వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !

వేసవికాలం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఎండకాలంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎండ వేడిమికి డీలా పడిపోవాల్సిందే. ఎండ కాలం పూర్తయ్యే దాకా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఆహారంలో, తాగే నీటిలో, ధరించే దుస్తుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు.

ఎండలో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినపు డైతే ఇక చెప్పనవసరం లేదు. కచ్ఛితంగా మనతో పాటు గొడుగు లేదా తలపై తెల్లటి గుడ్డ ఉండాల్సిందే. మనిషి తినకా తప్పదు, తిరగకా తప్పదు కాబట్టి ఈ రెండు విషయాల్లో వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వేసవిలో చాలా మంది నీటిని అధికంగా తాగుతారు. అయితే ఈ కాలంలో నీటితో పాటు రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తయారు చేసుకుని సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐస్‌క్రీములు, శీతల పానీయాలు ఆరోగ్యానికి హానికరం. అయినా అందరి దష్టి ఎక్కువగా వీటిపైనే ఉంటుంది. స్లో పాయిజన్‌ లాంటి ఈ తరహా పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే కోరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కలుషితం కాని స్వచ్ఛమైన నీటినే ఎల్లప్పుడూ తాగాలి. ఆకలి తగ్గించుకోడానికి ఏది పడితే అది తినకూడదు. ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్ల జోలికి అస్సలు పోకూడదు. వేసవి తాపానికి విరుగుడుగా ఆరోగ్యాన్నిచ్చే వివిధ రకాల పండ్ల రసాలు, పానీయాలు ఇళ్లలోనే చాలా తేలిక పద్ధతుల్లో తయారుచేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర రసాలు, పుచ్చకాయ, అల్లంరసం, దానిమ్మ, ద్రాక్ష రసాల వంటివి ఇళ్ళలోనే తయారు చేసుకుని సేవించాలి.

వేసవిలో వస్త్రధారణ కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి. నూలు దుస్తులు వాడటం సరైంది. ఏ వయసువారైనా సరే నూలు దుస్తులు వాడితే వేసవి తాపం చాలా శాతం తగ్గిపోతుంది. పిల్లలకైతే నూలు దుస్తులు వేయడం తప్పదు కాక తప్పదు. ముదురురంగు, మందపాటి వస్త్రాలను దూరంగా ఉంచడం మేలు. అలాగే పాలిస్టర్‌, సింథటిక్‌ దుస్తులు ఈ కాలంలో అస్సలు వాడకూడదు. లేత రంగు, తెల్లని కాటన్‌ దుస్తులే వేసవికి సరిగ్గా సరిపోతాయి.

వేసవిలో పళ్ల రసాలు అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, ఆరెంజ్‌, దానిమ్మ, దోసకాయ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. పది కప్పుల పుచ్చకాయ గుజ్జు, కప్పు చెక్కు తీసిన అల్లం ముక్కలను మిక్సీలో వేసి జ్యూస్‌ చేసుకొని తాగితే ఎండ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ రసం వల్ల జీర్ణక్రియ ఉత్తేజమవుతుంది. హిమోగ్లోబిన్‌ కూడా పెరుగుతుంది. కిడ్నీ, గుండెలకు మంచిది. శరీరానికి తగిన నీటి శాతాన్ని అందిస్తుంది. అల్లం వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు.

దానిమ్మ గింజలు ఒక కప్పు, రెండు కప్పుల ద్రాక్షలో ఒక చెంచా పంచదార కలిపి ఆ రసాన్ని వడకట్టి కొంతసేపు చల్లని ప్రదేశంలో ఉంచి సేవించాలి. దానిమ్మ వల్ల అతిసారం, డయేరియా, పేగుల్లో ఉన్న నులిపురుగులు పోతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కిడ్నీ, లివర్‌లు ఆరోగ్యంగా ఉంటాయి. హిమోగ్లోబిన్‌ కూడా పెరుగుతుంది. గుండె జబ్బుల నివారణకు బాగా పనిచేస్తుంది. వేసవిలో ఫ్రిజ్‌ లేదా ఐస్‌ వేసిన చల్లని నీరు తాగడం మంచిదికాదు. అటువంటి చల్లని నీరు తాగడం వల్ల గొంతునొప్పి, టాన్సిల్స్‌ వచ్చే ప్రమాద ముంది. మట్టి కుండలోని చల్లని నీటిని తాగితే ఎటువంటి దుష్ప్రభావాలూ ఉండవు.

వేసవిలో సాధ్యమైనంత వరకు ఎండలో బయటకు వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లినా తిరిగి వచ్చిన వెంటనే ఏ.సి. గదుల్లో కూర్చోవడం, నీరు అధికంగా తాగడం మంచిది కాదు. దాని వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదముంది.

– హర్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *