తలనొప్పి వేధిస్తోందా?

తలనొప్పి వేధిస్తోందా?

ఆధునిక సమాజంలో పిల్లలపై ఒత్తిడి రోజురోజుకి పెరిగిపోతోంది. చదువుల్లో పోటీతత్వం పెరిగి పోవడంతో విద్యార్థులు మానసికంగా కుంగి పోతున్నారు. ఒత్తిడికి గురై వ్యాధుల బారినపడు తున్నారు. మానసిక ఒత్తిడి వలన వచ్చే వ్యాధుల్లో తలనొప్పి ముఖ్యమైనది. రాత్రులు ఎక్కువసేపు మేల్కొని చదవడం, శరీరానికి సరిపడ నిద్ర లేకపోవడం వలన ఈ సమస్య ఎదురవుతుంది. అయితే ఇలాంటి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

కారణాలు :

– మానసిక ఒత్తిడి వలన మెదడులో కొన్ని రసాయనిక మార్పులు జరిగి తలనొప్పి వస్తుంది.

– మెదడు కణాలలో కణుతులు ఏర్పడటం వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

– తలకు గాయాలు తగలడం గానీ, కొన్ని సందర్భాల్లో మెదడులో వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

– కంటికి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

లక్షణాలు :

– తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు చిరాకు, కోపం ప్రదర్శిస్తారు.

– వాంతులు వచ్చినట్లుగా అనిపిస్తుంది.

– శబ్దాలు భరించలేరు.

– వెలుతురును చూడలేరు.

– ఆహారం సరిగా తినకపోవడం.

– కొంతమంది పిల్లల్లో తలనొప్పి ఒకే వైపుకు వచ్చి వేధిస్తుంది. దీన్ని పార్శ్వపు నొప్పి (మైగ్రేన్‌) అంటారు. ఈ నొప్పి తీవ్రత క్రమంగా పెరిగి, క్రమంగా తగ్గుతుంది. దీన్ని భరించడం చాలా కష్టం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

– మానసిక ఒత్తిడి నివారణకు యోగ, మెడిటేషన్‌, ప్రాణాయామం వంటివి చేయాలి. వీటితో మానసిక ప్రశాంతత కలిగి తలనొప్పి తీవ్రత తగ్గుతుంది.

– పిల్లలకు తగినంత విశ్రాంతి తప్పనిసరిగా ఇవ్వాలి.

– పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

– ఆకుకూరలు, తాజా కూరగాయలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

– నీరు ఎక్కువగా తాగాలి. సమయానికి నిద్రపోవాలి.

– ఉదయం లేవగానే వ్యాయమం చేయాలి. తద్వార రక్త ప్రసరణ సక్రమంగా జరిగి తలనొప్పి క్రమంగా తగ్గుతుంది.

చికిత్స : ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. హోమియో వైద్యంలో పిల్లల్లో వచ్చే తలనొప్పికి మంచి చికిత్స ఉంది. వ్యక్తి మానసిక లక్షణాలను, శారీరక లక్షణాలను, అలవాట్లను పరిగణలోకి తీసుకొని డాక్టర్లు మందులిస్తారు.

మందులు

కాల్కేరియాఫాస్‌: బడికి వెళ్లే పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఇంటికి తిరిగి రాగానే తలనొప్పి అంటారు. అలసటగా కన్పిస్తారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.

జెల్సీమియం: పిల్లల్లో మానసిక ఒత్తిడి తీవ్రత పెరిగినప్పుడు టెన్షన్‌కు గురై తలనొప్పి వెనుక నుండి ప్రారంభమై ముందుకు వస్తుంటుంది. అటువంటి వారికి ఈ మందు ఆలోచించదగినది. పరీక్షలంటేనే వణుకు, దడ, తలనొప్పి మొదలవుతుంది. మూత్ర విసర్జన అనంతరం తలనొప్పి తగ్గిపోవుట ఈ రోగి మరొక విచిత్ర లక్షణం. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.

నేట్రోమోర్‌: సుత్తితో తల మీద కొట్టినట్టుగా ఉంటుంది నొప్పి. ఇది ఉదయం 11 గం|| నుండి మధ్యాహ్న 3గం||ల వరకు ఉంటుంది. వీరు భయంతో దిగులుగా కనిపిస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఉద్వేగానికి లోనవుతారు. వీరు ఓదార్పును ఇష్టపడరు. జాలి చూపిస్తే కోపం తెచ్చుకునే వాళ్లకు ఈ మందు ఆలోచించదగినది.

సాంగ్యునేరియా : పిల్లల్లో కుడి వైపు వచ్చే తలనొప్పికి మంచి మందు. నొప్పి పోట్లతో కూడి భరించలేని పరిస్థితిలో ఉంటుంది. తలనొప్పి వెనుక నుండి ప్రారంభమై ముందుకు వచ్చి కుడివైపు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

స్పైజీలియా : పిల్లల్లో ఎడమ వైపు వచ్చే తలనొప్పికి ఇది మంచి మందు. నుదిటి, కంటి భాగాలలో పోట్లతో కూడిన నొప్పిని నివారిస్తుంది. తలనొప్పి వెనుక నుండి ప్రారంభమై ముందుకు వచ్చి ఎడుమ వైపు కణతల భాగంలో ఎక్కువగా ఉంటుంది. కదిలిన, కుదిపిన నొప్పి అధికమవుట దీని లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.

ఈ మందులే కాకుండా కాల్కేరియా కార్బ్‌, గ్రొనైన్‌, బ్రయోనియా, సైలీషియా, కాలీబైక్‌, సెపియా.. వంటి మందులను వ్యాధి లక్షణాలను పరిగణలోకి తీసుకొని చికిత్స తీసుకుంటే తలనొప్పి నుండి విముక్తి పొందవచ్చు.

– డా|| పావుశెట్టి శ్రీధర్‌, హోమియో ఫిజీషియన్‌, 9440229646

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *