హోమియోతో గొంతునొప్పికి చెక్‌ !

హోమియోతో గొంతునొప్పికి చెక్‌ !

చాలా మంది చల్లని ద్రవ పదార్థాలు తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే అతిశీతల పానీయాల వల్ల గొంతునొప్పి సమస్యలు ఎదురవుతాయి. చల్లని ఐస్‌తో తయారు చేసిన పండ్లరసాలు, కూల్‌డ్రింకులు తాగడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్‌ వచ్చి ఆహారం తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

లక్షణాలు :

1. ఆహారం మింగటం కష్టంగా మారటం.

2. నీరు తాగటం, గాలి పీల్చటం ఇబ్బందిగా ఉంటుంది.

3. చాలా రోజుల నుంచి ఇన్‌ఫెక్షన్‌ ఉంటే నోటి దుర్వాసన వస్తుంది.

4. గొంతునొప్పితో పాటు జలుబు, జ్వరం వస్తుంది.

5. చికాకు, నీరసంగా అనిపిస్తుంది.

6. గొంతునొప్పితో కొందరికి టాన్సిల్స్‌, ఎడినాయిడ్స్‌ లాంటి సమస్యలు ఉత్పన్నమై బాధిస్తాయి.

జాగ్రత్తలు:

1. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన చల్లని ద్రవ పదార్థాలు తీసుకోకూడదు.

2. కొంతమంది నీటిలో ఐస్‌క్యూబ్స్‌ వేసుకొని తాగుతారు. ఇది మంచిది కాదు.

3. గొంతునొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఐస్‌క్రీమ్స్‌, బేకరీ ఫుడ్స్‌ తీసుకోకూడదు.

4. సైనసైటిస్‌, ఆస్తమా, ఎడినాయిడ్స్‌ ఉన్నవారు శీతల పానీయాలు జోలికి పోవొద్దు.

5. ఏ కాలంలో అయినా కుండలో నీరు తాగడం శ్రేయస్కరం.

6. గొంతునొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రందిచాలి.

చికిత్స :

హోమియో వైద్యంలో గొంతునొప్పికి మంచి చికిత్స ఉంది. వ్యాధి లక్షణాలను, వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటే గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. చల్లటి పానీయాలు తీసుకున్న వెంటనే గొంతులో నొప్పి ప్రారంభమైతే ఈ మందు తప్పక ఆలోచించదగినది. అలాగే చల్లని ఏసి గాలికి ఎదురుగా ఎక్కువ సేపు ఉండటం వల్ల వచ్చే గొంతునొప్పికి కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. గొంతునొప్పితో పాటు గొంతులో ఉండబెట్టినట్లుగా, ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించేవారికి కూడా ఇది పనిచేస్తుంది.

ఎకోనైట్‌: చల్లటి పానీయాలు తీసుకున్న వెంటనే గొంతునొప్పి, జ్వరం, దగ్గు, జలుబు బాధిస్తే ఈ మందు బాగా పనిచేస్తుంది.

ఆర్సినిక్‌ ఆల్బ్‌: కలుషిత చల్లని పానీయాలు, ఐస్‌క్రీమ్స్‌ తీసుకోవడం వల్ల గొంతునొప్పి, దగ్గు, జ్వరం, జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, ఆహారం మింగటం కష్టంగా మారిన సందర్భంలో ఈ మందు వాడితే ప్రయోజనం ఉంటుంది.

మెర్క్‌సాల్‌: చల్లని శీతల పానీయాలు తాగడం ద్వారా వచ్చిన గొంతు నొప్పి రాత్రి వేళల్లో ఎక్కువగా బాధిస్తుంది. కొంతమందికి జలుబు చేసినప్పుడల్లా గొంతునొప్పి బాధిస్తుంది. అటువంటి వారికి ఈ మందు ఆలోచించదగినది.

బెల్లడోనా: కలుషిత చల్లని నీరు తాగడం వల్ల సోకే వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు ఈ మందు ప్రధానమైంది. ఈ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు కనీసం ద్రవపదార్థాలు సైతం తీసుకోలేరు. జ్వరంతో బాధపడుతూ నీరసంగా ఉంటారు. వేసవిలో వచ్చే జ్వరంతో కూడిన గొంతునొప్పికి ఈ మందు అద్భుతంగా పనిచేస్తుంది. వీరికి దాహం తక్కువగా ఉండి నాలుక పొడిబారి నట్లుగా ఉంటుంది.

పైన చెప్పిన మందులే కాకుండా బ్రయోనియా, ఫెర్రంఫాస్‌, కాలిమోర్‌, మెగ్‌ఫాస్‌, లేకసిస్‌, కాల్కేరియాకార్బ్‌, సల్ఫర్‌, ఏపిస్‌ వంటి మందులను డాక్టర్‌ సలహా మేరకు వాడితే గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

– డా|| పావుశెట్టి శ్రీధర్‌, హోమియో ఫిజీషియన్‌,  94402 29646 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *