మాటకారితనం

మాటకారితనం

వాక్కు.. అంటే మాటకారితనం. ‘వాక్కే అన్నిటికి కారణం’ అనేది రుషి వచనం. మధురమైన మాటలనే పలకాలని వేదశాసనం. మాట ఎలా ఉండాలనే విషయంపై మన సనాతన ధర్మంలో విస్తృతమైన అంశాలు చెప్పారు. మనం మాట్లాడే మాట తత్కాలానికి చక్కగా ఉండటమే కాదు, శాశ్వతమైన హితం కలిగేలా ఉండాలి. అందుకే సత్యం, ప్రియం, హితం అనే విశేషణాలను వాక్కుకు జోడించారు మన పెద్దలు. మన సంస్కారం, అధ్యయనం, హృదయపు లోతు మనమాట ద్వారానే తెలుస్తాయి. ఈ మాటను సవ్యంగా వినియోగించడమే తపస్సు అని గీతాచార్యుడు అన్నాడు.

ఉద్వేగం కలగకుండా, కలిగించకుండా సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడడం; నిరంతర అధ్యయనం అభ్యాసం చేయడం వాచక తపస్సు (చక్కగా మాట్లాడటం). ‘అల్ప జీవినైనా, అల్ప వస్తువునైనా తృణీకార భావంతో చూడరాదు. ఒకరిపట్ల నువ్వు గౌరవం చూపితే వారు నీ పట్ల గౌరవం చూపుతారు’ అంటారు శ్రీ శారదాదేవి. ‘నీ శత్రువు పరిశీలించినంత నిశితంగా నిన్ను నువ్వు పరిశీలించుకో, అప్పుడు నీ కంటే గొప్ప మిత్రుడు నీకు వేరెవ్వరూ లేరని అర్థమౌతుంది. ఉత్తముడిగా ఎదగడానికి ఇదే మూల సూత్రం’ అంటారు జె.టి.ఆర్‌. ఇది వాచక తపస్సు ద్వారానే సాధ్యమౌతుంది.

తిట్టడం, అవాచ్యాలు పలకడం, కసిరికొట్టడం, పెళుసుతనం, సూటిపోటి చురకలు.. ఇవన్నీ సజ్జనులకు సరికానివి. ఇవి వాచక తపస్సును దెబ్బతీస్తాయి. వాక్కుకి వ్యవహార ప్రయోజనమే కాక మన జీవితాన్నీ, మన చుట్టుపక్కల ఉన్న వారి జీవితాలనూ సక్రమంగా సరిదిద్దగల శక్తి ఉంది.

శ్రీరాముడు మనకు ఆదర్శ పురుషుడు. అతడు అనేకానేక గుణ సంపదలు కలవాడు. అందులో వాక్కు ప్రధానమైనది. శ్రీరాముడు వాక్య విశారదుడని వాల్మీకి పేర్కొన్నాడు. రాముని మాట తీరును ఇలా ప్రస్తుతించాడు. మితభాషీ, ప్రియభాషీ, పూర్వ భాషీ, స్మిత పూర్వ భాషీ, మధురభాషీ. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే రాముడు నవ్వుతూ మాట్లాడుతాడు, మితంగా మాట్లాడుతాడు, తియ్యగా మాట్లాడుతాడు, మృదువైన పలుకులతో సౌమ్యంగా మాట్లాడుతాడు, ప్రీతి కలిగేలా పలుకుతాడు, అహంకారం లేకుండా ఎదుటి వారి కంటే తనే ముందుగా మాట కలిపి మనసులు కలిసేలా మాట్లాడుతాడు. ఈ లక్షణం కలిగిన వారి వాక్కుల వలన స్నేహ సంపద వృద్ధి చెందుతుంది. శత్రువుల సంఖ్య విపరీతంగా తగ్గుతుంది.

ఈ మాటకారితనాన్ని ప్రతి మనిషి భాషా, ప్రాంత, మత, సంప్రదాయ, లింగ బేధాలు లేకుండా అలవరచుకుని ఆచరణలో పెడితే వాతావరణం సౌజన్యపూరితమవుతుంది. రాగద్వేషాలు ఈర్ష్య అసూయలు రూపుమాసి పోతాయి. మంచి అభ్యాసాలతో దుష్ట సంస్కారాలను అణచి వేయవచ్చు.

‘మనం మారితే ఇతరుల్లో కూడా మంచి మార్పు వస్తుంది. మనం పరిశుద్ధులమైతే ఈ ప్రపంచం కూడా పరిశుద్ధమవుతుంది’ అంటారు స్వామి వివేకానంద. రామబాణం లాంటి రామ వాక్కును మన వాక్కుగా అభ్యసించాలి. మంచిని పెంచడానికి, మనసు కలవడానికి, పనిని సాధించడానికి సత్ఫలితాలు కావాలంటే వాక్కే ప్రధానం. ఇది ఆచరణ యోగ్యమైనదే కాని అసాధ్యమైనది కాదు.

మొదటిసారి శ్రీరామచంద్రుడిని హనుమంతుడు కలిసినప్పుడు హనుమంతుని వాక్పటిమను చూసి శ్రీరాముడు ముందు ఆశ్చర్యపోయాడు. మాటకారితనంలో రామునికి సాటి అయిన వాడు హనుమంతుడు. అందువలన అతను వాక్య కోవిదునిగా ప్రతీతుడయ్యాడు. హనుమంతుడిని చూసిన రాముడేమనుకున్నాడో చూడండి – ‘ఈ మాటలను బట్టి ఈ వ్యక్తి వేద వేదాంగాలను క్షుణ్ణంగా చదివేడని తెలుస్తోంది. ఎక్కడా అపశబ్దం లేదు. నాన్చి నాన్చి సాగదీయడం లేదు. అలాగని అతి క్లుప్తత, అస్పష్టత లేదు. అనవసరాలు, అప్రస్తుతాలు లేనేలేవు. ఇలా మాట్లాడితే శత్రువైనా సరే లొంగిపోవలసినదే, ఇటువంటి వానిని మంత్రిగా పొందిన పాలకుడు అదృష్టవంతుడు’.

శ్రీరాముడు ఈర్ష్యా అసూయలు లేకుండా, ఆ మాట తమ్ముడు లక్ష్మణునికి చెప్పి ఆనందించాడు. అలాంటి హనుమంతుడు, శ్రీరాముడు స్నేహితు లయ్యారు. అంతేకాదు హనుమంతుడు రామభక్తుడయ్యాడు.

ఇంతవరకు బాగానే ఉంది. అయితే అందరికి వాచక తపస్సు అలవడాలంటే ఏమి చేయాలి ? కరపత్రాలను పంచితే సరిపోతుందా? బహిరంగ సభలో ఉత్తేజపూర్వకంగా ఉపన్యసించితే ఫలితం లభిస్తుందా? గుడిలో ప్రవచనాలు దీనికి పరిష్కార మార్గమా?

వాక్కులు ఎలా ఉండాలో మొదటి పాఠాలు పిల్లలకు పెద్దలు ఇంటిలో బోధించాలి. ఆ తరువాత విద్యాలయాల్లో కొనసాగాలి. జీవితాన్ని చక్కగా విభజన చేశారు భారతీయ దార్శనికులు. ‘శైశవేభ్యస్త విద్యానాం’ అంటాడు కాళిదాసు. బాల్యాన్ని విద్యాభ్యాసానికి కేటాయించారు. ఆ విద్య ఎలాగుండాలి? విలువలతో కూడి ఉండాలి. బాలురు ముద్దలాంటి వారు. కుమ్మరి వాడు మట్టి ముద్దకు ఆకారాలు ఇచ్చి ఎన్నో వస్తువులు తయారు చేస్తాడు. అలాగే ముద్దలాంటి విద్యార్థిని ఏ విధంగా దిద్దితే అలా తయారవుతాడు. విద్యార్థికి ఆ దశలో విద్యనే తప్ప మరే భోగలాలసనీ నేర్పరాదు. ఈ దశలోనే సత్యం, అహింస, కరుణ, మిత్రత్వం, క్షమ, పరోపకారం వంటి విలువలు గురించి చెప్పాలి. వాటిని జీవితంలో ఆచరించేందుకు ప్రోత్సహించాలి.

మన ప్రాచీన వాఙ్మయంలో ఎన్నో మహత్తర సంఘటనలున్నాయి. వాటిని పాఠ్యాంశాలలో చేర్చాలి. శ్రీరాముడి కథ, శ్రీకృష్ణుడి కథ, వ్యాస వాల్మీకుల కథలు మతపరమైనవి కావు. బాల్యంలో పిల్లలను వాటికి దూరం చేయడం క్షమించరానిది. గుడ్డివారైన ముసలి తల్లిదండ్రులకు సేవ చేసిన శ్రవణ కుమారుని కథలో మతం ఎక్కడ ఉంది? ఈ జాతి పురుషుడు, మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రుని కథలను అన్యమతస్తులు అంగీకరించరని 80 శాతం హిందువులను చిన్న చూపు చూడడం సరియైనదా? బాల్యం అనే భూమిలో నైతిక మూల్యాలు గల ఉత్తమమైన విత్తనం నాటితే అది పెరిగి మొక్కై, చెట్టై మంచి ఫలాలిస్తుంది. అంతేకాని సారవంతమైన భూమిని దున్ని, తగినంత బలం వేసి, నీరుపెట్టి, విత్తనం వేయకుంటే అక్కడ ఫలాలు ఇచ్చే చెట్టు వస్తుందా?

‘ఎన్ని వ్యయ ప్రయాసలనైనా సహించి బ్రహ్మమార్గంలో నడిపించడానికి వెనుకాడని గురువు ఉత్తమ గురువు’ అంటారు శ్రీరామ కృష్ణ పరమ హంస. మనకలాంటి విద్య, అటువంటి గురువులు కావాలి. అప్పుడే విద్య సార్థకమవుతుంది.

– గుమ్మా ప్రసాదరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *