విశ్వంలో దిక్కులు లేవు

విశ్వంలో దిక్కులు లేవు

నక్షత్రకాంతులు కోటానుకోట్ల యోజనాల దూరంనుంచి వచ్చి, మనల్ని కలుస్తుంటాయి. అంత దూరంనుంచి వచ్చే ఆ నక్షత్రకాంతులు ఏఏ విచిత్ర ప్రదేశాలు దాటివచ్చాయో, దురూహ్యమైన ఆ శూన్యప్రదేశమంతా ఏమిటో, మన భూమి ఏమిటో, నక్షత్రాలేమిటో అనే విషయాలు, నిశితంగా తెలుసుకునేముందు, విశ్వంయొక్క స్థూలచిత్రం తెలుసుకోవడం అవసరం. అనంత మైన శూన్య ప్రదేశంలో కనుపించే నక్షత్రాలూ, కనుపించని నక్షత్రాలూ పరిభ్రమిస్తున్నాయి. ‘మన భూమి కనుపించని నక్షత్రం. ఎందుచేతనంటే అది ఇతర నక్షత్రాలవలె మండే గోళంకాదు. కొన్ని నక్షత్రాలు కాలక్రమంగా మండిమండి చివరకు చల్లారిపోయి నీరు, వగైరా పదార్థాలు ఏర్పడి, జీవరాసులకు కూడా ఆస్పదమయింది. విశ్వ మంతటిలోను, ఒక్క భూగోళంమీదనే జీవం ఉందనుకోవటం పొరపాటు. నీటితో నింపిన ఒక గాజుకుండలో చాలా చేపలు, వాటి పిల్లలతో, అటూ ఇటూ చిన్న కెరటాల్ని కల్పిస్తూ సంచరిస్తూ ఉంటే ఆ గాజుకుండ ఎట్లా ఉంటుందో, అట్లాగే ఉంటుందని విశ్వం యొక్క స్థూలచిత్రాన్ని మనం మనసులో చిత్రించుకోవచ్చు. ఇట్లా పోల్చటం సాహసమే అయినప్పటికీ, సత్యానికి సమీపంగా ఉండనప్పటికీ, కనీసం సత్యం వైపుగానైనా ఉన్నందు చేత గత్యంతరంలేక సౌలభ్యం కోసం ఇట్లా పోల్చక తప్పదు. మన ఉపమానాన్ని విశదీకరిస్తే తాత్పర్యమేమిటంటే గాజుకుండ లాంటి విశ్వంలో శూన్య ప్రదేశం నీరనుకోవాలి. నీటిలో చేపలు సంచరించినట్లు శూన్యప్రదేశంలో నక్షత్రాలు సంచరిస్తున్నాయి. చేపలు పిల్లలతోటి సంచరిస్తున్నట్లే నక్షత్రాలు కుటుంబాలుగా సంచరిస్తున్నాయి. చేపల సంచారం నీటిలో చిన్న కెరటాల్ని కలిగించినట్లే నక్షత్ర సంచారంకూడా శూన్యప్రదేశంలో కెరటాల్లాంటి ఆకర్షణ సీమల్ని కలిగిస్తూ ఉంది. ఈ స్థూలచిత్రాన్ని మనస్సులో ఉంచుకొని సునిశిత పరిశీలనకు మనం ఉపక్రమించవచ్చు.

పైనచెప్పిన విశ్వచిత్రంలో మన భూమి స్థానం విశ్వ కేంద్రంలోనా? ఏదో ఒక అంచునా? ఎక్కడ అనేది నిర్ణయించడం అసాధ్యం. విజ్ఞుల ప్రకారం సూర్య కుటుంబంలోనిదైన మన భూగోళం సూర్యకుటంబంలో కూడా కేంద్రంకాదు. సూర్యుడు కూడా సూర్యకుటుంబం పరిభ్ర మించే తారాచక్రానికి కేంద్రం కాదుగదా, కేంద్రం సమీపంలోకూడా లేడు. ఆ తారాచక్రపు సరిహద్దుల్లో తన కుటుంబం తోటి పరిభ్రమిస్తున్నాడట. (నక్షత్రాలు కొన్నిచేరి కుటుంబం గాను, అటువంటి కొన్ని నక్షత్ర కుటుంబాలు చేరి తారాచక్రాలుగాను, ఈ శూన్యంలో పరిభ్రమిస్తు న్నాయి. తారాచక్రాన్ని ఇంగ్లీషులో గాలెక్సీ అంటారు.)

భూమి గుండ్రంగా ఉందనీ, భూమి సూర్య కుటుంబంలోని గ్రహాల్లో ఒకటనీ, ఇతరగ్రహాల్లా తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటుందనీ, ఈ పరిభ్రమణమే గ్రహణాలకూ రేయింబగళ్ళకూ, ఋతువులకూ కారణమనీ చెప్పేది, ఈనాడు ప్రాథమిక పాఠశాల విజ్ఞానం, అంత నిర్వివాదం అన్నమాట.

నీరు దాహం తీరుస్తుందా లేదా అని సందేహించేంతటి మూఢుడే ఈనాడు సత్యాలను శంకించగలడు.

గుండ్రంగా ఉన్న ఈ భూమిమీద మనం, తదితర జీవరాసులతోటి నేలమీద కాళ్ళు పెట్టి, తల ఆకాశంవంకగా సంచరిస్తున్నాము. కాళ్ళవైపు క్రింద అనీ, తలవైపు పైన అనీ భావిస్తున్నాము. మనం ఇక్కడ కాళ్ళు భూమికి అంటించి నడుస్తూ ఇది క్రింద అనీ అనుకుంటుంటే మనం అనుకున్న ప్రకారంగానే భూమికి క్రిందభాగంలో ఉన్నవాళ్ళు భూతలానికి వాళ్ళు కాళ్ళంటించి సంచరిస్తూ ఇది క్రింద అనుకుంటూ ఉంటారు. అంటే మనకు కాళ్ళు మనక్రింద ఉన్నట్లుగా తోచితే వాళ్ళకు మనం వాళ్ళక్రింద ఉన్నట్లుగా తోచుతుంది. ఎవరిక్రింద ఎవరు? ఎవరికి పైన ఎవరు? అనేది ఈ భూగోళం మీద నిర్ణయించడం అసాధ్యం. మనం మన క్రింద వాళ్ళను ఎట్లా భావిస్తామంటే వాళ్ళు తల క్రిందుగా కాళ్ళు భూమికి అంటించి వ్రేలాడుతూ తిరుగుతున్నారను కుంటాము. కానీ వాళ్ళకు, వాళ్ళను గురించి ఆ భావం ఉండదు కదా, పైపెచ్చు వాళ్ళు మనల్ని గురించి మనం తలక్రిందుగా భూమి నంటుకొని వ్రేలాడుతున్నామని భావిస్తారు. ఇదంతా భూమ్యా కర్షణ సీమలో ఉన్నందు చేత వచ్చిన మానసిక భ్రాంతి.

నిజంగా ఎవరు తలక్రిందుగా ఉన్నారో చెప్ప లేము. విశ్వానికి ఏది అడుగుభాగం ఏది పైభాగం, ఏది పార్శ్వభాగాలు అని చెప్పటం వీలుకానప్పుడు ఆ విశ్వంలో సంచరించే భూమికి దిక్కులను నిర్ణయించడం అసాధ్యం. అదేవిధంగా ఈ నక్షత్రాలు మనకు పైన ఉన్నాయి. ఈ నక్షత్రాలు ప్రక్కన ఉన్నాయి. ఈ నక్షత్రాలు క్రింద ఉన్నాయి అని కూడా చెప్పలేము. ఇది క్రింద, ఇది పైన, ఇది తూర్పు. ఇది దక్షిణం అని దిక్కులుగా భావించడం ఎక్కడికక్కడే సరిపోతుందికానీ, మొత్తం భూగోళానికి అన్వయించి నప్పుడు అర్థంలేదు. కంటే దిక్కులు నిజంగా లేవుగాని, భ్రమాజనితంగా మాత్రం ఉన్నాయి. అంటే కేవలం సత్యం కాదు; వ్యావహారిక సత్యం మాత్రమే. విశ్వంలో భూగోళస్థానమే ఇదమిత్థంగా లేనప్పుడు, మనం విశ్వంలో ఎక్కడ ఉన్నాము? ఈ విశ్వంలో ఏదిక్కున ఏవి ఉన్నాయి? అని దిక్కులను ఊహింప చూడటం నక్షత్రాలను మన ఇంట్లో దీపాలుగా పెట్టుకొనటానికి ప్రయత్నించినంత పరమ మూఢత్వంగా ఉంటుంది.

నక్షత్రాలు : వాటి పరిభ్రమణాలు

నక్షత్రాలు విశ్వశూన్యంలో స్వతంత్రంగాను, ఇష్టానుసారంగాను, పరిభ్రమించడంలేదు. కొన్ని నక్షత్రాలు కలిసి ఇంకొక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఒక కుటుంబంగా, ప్రవర్తిస్తాయి. కొన్ని కుటుంబంగా లేక, ఏకాకిగా ఉండే నక్షత్రాలు కూడా ఉన్నాయి. కాని, ఈ తారా కుటుంబాలూ, స్వతంత్ర నక్షత్రాలూ అన్ని కలసి, ఒక మహా కుటుంబంగా ప్రవర్తి స్తున్నాయి. చిన్న విధానమైన తారాకుటుంబంలో ప్రత్యేక నక్షత్రాలు కుటుంబ కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే మొత్తం ఆ కుటుంబం అంతా కేంద్ర నాయకత్వం క్రింద అట్లాంటి అనేక తారా కుటుంబాలతో కలసి, ఎక్కడికో పరుగెడుతూ ఉంటుంది. అనేక తారాకుటుంబ సమ్మేళనానికి అంటే ఆ మహా కుటుంబానికి తారాచక్రం అని పేరివ్వవచ్చును. (ఇదే గాలెక్సీ). తారాచక్రం బ్రహ్మాండమైన చక్రం తిరిగినట్లుగా కిర్రుకిర్రున మెల్లిగా తిరుగుతూ ఎక్కడికో పరుగెత్తిపోతూ ఉంది. తారా కుటుంబాని కున్నట్లు తారాచక్రానికి కూడా కేంద్రం ఉందని ఇదమిత్థంగా చెప్పడానికి వీలుకాదు. ఈ తారాచక్రంలోని నక్షత్రాలు ఒకే కేంద్రం చుట్టూ పరిభ్రమించకపోయినా మొత్తం చక్రమంతా కలిసి, ఒకటిగా పరిభ్రమించకపోయినా మొత్తం చక్రమంతా కలసి ఒకటిగా పరిభ్రమణం సాగిస్తూ ఉందని చెప్పాను. ఈ చక్రాలు ఎక్కడికో పోతున్నాయి. కానీ తారాకుటుంబాలూ, తారాచక్రాలు, ఎక్కడికో పోతున్నాయని చెప్పడము శాస్త్రధోరణికి విరుద్ధమని నా అభిప్రాయము. నక్షత్రభ్రమణాన్ని బట్టి విశ్వస్వరూపం నిర్ణీతమౌతున్నప్పుడు నక్షత్రాలు లేదా తారా చక్రాలు ఎక్కడికో పోతున్నాయనడం, అస్పష్ట విచారం అవుతుంది. మానవుని యాంత్రిక పరికరాలకూ, ఊహా పరిమితులకు అందుబాటులో ఉన్నందు చేత చిన్న విధానమైన తారాకుటుంబంలో కేంద్రాన్ని గుర్తించి, ఆ కేంద్రం చూట్టూ మిగతా నక్షత్రాలు తిరుగుతున్నాయని, నిర్ణయింపగలిగాము. కానీ, తారాచక్రము దురూహ్యమైనంత విస్తీర్ణంలో ప్రవర్తించడం చేత మన పరికరాలకూ, ఊహా పరిమితులకూ అతీతమై ఉండడం చేత తారాచక్రానికి కేంద్రం ఉన్నదా, తారాకుటుంబాలు ఆ కేంద్రము చుట్టూ తిరుగుతూ ఉన్నాయా, అంటే, వాటిగమన మార్గం వలయమేనా అనేది నిర్ణయింపలేకున్నాము. కానీ తారాచక్రానికి కేంద్రం ఉందనీ, దాని చుట్టూ ఈ కుటుంబాలు పరిభ్రమిస్తూనే మొత్తంగా కలసి తారాచక్రంగా కూడా ప్రవర్తిస్తున్నాయనడానికి వీలుంది. ఎందు చేతనంటే తారాచక్రంగా కూడా చక్రభ్రమణంచేస్తూ ఎక్కడికో పోతున్నాయి.

ఇక్కడ కూడా మళ్ళీ ఎక్కడికో పోతున్నాయని అనడం పరిగ్రాహ్యం కాదు. తారాచక్రానికి కేంద్రం ఉందా, ఉంటే, అట్లాంటి కేంద్రం చుట్టూ తారాకుటుంబాలు తిరుగుతున్నాయా, అనే విషయమే మన అవధుల కతీత మైనప్పుడు తారాచక్రాలు ఏదైనా కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయా అనే విచారణ పెట్టుకొనడం మన శక్తికి మించిన విషయం. నిజంగా కేంద్రం ఉండి, ఆ కేంద్రం చుట్టూ తారా కుంటుబాలు తిరుగు తున్నప్పటికీ, మనం అది వలయాకార భ్రమణంగా గుర్తించలేము. ఎక్కడికో పోతున్నాయనే అను కుంటాము. కానీ ఇప్పుడున్న ఎక్కడికో పోతున్నాయనే భావాన్ని తోసివేసి కేంద్రం చుట్టూ భ్రమిస్తున్నాయనే భావాన్నే గ్రహించడం ఉత్తమము. ఎందుచేతనంటే నక్షత్రాలు తమ చుట్టూ తాము తిరగడం ఒకటి, తర్వాత కుటుంబ స్థాయిలో ఇంకో కేంద్రం చుట్టూ తిరగడం రెండవది. వీటన్నిటికంటే విశ్వంలో ప్రధానంగా ఉన్న క్రమమత్వం మూడవది. ఈ కారణాలన్నీ తారాచక్రానికొక కేంద్రం ఉంటుందనీ, ఆ కేంద్రం చుట్టూ తారాకుటుంబాలు తిరుగుతుంటా యనీ, తనచుట్టూతాను తిరుగుతూ ఉన్న బ్రహ్మాండ మైన తారాచక్రం ఇంకొక కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటుందనీ, మన బుద్ధీం ద్రియాన్ని భావించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ విధంగా భావిస్తేనే విశ్వక్రయత్వానికి భంగం కలుగదు. ఈ క్రమత్వం నక్షత్రభ్రమణంలో ఉంటేనే పరస్పర సంఘర్షణ లేకుండా నక్షత్రాలు అనంత కాలం అట్లాగే సంచరిస్తూ ఉండగలుగు తున్నాయి. అందుచేత నక్షత్రభ్రమణం ఒక నిర్ణీతమార్గంలో జరుగుతుందను కోవాలి. నా అంతర్ముఖ దష్టికి విశ్వమంతా కేంద్రం చుట్టూ తిరిగే గోళాలూ, తారాకుటుంబాలూ, తారాచక్రాలూ మొదలైన సక్రమ తారా సముదాయ సమ్మేళన సమష్టి స్వరూపంగా కనిపిస్తూ ఉంది. నక్షత్రాలు, ఎక్కడికో పోతున్నాయని అనుకోవటం తారాగమనాన్ని, కేవలం భౌతికదృష్టితో చూచి భ్రమపడడము యొక్క ఫలితమేనని నా అభిప్రాయం.

తారాగమనంలో ఋజుమార్గాలే లేవు. అన్నీ వలయాలే. విశ్వంలోని చిన్న వలయాలు మనకు కనుపిస్తున్నాయి. అర్థం ఆవుతున్నాయి. (ఉదా|| సూర్యుని చుట్టూ తిరిగే భూమ్యాది గ్రహాలు) కానీ పెద్ద వలయాలు మనకు కనుపించవు. అర్థంకావు. అంటే పెద్దవలయాల్లోని ఏ ఒక్క వక్రభాగం కూడా వక్రంగా కనుపించక ఋజుమార్గంగా గోచరిస్తూ ఆ నక్షత్రాలు ఎక్కడికో పరుగెత్తి పోతున్నాయనే భ్రాంతికి దారితీస్తూ ఉంది.

seshendra Pustakalu itara vivaralaku : Saatyaki S/o Seshendra Sharma , saatyaki@gmail.com , 9441070985 , 7702964402

– గుంటూరు శేషేంద్రశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *