ఆశే శూర్పణఖ, క్రోధమే మంధర

ఆశే శూర్పణఖ, క్రోధమే మంధర

వాలి వధ, అహల్య కథ, సీతా పరిత్యాగం, శ్రీకృష్ణుని రాసలీల, తారాశశాంక కథ, మహర్షుల శాపకథలు, పాంచాలి పంచభర్తృకం వంటి అనేక గాథలు పైకి అనౌచిత్యాలుగా కనిపిస్తాయి. కానీ సమ్యక్‌ దృష్టితో ఆలోచించే వారికి ఇవన్నీ కూడా సరియైనవే. అనౌచిత్యాలు కావు. గురుదేవతా భక్తి గలవారికి, శ్రద్ధా విశ్వాస సంపూర్ణులకి వాటిలో మహత్వ పరిపూర్ణమైన అర్థాలే కనిపిస్తాయి. కాని దృష్టి లోపం ఉన్నవారికి వాటి నిండా దుష్టార్థమే కనిపిస్తుంది.

కొందరికి రామాయణం విషవృక్షం. మరికొందరకి అది అమృతసాగరర. నిజంగా ఎంత దృష్టి వ్యత్యాసం! భారతం ‘బొంకు’ రామాయణం ‘రంకు’ అంటూ ఉంటారు నాస్తికులు. అయితే వారు మాత్రం ఆ క్షీరసాగరంలోకి ప్రవేశించరు. అమృతాన్ని గ్రోలరు. రాక్షసులకి క్షీరసాగర మథనంలో అమృతం సిద్ధించలేదు కదా! భారతం లేదా రామాయణం- వాటికి ఆధ్యాత్మికములైన అంతరార్థాలు ఉన్నాయి. ఒకనాటి ఇతిహాసాలు భావికాలాల వారికి ఆధ్యాత్మిక సంకేతాలు కాగలవు.

రామాయణంలో మంథర, శూర్పణఖ పేర్లు కొన్ని పంక్తులలో మాత్రమే చూపించారు. అంతకంటె ఎక్కువ చెప్పలేదు. కానీ ఇంత చిన్న మంథర, శూర్పణఖల ద్వారానే రామాయణమంతా జరిగింది. శూర్పణఖ, మంథరలను కామక్రోధాలకు ప్రతీకలుగా గ్రహించి అంతరార్థాన్ని వివరించడం కనిపిస్తుంది. చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు శూర్పణఖ రావటం, లక్ష్మణుడు ముక్కు, చెవులు కోయటం, ఆపై రావణునితో చెప్పి సీతను లంకకు తీసుకు రావటానికి కారణం అయింది శూర్పణఖ. అయోధ్యలో రాముడు అరణ్యానికి పోవటానికి, అరణ్యంలో పర్ణ శాలలో ఉన్న సీత లంకను చేరటానికి ఈ మంథర, శూర్పణఖ కార్యకర్తలుగా ఉంటున్నారు. ఇంతకీ వీరెవరు? శూర్పణఖ కామం (కోరిక), మంథర క్రోధం. వీరిరువురే, అంటే ఆ రెండు లక్షణాలే మన జీవిత రామాయణానికి మూలాలు. అయితే వీటిని జయించేదెట్లా అని చింత పడనక్కరలేదు.

సర్వవిధాలైన వాంఛలను భగవద్భావంతో అనుభవిస్తే కొంత ఆనందం కలుగుతుంది. ప్రకృతిని విశ్వసించి పరమాత్మని వేరుచేసినప్పుడు ఆనందం అందుకోలేం. కామత్యాగాన్ని రామాయణం మనకు నిరూపణ చేసింది. సర్వసుఖాలు త్యజించిన సీత, కామాన్ని కూడా త్యాగం చేయడం వల్లనే రాముని వెంట నడవటానికి అవకాశం కలిగింది. తిరిగి త్యాగం కామంగా మారింది. మధ్యలో బంగారులేడిపై కామం(ఆశ) కలిగింది. అప్పుడు రాముడు దూరమైపోయినాడు. ఇలాంటి పవిత్ర అంతరార్థాన్ని రామాయణం బోధించింది తప్ప, అది వేరే ఏదో కాదు. ఉపనిషత్తులు, రామాయణ, భారత భాగ వతాలు- ఏవైనా సరే, ఒక పవిత్రమైన అంతరార్థాన్ని నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. దానినే బోధిస్తున్నాయి.

భగవంతుడైన రాముడు భార్య కోసం రోదించడం

ఉత్తమ పురుషుడు గృహస్థునిగా ఏకపత్నీ వ్రతుడై భార్య పట్ల చూపవలసిన ప్రేమ భావం ఎలా ఉండాలో ఇక్కడ వెల్లడువుతుంది. ఇదే లోకానికి ఆదర్శప్రయామైనది కూడా. భార్య చెంత నున్నప్పుడు ప్రేమను చూపించడం, ఆమె దూరమయినప్పుడు మరచిపోవడం సామాన్యుల లక్షణం. ఇది ఉత్తముల లక్షణం కాదు. ఈ విషయాన్నే సీతా వియోగం సూచించింది.

(వాల్మీకి సుందర. 26స.43వ శ్లో||)

సీతా పరిత్యాగం

పాలకుడు ఆచరించవలసిన ధర్మాలు అన్నింటి లోను ప్రజలను సన్మార్గంలో నడిపించడమే ప్రధాన ధర్మం. రామరాజ్యంలో శ్రీరాముని చూడనివారు, శ్రీరాముని చూపునకు నోచుకోని వారు తమ జన్మ వ్యర్థమని భావించినారు. అట్టి స్థితిలో తమ రాజు కామాత్ముడై పరుల వద్ద నుంచి వచ్చిన స్త్రీని మరల స్వీకరించాడన్న భావం ప్రజలలో కలిగితే వారు ప్రభువు మీద విశ్వాసం కోల్పోయి ధర్మానికి దూరయ్యే అవకాశం ఉంది. కాబట్టే ప్రజల కోసమే, ఒక ధర్మం కోసమే రాముడు స్వసుఖ త్యాగం చేయవలసి వచ్చినది. ఆయన త్రికాల జ్ఞానం కలవాడు కనుక సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో క్షేమంగా ఉండగలదని తెలిసినవాడు కనుక ఆమె ఏమవుతుందోనని సంశయించి ఉండడు. తాను వదలి పెట్టినప్పటికీ మహర్షి సంరక్షించాడు కాబట్టి ఆమె ఉత్తమురాలేనని లోకం విశ్వసించి ఉంటుంది.

గోపికా వస్త్రాపహరణం ఏమిటి?

కదంబవృక్షమే పరమపదం. యమునా ప్రవాహం సంసార వాహిని, గోపికలే జీవులు. వారి వస్త్రాలే ఐహిక పదార్థాలు. భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడో వారి ఐహిక సర్వస్వాన్ని సంహ రిస్తాడు. సర్వస్వనాశనంతో జ్ఞాని అవధూత వలె నగ్నంగా నిలబడతాడు. భక్తుడు, ప్రపత్తి ననుసరించి తన యోగక్షేమ భారాన్ని భగవంతు మీద వేస్తాడు. భగవంతుడు, అట్టి అనన్యచింతన గలవారి – నిత్యాభియుక్తుల యోగక్షేమాల బాధ్యత వహించి, భక్తిముక్తుల రెండు ప్రసాదిస్తాడు. గోపికా వస్త్రా పహరణంలోని పరమార్థం ఇదే! శ్రీకృష్ణ చరిత్రనంతా, చరిత్రగా, ఆధ్యాత్మిక సంకేతంగా ఇలాగే అన్వయించు కొనవచ్చును. భాగవతం ఈ పరమార్ధాన్నే ధ్వని రూపంలో సర్వత్ర విశదీకరిస్తుంది.

పంచభర్తృక వివరణ

పాంచాలికి అంటే ద్రౌపదికి ఐదుగురు భర్తలు. ఇందులోని యధార్థం ఏమిటో మార్కండేయ పురాణంలో, ధర్మపక్షులు జైమిని మహర్షికి వివరిం చాయి. భారతంలో ఉన్న అంతరార్ధాన్ని, సంశయా లను విశదీకరించినాయి. ఇంద్రుడు పాండవులుగా ఐదురూపాలతో జన్మించినట్లు చెప్పారు.

శ్రీకృష్ణుడు, కుబ్జ

మంచిని చేసి సుఖాన్ని, చెడును చేస్తే దుఃఖాన్ని పొందేవారు మనుషులు, ఇతరు జీవులు. భగవానుడు సుఖ దుఃఖాతీతుడు. కాబట్టి ఆయనకి ఈ విధి నిషేధాలు వర్తించవు. భగవానుడు భక్త పరాధీనుడు. నామరూప రహితమయిన పరమాత్మకు భక్తుడు నామరూపాలను కల్పించి ఉపాసించడం చేత అతని ఉపాసనకు అనుగుణమైన ఫలితాన్ని ఇస్తుంటాడు. కుబ్జ శ్రీకృష్ణుడిని కామభావనతో ఆరాధించింది. అందుకే ఆమె కోరికను తీర్చవలసి వచ్చింది. కానీ భగవంతుడు ఏ పని చేసినా అది లోక కల్యాణానికే తోడ్పడుతుంది. భగవానుని వలన కుబ్జకు సాత్వతుడు అనే కుమారుడు కలిగాడు. అతడు సాత్వత తంత్రం అనే భక్తి శాస్త్రాన్ని రచించి, సాధకులకు మార్గదర్శకుడైనాడు.

తారాశశాంక గాథలో ఆంతర్యమిది

‘తారయతీతి తారా’ అని తారా శబ్దానికి వ్యుత్పత్తి. ఉపాసకులను తరింప చేసే మంత్ర విద్య అని అర్థం. కథలో చంద్రుడు తారతో కలిసినట్లు ఉపాసకుని మనసు మంత్ర విద్యలో మేళనం కావాలి. ‘మనోబుద్ధిః ప్రసాదఞ్చ మాతృచింతాచ చంద్రమాః’ అని కారక నిఘంటువు తెలియచేస్తోంది. కనుక ఇక్కడ చంద్ర శబ్దం మనసును సూచిస్తున్నది. ఉపాసకుని మనసు మంత్రంతో మిళితం కాగా వచ్చేది బోధ. అది బుధుడిని తెలుపుతుంది. తారాచంద్రుల సంతానం బుధుడే కదా! ఒకరు తారా శశాంక గాథకు చెప్పిన అంతరార్థమిది. ఇంకొకరు ఇలా వివరించినారు. సప్తర్షి మండలంలో వసిష్ట నక్షత్రానికి అరుంధతి, బృహస్పతికి తార అనే ఉపగ్రహం ఉండేవి. ఖగోళంలో జరిగే కల్లోలంతో ఒక కాలంలో బృహస్పతి గ్రహం నుంచి తార చెదరి చంద్రుడికి ఉపగ్రహమయింది. మళ్లీ కొంత కాలానికి బృహస్పతికి ఉపగ్రహమయిందని చెబుతారు. ఇదే ఇందులో అంతరార్థం. (శ్రీకృష్ణావతారతత్త్వం వాసుదాస స్వామి కృతం 158 పుట)

తారాశశాంకం జ్యోతిషార్థం

చంద్రుడు బృహస్పతి దగ్గర చదువుకొనేవాడు. తరచుగా గురుని ఇంటిలోనే ఉండేవాడు. బృహస్పతి భార్య తార చంద్రుని మోహించి భర్త ఇంట లేని సమయం చూసి అతడితో కూడి, గర్భవతి అయింది. ఆమెను చంద్రుడు తీసుకుపోయాడు. బృహస్పతి తిరిగి పంపమమన్నా పంపలేదు. తారకు కొడుకు పుట్టాడు. మళ్లీ ఆ పిల్లవాడి కోసం గురుచంద్రులు తగవులాడారు. వారి తగవు తీర్చలేక బ్రహ్మ ఆ పిల్లవాడు ఎవరి పుత్రుడని తారనే అదిగాడు. ఆమె చంద్రుడి పుత్రుడేనని చెప్పింది (భాగవతము) పూర్వగాధాలహరి 152 పేజి.

బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించడం, చంద్రుడికి బుధుడు జన్మించడం ఇందులో సారాంశం. బృహస్పతి ఒక గ్రహం. చంద్రుడు ఉపగ్రహం. బుధుడు ఒక గ్రహం. ఈ మూడింటి మధ్య ఈ కథ నడిచింది. ఆయా గోళాల మధ్య ఈ కథ నడిచింది అంటే అది నమ్మే విషయం కాదు. ఆయా గ్రహాల అధిష్ఠాన దేవతల మధ్య ఈ కథ నడిచింది అని అంగీకరించే పక్షంలో కూడా వారి అక్రమ ప్రవర్తనకి సంబంధించిన గాథ వలన ఏదో నిగూఢ ఉపదేశం ఉండాలి. కాని అలాంటిదేదీ కానరాదు. ఇక ఆ గాథ వల్ల ప్రయోజనమేమిటి? విశేషించి భగవద్భక్తి బోధకమైన భాగవతంలో ఈ గాథకు ఏ విధంగా స్థానం వచ్చింది? ఈ ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తాయి.

ఈ కథా విధానంలో మనం గ్రహించదగిన జ్యోతిషార్థం ఇమిడి ఉంది.

బృహస్పతి మేధావి వర్గానికి ప్రతీక. బృహస్పతి ప్రభావం అధికంగా ఉన్న వారు మేధావులౌతారని ఆ శాస్త్రం చెబుతుంది. ఈ అతి మేధావుల చరిత్రలు పరిశీలిస్తే వారి ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. అందరి విషయంలోను కాకున్నా ఈ మేధావులు తమ భోజనాదికాన్నే మరచే పరిస్థితిలో భార్యను, ఆమె పరిస్థితిని అంతగా పట్టించుకోరన్న మాట ఉంది. అలాంటి స్థితిలోనే తారకు చంద్రుడు తారసిల్లాడు. రక్త ప్రసరణ వేగ ప్రభావం మనసు మీద ఉండటం మొదలైన కారణాల వలన చంద్రప్రభావంతో జన్మించినవారు చంచల మనస్కులు అవుతూంటారని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. అట్టి చంచల మనస్కులకు ప్రతీక ఈ కథలోని చంద్రుడు.

చంద్రుడు వచ్చిన పని ఒకటి, చేసిన పని మరొకటి. ఈ ప్రవర్తన చంచల మనసునకు తార్కాణం. అంటే చంద్ర ప్రభావ జనితుల ప్రవర్తన ఇలాగుననే ఉంటుంది అని కథ బోధిస్తుంది.

బుధుడు. ఇతడికి లౌక్యం హెచ్చు. బుధుడి మీద చంద్రుడికి మైత్రి (ప్రేమ) ఉంది. కాని ఇతడికి తండ్రి మీద ప్రీతి లేదు. (బుధుడికి చంద్రుడు శత్రువు, చంద్రుడికి బుధుడు మిత్రుడు. ఇది జ్యోతిష పరిభాష) అక్రమ సంతానం మంటే సమాజంలో చిన్నచూపు. ఆ అవమానానికి కారణం ఎవరు? తండ్రే కదా! అందుచేత ఆ తండ్రి అంటే విలువ ఉండదు. తండ్రి ఏర్పరచే ప్రవర్తన నియమాలను లెక్క చేయడు. వైరుధ్యాన్ని చూపిస్తాడు. అట్టి వైరుధ్యమే బుధునికి ఉంది. అట్టివారు లోకులనే ఆశ్రయిస్తారు. ఎవరు కనబడితే వారిని అనుసరిస్తారు, అనుకరిస్తారు. (బుధుడు శుభులతో కలిస్తే శుభుడు, పావులతో కలిస్తే పాపి ఇది జ్యోతిష పరిభాష) వారికి స్వతంత్ర బుద్ధి ఉండదు. లోకంలో తిరగడం వలన లౌక్యం అలవడు తుంది. చక్కగా మాట్లాడుతారు (బుధుడు వ్యాపార కారకుడు అని జ్యోతిష పరిభాష). తమ పనులు నెరవేర్చుకుంటారు. ఆర్థికపరమైన లెక్కలు బాగా వేస్తారు (బుధుడు గణిత విద్యాకారకుడు అని జ్యోతిష పరిభాష). ఏ పని కావాలన్నా స్వతంత్రంగా నెరవేర్చలేకపోయినా ఇతరులను ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. ఇతరుల శక్తినే తమ శక్తిగా వాడుకుంటారు (బుధుడు ఎవరితో కలిస్తే వారి ప్రభావాన్ని చూపుతాడు అని జ్యోతిష పరిభాష). అక్రమ సంతానం అనేమాట ఒకటి వదిలేసినా బుధుని ప్రభావం వలన జన్మించిన వారు పై విధమైన ప్రవర్తన కలిగి ఉంటారని ప్రతీతి. అట్టివారికి కథలోని బుధుడు ప్రతీక.

ఈ విధంగా తారాశశాంక గాథ గ్రహాల వ్యక్తిగత ప్రభావాలను వ్యక్తీకరిస్తూ కథా రూపంలో గ్రహస్వభావాలు మనస్సు నకు హత్తుకునేటట్టు చేస్తోందని గుర్తించాలి.

–  డాక్టర్‌ చిర్రావూరి శివరామకృష్ణశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *