ఇది చరమ వాక్యం కాదు

ఇది చరమ వాక్యం కాదు

తర్వాత ఘట్టంలో విశ్వశూన్యంలో వ్యాపించి ఉన్న ఈ ఎలెక్ట్రాన్లు ప్రోటాన్ల నుంచి ఉదజని కార్బన్‌, నైట్రోజన్‌, హీలియం మొదలైన కొన్ని వాయు పదార్థాల అణువులు విపరీతమైన వేగంతో తమచుట్టూ తాము తిరుగుతూ వక్రరేఖా మార్గాల్లో పరుగెత్తిపోతూ ఉండవచ్చును. అణువులకు, ఎలెక్ట్రాన్లకు, ప్రోటాన్లకు ఘర్షణ జరుగుతూ ఉండవచ్చును. ఆ ఘర్షణలో ఉదయించే విపరీతమైన ఉష్ణోగ్రత శక్తులచేత మళ్ళీ కొన్ని అణువులు భిన్నమై విడిపోయి ఉండవచ్చును.

సూర్యగోళం పైన 60000జ డిగ్రీలు ఉష్ణం ఉంటుంది. అధునిక శాస్త్ర, పరిశోధనాలయాల్లో ఉపయోగించే మహత్తర ఎలెక్ట్రిక్‌ కొలిమి కూడా 60000జ ఉష్ణోగ్రత కల్పించ లేదుగదా. ఆ ఉష్ణోగ్రతలో కొలిమి నిలువలేదు కూడాను. ఎందుచేతనంటే ఆ పరిస్థితిలో కొలిమిని తయారు చేయటానికి ఉపయోగించే ఇనుము, కార్బను, ప్లాటినము వగైరా లోహాలన్నీ ఆవిరయిపోతాయి. అంటే ఆ కొలిమిలో యే భాగమూ ఉండదన్నమాట. 60000జ డిగ్రీలకే ఇట్లా అంటే ఇక సూర్య గోళ కేంద్రంలో ఉష్ణోగ్రత 20 మిలియన్ల డిగ్రీలట. అంటే ఏ వస్తువు కూడా ఆవిరిరూపంలో తప్ప ఇంకే రూపంలోను ఉండలేదు. ఆవిరి రూపం అన్న పదంకూడా సరిపోదు. అప్పుడు అణువులు కాదు. కేవలం ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు నిర్మలశక్తి స్వరూపం ఉంటుందన్నమాట. ఈ శక్తే మొదట ఉందని నా విశ్వగాథా కథనం ప్రారంభించాను. ఉండి ఉండాలి.

ఈ ప్రారంభ వాయువు పరిభ్రమిస్తూ విశ్వ కుహరంలో తుపాను వాయువు లా ఉండి ఉండాలి. మన ఆధునిక శాస్త్రజ్ఞులు వాయువు అని మాత్రం చెప్పారు. అందులో యే యే వాయువులు ఉన్నాయి అనేది చెప్పలేదు. ఒక సందర్భంలో ఉదజని, నైట్రోజన్‌, కార్బన్‌, హీలియం మొదలైన వాయువులు ఆ వాయువులో ఉన్నాయన్నారు. కానీ ఆ వాయువులో ఇంకేవీలేవా, ఉండేవన్నీ ఉదజని మొదలైనవేనా? అని విషయాలు ఖచ్చితంగా చెప్పబడలేదు. మరొక సందర్భంలో ఆ వాయువులో ముందు చెప్పిన వాయువులేగాక యింకా చాలా మూల పదార్థాల ఆవిర్లు ఉన్నాయనీ, ఆ వాయువు ఎంతో విపరీతమైన ఉష్ణోగ్రతలో ఉంటుందనీ వర్ణింపబడింది. కానీ ఈ వర్ణన అంటే అనేక వ్యత్యాసాలతోనూ వ్యాఘాతాలతోను కూడి ఉందని స్పష్టం అవుతూ ఉంది. అంత విపరీతమైన ఉష్ణోగ్రతలో మూల పదార్థాలు ఆవిర్లు ఎట్లా విభిన్నమై ఎలెక్ట్రాన్లు ప్రోటాన్లుగా మారకుండా వున్నాయి? ఇది అంత సమంజసంగా తోచదు. ఆ ప్రారంభ వాయువులో పైన చెప్పిన లఘువాయువులు ఉంటూ పైగా ఎలెక్ట్రాన్లు ప్రోటాన్లు కూడా ఉండాలి. మొత్తం యీ అన్నింటి యొక్క మిశ్రమమే ఆ వాయువని నా అభిప్రాయం. ఇట్లాంటి వాయువు విశ్వశూన్యంలో సుడులు సుడులుగా తుఫానులా ప్రచండ వేగంతో పరిభ్రమిస్తూ వుండగా కొంత కాలానికి ఆ విస్తార వాయువు చిన్న చిన్న గోళాలుగా విరిసిపోయి, వేడిమి తగ్గి మూడు వంతులు అణువులుగా మారటానికి అవకాశం వచ్చివుంటుంది. ఈ గోళాలు పరిభ్రమిస్తూనే ఉన్నాయి. తర్వాత ఈ గోళాలు మళ్ళీ గోళవర్గాలుగా విడిపోయాయి. గోళవర్గ మంతా ఒకటిగా ప్రవర్తిస్తుంది. ఈ గోళవర్గమే తర్వాత తారాచక్రాలుగా (గెలక్సీ) గోళాలే నక్షత్రాలుగా ఆకాశంలో వెలుగొందాయి.

పరిభ్రమిస్తూ ఉన్న వాయుగోళాల్లో చాలామటుకు ఎలెక్ట్రాన్లు, ప్రోటాన్లు అనబడే విద్యుత్మణాలు పరస్పరం ఆకర్షింపబడి కలిసి అణువులు అయివున్నాయి. అణువుల యొక్క స్వకీయ కేంద్ర పరిభ్రమణం గోళాలకు వచ్చింది. పై పెచ్చు మొత్తం గోళం వక్రరేఖా మార్గంలో పరుగెత్తే ప్రవర్తనకూడా వచ్చింది. కానీ ఇక్కడ ఊహకందని విషయం యేమిటంటే దశలో యే విధంగా పరకీయ కేంద్రంచుట్టూ ఒక నక్షత్రం తిరగడమనేది వచ్చింది అన్న విషయం. ఈ విధంగా స్వకేంద్రం చుట్టూ పరకేంద్రం చుట్టూ తిరగడం వచ్చాయన్న ఏ దశలలో విషయాన్ని ఆధునిక శాస్త్రజ్ఞులు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. నక్షత్ర చరిత్రయొక్క గొలుసులో ఈ లంకెకోసం వెదకటం మహాకష్టమైన కార్యమే. గ్రహాలే పరకీయ కేంద్రంచుట్టూ తిరుగుతున్నాయి. మిగతా నక్షత్రాలు తిరగడం లేదంటారేమో, కానీ అది నా మనస్సుకు కేవలం వ్యాఘాతంగా కనిపిస్తుంది. శాస్త్రానికే అసంబద్ధంగా తోస్తుంది. మిగతా నక్షత్రాలు పరకీయ కేంద్రంచుట్టూ తిరగకుంటే తారాచక్రాల గతి యేమిటి? తారాచక్రాలంటే కొన్ని నక్షతాలు సముదాయంగా కలసి రుజుమార్గాల్లో పరుగెత్తి పోవడమా? కాదుకదా: ఎందుచేతనంటే తారాచక్రం తనచుట్టూ తాను తిరుగుతూ వుందని శాస్త్రజ్ఞులే చెబుతున్నారు. తారాచక్రంలోని నక్షత్రాలు రుజుమార్గాల్లో పరుగెత్తుతూ ఉంటే తారాచక్రం తన కేంద్రం చుట్టూ తాను తిరుగుతూ ఉందనడం అసంబద్ధంగా ఉంటుందిగదా? తన కేంద్రంచుట్టూ తాను తిరుగుతూ ఉంటే అందులోని నక్షత్రాలు రుజుమార్గాల్లో కాక వలయాకారమార్గాల్లో పరుగెత్తుతూ, మొత్తం తారాచక్రంగా కూడా పరుగెత్తుతూ ఉండాలి. నక్షత్రాలు తారాచక్రంలో వలయాకారంగా పరుగెత్తుతూ ఉన్నాయంటే ఒక కేంద్రం చుట్టూ పరుగెత్తుతున్నాయన్నమాట. గమనించవలసిందేమిటంటే వ్యష్టిగా ప్రతి నక్షత్రమూ తనచుట్టూ తాను తిరుగుతూ, మరొక బాహ్య కేంద్రం చుట్టూ కూడా తిరిగి సముదాయంగా తారాచక్రం అవుతున్నాయి. అంటే తారాచక్ర స్వరూపాన్ని కలిగిస్తున్నాయి. మళ్ళీ తారాచక్రంతో పాటు ఇంకెక్కడికో పోతున్నాయంటే (ఇంకో మూడో కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయంటే) మళ్ళీ మరొక గమనం ఉందనేకదా: అప్పటికి మొత్తం మీద నక్షత్రం మూడు రకాల పరిభ్రమణం మూడు కేంద్రాల చుట్టూ చేస్తూ ఉందన్నమాట. (గ్రహాలైతే నాలుగు రకాల భ్రమణం)

మూడు రకాల పరిభ్రమణం

ఒకటి : స్వకీయ కేంద్రం అంటే ఆత్మ కేంద్రం.

రెండు : తారాచక్ర కేంద్రం అంటే బాహ్యకేంద్రం.

మూడు : తారాచక్ర బాహ్యకేంద్రం.

కానీ ఈ మూడు రకాల భ్రమణాలు కూడా నక్షత్రం ఆత్మకేంద్రం చుట్టూ తిరుగుతుండడం నించే ఉద్భవించాయనుకోవాలి. అందుచేత నా దృష్టిలో విశ్వానికంతా ఎక్కడో ఒక కేంద్రం వుండాలి. అదే ప్రారంభంలో ఆదిశక్తి పీఠమయి వుండాలి. అక్కడినించి శక్తి వాయురూపం ధరించి వ్యాపించి నక్షత్రాలుగా తారాచక్రాలుగా విశ్వరూపం ధరించి వ్యాపించి నక్షత్రాలుగా తారాచక్రాలుగా విశ్వరూపం ధరించింది. ఈ సందర్భంలో భారతీయ తాంత్రిక సిద్ధాంత మూలాధారమైన శ్రీచక్ర భావాన్ని గురించి పరిశోధనలు చేయడం ఫలవంతమని నా ఊహ. కనుక విశ్వంలో నక్షత్రమార్గాలు వలయాలు అంతర్వలయాలుగా వుండాలి. కానీ విశ్వానికి ఆవల యేదైనా కన్ను వుండి చూస్తే ఈ వలయాలు అంతర్వలయాలు కాక అంతా గజిబిజిగా గహనంగా కనిపించవచ్చును. అయినప్పటికీ విశ్వంలో నక్షత్ర మార్గాల్లో పైన చెప్పిన సక్రమత్వం తప్పనిసరిగా వుండితీరాలి. అధునిక శాస్త్ర పరికరాలకు ఈ సత్యం గోచరం కాకపోవచ్చును. మహనీయులైన మేధావులు ఈ ప్రత్యేక విషయాన్ని గురించి అంతగా ఆలోచించి వుండకపోవచ్చును. ఇది ఎప్పుడో పూర్వపక్షం చేయబడిన టాలెమీ సిద్ధాంతం కాదు. భూమిగానీ, నక్షత్రంగానీ విశ్వ కేంద్రంలో వుండకపోవచ్చును కూడా. కానీ నా అభిప్రాయం – నక్షత్ర మార్గాలను గురించి ఈనాడు మనకు తెలిసిన విషయం చరమవాక్యం కాదు- కానేరదు. పరికరాలు చాలవు, ఊహ అంత దూరం పోలేకున్నది. బహుశా సృష్టి పరణామాలలో బుద్ధి ఇంకా సునిశితమైతే మానవ ప్రతిభ హద్దులు ఇంకా విస్తృతమైతే అప్పటికి ఈ అగాధ విషయాలు స్పష్టంగా చూడగలుగు తామేమో:

విశ్వంలో విస్తరించిన పార్రంభ వాయువు గోళాలుగా విడిపోయి గోళాలు తారాచక్రాలుగా మార్పుచెందాయని ముందు చెప్పాను. కానీ ఇక్కడ కూడా ఆధునిక శాస్త్రం ఒక ప్రశ్న వివరించలేదు. వాయుగోళాలు, తారాచక్రాలు రూపొందే ముందు, నక్షత్రాలుగా మారాయా అంటే మండడం ప్రారంభిం చాయా? లేక వాయుగోళాలు తారాచక్రాలుగా రూపొందిన తర్వాత నక్షత్రాలుగా మారాయా? అంటే నక్షత్రాలు ముందా, తారాచక్రాలు ముందా అనే ప్రశ్న వచ్చింది. నక్షత్రాలే ముందు. తారాచక్రాలు తర్వాత అని తొలుత సిద్ధాంతం చేశారు గానీ, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్‌ జేమ్స్‌ జీన్స్‌ ”కాదు, ముందు తారాచక్రాలు తర్వాత నక్షత్రాలు” అన్నారు. కాని జార్జ్‌ గెమోవ్‌ మొదలైన శాస్త్రజ్ఞులు ప్రస్తుతం విస్తార పరిశీలనా ఫలితంగా జీన్స్‌గారి వాదాన్ని పూర్వపక్షం చేసి నక్షత్రాలే ముందు తర్వాత తారాచక్రాలని సిద్ధాంతం చేశారు. ఇది ఎట్లావున్న ఏ దశలో వాయు గోళాలు నక్షత్రాలుగా మారాయి అనే ప్రశ్న అస్పష్టంగా మిగిలివుంది.

ఒక వస్తువు తన కేంద్రం మీద తాను పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ఆ వస్తువు రూపాన్ని గుండ్రంగా చేసే శక్తులు అంటే కేంద్రంవైపు ప్రసరించే శక్తులు ఆ పరిభ్రమణ ఫలితంగా ఏర్పడుతాయి. వాయుగోళాలు శూన్యంలో పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ముందుచెప్పిన కేంద్రాకర్షణ శక్తిమూలాన సంకోచం పొందసాగాయి. ఈ విధంగా సంకోచం పొందే కొలదీ వాయుగోళం యొక్క కేంద్ర ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువయింది. దురూహ్య పరిణామం కలిగిన ఆదిమ వాయుగోళాల కేంద్రసీమలో ఉదయించిన ఒత్తిడి ఎంతో మన సామాన్య ఊహ కందదు. సూర్యగోళం కేంద్రంలో 200000000ష డిగ్రీల ఉష్ణోగ్రత ఉదంటే మన కర్థమయిందేమిటి? ఇప్పుడూ అంతే (సూర్యగోళంలాగే అన్ని నక్షత్రాలూ మండే వాయుగోళాలని ముందు తాత్కాలికంగా తెలుసు కుంటే మన కథను అనుసరించటం సులభం) ఆవిధంగా కేంద్రంలో ఒత్తిడి అత్యధికమయ్యేసరికి ఉష్ణోగ్రత పెరిగి ఒక స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత మూలాన మండటం ప్రారంభమయింది. సంకోచించి సంకోచించి కేంద్రంలో ఒత్తిడి ఎక్కువై ఉష్ణోగ్రత ఎక్కువైన వాయు గోళం మంటలు ప్రారంభించిన స్థాయినందుకున్న తర్వాత వ్యాకోచించడం ప్రారంభిం చాయి. ఈ దశలో రెండు పరిస్థితులు ఏర్పడు తున్నాయి. 1. వాయుగోళపు పై పొరల బరువును (కేంద్రాకర్షణ శక్తిని) ఎదుర్కొనే వ్యాకోచశక్తులు ఉష్ణోగ్రతమూలాన హెచ్చడమూ, 2. దానితో పాటు మండే ఆ గోళం యొక్క శక్తి శూన్యంలోకి ఖిలమయి పోవడమూ జరుగుతున్నాయి. అంటే ఆదశలో వేడిమి తగ్గడమూ వ్యాకోచశక్తులు సంకోచశక్తులతో సమానంకావడమో లేక అధిగమించడమో సంభవించడమూ- ఈ రెంటిచేత వాయుగోళం వ్యాకోచించడానికి అనుకూలత ఏర్పడుతుంది. ఇదంతా ఒత్తిడి హెచ్చితే గోళం సంకోచించి ఉష్ణోగ్రత తగ్గుతుందనే ప్రాథమిక ప్రకృతి సూత్రానుసారంగా సంభవించే దృశ్యమే.

పై విధంగా వాయుగోళాలు మండటం ప్రారంభించిన తర్వాత మళ్ళీ వ్యాకోచింప సాగాయి. వ్యాకోచించడంతోటి ఉష్ణోగ్రతకూడా తగ్గింది. మండే ఆ గోళపు కొంత శక్తివేడిమి కాంతిరూపాలుగా శూన్యంలోకి ప్రసారం అయిపోవడంచేత ఆ వ్యాకోచం మరింత శీఘ్రగతి సంతరించుకుంది. ఈ విధంగా కాంత్యుష్ణాలరూపేణ కొంత శక్తి శూన్యం లోకి వ్యయం అయిపోతూ ఉండటంచేత ఆ నక్షత్రం యొక్క పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ విధమైన శక్తి క్షయంచేత మన సూర్య నక్షత్రం ప్రతి శతాబ్దమూ 0.0003% అర్ధ వ్యాసాన్ని అంటే రెండు కిలోమీటర్లను పరిమాణంలో కోల్పోతూ ఉందని ఆధునిక శాస్త్రజ్ఞులు గుణించారు.

ఉష్ణోగ్రత తగ్గి సహజపరిస్థితికి వచ్చిన తర్వాత మళ్ళీ పూర్వవిధంగానే కేంద్రాకర్షణాశక్తి సంకోచింప జేయటం ప్రారంభిస్తుంది. వాయుగోళం మొదటిసారి మండటం ప్రారంభించిన తర్వాత అది నక్షత్రం అయిందన్నమాట. ఆ దశనించీ అది వెనక చెప్పినట్లు సంకోచిస్తూ వ్యాకోచిస్తూ ఉంటుంది (ప్రాణి హృదయంలా). అయితే ఈ సంకోచవ్యాకోచాలు ఎంతకాలం నక్షత్రానికి ఉంటాయంటే ఆది మండి మండి పూర్తిగా ఆరిపోయేవరకూ, ఘనపదార్థం అయ్యేవరకూ ఉంటాయి. అంటే ఆ నక్షత్రం చచ్చిపోయేవరకూ అన్నమాట. నక్షత్రం కూడా ప్రాణిలాగే ఉంది గదా: హృదయంలో (కేంద్రంలో) శక్తిమూలాన ఉష్ణోగ్రత పెరగడం తరగడం జరుగుతూ చచ్చిపోయేవరకూ పరిస్పందన (సంకోచ వ్యాకోచాలు) కలిగి ఉంది. పొడి చరిత్ర ఏనాడు ప్రారంభించిందో చూచారా.

నక్షత్రం చచ్చిపోయిన ”వెంటనే” (ఖగోళకాలం) హృదయంలోని జీవం బహిర్గతమైనట్లుగా గడ్డబారిపోయిన గోళంమీద అంతటా జీవరాసులు పొడసూపేయి. ఆ దశనించీ, మన భూగోళం మీద బహిర్గోచర జీవచరిత్ర ప్రారంభమయింది. జీవాల్లో బహిర్గోచర జీవాలనీ, అంతర్గోచర జీవాలనీ ఉన్నాయా అని సందేహం రావచ్చును. సంచరిస్తూ సంచరించినా సంచరించకపోయినా ఆహారం తింటూ వంశాభివృద్ధి చేసుకొంటూ ఉండేవి బహిర్గోచర జీవాలు. కానీ సంచరించకుండా ఆహారం తీసుకోకుండా ఉండేవి అంతర్గోచర జీవాలు. అవికూడా జీవాలేనా? అవును. నిర్జీవపదార్థంనించే మనమనుకునే జీవపదార్థం వచ్చిందనీ, జీవనిర్జీవ పదార్థాలకు ప్రవర్తనలోతప్ప అన్యధా భేదం లేదనీ ఈ రెండు వర్గాలమధ్య ఉన్న జతీవర్‌aశ్రీర, జశీతీaశ్రీర వగైరా వస్తువులు శాస్త్రీయంగా పరిశీలిస్తే వాటిలో కదలటం పెరగడం వగైరా కొన్ని విషయాలు ఉండడంచేత, నిర్జీవ పదార్థం జీవ పదార్థంగా మారేముందు మధ్య దశలో ఇవి వచ్చినట్లుగా నిర్జీవపదార్థమే క్రమంగా జీవపదార్ధంగా రూపొందినట్లుగా రుజువవుతూంది.

– గుంటూరు శేషేంద్రశర్మ

గుంటూరు శేషేంద్రశర్మ ఇతర పుస్తకాల వివరాలకు :

Saatyaki S/o Seshendra Sharma , saatyaki@gmail.com ,
9441070985 , 7702964402

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *