చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండి

చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండి

చలికాలం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చల్లటి వాతావరణంలో విహరించడానికి అందరూ ఉత్సాహం చూపిస్తారు. కాని చలి కాలంలో వాతావరణంలో ఉండే అతి చల్లదనం మన చర్మానికి హానిచేస్తుంది. ఈ కాలంలో చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏ కాలంలోనైనా చర్మం ఆరోగ్యంగా ఉండా లంటే శరీరంలో నీటి పరిమాణం తగినంత తప్పనిసరిగా ఉండాల్సిందే. చర్మకణాలు నిరంతరం వాటిపని అవి చేసుకుపోవాలంటే చర్మానికి నీరు ఎంతో అవసరం. కనుక ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. దీనివల్ల చర్మంలో తేమ నిలకడగా ఉంటుంది. ఎక్కువగా నీరు తాగడం కష్టమనుకుంటే పండ్లరసాలు కూడా తాగొచ్చు.

చలికాలంలో చర్మం తరచూ పొడిబారుతుంది. మత కణాలు పెరుగుతుంటాయి. చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారి అందవిహీనంగా, ముడతలుగా, పొలుసులుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు చర్మానికి మాయిశ్చ రైజింగ్‌నిచ్చే స్క్రబ్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం కప్పు బ్రౌన్‌షుగర్‌, అరకప్పు బాదం నూనె, రెండు టీ స్పూన్ల తేనె, ఒక టీ స్పూన్‌ వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌లను ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకొని ముఖం, చేతులు, భుజాలు, శరీరమంతా వలయాకారంగా రుద్దుతూ మర్దన చేసుకోవాలి. (నువ్వుల నూనెతోకూడా మర్దన చేసుకోవచ్చు.) తర్వాత నలుగుపిండి లేదా శనగపిండితో స్నానం చేయాలి. దీనివల్ల శరీరంలో పేరుకున్న మృతకణా లన్నీ తొలగిపోతాయి. చలికాలంలో మార్కెట్‌ లోకి రకరకాల సబ్బులు వస్తాయి. బజారులో దొరికే సబ్బులతో స్నానం చేయడం శరీరానికి మంచిది కాదు.

ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. చలికాలంలో చన్నీళ్ళతో స్నానం మంచిది కాదు. స్నానపు నీటిలో రెండు చుక్కలు బాదం నూనె వేసుకొని స్నానం చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. పెసలను పిండిగా చేసుకొని దాంతో స్నానం చేస్తే చర్మం నిగారింపు సంతరించు కుంటుంది.

ముఖ్యంగా ఈ కాలానికి తగిన విధంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. విటమిన్లు, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకో వచ్చు. పండ్లు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అనారోగ్యం దరిచేరదు. రోజూ ఏదో ఒక పూట ఆహారంలో పళ్ళను తప్పనిసరిగా తింటే మంచిది.

ఈ కాలంలో పెదాలు పొడిబారుతాయి. పెదాలు పగలకుండా ఉండడానికి ఉదయం, రాత్రి నెయ్యి, పాలమీగడ రాసుకోవచ్చు.

చలికాలంలో చుండ్రు కూడా ఎక్కువగా పెరుగుతుంది. కరివేపాకును కొబ్బరి నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి చల్లార్చి, వడకట్టి వెంట్రుక లకు మర్దన చేసుకుంటే చుండ్రును నివారించడంతో పాటు కేశాలు దృఢంగా, నల్లగా, వత్తుగాను ఉంటాయి.

ఈ కాలంలో పాదాల పగుళ్లు ఎక్కువగా వేధిస్తాయి. తరచుగా పాదాల పగుళ్ళతో బాధపడే వారు ముదురు రంగు బెల్లం ఎక్కువగా తినడం ద్వారా ఉపశమనం పొందొచ్చు.

అన్నిటికంటే శారీరక వ్యాయామం ద్వారా చర్మాన్ని మరింత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు. వ్యాయామం కారణంగా చర్మంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. వ్యాయామ చేయడం ద్వారా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

చలికాలంలో శొంఠి పాలు, అల్లం టీ తాగితే చర్మానికి, శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది.

– కోరుట్ల రేణుక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *