చిన్నారుల్లో గుండె జబ్బులున్నట్లు తెలుసుకోవడమెలా?

చిన్నారుల్లో గుండె జబ్బులున్నట్లు తెలుసుకోవడమెలా?

ఒకప్పుడు గుండె జబ్బులు కేవలం పెద్ద వారికి వచ్చే రోగంగానే పరిగణించే వారు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆధునిక ఆహార అలవాట్లు పెద్దవారిపైనే గాక పిల్లల ఆరోగ్యాల మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. మనదేశంలో ప్రస్తుతం ఎంతో మంది చిన్నారులు గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు.

పరీక్షలు

1. క్లినికల్‌ ఎగ్జామినేషన్‌

స్టెథస్కోపు, బ్లడ్‌ ప్రెషర్‌ మీటర్‌లను ఉపయోగించి నిశితంగా పరీక్ష చేస్తే గుండె స్పందన లబ్‌డబ్‌లలో తేడాలతో, మర్‌మర్‌లనే అబ్‌నార్మల్‌ ధ్వనుల వల్ల కొంతవరకు తెలుస్తుంది.

2. ఛాతీ ఎక్స్‌రేలలో

– గుండె ఎడమ బదులు కుడివైపు ఉండడం.

– గుండె సైజు బాగా పెద్దదవడం.

– గుండె రకరకాల విచిత్ర షేపులలోకి మారడం.

– టీఓఎఫ్‌ – షూ షేప్‌లోకి మారడం.

– టీజీయే – గుడ్డ ఒక ధ్రువం మీద ఏటవాలుగా ఉన్నట్లు.

– టీఏవీపీసీ -8 అంకెను పోలీ ఉండడం.

ఊపిరితిత్తులలో తేడాలు :

రక్తం ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులు తెల్లగానూ, రక్తం తక్కువగా ఉంటే నల్లగా ఉండటం.. వీటి వల్ల తెలుస్తుంది.

ఈసీజీ (ఎలెక్ట్రొ కార్గియోగ్రామ్‌): ఇది గుండె ఎలక్ట్రికల్‌ స్వభావాన్ని గ్రాఫు రూపంలో తెలియజేస్తుంది. దీంట్లో తేడాల వల్ల గుండె ఎటువైపు ఉంది? గుండెలో అన్ని గదులు సక్రమంగా ఉన్నాయా? లేదా? గుండె ఎన్‌లార్జ్‌ అయిందా? గుండెలో ఏ గదిలో, ఏ రకం తేడాల వల్ల పెద్దదయింది.. మొదలుకొని గుండె కొట్టుకోవడంలో వచ్చే లయభేదాలు ‘ఎర్రిథ్‌మెయాస్‌’ – అనే వాటి గురించి తెలుస్తుంది. ఛాతీ మీద కొన్ని స్టిక్కర్లు తాత్కాలికంగా అతికించి, వాటిని ఈసీజీ మెషిన్‌కు కలపడం ద్వారా ఈ గ్రాఫు తయారవుతుంది.

ఈఖో కార్డియోగ్రామ్‌ : ఈఖో అంటే ప్రతిధ్వని తరంగాలను ఛాతీలోకి పంపి అవి పరివర్తనం చెందినప్పుడు వచ్చే ప్రతిధ్వనులను కంప్యూటర్‌ ద్వారా విశ్లేషించి, వాటి ద్వారా గుండె భాగాలను బొమ్మల రూపంలో పునర్నిర్మిస్తారు. ఈ పునర్నిర్మాణం ఏ రకంగా ఉంటుంది అన్నదాన్ని బట్టి ఈఖో కార్డియో గ్రాముల్లో రకాలున్నాయి.

2డి ఈఖో కార్డియోగ్రామ్‌ : దీనివల్ల గుండె నిర్మాణం అనాటమీ తెలుస్తుంది. గుండె ఎలా ఉంది. ఎన్ని గదులున్నాయి. ఒక గది మరో గదితో ‘వాస్తు’ ప్రకారం కలిసున్నాయా లేదా, గుండెలో కవాటాలు ఎలా ఉన్నాయి మొదలయిన అనాటమికి సంబంధించి వివరాలు తెలుస్తాయి.

కలర్‌ డాఫ్లర్‌ ఈఖో కార్డియోగ్రఫీ : దీని ద్వారా గుండెలో రక్తప్రసరణ దిశ సరిగా ఉందా, ఎక్కడి నుండి ఎక్కడకు రక్తం వెళుతోంది. కవాటాలు మూసుకుపోవడం వల్ల, లీక్‌ కావడం వల్ల కలిగే తేడాలను తెలుసుకోవచ్చు.

డాఫ్లర్‌ ఈఖో కార్డియోగ్రఫీ : రక్తప్రసరణ వేగాన్ని విశ్లేషించి, గుండెలో వాటాలు మామూలుగా ఉన్నాయా, దెబ్బతిన్నయా అనే విషయాలు తెలుసుకుంటారు. గుండె రంధ్రాలలో రక్తం ఏ దిశలో ప్రవహిస్తోంది? గుండె వివిధ భాగాలలో బ్లడ్‌ప్రెజర్‌ తేడాలు ఎలా ఉన్నాయి ? అనే అంశాలు తెలుస్తాయి.

ఈ పరీక్ష అభివృద్ధి చెందాకే డాక్టర్లు చిన్న పిల్లల గుండె జబ్బులు కనిపెట్టడంలో, ఆపరేషన్లు చేయడంలో గణనీయమైన, అభివృద్ధి సాధించారు. అంతకు ముందు ఈ రకమైన వివరాలకు కార్డియాకు కాథెటరైజేషన్‌, ఆంజియోగ్రాములు అవసరమయ్యేవి. అవి ఈఖోలాగా మళ్లీ మళ్లీ చేసి సరిచూసుకోవడం చాలా కష్టతరంగా ఉండేది.

ఛాతీ సిటీ స్కాన్‌ : కొత్తగా వస్తున్న ఆధునిక సీటీ స్కాన్‌ యంత్రం ద్వారా కొన్ని రకాల జబ్బులు నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది.

కార్డియాక్‌ కాథెటరైజేషన్‌ ఆంజియోగ్రఫీ : చిన్న పిల్లల గుండె జబ్బులు గుర్తించడంలో, శస్త్ర చికిత్సలో జరిగిన ప్రగతికి మొదటి మెట్టు ఈ పరీక్షలు, తొడ దగ్గర నుండి గుండెలోకి పలుచని ట్యూబ్‌లు పంపి వివిధ భాగాల్లో బ్లడ్‌ప్రెషర్‌, రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని తెలుసుకుంటారు. వాటి ద్వారా గుండె పనిచేయడంలో రకరకాల తేడాలు గుర్తిస్తారు. కొన్ని జబ్బుల్లో 1.ఆపరేషన్‌ అవసరమా లేదా? 2. ఆపరేషన్‌తో బాగవుతుందా? 3. ఆపరేషన్‌ చేసే స్టేజ్‌ దాటిందా? అని తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

గుండె రకరకాల భాగాలలో ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా నిర్మాణాన్ని, గుండెలో రంధ్రాలను, రక్తనాళాల్లో అడ్డంకులను, రక్తం కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి ఎటు వెళుతుందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేశాక కూడా, కొన్నిసార్లు జబ్బు ఏమిటి? ఏమైనా చేయగలమా? లేదా? అనే మీమాంస నుండి పూర్తి విముక్తి లభించదు.

ఎంఆర్‌ఐ స్కాన్‌ : అయస్కాంత శక్తి మీద ఆధారితమై పనిచేసే ఈ స్కాన్‌ ద్వారా సంక్లిష్టమైన నిర్మాణం ఉన్న చిన్నారులలో తాడలోని రక్తనాళంలోంచి గుండెలోకి పలుచని ట్యూబ్‌ను పంపి గుండె నిర్మాణం, పనిచేసే విధానం కనిపెడతారు

– డా|| ఆర్వీ కుమార్‌.

(‘పసి పిల్లల గుండె జబ్బులపై ఒక అవగాహన’ పుస్తకం నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *