ఫిషర్స్‌కు ఆదిలోనే చెక్‌ పెడదాం..!

ఫిషర్స్‌కు ఆదిలోనే చెక్‌ పెడదాం..!

మనం నిత్యం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. దీంతో మలవిసర్జన కష్టంగా మారుతుంది. మలవిసర్జన సాఫీగా జరగనప్పుడు ముక్కడం వల్ల మలద్వారంలో పగుల్లు ఏర్పడటాన్నే ఫిషర్స్‌ అంటారు. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు మలవిసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం కూడా అవుతుంది.

కారణాలు

మల విసర్జన సక్రమంగా జరగక మలబద్దకం ఏర్పడటం వలన, కొందరిలో వంశ పారంపర్యంగా, ఎక్కువసేపు కుర్చీలోనే కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తించడం వల్ల, తక్కువగా నీరు తాగడం వల్ల, మద్యం అతిగా సేవించటం వల్ల, ఫాస్ట్‌ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం వల్ల, మాంసాహారం తరచుగా తీసుకోవటం వలన ఫిషర్స్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు

– మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట కలుగుతుంది.

– హుషారుగా ఉండలేరు.

– ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు.

– సుఖవిరేచనం కాదు.

– ఎప్పుడూ చిరాకుగా, కోపంగా ఉంటారు.

– అప్పుడప్పుడు విరేచనంలో రక్తం పడు తుంటుంది.

– మల విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది.

జాగ్రత్తలు

సులభంగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలు తీసుకోవటం శ్రేయస్కరం. ఘనపదార్థాల కన్నా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నించాలి. కారం, నూనె, మసాలాలు బాగా తగ్గించాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్లు తాగాలి). ప్రతి రోజు వ్యాయామం చేయాలి. మల విసర్జన సాఫీగా జరిగేట్లు చూసుకో వాలి. మద్యం అతిగా సేవించటం, ఫాస్ట్‌ఫుడ్స్‌, వేపుళ్లు, మాంసాహారం మానుకోవాలి.

చికిత్స

వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. వ్యాధి ఆరంభంలోనే హోమియో మందులను వాడుకుని ప్రయోజనం పొందవచ్చు. హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక, శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచిస్తారు. కనుక సమూలంగా ఫిషర్స్‌ వంటి రుగ్మతల నుండి విముక్తి పొందవచ్చు.

మందులు

నైటిక్‌ ఆసిడ్‌: ఇది ఫిషర్స్‌కి అతి ముఖ్యమైన మందు. వీరు మలబద్దకంతో బాధపడతారు. మలవిసర్జనకు వెళ్లే సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి మల విసర్జన అనంతరం కూడా బాధిస్తుంది. ఇటు వంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.

అస్కులస్‌హిప్‌ : మల ద్వారం పొడిగా ఉండి నొప్పిగా అనిపిస్తుంది. ఆసనంలో పుల్లలు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనానికి వెళ్లాలంటేనే భయపడి పోతారు. విరేచనం తరువాత నొప్పిగా, బాధగా అనిపిస్తుంది. ఇటు వంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక గుర్తుంచుకోదగినది.

నక్స్‌వామికా : శారీరక శ్రమ లేకుండా, మలబద్దకంతో బాధ పడుతూ తరుచుగా మలబద్దకం నివారణ మాత్రలు వాడే వారికి ఈ మందు ఆలోచించ దగినది. అలాగే తరచుగా మల విసర్జన చేయాలనిపించడం, తీరా మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక బాధాకరంగా అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.

సల్ఫర్‌ : ఫిషర్స్‌ వ్యాధిని నయం చేయటంలో ఈ మందు అతి ముఖ్యమైనది. ఈ మందును వాడి చాలా మంది రోగులు విముక్తి పొందారు. వీరు మలబద్ధకంతో బాధ పడుతుంటారు, మలవిసర్జనకు వెళితే మలం సాఫీగా జరుగక మంట, నొప్పి బాధిస్తుంది. నొప్పి మలవిసర్జన అనంతరం కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక వాడుకోదగినది.

రటానియా : వీరికి ఆసనంలో గాజుపెంకులు గుచ్చుతున్నట్లుగా ఉంటుంది. విరేచనానికి వెళ్లిన తరువాత కొంత సేపు వరకు నొప్పిగా, బాధగా అనిపిస్తుంది. మలవిసర్జన సమయంలో అప్పుడప్పుడు రక్తం పడుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.

హెమామెలీస్‌ : మల విసర్జన సమయంలో తీవ్రమైన రక్తస్రావం అవుతూ ఉంటుంది. తరచూ బాత్‌రూమ్‌కి వెళ్లాలనిపిస్తుంది. వీరికి ఇది బాగా పనిచేస్తుంది.

ఈ మందులే కాకుండా ఫిషర్స్‌ నివారణకు మ్యురాటిక్‌ ఆసిడ్‌, గ్రాఫాయిటీస్‌, మెర్కుసాల్‌, ఫాస్పారస్‌ వంటి మందులను వ్యాధి లక్షణాల ఆధారంగా వాడుకొని విముక్తి పొందవచ్చు.

– డా|| పావుశెట్టి శ్రీధర్‌, 94402 29646

(రచయిత హోమియో ఫిజీషియన్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *