శీతాకాల నేస్తం సీతాఫలం

శీతాకాల నేస్తం సీతాఫలం

సీతాఫలం శీతాకాలంలో లభించే పండు. అంటే అక్టోబర్‌ మొదలైతే వచ్చేది. ఈ పండులో ఎన్నో పోషక పదార్థాలు లభిస్తాయి. ఈ పండులో విటమిన్‌ ఎ, బి, సీలు, ప్రొటీన్స్‌, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, కాపర్‌, ఫాస్పరస్‌, నియోసిన్‌, రిబోఫ్లోవిన్‌, ఫైబర్‌, నీరు లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేయటమే కాక ఔషధపరంగా కూడా ఉపయోగపడుతుంది.

సీతాఫలం మనిషిలో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అజీర్తిని, మలబద్ధకాన్ని పోగొడుతుంది, ఫ్రీ రాడికల్స్‌ తొలగిస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. చర్మానికి ఎలర్జీని కలుగనివ్వదు. దాహాన్ని తీరుస్తుంది.

ఈ పండు గుజ్జులో పాలు పోసి పిల్లలకు తినిపిస్తే పిల్లల ఎదుగుదల బాగుంటుంది.

సీతాఫలం ముఖ్యంగా ఆస్త్మా వ్యాధికి ఔషధంగా ఉపయోగిస్తుంది. సీతాఫలం ఆకులను పుండ్ల మీద పెట్టి కట్టుకడితే, అవి త్వరగా మానుతాయి.

అలాగే సీతాఫలం అలసటను దూరం చేసి, కండరాలు, నరాలకు తగినంత శక్తినిస్తుంది. వాతాన్నిహరిస్తుంది. సీతాఫలం గుజ్జు సెగ్గడ్డలకు, పుండ్లకు, గాయాలకు యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది.

ఈ ఫలం లేత ఆకులను, గింజలను మెత్తగా నూరి తలకు పట్టిస్తే, పేలు ఎక్కువగా ఉన్న సమస్య నివారణ అవుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతూ, దృష్టిలోపం ఏర్పడకుండా చేస్తుంది.

గర్భిణులలో వేవిళ్ళను, గర్భస్రావాన్ని నిరోధిస్తుంది. ప్రసవం తర్వాత బరువు పెరగ కుండాను, బరువు తగ్గేలా చేస్తుంది. రక్తలేమిని పోగొట్టి, రక్తవృద్ధికి తోడ్పడుతుంది. రక్తపోటును అదుపు చేస్తుంది.

నోటి వికారాన్ని పోగొడుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎముకలు ధృడం కావటానికి సాయపడుతుంది.

సీతాఫలం దంతక్షయాన్ని నివారించి, దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

సీతాఫలం చెట్టులోని ప్రతిభాగం మనిషికి ఉపయోగపడుతుంది. ఈ చెట్టు కలపను ఇంటిపై కప్పుకు, దూలాలకు వాడినట్లయితే చెక్కకు చెదలు పట్టే ప్రమాదం ఉండదు. సీతాఫలం గింజల నుంచి తీసిన తైలాన్ని క్రిమి సంహారక ముందుల్లో వాడుతారు. ఈ పండు గుజ్జును ఐస్‌క్రీమ్‌, మిల్క్‌ షేక్స్‌, బర్ఫీ, కొన్ని తీపి తినుబండారాల్లోనూ ఉపయోగిస్తారు.

కానీ సీతాఫలం ఎక్కువ తింటే కొంతమందికి జలుబు చేస్తుంది. అయితే దీనికి కారణం అటువంటి వారి శరీరంలో తగిన రోగనిరోధక శక్తి లేకపోవడమే. అటువంటి వారు వెంటనే వైద్యునికి చూపించుకుని తగిన మందులు వాడుకోవాలి.

ఏదైనా అతి మంచిది కాదు.

– కౌతా నిర్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *