వేసవిలో నీరే మేలు

వేసవిలో నీరే మేలు

వేసవి కాలం అంటే ఎండలు ఎక్కువగా ఉన్నా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించే కాలం. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులుండటంతో వేసవిలో పిల్లలు చాలా ఎంజాయ్‌ చేస్తారు. అయితే గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగు తున్నాయి.

ఎండాకాలంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని తీవ్రంగా బాధిస్తాయి. వడగాలులు, డీహైడ్రేషన్‌, వడదెబ్బ, చెమట కాయలు, సెగ్గడ్డలు, నీటి కాలుష్యం వలన వచ్చే డయేరియా, వైరల్‌ జ్వరాలు మొదలైనవి ఎండా కాలంలో తరచూ బాధించే రోగాలు. అయితే కాస్తా ముందుచూపుతో వ్యవహరిస్తే ఈ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

వేసవిలో దాహం అధికంగా వేస్తుంది. అలాగని కూల్‌డ్రింక్స్‌ లేదా మరేవైనా బయట తయారు చేసే పానీయాలు తాగారో దాహం తీరడం సంగతి దేవుడెరుగు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు వైద్య నిపుణులు.

ఈ కాలంలో తరచూ ఇంట్లో లేదా బయట చక్కెర కలిపి చేసే పండ్ల రసాలను అధికంగా తాగేస్తుంటాం. అయితే చక్కెరను అతిగా తీసుకోవడం వల్ల శరీరానికి పీచుపదార్థాలు అందకపోగా శరీరంలో జీర్ణక్రియ దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఎండాకాలంలో చాలా మంది ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం రకరకాల ఫ్రూట్‌ సలాడ్‌లు, డ్రైఫ్రూట్‌లు తింటూ, ఆహార నియమాలు పాటిస్తూ అనారోగ్యాల పాలవడం మనం గమనిస్తూనే ఉంటాం.

వేసవిలో శరీరంలో జీవక్రియలు సాఫీగా సాగాలంటే తగిన మోతాదులో శరీరానికి నీరు అందివ్వడం చాలా అవసరం. నీరు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. రోజుకు కనీసం ప్రతిఒక్కరూ సగటున 5 లీటర్ల నీరు తాగాలి. నీరు శరీరంలో క్యాలరీలను కరిగించి డైజెస్టివ్‌ ఫ్యాట్‌గా మలచడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఒంట్లో వేడిని తగ్గడంతో పాటు టాక్సిన్లను బయటకి పంపేస్తుంది.

డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకోవాలంటే ?

శరీరం నుంచి బయటకు పోయిన నీటిని తిరిగి భర్తీ చేస్తే డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు. అలా ఉండాలంటే కేవలం నీరు అధికంగా తాగడం ఒక్కటే మార్గం. వేసవిలో పిల్లలకు అవసరం లేదన్నా కొద్ది కొద్దిగానైనా నీరు తాగిస్తూ ఉండాలి. శరీరంలో ఎల్లప్పుడూ ద్రవాలు సమతుల్యంలో ఉండాలంటే నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఎండలో ప్రయాణించేటపుడు వాటర్‌ బాటిల్‌ను తప్పనిసరిగా వెంట ఉంచుకో వాలి. మజ్జిగ, పెరుగు, దానిమ్మ, క్యారెట్‌, బార్లీ, చల్లటి గంజి, నిమ్మరసం, తాజా పండ్లను తీసుకోవడం ద్వారా కూడా డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండొచ్చు.

– హర్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *