిల్లలను ఎక్కువగా ఆకర్షించేవి కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములే. వీటిని పిల్లలకు కచ్చితంగా దూరంగా పెట్టాలి. ఫ్రిజ్‌ నీటిని కూడా వీరికి దూరంగానే ఉంచాలి.

– ఉదయం 8 లేక 9 గంటల లోపే స్నానం చేయించాలి. చల్లని లేక గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. అధిక వేడి లేక అధిక చల్లని నీరు వాడొద్దు. సాయంత్రం సమయంలో 6 గంటల తరువాత స్నానం చేయించడానికి మంచి సమయం.

– ఉదయం 11 గంటల తరువాత, సాయంత్రం 4 గంటల వరకూ బయట ఎండలో తిరగనీయొద్దు.

– పిల్లల ఆహారంలో మజ్జిగ, రాగులతో చేసిన జావ, సగ్గుబియ్యం జావ వంటివి ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. జావ వంటి వాటిలో పంచదార కాకుండా బెల్లం లేక ఉప్పు వాడాలి. కుండ నీరు వారికి అందు బాటులో ఉంచాలి. బయట షాపులలో కొన్న ఆహారం అసలు తినిపించొద్దు. ఏదైనా ఇంట్లో తయారైనదే తినిపించాలి.


ఈ మధ్య పట్టణాల్లో, నగరాల్లో చలివేంద్రాల పేరుతో ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నీరు నింపుతున్నారు. ఆ నీరు చల్లబడటానికి ఆ డ్రమ్ముల్లో పెద్ద పెద్ద ఐస్‌ గడ్డలు వేస్తున్నారు. ఈ ప్లాస్టిక్‌ డ్రమ్ములు కడగరు, పైగా ఐస్‌ గడ్డలు వేసి నీటిని చల్లబరుస్తారు. ఇటువంటి నీరు తాగడానికి ఎందుకూ పనికిరాదు. వేడిగా ఉండే మనదేశంలోని జీవులకు ఐస్‌ పనికిరాదు. మన శరీర ఉష్ణోగ్రతను ఈ ఐస్‌ ఒక్కసారిగా చల్లబరుస్తుంది. దాంతో జీర్ణశక్తి దెబ్బతింటుంది. ఈ నీరు ఒక గ్లాసు తాగితే గంట వరకు ఆకలి వేయదు. అందుకు కారణం జీర్ణవ్యవస్థ చల్లబడి, ఆగిపోవడమే. అలాంటిది వేసవి అంతా ప్లాస్టిక్‌, ఐస్‌ కలిసిన నీరు తాగితే ఇక జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. కొందరు ఈ మధ్య ఏకంగా ఫ్రిజ్‌నే చలివేంద్రాలలో పెడుతున్నారు. ఇది మరింత ప్రమాదకరం. అలా కాకుండా మట్టి కుండలు పెట్టిన చలివేంద్రాలలోని నీరు తాగటమే శ్రేయస్కరం. అందుకే ప్రజల దాహం తీర్చాలనుకున్న సేవాతత్పరులు చలివేంద్రాల కోసం మట్టికుండలనే వాడటం మంచిది.

వేసవితాపం నుండి తట్టుకోవాలంటే కుండలోని చల్లని నీటినే తాగాలనేది స్పష్టమైంది. అయితే దీనికీ ఓ పద్ధతుంది. ఉదయం 6 గంటల లోపే నిద్రనుండి మేల్కోవాలి. కాలకృత్యాలు తీర్చుకోవాలి. దంతాలు, నాలుక శుభ్రం చేసుకోవాలి. అప్పుడు కడుపు ఖాళీగా, ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ సమయంలో లీటరు నుండి 2 లీటర్ల వరకు కుండ నీరు తాగాలి. ఇలా ఖాళీ కడుపుతో కుండనీరు తాగడం వలన శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రమూ అవుతుంది. చురుకుతనం పెరుగుతుంది. అయితే ఇలా నీరు తాగిన మరో గంట వరకు ఏమీ తినరాదు. గంట తరువాతే ఏదైనా తినాలి. అలాగే తిన్న గంట లేక గంటన్నర తరువాతే నీరు అధికంగా తీసుకోవాలి. ఈ లోపు దాహం వేసినట్లుగా ఉంటే ఒక గుక్క లేక రెండు గుక్కల నీరు తాగొచ్చు. ఇలా ఒక పద్ధతి పాటిస్తే వేసవిలో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.

ఉదయం వ్యాయామం చేసేవారు కూడా నీరు తాగి వ్యాయామం చేయాలి. ఎటువంటి ఇబ్బందీ ఉండదు. వ్యాయామం చేసినందువలన చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళుతుంది. వేసవిలో ఇది అధికంగా ఉంటుంది. నీరు తాగడం వలన బయటికి వెళ్లిన నీటి శాతం శరీరంలో భర్తీ అవుతుంది. నీరసం వచ్చే ప్రమాదం ఉండదు. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో చల్లని కుండ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.

ముట్టకూడని పదార్థాలు – కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీమ్‌లు

ఇక మన వేసవితాపం తీర్చడానికి కుండనీటితో పాటు మరెన్నో సంప్రదాయ పానీయాలు, ప్రకృతి ప్రసాదించిన పానీయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కుండ నీటితో పాటు అంతే ఉత్తమమైనవి కొబ్బరిబొండాం నీరు, ఐస్‌ వేయని చెరుకురసం, ఇంట్లో కవ్వంతో చిలికిన మజ్జిగ, ఇంట్లోనే తయారుచేసుకున్న నిమ్మరసం. ఇవన్నీ వేసవితాపం తీర్చే మన సంప్రదాయ పానీయాలు. అయితే ఇవి కూడా ఎక్కువగా తీసుకోకపోవటమే ఉత్తమం. కొబ్బరిబొండాం వేసవిలో రోజుకొకటి లేక రెండు సరిపోతాయి. అలాగే మజ్జిగ రెండు లేక మూడు పూటలు తీసుకోవచ్చు. మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు, కర్వేపాకు కలిపితే మరీ మంచిది. నిమ్మరసంలో పంచదార కాకుండా ఉప్పు వేయటం మంచిది. నిమ్మరసం రోజుకు ఒక్క గ్లాసు సరిపోతుంది. ఎన్నిసార్లు తాగినా ఎటువంటి దుష్ప్రభావం చూపనిది కుండ నీరు ఒక్కటే.

ఇక వేసవిలో అసలు తాగకూడని పానీయం ఒకటుంది. విచిత్రం ఏమిటంటే ఈ పానీయం అందరికీ అందుబాటులో ఉంటుంది. అదే కూల్‌డ్రింక్‌. స్ప్రైట్‌, కోకాకోలా, మిరిండా, పెప్సీ, మజా, 7అప్‌ వంటి అనేక రకాల కూల్‌డ్రింకులు మనచుట్టూ అన్ని షాపుల్లో విరివిగా సరసమైన ధరలకే లభిస్తాయి. ఇవి ఫ్రిజ్‌లో ఉండి వేసవిలో మరింత ఊరిస్తాయి. కానీ ఇవి తాగడం శరీరానికి అత్యంత ప్రమాదకరం. కూల్‌డ్రింక్‌ తాగడానికి అలవాటు పడితే ఇక శరీరం కూల్‌డ్రింక్‌నే కోరుకుంటుంది. దానికీ ఒక కారణం ఉంది. కూల్‌డ్రింక్‌ తాగితే దాహం తాత్కాలికంగా ఉపశమిస్తుంది. మళ్లీ మరో గంటకు దాహం వేస్తుంది. దానికి కారణం కూల్‌డ్రింకులో ఉన్న అధిక చక్కెర, రసాయనాలే. ఇవి శరీరంలోని నీటి శాతాన్ని హరించివేస్తాయి. దీనినే డీహైడ్రేషన్‌ అంటారు. వేసవిలో ఇది మరింత ప్రమాదకరం. కూల్‌డ్రింకులకు అలవాటు పడినవారిలో డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా వస్తుంది. పైగా అతి చల్లగా ఉండే కూల్‌డ్రింక్‌ జీర్ణవ్యవస్థనూ దెబ్బతీస్తుంది. గ్యాస్‌ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి కూల్‌డ్రింకులకు వేసవిలో కచ్చితంగా దూరంగా ఉండాలి.

అలాగే వేసవిలో తినకూడని మరో పదార్థం ఐస్‌క్రీమ్‌. దీనికి కూల్‌డ్రింక్‌కి ఎటువంటి తేడా లేదు.

అలాగే ఉదయం 10 గంటల తరువాత, సాయంత్రం 5 గంటలకు ముందు స్నానం చేయకపోవడమే ఉత్తమం. అలాగే ఉదయం 11 గంటల తరువాత, సాయంత్రం 4 గంటలకు ముందు ఎండలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవి హాయిగా గడుస్తుంది.

– సూర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *