వేసవిలో చర్మ సంరక్షణ

వేసవిలో చర్మ సంరక్షణ

మరో వారంలో వేసవి ముగిసిపోతుంది. కాని ఎండలు ఇప్పుడే తగ్గేలా లేవు. మరో వారం పాటు రోహిణీ కార్తె ఉంటుంది. ఇది వేసవి చివరి కాలం. ఈ కాలంలో చర్మం అనేక రుగ్మతలకు లోనవుతుంది. అందుకే ఈ కాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అధిక ఉష్ణోగ్రతల వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలున్నాయి.

జాగ్రత్తలు :

1. వేసవిలో తరచూ చర్మం బాగా పొడిబారిపోతూ ఉంటే సబ్బుకు బదులు వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.

2. అన్నింటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీటి కంటే ఇప్పుడు రెండింతలు అధికంగా తీసుకోవాలి.

3. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది.

4. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. కీరదోస, క్యారట్‌, బీట్‌రూట్‌ లాంటి పచ్చికూరగాయలు తింటే చర్మం తాజాగా ఉంటుంది.

5. వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి.

6. టమాట, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్‌ కూడా తగ్గిపోతాయి. ముఖంపై ర్యాషెస్‌ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు.

7. వేసవిలో కేశ సంరక్షణ కూడా చాలా ముఖ్యం. జుట్టును మరీ పొడవుగా ఉంచుకోకుండా వీలైనంత తక్కువగా కట్‌ చేసుకుంటే మంచిది.

8. వేసవిలో ఎక్కువగా స్విమ్మింగ్‌ చేయడం చాలా మందికి అలవాటు. అయితే స్విమ్మింగ్‌ ఎక్కువ సమయం చేయడంవల్ల నీళ్లలో ఉండే క్లోరిన్‌ కేశ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. కనుక స్విమ్మింగ్‌ చేసేటప్పుడు తప్పకుండా తలకు మాస్క్‌ ధరించడం మరచిపోవద్దు.

– హర్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *