సంతానమిచ్చే సుబ్రహ్మణ్యుడు

సంతానమిచ్చే సుబ్రహ్మణ్యుడు

13 డిసెంబర్‌ సుబ్రహ్మణ్య షష్ఠి ప్రత్యేకం

ప్రతి సంవత్సరం మార్గశిర మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి రోజున ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ జరుపు కుంటారు. దీనినే ‘స్కంద షష్ఠి’ అని కూడా అంటారు. తారకా సురుని సంహరించడానికి శివపార్వతులకు పుట్టిన అవతారమే సుబ్రహ్మణ్యుడు.

తారకాసురుడు బ్రహ్మ ద్వారా వరం పొంది గర్వంతో ఋషుల ఆశ్రమాలను ధ్వంసం చేసి, దేవతలపై దండెత్తుతాడు. కొంతకాలం తర్వాత హిమవంతునికి సతీదేవి (పార్వతి) జన్మిస్తుంది. శివపార్వతులకు కల్యాణం జరుగుతుంది. ఆ నూతన దంపతుల ఏకాంతానికి మన్మథుని ద్వారా భంగం కలిగిలించిన దేవతలు తమకు పిల్లలు కలగకుండా శాపాన్ని పొందుతారు. శివుడు తన శక్తిమంతమైన వీర్యాన్ని పావురం రూపంలో వచ్చిన అగ్నిలో ప్రవేశ పెడతాడు. అగ్నిదేవుడు దానిని తట్టుకోలేక గంగలో విడిచిపెడతాడు. గంగాదేవి కూడా దానిని భరించలేక వాయుదేవుని సాయంతో ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలో ఉంచుతుంది. అక్కడే ఆరు ముఖాలతో, పన్నెండు చేతులతో అవతరిస్తాడు శరవణ (రెల్లుగడ్డి) భవుడు (కార్తికేయుడు). ఆ రోజు మార్గశిర శుద్ధ పంచమి.

ఆరుగురు కృతికల (ఋషి పత్నులు) నుండి ఒకేమారు ఆరు ముఖాలతో పాలు తాగి ఆ శిశువు కార్తికేయుడయ్యాడు. పుడుతూనే నాయకత్వపు లక్షణాలు పుణికిపుచ్చున్నవాడు.

తన తల్లి ఆజ్ఞతో ఆరు వారాల వయసు గల కుమారస్వామి క్రౌంచ పరత్వాన్ని చేధించి అక్కడ దాక్కొని ఉన్న తారకాసురుణ్ణి సంహరించాడు. ఆంధ్ర ప్రాంతంలో పంచారామాల ఆవిర్భావానికి కారుకు డయ్యాడు.

కుమారస్వామికి తిరుత్తణి, స్వామిమలై, తిరు చందూర్‌, తిరుప్పరంగుండ్రం, పళని, పళందిర్‌చోలై అనే ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పళని కొండలు, తిరుచ్చందూర్‌లోనే స్వామి బాల్యం గడిపా డని చెప్తారు. కర్నాటకలోని కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం, ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, మల్లాం, రామకుప్పం, నాగులమడక మొదలైన ఆలయాలు సుప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాలు.

కైలాసంలో వినాయకునికి గణాధ్యక్ష పదవి ఇచ్చినందుకు కుమారస్వామి అలిగి శ్రీశైలం వచ్చి బ్రహ్మచర్య దీక్షను అవలంబించినట్లు, ఆ కారణం చేతనే శివపార్వతులు శ్రీశైలం క్షేత్రంలో వెలిసినట్లు పురాణ కథనం.

ఆయనకున్న ఆరు తలలు జ్ఞానం, వైరాగ్యం, శక్తి, కీర్తి, సంపద, దివ్యత్వం అనే గుణాలకు ప్రతీకలు. ఈ ఆరు తలలు మనిషి అయిదు ఇంద్రియాలు, మనసు అని చెబుతారు. ఇవి ఒకదానితో మరొకటి సమన్వయంగా పని చేసినప్పుడు మాత్రమే మానవుడు అంతులేని శక్తిమంతుడవుతాడు.

కుమారస్వామి వాహనం నెమలి. కోడి పుంజును తన ధ్వజంగా చేసుకున్నాడు. అందుకే ‘కుక్కుట ధ్వజుడు’గా స్వామి ప్రసిద్ధుడైనాడు.

తెలుగు ప్రజలు సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకృతిలో కొలుస్తారు. కుండలినీ శక్తిని యోగులు పాము రూపంలో దర్శిస్తారు. మూలా ధారంలో మొదలైన సర్పాకృతి ఇడ, పింగళనాడుల సంగమ స్థానమైన సుషుమ్న వద్ద పడగ రూపం ధరిస్తుంది. సుషుమ్నకు స్కందుడే అధిపతి. కుమారస్వామి ఇంద్రుని కుమార్తె దేవయానిని, శివముని కుమార్తె వల్లీదేవిని వివాహ మాడాడు.

వారిద్దరూ ఈశ్వరుని ఇచ్ఛా జ్ఞానశక్తులు. అంతేకాదు వల్లీదేవి వ్యవసాయాధిపతి, అరణ్యాధిపతి కుమార్తె. ఈమెను కుండలి శక్తిగా భావిస్తారు. మూలాధారం కుండలికి స్థానం. త్రికోణాకారంగా శక్తికి నిలయంగా ఉంటుంది. ఈ మూలాధార కుండలి నుండి పుట్టిన పార్వతి స్వాధిష్ఠానంలో కలిస్తే శివశక్తుల కలయిక. అప్పుడే సృష్టి జరుగుతుంది. అలా జన్మించిన వాడే కుమారస్వామి.

శుద్ధ షష్ఠి నాడు ఉదయాన్నే స్నానమాచరించాలి. వల్లీ దేవసేన సమేతుడైన సుబ్రమణ్యస్వామిని ఎర్రని పూలతో, ముఖ్యంగా మందార పూలతో పూజించాలి. ఏడు వత్తులతో దీపారాధన చేయాలి. ‘ఓం శ్రీ శరవణభవాయనమః’ అనే మంత్రాన్ని జపించాలి. కందిపప్పుతో నైవేద్యాన్ని సిద్ధం చేయాలి. దానిమ్మ పండును నివేదించడం మంచిది. అష్టోత్తర శతనామా లతో పూజించాలి. పుట్టలో పాలు పోయవచ్చు. సర్వసూక్తంతో అభిషేకం చేయవచ్చు. శరవణభవ అనేది సుబ్రహ్మణ్య షడక్షరి.

సుబ్రహ్మణ్యస్వామికి తేనెతో అభిషేకం చేస్తే తీయని గాత్రం వస్తుందని భక్తుల నమ్మకం.

తీర్థయాత్రలో ఉన్న ముత్తుస్వామి దీక్షితార్‌కు కలలో కనిపించి పటిక బెల్లం నోట్లో వేసి వెళ్లి పోయాడు. తర్వాత ఆయనే కుమారస్వామి అని గుర్తించిన దీక్షితార్‌ తన కీర్తనలన్నింటినీ ‘గురుగుహ’ (గురువైన కుమారస్వామి) అనే పేరుతో రచించారు.

దక్షిణాయనం ప్రారంభంలో ఆడి మాసంలో తమిళులు కృత్తికా నక్షత్రం నాడు ఆడి కృతికా నిర్వహించుకుంటారు. ఆరుఏడైవీడు ఆరు సుబ్రమణ్య క్షేత్రాలలో (తమిళనాడులోని) ఒకటి. ఇక్కడ సుబ్రహ్మణ్యునికి తమ కోర్కెలు తీరడానికి కావళ్లతో (కావిడి) మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా సంతానం కోసం ఇవి చేస్తుంటారు. సుబ్రహ్మణ్యుడు ఇలవేల్పుగా ఉన్న వారందరూ ముఖ్యంగా చిత్తూరు, తమిళనాడులలో ఈ కావిడిలు ఎత్తుతారు. ఇవి చాలా రకాలు. పాల కావిడి, నెమలి కావిడి, వడ్డి కావిడి, పన్నీరు కావిడి, కార్‌కట్‌ కావిడి, వెండి కావిడి మొదలైనవి.

అరుణాచల రమణులు సుబ్రహ్మణ్యుని అవతారం అని కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని అన్నారు. ఆర్త జన రక్షకుడైన సుబ్రహ్మణ్యుడు భూమ్మీద సద్గురువుల రూపంలో కూడా సంచరిస్తుంటాడని ప్రతీతి.

ఓ శరణాగతవత్సల !

కాశవన ప్రభవ ! దీనకల్పక ! యాప

న్నాశకర ! దురితగిరి దే

వేశ ననుం గరుణజొడవే ! సుఖినగుదున్‌!

– సత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *