ధర్మం-శాసనం-పాలన

ధర్మం-శాసనం-పాలన

ధర్మశాస్త్రాలనే స్మృతులని అంటారు. ధర్మ శాస్త్రకర్తలు లేదా స్మృతికర్తలు లోకహితం కోరినవారు. సమదృష్టి కలిగినవారు. అందుకే ఎంత పురాతనమైనా భారతీయ ధర్మశాస్త్రాల అధ్యయనం మీద నేటికీ ఒక విధమైన శ్రద్ధ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిరపేక్ష రాజరికం లేనేలేదు. రాజు సర్వంసహ అధికారి కాడు. అంతేకాదు, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థలలో వేటి ఉనికి వాటిదేనని మొదటిగా గుర్తించినది మన ప్రాచీన భారతీయ న్యాయ వ్యవస్థేనని చాలామంది విజ్ఞుల అభిప్రాయం. ఈ సూక్ష్మ విభజన గురించి ఆసక్తి ఉండడం అతి సహజం. ఇలాంటి విభజన వెనుక ఉన్న మన ఋషుల తాత్విక కూడా బలమైనది. మొదట ఆ స్మృతికర్తలు, ఆ తాత్వికతను గురించి ప్రస్తావించు కోవాలి.

భారతీయ సనాతన ధర్మానికి స్పష్టమైన స్వరూపం ఉంది.

‘యతో-భ్యుదయ నిఃశ్రేయసౌ స ధర్మః||’ (కణాదుడు) అంటే దేని వలన అభ్యుదయం, నిశ్రేయసం (మేలు, ముక్తి) కలుగుతుందో అది ధర్మం అని అర్థం. వ్యాసర్షి మహా భారతంలో సనాతన ధర్మ లక్షణం గురించి మరింత విస్తృతముగ నిరూపిం చాడు. వ్యాసభగవానుడు చెప్పినదానిని బట్టి ఆత్మ సంయమం, తపస్సు, శౌచం, సంతుష్టి, హ్రీ (Sense of Shame) క్షమ, ఆర్జవం (Straight forwardness) ఆత్మజ్ఞానం, ఇంద్రియ సంయమం, దయ, ధ్యానం-ఇవన్నీ కలసి ఉన్నదే సనాతన ధర్మ లక్షణం.

”ఇజ్యా –చారదయా,

(అ)హింసా, దమ స్వాధ్యాయ కర్మణామ్‌ |

అయం హి పరమోధర్మః యద్యోగేనా–

త్మదర్శనమ్‌|| (యాజ్ఞవల్క్యుడు)

(యజ్ఞం, సదాచారం, అహింస, దయ, మనో నిగ్రహం, వేదాధ్యయనం ధర్మాలు, యోగం చేత ఆత్మ దర్శనం పరమధర్మం)

స్మృతికర్తలు

మనువు, పరాశర, దక్ష, సంవర్త, వ్యాస, హరీత, గౌతమ, వసిస్ఠ, ఆపస్తంబ, అత్రి, విష్ణు యాజ్ఞవల్క్య మహర్షులు ధర్మశాస్త్రాలు రచించినారు. వీరు జీవించిన కాలంలో అనేక మత భేదాలు ఉన్నాయి. శాతా తప, యమ, దేవల, శంఖ లిఖిత, ఉశన, శౌనకులు స్మృతికర్తలు. వీరుకాక బోధాయన, నారదాది మహర్షులు చాలామంది స్మృతికర్తలు ఉన్నారు. ఈ స్మృతులను George Buhler, Hermana, Oldenn berge, Julius Jolly, Max Muller, మొదలగు పాశ్చాత్య పండితులు ఆంగ్లమున కనువదించి “Sacred Books of the East Series” 25,29,30,31లో చోటు కల్పించారు. (Oxford University Press 1881 M{ì“ Motilal Banarasidas పునర్ముద్రించారు (UNESCO) Collection of representative works – 1965, 68,73). మొదట స్మృతి చెప్పిన ధర్మం స్వరూపం ఎలాంటిదో వివరించి, తరువాత పాలన, న్యాయ వ్యవస్థల గురించి చర్చిస్తాను.

వేదం చెప్పిన ప్రకారం సత్కర్మాచరణమే ధర్మం. అంటే దోషం లేని పనులు, ఎవరికీ నష్టం చేయని పనులు. ఒక పనికి ప్రేరణ కలిగించేవే చోదన వాక్యాలు. చోదనం అంటే ఆంతరంగికమైన ఉద్దీపనం. ఇది బాహ్యంగా ఉండే విధ్యుక్త శాసనంతో ఏకీభవిస్తుంది. అందువలన విధ్యుక్త ప్రవర్తనం శ్రేయస్కరమైనది. వేదోక్తమైనదే సత్కర్మయని జైమిని సిద్ధాంతం.

‘వేదో నిత్య మధీయతాం, తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్‌’ (శంకరుడు) మనువు ఏమన్నాడంటే ధర్మం సత్య స్వరూపం. అహింసా రూపం కూడ.

”సత్యం బ్రూయాత్‌, ప్రియం బ్రూయాత్‌ న బ్రూయాత్‌ సత్యమప్రియమ్‌|

ప్రియంచ నానృతం బ్రూయాత్‌ ఏష ధర్మః సనాతనః” (మను IV – 138)

”సర్వం పరవశం దుఃఖం, సర్వమాత్మ వశం సుఖమ్‌

ఇతి విద్యాత్‌ సమాసేన లక్షణం సుఖ దుఃఖయోః||”

(సత్యం, ప్రియం పలకాలి. అప్రియమయిన సత్యాన్ని, ప్రియమయిన అసత్యాన్ని పలుకరాదు. ఇది సనాతన ధర్మం. ఇతరునికి వశమయిన దంతా దుఃఖం, ఆత్మవశమయినది సుఖం. ఇది సుఖదుఃఖా లకు సంగ్రహంగా ఉండే లక్షణం) అనర్థం.

ధర్మం ఎక్కడ ఉన్నా ధర్మమేనని కూడా మన ఋషులు చెప్పారు. ధర్మం ఎవరు చెప్పినదైనా ధర్మమే. ఈ శ్లోకమే అందుకు గొప్ప ఉదాహరణ.

”శ్రద్దధానః శుభాం విద్యామ్‌, ఆదదీతా- వరాదాపి

అంత్యాదపి పరం ధర్మమ్‌, స్త్రీ రత్నం దుష్కులాదపి||”

శుభరూపమైన విద్యను తక్కువ జాతి (అవరాత్‌) వారి నుండి, పరమ ధర్మాన్ని చండాలాదుల నుండి కూడ శ్రద్ధావంతుడైనవాడు పొందవలెనని కూడా మనువు బోధించాడు. ఇలా జ్ఞానం, సంస్కృతులను అన్ని దిక్కుల నుండి స్వీకరించేందుకు అవసరమైన వికాసవంతం, ఉదారమైన మనసు మనకు ఉంటే, ఈ ఆధునిక యుగంలో కూడా మ¬న్నతం, విశ్వజనీనమునైన మన సంస్కృతిని మళ్లీ వైభవో పేతంగా నిర్మించుకొనవచ్చును.

శాసన వ్యవస్థ

Seperation of the judiciary from the executive: మొదట ఉదహరించినట్టు ఇలాంటి సమున్నత భావనను రూపొందించువారు స్మృతికర్తలైన మన ఋషులు. వీరు లోకహితైషులు, సమదర్శనులు; స్వార్థచింతా రహితులు. పాలనా వ్యవస్థ (executive)శాసనాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ (administration of justice) పాలనా వ్యవస్థ కంటే భిన్నమైనది. ప్రాచీన కాలంలో కూడా అవి రెండు ఒకే వ్యవస్థగా ఉండలేదు. పాలనా వ్యవస్థ (executive) న్యాయవ్యవస్థ (administration of justice) వేర్వేరుగా పని చేయాలన్న సిద్ధాంతం ప్రాచీన భారతీయ న్యాయ వ్యవస్థ మొట్టమొదట గుర్తించిందని విజ్ఞుల అభిప్రాయం. బౌద్ధ జాతక కథలు కూడా ఈ వాస్తవాన్ని నిరూపిస్తు న్నాయి. వినయపికటంలోని అనాథ పిండకుని కథ ఈ సత్యాన్నే తెలియచేస్తున్నది. ఒక రాజపుత్రుడు, ఒక సామాన్య పౌరుడు తగవు తీర్చుకునేందుకు న్యాయస్థానానికి వెళ్లారట. న్యాయస్థానం రాజపుత్రునికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. రాజపుత్రుడు ఆ తీర్పును శిరసావహిస్తాడు కూడా.

భారతీయ న్యాయ వ్యవస్థ నియమం ప్రకారం పాలకులు (రాజులు) ధర్మానికి కట్టుబడవలసిందే. రాజు ధర్మ ప్రవర్తకుడు మాత్రమే. ధర్మకర్త కాడు, ధర్మాతీతుడు అసలే కాడు. మన దేశంలో సార్వ భౌములైన చక్ర వర్తులు సైతం ధర్మాన్ని ఆరాధిం చారు. పురాణ కథలతో పాటు కొన్ని చారిత్రక కథనాలు కూడా దీనిని నిరూపిస్తున్నాయి. రాణి తిష్యరక్షిత కుణాలు డికి ద్రోహం చేసినందుకు అశో చక్రవర్తి ఆమెకు మరణ దండన విధించాడు. ఒక స్త్రీ మీద అత్యాచారం చేసిన కుమారునికి శివాజి కారాగార శిక్ష విధించాడు. కన్నుగానక ఆవుదూడపై రథం తోలిన కుమారుడిని చోళ చక్రవర్తి రథ చక్రాల క్రింద పడవేసి చంపించాడు. ”ధర్మో రక్షతి రక్షితః” అన్నది వారి పరమ సిద్ధాంతం.

రాజు ధర్మారాధకుడు

భారత వర్ష సార్వభౌములు సర్వస్వతంత్రులు అని భావించడం కేవలం తొందరపాటు. వాల్మీకి, వ్యాస, కాళిదాస, భవభూతి వంటి కవీంద్రులు వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు రాజుకి ప్రజారాధనమే పరమధర్మమని బోధించారు. ప్రజాభీష్టమే రాజు అభీష్టం. శ్రీరామచంద్రుడు ప్రాణాధికమైన జానకిని నిర్దోష అని తెలిసినా ప్రజారాధనకై త్యజించాడు.

”స్నేహం, దయాంచ, సౌఖ్యంచ యదివా జానకీ మపి|

ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథా||”

(ఉత్తర రామచరితం 1-12)

(స్నేహాన్ని, దయని, సౌఖ్యాన్నిగాని, లేదా జానకిని గాని ప్రజారాధనకై వీడినప్పటికిని నాకు వ్యథ లేదు) రఘువంశ ప్రభువులు మనుధర్మాన్ని అనుసరించి ప్రజాపాలన సాగించారు. ప్రజలు, మన్వాదిగా వచ్చిన మార్గాన్ని రేఖా మాత్రం కూడ అతిక్రమించక జీవనం సాగించారు. ప్రభువులు తండ్రుల వలె ప్రజలను రక్షించారు. ప్రజల తండ్రులు కేవలం జన్మహేతువులే.

”ప్రజానాం వినయాధానాత్‌, రక్షణాత్‌, భరణాదపి |

స, పితా పితరస్తాపాం కేవలం జన్మహేతవః||”

(రఘువంశం 1-24)

(ప్రజలను సన్మార్గంలో ఉండేటట్టు చేయడం వల్ల, భయహేతువుల నుండి రక్షించడం వలన, అన్నపానాదులు ఇచ్చి పోషించడం వల్ల ఆ రాజే తండ్రి అయ్యాడు. ప్రజల కన్న తండ్రులు కేవలం జన్మకు హేతువులు.)

ధర్మమే సత్యం, సత్యమే ధర్మం

ధర్మశాస్త్రాలు (స్మృతులు) న్యాయపరిపాలనకు సంబంధించిన పాఠ్యగ్రంథాలు. దండనీతి సమ వర్తియై ఉండేది. ధర్మం అంటే రాజులకు కూడ రాజు. ధర్మానికి మించినది లేదు. దుర్బలులు సైతం ధర్మంతో బలవంతులను జయింపగలరనీ, అది సత్య స్వరూపమనీ బృహదారణ్య కోపనిషత్తు చెబుతోంది.

న్యాయ వ్యవస్థయందు ప్రాడ్వివాకులు (Chief Justices) ధర్మాధికరణులు (Ministers of Law) భోజకులు ధర్మవేత్తలు. ప్రాడ్వివాక పదవి నధిష్ఠించు వ్యక్తి ఆత్మనిగ్రహశాలి వంశగౌరం కలవాడు, పక్షపాతరహితుడు, ఉద్వేగరహితుడు ఆర్జవ వంతుడు, దైవభీతి కలవాడు, సద్గుణవంతుడు, శక్తిమంతుడు, రాగరహితుడై ఉండాలని ధర్మశాస్త్రాలు నిర్దేశిస్తు న్నాయి. అతడు ధర్మాన్ని నిష్పక్షపాతంగా చెప్పాలి. ధర్మాధికారులు ఇచ్చిన తీర్పు ఎంత ఉదారంగా ఉన్నప్పటికీ, లేక అప్రియంగా ఉన్నప్పటికీ రాజులు జోక్యం కల్గించుకొనకూడదు. భయక్రోధ లోభమాత్సర్య పక్షపాతాలతో అధర్మంగా తీర్పును ఇచ్చిన ధర్మాధికారి నరకానికి వెళతాడు ఇలా ధర్మపీఠం ఎక్కి పక్షపాతరహితంగా తీర్పు చెప్పనివాడి ముఖమే చూడరాదని అంటున్నాయి ధర్మశాస్త్రాలు.

పునర్విచారణ

ఒకవేళ తీర్పులో లోపం ఉన్నట్టు, అధర్మం జరిగినట్లు తోచినట్టయితే, వెంటనే పునర్విచారణ స్వయంగా చేసి, ఆ పొరపాటును సవరించుకొనే సర్వాధికారాలు కూడా ధర్మాధికరణులకు ఉండేవి. పంచతంత్రంలోని హితోపదేశంలో దీనిని వివరించే కథలు ఉన్నాయి. భార్య చెప్పిన అబద్ధపు సాక్ష్యంచేత ఒక క్షురకునికి ధర్మాధికారులు మరణశిక్ష విధించారు. వానిని తలారులు, వధ్యస్థానమునకు తీసుకొని పోయారు కూడా. ఇంతలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు తనకు తెలిసిన సత్యం గురించి ధర్మాధికారులకు చెప్పాడు. వారు ఆ క్షురకుని భార్యకు శిక్ష విధించి, ఆమె భర్తను విడిచినట్లు కథ చెబుతున్నది. (ఏతత్‌ సర్వం శ్రుత్వా రాజపురుషైః న్యాయే ధర్మాధీకారీ ప్రవర్తితః||) (హితోపదేశము-సుహృద్భేద కథ- 5)

ఇవాళ ఇలాంటి స్వాతంత్య్రం ధర్మాధికారులకు ఉన్నదని చెప్పజాలం. ధర్మాధికారుల ఎదుటకు వచ్చి తన నిరపరాధతను నిరూపించుకోలేని వారికి వారి పరోక్షంలోనే దండన విధించే పద్ధతి కూడ స్మృతులలో కనిపిస్తుంది. ధర్మాస్థానమునకు రాకుండా నిరాక రించడానికీ, ధర్మాధికారుల ఆదేశాలు తిరస్కరించ డానికీ ఎవరికి అర్హత లేదు.

వివాహం గురించి మన ధర్మశాస్త్రాలు ఏమన్నాయి చదవడం కూడా అవసరం. పరాశ రస్మృతి (కలియుగమున) స్త్రీకి, పునర్వివాహాన్ని అనుమతిస్తున్నది. అర్థశాస్త్రం (కౌటిల్య) సైతం అంగీకరిస్తున్నది. కాని మనుస్మృతి, గుణపతియగు సాధ్వికి పునర్వివాహానికి అనుమతి ఇవ్వలేదు.

అర్థశాస్త్రం కంటే ధర్మశాస్త్రానికే ప్రాధాన్యం

స్మృతులను అనుసరించి పాలనా, శాసన న్యాయ వ్యవస్థలను గురించి వాటి పరస్పర సంబంధం గురించి రాయాలంటే సకల స్మృతుల సారమైన మహా భారతంలోని రాజ ధర్మాలను గురించి సమగ్రంగా సమీక్షించవలసి ఉంటుంది. అంతేకాక ధర్మ శాస్త్రాలకు శాఖారూపమైన అర్థశాస్త్రం (కౌటిల్యుని అర్థశాస్త్రం) కామందకీ, శుక్రనీతి మొదలైన వాటిని గూడా సమీక్షింపవలసి ఉంటుంది. ధర్మశాస్త్రాల గురించి గొప్ప పరిశోధన చేసిన కాణే పండితుని రచన History of Dharmasastras అధ్యయనం చేయాలి.

– డాక్టర్‌ చిర్రావూరి శివరామకృష్ణశర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *