నక్షత్రాలకు గమనం ఎట్లా వచ్చింది?

నక్షత్రాలకు గమనం ఎట్లా వచ్చింది?

ఈ నక్షత్రాలు ఎందుచేత పరిభ్రమిస్తు న్నాయి? ఎందుచేత రాలిపోవు, కూలిపోవు? తమచుట్టూ తాము తిరుగుతూ ఇంకొక నక్షత్రం చుట్టూ తిరగడమేమిటి? అట్లా తిరగడంవల్ల ఏ ఫలితాలు సంభవిస్తున్నాయి? నక్షత్ర గమనం చేత చెట్లూ మొదలైన వస్తువులు ఎందుచేత తీవ్రంగా చలించవు? ఇట్లాంటి సందేహాలు, ప్రశ్నలూ ఈ సందర్భంలో ఉదయించక మానవు.

నక్షత్రాలు పరిభ్రమించే మార్గం గురించి చెప్పాను. తర్వాత ఎందుచేత పరిభ్రమిస్తున్నాయి అనేది విచారించాలి. ముందు విశ్వంలో నక్షత్రాలు పుట్టి, కొంతకాలం నిశ్చలంగా మన ఇంట్లో దీపాల్లా ఉండి, తర్వాత పరిభ్రమించటం ప్రారంభించాయా అని ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ ప్రశ్నలోనించి అసలు నక్షత్రాలు ఎట్లాపుట్టాయి? అంటూ ఇంకా కొన్ని ప్రశ్నలు వస్తాయి, వాటిని గురించి, విపులంగా తర్వాత ఆలోచిద్దాము. కానీ ప్రస్తుతానికి నక్షత్రాలు అణువుల నుంచీ అణువులు ఎలెక్ట్రానులు ప్రోటాన్ల నుంచి పుట్టాయని తెలుసుకుంటే చాలు-సునిశితంగా పదార్థం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని గురించి విజ్ఞానం పెంపొందిన తర్వాత నక్షత్రాల భ్రమణాన్ని బట్టి నక్షత్రాలు ఎట్లుద్భవించాయి? ఎట్లా విశ్వం పుట్టింది? అనే ప్రాథమిక ప్రశ్నలు తేల్చుకుంటూ విశ్వం యొక్క ఆదిమ చిత్రాన్ని శాస్త్రజ్ఞులు నిర్మించారు. మానవ విజ్ఞానాభివద్ధి చరిత్రను పరిశీలిస్తే అనేక నూతన సత్యావిష్కరణ సందర్భాల్లో బుద్ధేంద్రియ పురోగమనం ద్యోతకమవుతూ ఉంది. అంటే బుద్ధి ముందుగా ఒక విషయాన్ని గురించి ఊహించిన తర్వాత ఆ పద్ధతిననుసరించి పరిశోధన జరుపగా ముందుగా ఊహించిన సత్యం నిజమని ఋజువు కావటం తటస్థిస్తూ ఉంది. అందుచేత నక్షత్రాలు అణువుల్లోనుంచి పుట్టిన సమయంలో మనం జీవించి ఉండి కళ్లారా చూడకపోయినా, బుద్ధీంద్రియ సహాయంతో సత్యాన్ని తెలుసుకోవచ్చు. కళ్లతోచూస్తే ఎంతో, బుద్ధితో తెలుసుకున్నా అంతే, రెంటి ప్రయోజనమూ తెలుసుకోవడమే కదా.

కళ్లతో చూడటం బుద్ధి తెలుసుకోవటానికే; అనగా బుద్ధికి కళ్లు సహాయ పడుతున్నాయన్నమాట. కానీ, కేవలం కళ్లమీదనే ఆధారపడేవి బుద్ధీంద్రియం లేని మానవేతర ప్రాణులు, మానవుడికి కళ్లకంటే బుద్ధి ప్రధానం. దాన్ని ఎక్కువ ఉపయోగించడమే అతని విశిష్టత. అందుచేత నక్షత్రాలు పుట్టినపుడు నీవున్నావా, నీవు చూశావా? అనటం, నీవెందుకు మానవుడుగా ఉన్నావు? నీవు మగంగా ఉండ కూడదా? అనటంతో సమానం. చూచినా, తెలుసు కున్నా, ఒకటేనని ముందే చెప్పాను. ఈ మార్గాను సారంగా నక్షత్రాల పుట్టుకనుగూర్చి విచారిస్తే నక్షత్రాలు, వాటి భ్రమణాలు అణువులలోని ప్రోటాన్ల చుట్టూ, ఎలెక్ట్రాన్లు తిరిగే పద్ధతిని బట్టే వచ్చి ఉంటాయి. అంటే నక్షత్రాలకు ముందున్న అణువులు ఒక సూర్య కుటుంబం లాంటివని అభిప్రాయం. సూర్య కుటుంబంలో సూర్యుడు కేంద్రంగా ఉన్నట్లే అణువులో ఒక కేంద్రము, ఆ కేంద్రం చుట్టూ ఎలెక్ట్రానులూ, సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే తిరుగుతూ ఉండడమా-ఇదిట్లా ఉండగా నక్షత్రాలు తమచుట్టూ తాము తిరుగుతూ కేంద్రం చుట్టూ తిరిగే గ్రహాల్లా నక్షత్ర పూర్వ అణువులు తమ చుట్టూ తాము తిరుగుతూ ఇంకో కేంద్రం చుట్టూ తిరిగేవి అనుకుంటాను. ఆదిమ విశ్వశూన్యంలో ఉండిన అసంఖ్యాక అణువులు, అసంఖ్యాక కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉండవచ్చును. లేదా అణువులు కేందాల చుట్టూ తిరుగుతూ ఉండకపోయినా వలయాకారంగా తిరిగే స్వభావమైనా అట్లా తిరుగుతూ ఉన్న అణువులు కలసి నక్షత్రం అయ్యేటప్పటికి వ్యక్తిగతమైన వలయభ్రమణం అణువుల సముదాయమైన నక్షత్రానికి కూడా తప్పనిసరిగా సంక్రమిస్తుంది.

ఏది ఎట్లా ఉన్నా: ప్రకతి ప్రాథమిక సూత్రాల్లో ఒక దానిని న్యూటన్‌ సిద్ధాంతం విశదం చేస్తుంది. ఏ వస్తువైనా గమనంలో ఉన్నా, నిశ్చలంగా ఉన్నా, ఉన్నస్థితి నుంచి ఆ వస్తువు రెండవ స్థితిలో అంటే నిశ్చలత నుండి గమనానికి గాని, గమనం నుంచి నిశ్చలతకుగాని, మారాలంటే మరొక శక్తి అందుకు గాను ఆ వస్తువుమీద పనిచేయాలి. లేకపోతే గమనంలో ఉన్న వస్తువు గమనంలోనే ఉంటుంది, నిశ్చలంగా ఉన్న వస్తువు నిశ్చలతలోనే ఉంటుంది. ఈ సూత్రాన్ని బట్టి చూస్తే గమనంలో ఉన్న అణువుల నుంచి, గమనంలో ఉండగానే నక్షత్రాలు ఉత్పన్న మైనప్పుడు ఈ నక్షత్రాలు కూడా గమనంలోనే ఉండాలి అని విశదమవుతుంది. దీన్ని బట్టే గమనంలో ఉన్న నక్షత్రాలు, వాటికి ఆ గమనం ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నకు దోహదం కలిగించి, వాటికి పునాది రాళ్ళయిన అణువులు గమనంలోనే ఉండితీరాలి, అనే సత్యావిష్కరణకు దారి తీస్తాయి.

ఈ సూత్రమే నక్షత్రాలు రాలిపోకుండా, కూలిపోకుండా శూన్యాకాశంలో అట్లాగే నిరంతరం పరిభ్రమిస్తూ ఉండటానికి కారణం అయింది. భూమి మీద వస్తువులు పడిపోవటానికి కారణం భూమ్యా కర్షణ శక్తి, వాతావరణ పీడనశక్తి, వగైరా అనేక శక్తులు భూమి మీద వస్తువులపై పనిచేస్తుంటాయి. కానీ, ఆకాశశూన్యం అంటే భూమి మీద కాని, ఏ నక్షత్రం మీద కానీ, మనం ఎరిగిన ఏలాంటి శక్తులూ లేని సంపూర్ణ శూన్య ప్రదేశం. అట్లాంటి ప్రదేశంలో పెట్టిన వస్తువు పెట్టినట్లే ఉండాలి న్యూటన్‌ సూత్రం ప్రకారము. అంటే నిశ్చలంగా ఉన్నది, నిశ్చలంగానే ఉంటుంది, గమనం ఉన్నది, గమనంలోనే ఉంటుంది. నక్షత్రాలు పుట్టుకతోనే గమనంలోనే ఉన్నాయి కాబట్టి నిరంతరం గమనంలోనే ఉన్నాయి, ఉంటాయి. మనం భూమి మీద పైకివేసిన వస్తువులు క్రింద పడటం చూచి నక్షత్రాలను కూడా అట్లాగే అనుకోవటం అజ్ఞానం.

భూమి మీది వస్తువులు భూమియొక్క అయస్కాంత శక్తికి లోబడి ఉన్నాయి. (భూగోళం ఒక అయస్కాంతం.) అందుచేత పైకి విసిరితే భూమి అయస్కాంత శక్తి క్రిందికి లాగడంచేత క్రిందకు పడతాయి. కానీ, అట్లాంటి ఏ శక్తీ లేనిదే ఆకాశ శూన్యం అని ముందే అన్నాను. అందుచేత ఆ శూన్యంలో ఉండే నక్షత్రాలు భూమికిలాగే కేంద్రాకర్షణ శక్తి ఉండటం సహజం. కనక ఆకాశశూన్యం అంటే నక్షత్రాలూ వాటి కేంద్రాకర్షణ సీమలు. అలాంటి కేంద్రాకర్షణ సీమలు దాటిన తర్వాత, అంటే నక్షత్రాలు వాటి కేంద్రాకర్షణ సీమలు దాటిన తర్వాత, అంటే నక్షత్రాలు, వాటి క్షేంద్రాకర్షణ సీమలు ఈ రెంటిని మినహాయిస్తే మిగిలిన ప్రదేశం నిజంగా శూన్యం. కంటికి ఏదీ కనిపించని మాత్రం చేతనే శూన్యం కాదు.

మరి ఇంతవేగంగా ఉన్న భూభ్రమణంచేత భూమి మీది చెట్లు చేమలు ఎందుచేత తీవ్రంగా చలించవు అనే సంశయం రావచ్చును. భూమి మీది చెట్లు మొదలైన వస్తుజాలము వాతావరణంలోని గాలి, దాని యొక్క సంచలనం చేతనే చలిస్తాయి కాని, భూభ్రమణం మూలంగా చలించవు. దీనికి కూడా కారణము ముందు చెప్పిన సూత్రమే. భూమి శూన్యంలో తిరుగుతూ ఉంది. అందుచేత భూమి యొక్క వాతావరణ మండలము యొక్క హద్దులు శూన్యంలో ఉంటాయి. శూన్యంలో ఏదీ ఆ సరిహద్దు లను ముట్టుకునేదీ, మార్చేదీలేదు. (న్యూటన్‌ సూత్రం) అందుచేత వాతావారణంలోని గాలియొక్క సంచలనం చేతనే చెట్లువగైరా వస్తుజాలం చలిస్తుంది గానీ భూభ్రమణం యొక్క తీవ్ర వేగం వాటి పై పనిచేయదు. అట్లా కాకుండా పనిచేసి ఉండేట్లయితే వాతావరణపు పొర, చెట్లు, కొండలు, మేడలు మొదలుకొని, కాలక్రమంగా భూమి అంతా ఈ పాటికి ధూళి అయిపోయేది. వ్రాయడానికి నేనుండే వాడ్ని కాను; చదవటానికి మీరుండేవారు కారు.

నక్షత్ర సంచార కేంద్రాలు : తద్భవశక్తులు

తమలోతాము తిరుగుతూ ఉండే ప్రాథమిక స్వభావం చేతనే నక్షత్రాలకు వలయాకారంగా ఇంకా పెద్దదైన గమనం చెయ్యడమనే ద్వితీయ స్వభావం అంకురించి ఉండాలి. ఈ రెండు స్వభావాలూ అణువు నుంచే వచ్చి ఉంటాయి. ఒక వస్తువు అతివేగంగా తనలో తాను తిరుగుతూ ఉన్నప్పుడు ఈ భ్రమణ వేగంచేత ఆ వస్తువు కొంచెం ముందుకు జరుపబడటమూ, ఆ జరిగిన పద్ధతి వక్రరేఖా మార్గంగా ఉండడమూ అసమంజసం కాదు. ఇట్లా ఆ వస్తువు కొంచం కొంచంగా వక్రరేఖా మార్గంలో జరుగుతూ పోగా మొత్తం మార్గం యొక్క స్వరూపం వలయం అవుతుంది కదా? అందుచేతనే తమ చుట్టూ తాము తిరిగే వస్తువులు లేక నక్షత్రాలు, ఇంకొక కేంద్రం చుట్టు వలయాకార మార్గంలో సంచరిస్తూన్నాయి. నక్షత్రాలు ఇతర కేంద్రం చుట్టూ తిరిగేటప్పుడు సమగ్ర వలయంగా కాకుండా కోడిగ్రుడ్డు వలయంలో తిరుగుతున్నాయి. ఈ మార్పు నక్షత్రాల ఆకర్షణ సీమల యొక్క పరస్పర ప్రభావం వల్ల వచ్చి ఉండవచ్చు. అంటే అసలు సమగ్ర వలయంగా ఉండవలసిన నక్షత్ర గమనం అకర్షణ సీమల పరస్పర ప్రభావం వల్ల కొంచెము నొక్కబడి కోలగా తయారయి ఉండవచ్చు.

ఇంతవరకూ భూమి మీద మానవుడు విశ్వంలో ఎక్కడ ఉన్నాడో ఏవి ఏ దిక్కున ఉన్నాయో అని ఊహించడం కష్టమనీ దిక్కు అనేది విశ్వంలో లేదనీ మానవుడి యొక్క విశ్వ పరిసరాల్ని గురించి తెలిసిన తర్వాత, విశ్వపరిసరాల్లో ఉన్న నక్షత్రాలు సము దాయాలుగా సంచరిస్తున్నాయని, వాటి సంచార మార్గాలను గురించి, వాటి సంచార కారణాన్ని గురించి చెప్పాను. తర్వాత ఈ నక్షత్రాలు స్వీయ కేంద్రం, పరకీయ కేంద్రం అనే ద్వివిధ కేంద్రాల చుట్టూ చేసే భ్రమణం మూలాన సంభవించే ఫలితాన్ని వివరించి తర్వాత, తత్ఫలితంగా ఏర్పడే సమష్టి విశ్వచిత్రాన్ని విశదం చేస్తాను. ఈ అభిప్రాయా లన్నీ మొత్తం మీద ఈనాడు మనకు ఉపలబ్ధమైన ప్రామాణిక శాస్త్ర విజ్ఞానాన్ని నెమరు వేస్తే తదాధారంగా ఉత్పన్నమైనవే. ఈ అభిప్రాయాలు మాత్రం ఇతర గ్రంథాల్లో లేకపోవచ్చు. నావే కావచ్చుకూడాను. అయితే ఉన్న విజ్ఞాన సమాచార సాగరంలో బుద్ధీంద్రియ మందరాన్ని పెట్టి, చిలికితే నూతన భావ వీచికలు ఉద్భవించవచ్చు. మథనం యొక్క ఫలితం ప్రమాదవశాన హాలాహల జ్వాలా దూషితం కూడా కావచ్చు. కానీ ఆ విషయం నిమర్శనాదష్టులైన పాఠకులకే వదలివేస్తాను.

నక్షత్రాలకు విద్యుదయస్కాంత స్వభావమూ, కేంద్రాకర్షణ స్వభావమూ అని రెండున్నాయి. ఒకటి ఇంగ్లీషులో వశ్రీవష్‌తీశీఎaస్త్రఅవ్‌ఱరఎ అనీ, రెండవది స్త్రతీaఙఱ్‌a్‌ఱశీఅ అనీ అంటారు. విశ్వంలో ఉన్న నానావిధశక్తులకన్నిటికీ విద్యుదయస్కాంతశక్తి మూలము -అంటే అణువులను దగ్గరకు చేర్చి గట్టిగా పట్టుకుని ఉండి పదార్థాల్లో ”వాయు, ద్రవ, ఘన” అనే త్రివిధ భేదాలను కల్పించే శక్తులు. ఇంకా అనేక శక్తులు విద్యుదయస్కాంత శక్తినుంచే వచ్చాయి, అని ప్రస్తుత శాస్త్ర విజ్ఞానానికి స్పష్టంగా తెలుసు. కానీ ఆకర్షణ శక్తి అనేది, విభిన్నంగాను విశిష్టంగాను ఉంది. ఆకర్షణశక్తి గోళం యొక్క కేంద్రంవైపు ప్రబలంగా లాగుతుంది.

కేంద్రాకర్షణ శక్తి, గోళం స్వకీయ కేంద్రం చుట్టూ తాను తిరుగుతూ ఉన్నందువల్ల ఉద్భవించిందనీ, విద్యుదయస్కాంతశక్తి గోళం పరకీయ కేంద్రంచుట్టూ తిరిగినందుచేత వచ్చిందని అనుకొనడం సమంజస మని నా అభిప్రాయం. మొత్తంమీద ఈ రెండు శక్తుల స్వభావం బాహ్యానికి భిన్నంగా కనుపించినా, రెండూ ఆదిలో ఒకటే అనుకోవాలి. రెండూ భూభ్రమణం నుంచే ఉత్పన్నమయ్యాయి.

గుంటూరు శేషేంద్రశర్మ ఇతర పుస్తకాల వివరాలకు :

Saatyaki S/o Seshendra Sharma , saatyaki@gmail.com ,
9441070985 , 7702964402

9441070985 , 7702964402

–  గుంటూరు శేషేంద్రశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *