అరిసెలతో ఆరోగ్యం

అరిసెలతో ఆరోగ్యం

హిందూ పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. నెల రోజుల పాటు సాగే ఈ పండుగ చివరి మూడు రోజులు భోగి, సంక్రాంతి, కనుమలతో; ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లతో, చుట్టాలతో, చక్కని పిండివంటలతో, ఘుమఘుమ లాడే సువాసనలతో ఘనంగా ముగుస్తుంది.

హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సంక్రాంతి పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇంటి లోపల అరిసెలు, ఇంటి బయట ముగ్గులు. సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ రెండూ లేని ఇల్లు ఉండదు. ఈ ఆధునిక కాలంలో ముగ్గులు అక్కడక్కడ కనబడకపోయినా అరిసెలు మాత్రం ప్రతి ఇంటిలోనూ ఉండాల్సిందే. తియ్యగా, నోట్లో పెట్టుకోగానే మెత్తగా కరిగిపోయే ఈ అరిసెలను ఇష్టపడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అరిసెల మరో ప్రత్యేకత ఏంటంటే, ఇవి ఎన్ని తిన్నా బోరు కొట్టదు. అందుకే వింటే భారతం వినాలి, తింటే సంక్రాంతి అరిసెలు తినాలి అని ఆధునిక తరం అంటోంది.

ఆరోగ్యమే మహాభాగ్యం అనేది భారతీయ నానుడి. సంవత్సరం పొడుగునా పండుగలు జరుపుకోవడంలోని ముఖ్య ఉద్దేశ్యం, ఆంతర్యం ఆరోగ్యమే. అందుకే వాటిని ఒక పండుగ రూపంలో ఇమిడ్చి ప్రతి సంవత్సరం చేసుకొనే సంప్రదాయం నెలకొల్పారు మన పెద్దలు. సంక్రాంతికి తినే అరిసెలలో కూడా మనిషికి ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో ఔషధాలు ఇమిడి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

అరిసెలలో ప్రత్యేకంగా వాడే పదార్ధాలు 1) బియ్యపు పిండి, 2) బెల్లం, 3) నువ్వులు. ఈ మూడు ఉంటేనే అరిసెలు తయారవుతాయి. మరో విషయం ఏంటంటే సరిగ్గా శీతాకాలంలో ఈ అరిసెల పండుగ వస్తుంది.

మన పెద్దలు శీతాకాలం సమయంలో వచ్చే వివిధ అనారోగ్యాలకు ఔషధంగా అరిసెలను పండుగలో చేర్చారు. శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందువల్ల తిన్న తిండి సరిగా అరగక జీర్ణరోగాలు వస్తాయి. అలాగే శీతా కాలంలో శరీరం ఎండిపోయినట్లయి, పగిలిపోతూ ఉంటుంది. లేదా తెల్లగా మారుతుంది, కళ కోల్పోతుంది. వీటన్నిటికి గొప్ప ఔషధం బెల్లం, నువ్వులు.

బెల్లంతో జీర్ణశక్తి

ఔషధాల నిలయం బెల్లం. ఆయుర్వేదంలో బెల్లానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెల్లాన్ని వంటింట్లో రారాజు అని కూడా అంటారు. శీతాకాలంలో వచ్చే అనేక రోగాలకు చక్కని మందు బెల్లం. బెల్లంలో కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌లు ఇందుకు చక్కగా పనిచేస్తాయి. ఈ మూడింటి కలయిక వల్ల చల్లగా ఉండే శీతాకాలంలో మన శరీర వేడి సాధారణ స్థాయిలో ఉండి జీర్ణశక్తికి చక్కగా తోడ్పడుతుంది. జీర్ణశక్తి చక్కగా ఉంటే చర్మం కూడా కళను కోల్పోదు. అంటే చర్మం కళను కూడా బెల్లం కాపాడుతుంది. అలాగే బెల్లం తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌ పోయి, కీళ్ల నొప్పులు, ఎసిడిటి వంటివి తగ్గుతాయి. బెల్లం రక్తంలో చేరిన విషపూరిత పదార్థాలను తొలగిస్తుంది. అంటే రక్తాన్ని శుభ్రపరుస్తుంది అన్నమాట. అసలు చిన్నప్పుడు అందరి ఇళ్లలోనూ బెల్లంతో చేసిన పదార్థాలే ఉండేవి. బెల్లం పాయసం, బెల్లంతో చేసిన నువ్వు ఉండ, కొబ్బరి లోజ్‌, పప్పు ఉండ లేదా పల్లీ ఉండ మొదలైనవి. ఒకవేళ ఇంటిలో లేకపోయినా బయట బడ్డీకొట్టులో సీసాల్లో అవే ఉండేవి. ఏది కొనుక్కుతిన్నా ఆరోగ్యం నిలబడేది. ఇప్పుడు వీటి స్థానంలో కుర్‌కురేలు, బిస్కట్‌లు, చాక్లెట్‌లు వచ్చి చేరాయి. ఇవి కొనుక్కుంటే అనారోగ్యాన్ని కొనుక్కున్నట్లే.

భోజనం చేసిన వెంటనే ఒక చిన్న బెల్లం ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే తిన్న తిండి సక్రమంగా జీర్ణమవుతుంది. అందువల్ల గ్యాస్‌, ఎసిడిటి, కీళ్లనొప్పులు చుట్టుముట్టే ప్రమాదం తప్పుతుంది.

బెల్లం వట్టిది తినడం కన్నా దానిని పాకంగా చేసి, ఔషధ రూపంలో తీసుకుంటే ఎన్నో రోగాలు నయమవుతాయి. ఔషధ రూపం అంటే సూక్ష్మ రూపం. సూక్ష్మ రూపానికి ఉదాహరణ హోమియో వైద్యం. బెల్లానికి సూక్ష్మ రూపం బెల్లం పాకం. బెల్లం పాకంతో వండిన తిండి తింటే శరీరంలోని అనేక రోగాలు నయమవుతాయి. అలా బెల్లం పాకంతో తయారయ్యే వంటకం అరిసె. అంటే అరిసెతో ఆరోగ్యం అన్నమాట.

సన్నబడటానికి నువ్వులు

అరిసెలలో ఉండే మరో ముఖ్య పదార్ధం నువ్వులు. ఇవి నలుపు, తెలుపు రంగులో ఉంటాయి. నల్ల నువ్వులే మంచివి. సాధారణంగా వంటకు ఇప్పుడు తెల్ల నువ్వులు వాడుతున్నారు. నువ్వుల స్వభావం చర్మాన్ని నునుపుగా ఉంచి, మంచి తేజస్సును ఇవ్వడం. మరో గుణం కొవ్వును కరిగించి, సన్నబడేట్లు చేయడం. అలాగే శరీరంలో వేడిని సాధారణ స్థాయిలో ఉంచడం. నువ్వులలో క్యాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. ఇది కీళ్లు, కాలి నొప్పులను పోగొడుతుంది. ముఖ్యంగా ఎముకలు బలహీనంగా ఉండేవారికి నువ్వులు మంచి ఔషధం. నువ్వులలో పీచు పదార్థం కూడా ఉంటుంది. ఇది కూడా జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది.

పూర్వం చాలా ఇళ్లలో నువ్వులు, బెల్లం ఉండేవి. పిల్లలు ఆకలి అంటే అవి ఇచ్చేవారు తల్లులు. అందుకే ఆ రోజుల్లో పిల్లలకు, పెద్దలకు జీర్ణ సమస్యలు ఎదురు కాలేదు. జీర్ణ సమస్య ఎదురైతే రాని రోగమంటూ లేదు. ఇప్పటి రోగాలన్నిటికి ముఖ్య కారణం అజీర్ణమే కదా.

అరిసెలలోని మరో ముఖ్యపదార్థం బియ్యం పిండి. బియ్యపు పిండికి చర్మానికి కళను పెంచే గుణం ఉంది. బియ్యపు పిండికి బెల్లం, నువ్వులు కలిపితే అరిసెలు తయారవుతాయి.

ఇలా తయారైన అరిసెలు ముఖ్యంగా శీతా కాలంలో శరీర వేడిని సమస్థాయిలో ఉంచటంతో పాటు, అజీర్తిని నివారించి, గ్యాస్‌ ఎసిడిటి, కీళ్లనొప్పులు వంటి వాత సంబంధ రోగాలు రాకుండా చేస్తాయి. అరిసెలు తినడం వల్ల శరీరంలోని రక్తం సులభంగా శుభ్రమవుతుంది. హృదయానికి శ్రమ తప్పుతుంది. చెడు కొవ్వు నిల్వలు కరిగి శరీరం సన్నబడి ఆరోగ్యవంతమవుతుంది. ముఖ్యంగా నువ్వులు, బెల్లం మిశ్రమం వలన చర్మంలో పెళుసు గుణం తగ్గి, నునుపు పెరిగి, కళతో, మంచి వర్చస్సుతో నిగనిగలాడుతుంది. మరో మాట చెప్పాలంటే అంతకుముందు మనలను బాధిస్తున్న ఎన్నో చర్మరోగాలు కూడా అరిసెలతో నివారణ అవుతాయి. ఉదాహరణకు గజ్జి, దురద, చర్మంపై వాతపు మచ్చలు, పొక్కులు వంటివి. ఇవన్నీ నయమై చర్మం కొత్త రూపు సంతరించుకుంటుంది. మరోమాటలో చెప్పాలంటే అరిసెలు కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తాయి.

అరిసెలతో అన్ని రకాల వయసుల వారికి ఆరోగ్యం కలుగుతుంది. పిల్లలు, యువకులు, స్త్రీలు, వృద్ధులు అందరికీ అరిసెలతో ఉపయోగమే. ముఖ్యంగా చర్మం తెల్లగా, నున్నగా కావాలని కోరుకునే యువతీ యువకులకు అరిసెలు గొప్ప ఔషధం. అరిసెలు నెల రోజుల పాటు తింటే శరీరం శుభ్రమై, నూతన కళను, ఉత్సాహాన్ని పొందుతుంది.

అందుకే అరిసెలను పండుగకు రెండు, మూడు రోజుల ముందు కాక, రెండు వారాల ముందే చేసుకుని, పండుగ అయిపోయాక మరో రెండు మూడు వారాల వరకూ తింటూనే ఉంటారు.

ఈ ఆధునిక యుగంలో కూడా గ్రామాల్లోని ప్రతి ఇంటిలోనూ అరిసెలు ఉంటున్నాయి. ఒకవేళ లేకపోయినా మనం ప్రారంభిద్దాం. సంక్రాంతిని చక్కగా ఆస్వాదిద్దాం. ఆరోగ్యం తెచ్చుకుందాం.

– ప్రణవ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *