రోగాలకు పాత్రలూ కారణమే

రోగాలకు పాత్రలూ కారణమే

మన ఆరోగ్యంపై అనేక రకాల విషయాలు ప్రభావం చూపిస్తాయి. వాటిలో ఆహారం వండటానికి ఉపయోగించే పాత్రలు కూడా ఒకటి. సాధారణంగా ఇప్పుడు అందరూ ఇంట్లో ఆహారం వండటానికి ఎక్కువశాతం అల్యూ మినియం పాత్రలను, కాస్త తక్కువగా స్టీలు పాత్రలను, ఆధునికత పేరుతో నాన్‌స్టిక్‌ పాత్రలను ఉపయోగిస్తున్నారు. ఆహార పదార్థాల నిల్వ కోసం ప్లాస్టిక్‌ పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటువంటి పాత్రల వలన మన ఆరోగ్యానికి ఎంతో హాని జరుగు తున్నదన్న విషయం ఎక్కువమందికి తెలియదు. అదెలాగో తెలుసుకుందాం.

అల్యూమినియంతో అలుపే..

అల్యూమినియం అసలు వంటకు పనికిరాదు. ఎందుకంటే అల్యూమినియం బంగారం, వెండి, రాగి వలె సహజంగా ఏర్పడిన లోహం కాదు. ఇది బాక్సైట్‌ నుండి తయారవుతుంది. బాక్సైట్‌ నుండి అల్యూ మినియం తయారు చేయడానికి కొన్ని రసాయనా లను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు అల్యూ మినియం లోహంలో ఎంతో కొంత మిగిలిపోతాయి. ఆ పాత్రలలో వండిన ఆహారం ద్వారా రసాయనాలు కడుపులోకి వెళ్లి, శరీరానికి చెడు తలపెట్టే ప్రమాదం ఉంది. మరొక విషయం.. అల్యూమినియం త్వరగా వేడెక్కుతుంది, త్వరగా కరుగుతుంది. త్వరగా కరిగే లోహంతో పాత్రలు తయారు చేయడం సులభం. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. అందుకే అల్యూమినియం పాత్రల తయారీకి ప్రపంచం మొగ్గు చూపుతుంది. త్వరగా వేడెక్కే అల్యూమినియం పాత్రలలో పదార్థాలు కూడా త్వరగా ఉడుకుతాయని వాటిని ఉపయోగిస్తున్న వారందరి అభిప్రాయం. అందుకే ప్రెషర్‌ కుక్కర్‌లు అల్యూమినియంతో తయారవుతున్నాయి. త్వరగా కరిగే గుణం కూడా ఉన్న అల్యూమినియం పాత్రలలో ఆహారం వండినప్పుడు మనకు తెలియని పరిమాణంలో అల్యూమినియం కరిగి ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. కరిగే గుణం ఉంది కాబట్టే అల్యూమినియం పాత్రలు ఎక్కువకాలం మనలేవు. అందుకే ఇళ్లల్లో ఏ అల్యూమినియం పాత్ర 10 నుండి 15 ఏళ్లకు మించి దృఢంగా ఉండలేదు. వంగడమో, వంకర్లు రావడమో, బలహీనం కావడమో జరుగుతుంది. కరిగి ఆహారంలో కలిసిన అల్యూమినియం మన శరీరంలోకి వెళ్లి జీర్ణం కాకుండా మిగిలిపోతుంది. మన శరీరంలో బంగారం, ఇత్తడి, రాగి జీర్ణమవు తాయి. కానీ అల్యూమినియం జీర్ణం కాదు. అందుకే కొన్ని ఆయుర్వేద మందుల తయారీలో బంగారం, వెండి, రాగి వంటి లోహాలు ఉపయోగిస్తారు తప్ప అల్యూమినియం ఉపయోగించరు. ఆయుర్వేద పరిభాషలో అల్యూమినియం విషంతో సమానం. ఎందుకంటే అల్యూమినియం జీర్ణం కాదు. అందుకే హిందూ ఆలయాలలో ప్రసాదం తయారీకి లేదా ఇతర ఆహారం లేదా తీర్థం తయారుచేయడానికి ఇత్తడి, వెండి లేక రాగి పాత్రలు ఉపయోగిస్తారు తప్ప అల్యూమినియం ఉపయోగించరు. కొన్ని ఆలయాలలో మట్టి పాత్రలు ఉపయోగిస్తారు. అలాగే త్వరగా వేడెక్కి ఆహారాన్ని త్వరగా ఉడికించే గుణం ఉన్న అల్యూమినియం పాత్రలలో ఉడికిన ఆహారం త్వరగా జీర్ణం కాదు. తక్కువ వేడితో ఆలస్యంగా ఉడికిన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఏవిధంగా చూసినప్పటికీ అల్యూమినియం పాత్రలలో ఆహారం వండుకుని తినటం వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయి. అజీర్ణం పెరుగుతుంది. అజీర్ణం పెరిగినప్పుడు జీర్ణ సంబంధిత రోగాలు, మధుమేహం వంటివి చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే అల్యూమినియం విషంతో సమానం అంటున్నారు పరిశోధకులు.

ఈ విషయాలు ఏవీ తెలియని దిగువ మధ్య తరగతి, పేద ప్రజలు తమ ఆహారం వండుకోవ టానికి పూర్తిగా అల్యూమినియం పాత్రలపైనే ఆధారపడుతున్నారు. ఈ పాత్రలు తక్కువ రేటులో లభిస్తుండటమే అందుకు కారణం. ప్రెషర్‌ కుక్కర్‌లు, పాన్‌ల రూపంలో అల్యూమినియం ధనవంతుల ఇళ్లల్లోకీ వచ్చేసింది. సాధారణంగా పెద్ద సైజు పాత్రలన్నీ అల్యూమినియం పాత్రలే ఉంటున్నాయి.

అది భ్రమే

అల్యూమినియం పాత్రలలో వండే ఆహారం త్వరగా ఉడుకుతుంది అనేది వట్టి భ్రమ. ఉదాహరణకు పండుగలు, ఉత్సవాల సమయంలో అనేకమంది పాయసం వండుతారు. దీనికోసం ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తుంటారు. అప్పుడు పాయసం త్వరగానే ఉడుకుతుంది. మరో ఉదాహరణ.. ఇంతకుపూర్వం గ్రామాల్లో మట్టి పాత్రలలో ఆహారం వండేవారు, ఆ మట్టి పాత్రలో వేసిన పప్పు 20 లేక 25 నిముషాల సమయంలో ఉడికేది. కాని ఇప్పుడు అల్యూమినియం పాత్రలలో వేస్తున్న పప్పు ఉడకటానికి 30 నుండి 40 నిముషాల సమయం పడుతుంది. ఈ విషయాలు గమనిస్తే అర్థమవు తాయి. అల్యూమినియంతో తయారైన ప్రెషర్‌ కుక్కర్‌లో 5 నిముషాల్లోనే పప్పు ఉడుకుతుంది. కానీ ఇది అల్యూమినియం పాత్ర ప్రభావం అనేకన్నా, ప్రెషర్‌ కుక్కర్‌ తయారీ విధానం ప్రభావం అనొచ్చు. ఎందుకంటే ప్రెషర్‌ కుక్కర్‌లో లోపల ఉత్పన్నమవు తున్న వేడి ఎటూ పోదు. లోపలి వస్తువుపై కేంద్రీకృత మవుతుంది. దాంతో పాత్ర లోపల పీడనం ఎక్కువయి ఆహారం త్వరగా మెత్తబడుతుంది. ఇటువంటి ప్రెషర్‌ కుక్కర్‌ ఇత్తడితో కూడా చెయ్యొచ్చు. కానీ చెయ్యలేరు. ఒకవేళ చేసినా ఎవరూ కొనరు. ఎందుకంటే ధర ఎక్కువైపోతుంది. ధర తక్కువ కాబట్టే అల్యూమినియంతో ప్రెషర్‌ కుక్కర్‌ తయావుతోంది. కానీ అల్యూమినియం వంటకు పనికిరాదు.

కుట్ర

ఎటువంటి ఉపయోగాలూ లేని, పైగా ప్రమాద కరమైన అల్యూమినియంతో తయారైన పాత్రలను మనదేశంలో ఆహారం వండటానికి ఉపయోగించడం ఎలా మొదలైంది ? అది కూడా ఒక కుట్రే. భారత దేశాన్ని ఆంగ్లేయులు పాలించేటప్పుడు కారాగా రాలలో ఖైదీలుగా ఉన్న భారతీయ విప్లవకారులను క్రమంగా నిర్వీర్యులను చేయటానికి ఆంగ్లేయులు అల్యూమినియం పాత్రలను ఉపయో గించారు. అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారం విషం అవుతుందనే విషయాన్ని వారి శాస్త్రజ్ఞులు అప్పుడే తేల్చారు. అందుకే బ్రిటిష్‌వారు భారత కారాగారా లలో వాటిని ప్రవేశపెట్టారు. ఆ పాత్రలలో ఆహారాన్ని వండి ఖైదీలుగా ఉన్న మన విప్లవకారులకు వడ్డించే వారు. మనదేశం నుండి ఆంగ్లేయులు మాత్రం వెళ్లి పోయారు. కానీ వారు జైళ్లలో ప్రవేశపెట్టిన అల్యూ మినియం పాత్రలు మనదేశం మొత్తం విస్తరించాయి. ఎక్కువగా పేదవారి ఇళ్లలో చేరిపోయాయి.

ఏవి మంచివి ?

మనదేశంలో భూమి పొరలలో అల్యూమినియం తయారీకి ఉపయోగించే బాక్సైట్‌ నిల్వలు దశాబ్దాలుగా ఉన్నాయి. కానీ అల్యూమినియాన్ని విద్యుత్‌ తీగలు, వాహనాలు, యంత్రాలు, ఇంటిలో నీటి కడవలు, కుండలు, ఇతర గృహోపకరణాలు వంటివాటి తయారీకి ఉపయోగించారు తప్ప ఆహారం వండటానికి ఎప్పుడూ ఉపయోగించలేదు. భారతీయులు ఆహారం వండ టానికి ఎప్పుడూ మట్టి పాత్రలనే ఉపయోగించారు. ఇప్పటికీ వేసవిలో తాగునీటి కోసం మట్టికుండలనే వాడుతున్నాం. భారతీయ శాస్త్రజ్ఞుల (ఋషులు) పరిశోధనల ప్రకారం మట్టితో తయారైన ఈ శరీరానికి మట్టి పాత్రలలో వండిన ఆహారమే శ్రేయస్కరం. మన అమ్మమ్మలు మట్టి పాత్రలలోనే ఆహారం వండటం మనం చూసే ఉంటాం. మట్టి పాత్రలలో వండుకుని తిన్న అప్పటి తరం వారికి బిపి, మధుమేహం, గ్యాస్‌, అసిడిటి, గుండె సమస్యలు, క్యాన్సర్‌ వంటి వ్యాధులేవీ లేకపోవడం మనకు తెలిసిందే. వారికి కళ్లజోళ్లు రావడం, పళ్లు ఊడటం జరిగేది కాదు. ఈ ఆధునిక కాలంలో కూడా పాశ్చాత్య పోకడలు సోకని కొన్ని ప్రాంతాలలో వంటకు మట్టి పాత్రలనే ఉపయో గిస్తున్నారనేది అతిశయోక్తి కాదు. మట్టిపాత్రలో ఉడికిన ఆహారం శరీరానికి వందశాతం శ్రేయస్కరం. ఎందుకంటే మట్టిలో అనేక రకాల ఔషధాలు, పోషకాలు, మినరల్స్‌ ఉన్నాయి. అనేక రకాల పంటలు పండించి, మనకు ఆహారాన్ని అందించేదే మట్టే కదా! కాబట్టి మట్టి పాత్రలు వంటకు శ్రేయస్కరం. అందుకే ఆలయాలలో ఆహారం ఎక్కువ శాతం మట్టి పాత్రలలోనే తయారుచేస్తారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ప్రసాదం మట్టి పాత్రలోనే వండి, మట్టిపాత్రలలోనే ప్రసాద వితరణ చేస్తారు. బీహార్‌లో ఇప్పటికీ మట్టి కుండలతోనే తేనీరు, మజ్జిగ తాగుతారు.

మట్టి పాత్రలో ఆహారం తక్కువ వేడిలో మెల్లగా ఉడకడం వల్ల అందులోని పోషకాలు వందశాతం అలాగే ఉంటాయి. ఇది ఢిల్లీలోని సిఐఎస్‌ఆర్‌ లేబోరేటరీ పరిశోధనలో తేలిన విషయం. వారి పరిశోధనలోనే తేలిన మరో అంశం అల్యూమినియం పాత్రలో వండిన ఆహారంలో మిగిలిన పోషకాల శాతం 7 నుండి 13 శాతమే అని. ప్రస్తుతం మధుమేహం, బిపిలతో బాధపడుతున్నవారు మట్టి పాత్రలలో వండిన ఆహారం తీసుకుంటే అవి తగ్గుముఖం పడతాయని రాజీవ్‌ దీక్షిత్‌ వంటి కొందరు ఆరోగ్య పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి వంటకు మట్టి పాత్ర శ్రేయస్కరం.

వంట కోసం తయారు చేసే మట్టిపాత్రలను ఏదో ఒకరకమైన మట్టితో కాక ప్రత్యేక మట్టితో తయారుచేస్తారు. ఆ పరిజ్ఞానం ఎప్పుడూ మట్టిలో కుండలు, ఇతర పాత్రలు తయారుచేసే వారికే తెలుస్తుంది. అందుకే వారి వద్దే ఆహారం వండుకునే పాత్రలు కొనాలి.

ఆహారం వండటానికి మట్టి పాత్రల తరువాత శ్రేయస్కరమైనవి ఇత్తడి లేక కంచు పాత్రలు. వీటిలో వండిన ఆహారంలో కూడా పోషకాలు 97 శాతం మిగిలే ఉన్నట్లు పరిశోధనలలో తేలింది.

ఆ ఆహారం చెడు చేస్తుంది

ఫ్రెషర్‌ కుక్కర్‌లో ఆహారం ఉడకదు. కేవలం మెత్తబడుతుంది. ప్రెషర్‌ అంటే ఒత్తిడి. ప్రెషర్‌ కుక్కర్‌లో వండే పదార్థం ఒత్తిడికి గురై త్వరగా మెత్తబడుతుంది. మెత్తబడటాన్నే ఉడికినట్లుగా మనం భావిస్తున్నాం. ఉదాహరణకు ఇవ్వాళ ఉదయం 6 నుండి 8 గంటల మధ్య మట్టి లేక ఇత్తడి పాత్రలో వండిన పప్పు రాత్రికి కూడా పాడవకుండా ఉంటుంది. మట్టిపాత్రలో వండితే రేపు ఉదయానికి కూడా పాడవదు. ఇది పరిశోధనలలో తేలిన విషయం. అదే ప్రెషర్‌ కుక్కర్‌లో వండిన పప్పు రాత్రికే పాడైన వాసన వస్తుంది. ఇక రేపు ఉదయానికి దాని దగ్గరకు కూడా పోలేం. అంతగా పాడవుతుంది. ఇదీ మెత్తబడటానికీ, ఉడకటానికి ఉన్న తేడా. చక్కగా ఉడికిన పదార్థం ఎక్కువసేపు నిలవ ఉంటుంది. అలాగే తిన్నతరువాత కూడా శరీరంలో త్వరగా జీర్ణం అవుతుంది. పప్పు వంటి మందపు ఆహారం కూడా సరిగా ఉడికితే జీర్ణం అయ్యేవరకు శరీరంలో నిల్వ ఉండగలుగుతుంది. ఎటువంటి చెడూ తలపెట్టదు. కుక్కర్‌లో వండిన పప్పు శరీరం లోపలికి వెళ్లాక జీర్ణం అయ్యేంతసేపు నిల్వ ఉండలేక పాడయి ఆమ్లాలు విడుదల అవుతాయి. అందుకే ఆహారం మెత్తబడటం కాక ఉడకాలి.

అలాగే ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం భూమిలో ఏ గింజ పండటానికి ఎక్కువ కాలం పడుతుందో, అదేవిధంగా ఆ గింజ ఉడకటానికి కూడా ఎక్కువ సమయమే తీసుకుంటుంది. ఉదాహరణకి ఎక్కువ పోషక విలువలు ఉండే కందిపప్పు పంట పండ టానికి కనీసం 7 నుండి 8 నెలలు పడుతుంది. అందులో ఉంటే విటమిన్స్‌, ప్రొటీన్స్‌, న్యూటియ్రన్స్‌, అన్నీ సక్రమంగా మట్టినుండి తయారవటానికి అంత సమయం పడుతుంది. మట్టిలోనే అన్నిరకాల మైక్రో నూట్రియన్స్‌ ఉన్నాయి. ఇవన్నీ మొక్క వేరులోకి చేరి క్రమంగా ఫలానికి చేరుతాయి. కనుకనే అంత సమయం పడుతుంది. కాబట్టి గింజలోని అన్నిరకాల పోషకాలు మన శరీరంలోకి చేరాలంటే పదార్థం నెమ్మదిగా ఉడకాలి. ఒత్తిడికి గురై, మెత్తబడితే సరిపోదు. ఇది ప్రకృతిధర్మం. బిడ్డ జన్మించాలంటే కూడా తొమ్మిది నెలలు వేచి చూడాలి. అప్పుడే అన్ని అవయవాలు చేకూరి, సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డ జన్మిస్తుంది. కాబట్టి ఫ్రెషర్‌ కుక్కర్‌లో వండిన ఆహారం చెడు చేస్తుంది.

– సూర్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *