ఆధ్యాత్మిక పరిభాషలో అంతరంగాల విశ్లేషణ

ఆధ్యాత్మిక పరిభాషలో అంతరంగాల విశ్లేషణ

ఆ మహాకావ్యాలు అక్షరబద్ధమై కొన్ని శతాబ్దాలు గడిచిపోయాయి. క్రీస్తుపూర్వం 400 ప్రాంతంలో ఆ గాథలు కావ్యరూపం దాల్చాయని కొందరి వాదన. అయినా 21వ శతాబ్దంలో కూడా ఆ మహా కావ్యాలు- రామాయణం, మహాభారతం, భాగవతం భారతీయులను రంజింప చేస్తూనే ఉన్నాయి. ఇరవై నాలుగువేల శ్లోకాల రామాయణం ఇప్పటికీ పఠనీయమే. లక్ష శ్లోకాల భారతం ఆరాధనీయ గ్రంథమే. ఆ ఇతిహాసాలతో ప్రభావితం కాని నేల భారత భూమిలో అంగుళమైనా కానరాదు. ఒక అంశాన్ని తాత్వికంగా చెప్పాలన్నా, భారతీయమైన శైలితో చెప్పాలన్నా, ఈ దేశంలో ఏ మూలన ఉన్నవారికైనా అర్థమయ్యేటట్టు చెప్పాలన్నా ఆ మహా కావ్యాలను ఆశ్రయించక తప్పదు. మంచినీ, చెడునీ, శాంతాన్నీ, తంత్రాన్నీ, మంత్రాన్నీ దేనినైనా, ఏ విలువనైనా, ఏ ఔన్నత్యాన్నయినా, ఆఖరికి ఏ పతనాన్నయినా రామాయణ, భారతాలను ఉటంకిస్తూ చెబితే వెంటనే హత్తుకుంటుంది. గుండెను తాకుతుంది. ఇన్ని శతాబ్దాలలో మళ్లీ మళ్లీ ఆ గ్రంథాలను మార్పులతో, చేర్పులతో ప్రాంతీయ భాషలలోకి కవులు రాసుకుంటూనే ఉన్నారు. ఆధునిక మాధ్యమాలు కూడా ఇందుకు మినహాయిపు కాదు. రంగస్థలం మీద, వెండితెర మీద, బుల్లితెర మీద ఆ మహా కావ్యాలే ఇతివృత్తాలుగా కళారూపాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. కావ్యాలుగా, సంస్కృతంలో అజరామర సాహిత్య రూపాలుగా ప్రపంచ ఖ్యాతి గాంచిన వీటి గొప్పదనం ఏమిటి? ఎందుకు? అవి ధర్మం గురించి, ధర్మపథం గురించి అనన్య సామాన్యంగా విశ్లేషించాయి. ధర్మమే ఈ మట్టికి ఆలంబన.ఈ నేలకీ, ఆ కావ్యాలకీ మధ్య అంతటి బంధం అందుకే. ఆ గొప్ప పాత్రలు, వాటి మనస్తత్వాలు ఇదే చెబుతాయని, అర్థం చేసుకుంటే ఈ సంగతి తెలుస్తుందనీ అంటున్నారు డాక్టర్‌ శివరామకృష్ణశర్మ.

రామాయణంలో శ్రీరామునికి తాను అవతారమూర్తినని తెలుసు. కానీ సామాన్య మానవునిడిలా నటించి, సీతావియోగానికి దుఃఖించినట్లు కనబడి సహజ మానవ ప్రకృతిని, సతి పట్ల పతి ధర్మాన్ని నిరూపించాడు. కుమారునిగా, సోదరునిగా, పతిగా, రాజ్యపాలకునిగా, ఒక స్నేహితునిగా వివిధ రీతుల ధర్మాలను ప్రబోధించేదే రామతత్త్వం. సత్యవాక్పరిపాలన, పితృవాక్య పరి పాలన, ఏకపత్నీ వ్రతం వంటి ధర్మాలను లోకానికి చాటేందుకు అవతరించినవాడు రాముడు. నిజానికి ప్రాచీన భారతీయ ఇతిహాసాలన్నీ కూడా మానవతా విలువలను చాటేవే. కామం వల్ల పతనం తప్పదని నిరూపించినది రామాయణం. రామునికంటే అధిక విద్యలందు ఆరితేరి, శివభక్తుడై, మహా బలిశాలియై, సువర్ణమయమైన లంకకు అధిపతియైన రావణుడు కామంచేత ఏ రీతిగా తన ప్రాణాన్నీ రాజ్యాన్నీ వంశాన్నీ కోల్పో యింది వర్ణించింది రామాయణం.

ఒక క్రోధం మానవుణ్ణి ఏ రీతిగా పతనం గావిస్తుందో తెలియచేస్తుంది భాగవతం. కంస, శిశుపాల, దంతవక్త్ర హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అస్త్రశస్త్ర పారంగతులై, తపోధనులై, మహాశక్తి సంపన్ను లైనప్పటికీ భగవంతుడి మీద ప్రేమకు బదులు క్రోధాన్ని ద్వేషాన్ని పెంచుకోవడం చేత దుర్మరణం పాలయ్యారు.

మూడవది మహాభారతం. ధనబలం, జనబలం, భుజబలం, బుద్ధిబలం ఎంతగా ఉన్నప్పటికీ కౌరవులు నూరుమందీ నామరూపాలు లేకుండా హతులైనారు. నూర్గురు పుత్రులు కల్గిన ధృతరాష్ట్రునకు చివరికి పిండం విడిచేవారు కూడా లేకుండా పోయారు. దీనికి కారణం? లోభం. రాజ్యం పాండురాజుది. కానీ కౌరవులు లోభం చేత పాండవులకు అర్ధరాజ్యం కూడా ఇవ్వ నిరాకరించారు. ఐదూళ్లు, కాదు సరికదా, కనీసం సూదిమొన మోపేటంత భూమిని కూడా ఇవ్వమన్నారు. అంతేకాదు ధర్మపరులైన, మహా భక్తులైన, పాండవులను వధించడానికి కూడా సిద్ధపడ్డారు. దీనికంతటికీ లోభమే కారణం. ఈ ప్రకారం కామక్రోధలోభములు మానవుణ్ణి ఎన్ని ఉన్ననూ ఏ రీతిగా పతనం గావించలగలవో రామాయణ, భాగవత, భారతాలు ప్రకటిస్తున్నాయి.

భారతం – అంతరార్థం

దుర్గుణాలు కౌరవులు. ఇక సద్గుణాలని చెప్పే సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస- ఈ ఐదు పంచపాండవులు. దుర్గుణాలు అనే కౌరవులు లెక్కలేనంతమంది ఉన్నారు. ఇక యుద్ధం! వారికీ, వారికీి ప్రతిఒకరి హృదయాకాశం కిందే చిత్తభూమిలో జరుగుతున్నది.

అజ్ఞాని అయిన అంధుడే ధృతరాష్ట్రుడు. సుజ్ఞాని అయిన పాండురాజే సద్గుణముల తండ్రి. వివిధము లైన అనేక భావాలే ప్రజలు. దశేంద్రియాలే సైన్యం. పంచేంద్రియములే రథాలు. అలాంటి సైన్యంతో ప్రజలలో ప్రతి ఒక్కరి హృదయంలోను నిత్యం పాండవులూ కౌరవులనే సద్గుణ దుర్గుణాలు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఆ రెండింటికి మధ్యవర్తి అయిన కృష్ణపరమాత్మ ఆత్మ అనే పేరుతో సాక్షీభూతుడై ఉన్నాడు. జీవితసారథే అతడు. అస్థి పంజరమే హస్తినాపురం. ఇందులో రాజులే అజ్ఞాని, సుజ్ఞాని. వ్యామోహాలే ప్రజలు. ఎప్పుడు దుర్గుణ సద్గుణాలు ఒకటై గుణ రహితులు కాగలరో అప్పుడే శాంతి ఏర్పడుతుంది. వ్యామోహాలు మమకార అహంకా రాలు లేకుండా చేసుకుని శాంతితో ఉండవచ్చును.

రామాయణం – అంతరార్థం

ఆత్మే రాముడు. జీవుని వేషంతో దేహశస్త్ర ధారియై వచ్చినాడు. బ్రహ్మజ్ఞాన చైతన్యం సీత అనే పేరుతో పుట్టినది. జీవి బ్రహ్మజ్ఞానాన్ని సీతను పోగొట్టుకోవడం వల్ల అంధకారంలో అడవిలో సంచరించక తప్పదన్న అర్థాన్ని చూపించడానికి రాముడు అలా (దుఃఖం) నటించినాడు. మనస్సు లక్ష్మణుడు. దీనత్వం వాలి. వివేకమే సుగ్రీవుడు. ధైర్యం హనుమంతుడు. మోహం సాగరం. రాముడు మోహాన్ని అధిగమించిన తక్షణమే రజోగుణ తమోగుణాలనే రావణ కుంభ కర్ణులను చంపివేశాడు. మిగిలిన చిన్న తమ్ముడైన విభీషణుడు సత్వ గుణం. అతనికే పట్టం కట్టాడు. అనుభవజ్ఞానమైన సీత అనే చైతన్యాన్ని చేరుకున్నాడు. పట్టాభిషేకం జీవన్ముక్తి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలనే దశేంద్రియాలే దశరథుడు. పరమాత్ముడికి సత్య ధర్మ శాంతి ప్రేమలే నాలుగు ముఖములు. ఆ నాలుగు ముఖములే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. శ్రీరాముడు సత్య స్వరూపుడు. భరతుడే ధర్మ స్వరూపుడు. లక్ష్మణుడే ప్రేమ స్వరూపుడు. ఈ మూడింటి జాడలలో నడిచిన శతృఘ్నుడే శాంత స్వరూపుడు. కౌసల్య సత్వగుణం. కైక రజోగుణం. సుమిత్ర తమోగుణం.

సామాన్య మానవులు సులభంగా గ్రహించలేరని వారికి బోధించడానికే పరమాత్ముడు ఇన్నిన్ని రూపాలతో ఇంత రామాయణాన్ని ఈనాటి మానవ హృదయ రంగంలో గుణరూపాలతో సూక్ష్మ రామాయణం వలెనే జరుపుతున్నాడు.

భాగవతం – అంతరార్థం

గుణం, ఇంద్రియం, మనస్సు, చిత్తం అన్నింటికి అతీతమైన ఆత్మకు ఉన్న రూపాలు శక్తి సామర్థ్యాలు, వాటి లీలలే భాగవతం. అన్నింటికి సాక్షిగా ఉన్న వాని అవతార కథలనే భాగవతం అంటారు. అతను (భగవంతుడు) సర్వ స్వరూపి. అతని రూపాలకు హద్దు లేదు. కాని ప్రకృతికి గోచరించేటట్టు చెప్పా లంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, రామ, కృష్ణ అవతారాలు. లోక సృష్టి స్థితి లయాల కోసం దుష్ట శిక్షణల కోసం ఆయా కాలాలలో తాను ఏయే రూపంలో పోయిన తన సంకల్పకార్యాలు జయప్రద మవుతాయో తలంచుకొని ఆయా రూపాలలో తనను తాను సృష్టించు కొంటాడాయన. ఆ కార్యం పూర్తి కాగానే తిరిగి ఆత్మ స్వరూపుడుగానే ఉండిపోతాడు. భాగవతమే సాధకులకు అవసరం. అందులోనే భగవంతుని నిజమైన మర్మాలు, నిజమైన మహాత్మ్యములు, నిజమైన మార్గాలు దర్శనమిస్తాయి.

పురాణాలు

పురాణం పంచ లక్షణమంటారు. అంటే వాటిలో చారిత్రక సంబంధమైనవి, సృష్టి క్రమ సంబంధములైనవి, తాత్విక సిద్ధాంతాలను విశదీకరించే సాంకేతికోదాహరణ రూపమైనవి ఎన్నో విషయాలు ఉంటాయి. వేద విషయాన్ని సామాన్య మానవులకు అర్థమయ్యేటట్టు చెయ్యడానికే వీటిని రచించారు. వేదభాష అత్యంత ప్రాచీన రూపమైనది. మహామహా విద్వాంసులలో కూడా ఏ కొద్దిమంది మాత్రమే వీటి రచనా కాలం గురించి నిర్ధారణకు రాగలరు. పురాణాలు ఆ కాలపు జన సామాన్యం వాడిిన భాషలో రాశారు. మనమిప్పుడు ఆధునిక సంస్కృతం అని వ్యవహరిస్తున్న భాష అది. హిందూ మత సనాతన ధర్మాల గురించి ఉదాహరణలతో చెప్పడానికి మహా రుషులు పురాణాలను నిర్మించారు.

వేదాలలోని సంక్షిప్త వచనాలకు వ్యాఖ్యానం చెబితే ఆ వ్యాఖ్యానాలనే పురాణమని అంటారు. పురాణాలు అసంఖ్యాకం. కాని ప్రస్తుతానికి పద్దెనిమిది పురాణాలు, 18 ఉప పురాణాలు, పద్దెనిమిది ఉపోప పురాణాలు లభ్యమవు తున్నాయి. ఇవే ప్రసిద్ధి కెక్కాయి. వీటన్నింటిని వ్యాసుల వారే సంగ్రహించారు. ఈ పురాణాలకు పది లక్షణాలు ఉంటాయి. అదే ఉప పురాణాలయితే ఐదు లక్షణాలు ఉంటాయి. ఆ దశ లక్షణములు ఏవి? సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశానుచరితము, నిరోధము, ముక్తి, ఆశ్రయము అని. ఈ పదిలోను ఆశ్రయము ప్రధానమైనది.

పురాణాలు మానవత్వాన్ని ఆదర్శాన్ని దివ్యత్వాన్ని జీవన విధానాన్ని గమ్యాన్ని భారతీయ సంస్కృతిని నిరూపించునట్టివి. మానవతా విలువల ప్రమాణాన్ని, వాటి లోపం వల్ల కలిగే నష్టాన్ని వివరించునట్టివి; ఆత్మ తత్త్వమును నిరూపించు నట్టివి. కానీ ఈనాటి పండితులు వాటికి విపరీతార్థాలు తెలిపి అనర్థాలు కలిగిస్తున్నారేగాని యథార్థాన్ని అంతరార్థాన్ని తెలిపే వారు లేరు. అందుచేత వాటిని సరిగా గ్రహించేవారు లేరు. నాటి పురాణ కథలు, భారతీయ చరిత్రలు ఆధ్యాత్మిక జ్యోతులు. మానవుణ్ణి దైవానికి చేర్చే సనాతన సారథులు, వారధులు, ఈ పురాణాలు. భగవంతుడు జగన్నాటక సూత్రధారి. తానే ఈ జగన్నాటకమును రచించి, దర్శకుడైయుండి, పాత్రధారియై తన పాత్రను ఔచిత్యముగా పోషించిన విధానాన్ని ఈ పురాణాలు చక్కగా వెల్లడిస్తాయి.

పురాణాల సారాంశం

వ్యాసుడు పద్ధెనిమిది పురాణాలు రాసాడు. వీటిని చదవడానికి సమయం చిక్కుతోందా? కనుక ఈ పద్ధెనిమిది పురాణాల సారాంశాన్ని రెండు వాక్యాల్లో చెప్పాడు.

”అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం

పరోపకారః పుణ్యా పాపాయ పరపీడనం”

అందరికి సహాయం చేయండి. ఎవ్వరినీ బాధించకండి. ఇవే మీ లక్ష్యాలు కావాలి. అపకారం ఎప్పుడూ చేయకు. చేతనైనంత ఉపకారం చెయ్యి. ఇది నీ ధర్మం. ”సహస్ర శీర్షాపురుషః సహస్రాక్షస్సహస్రపాత్‌” అన్ని శిరస్సులు అన్ని నేత్రాలు అన్ని పాదాలు భగవంతునివే. కనుక ఎవరిని బాధించినా భగవంతుని బాధించినట్లే అవుతుంది.

– డాక్టర్‌ చిర్రావూరి శివరామకృష్ణశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *