భాగవత చేతన-బమ్మెర పోతన

భాగవత చేతన-బమ్మెర పోతన

భగవంతుని గురించి చెప్పేది భాగవతం! పూర్వం నారాయణుడు బ్రహ్మకు, బ్రహ్మ నారదునకూ తర్వాత వేదవ్యాసుడు తన పుత్రుడైన శుకునకూ, శిష్యుడైన సూతునకూ బోధించగా…. సూతుడు శౌనకాదిమునులకు విన్పించినది… కృష్ణ నిర్యాణ వేళ కృష్ణుడు మైత్రేయునకు, మైత్రేయుడు విదురునకూ వివరించినదీ విలువైన భాగవతం!

శాపగ్రస్తుడిగా సప్తదినములు మాత్రమే ఆయుప్రమాణమున్న పరీక్షిత్తుకు శుకయోగి బోధించిన భక్తి సుధాపూరం ఈ భాగవతసారం!

భాగవత రచనకు పూర్వం పూర్ణకాముడైననూ వ్యాసుడు పూర్తి వ్యాకుల చిత్తుడై వుండటం గమనించి దేవర్షి నారదుడరుదెంచి కారణమడిగాడు. అందుకు వేదవ్యాసుడిలా అన్నాడు.

”వేదాలను విభజించినా, అష్టాదశ పురాణాలనూ బ్రహ్మ సూత్రాలనూ, మహాభారత ఇతిహాసాలెన్ని రచించినా, అవన్నీ కూడా జ్ఞాన గ్రంథాలు.. కలియుగ మానవులు అర్థం చేసుకోలేనివి. కేవలం పండితులకు తప్ప పామరులకు పనికిరానివి… జీవితమంతా నిష్ప్రయోజనమేనా అన్నదే నా ఆవేదన దేవర్షీ!”

అపుడు వ్యాస మహర్షికి మ¬పదేశం గావించాడు నారదమహర్షి.

”శాస్త్ర, జ్ఞాన, శాసనాల వల్లగానీ, దమన సూత్రాల వలన గానీ పరిపూర్ణ ఫలితం కలదు! దైవీ గుణకీర్తనల వలన కలిగే ఆకర్షణ, ఆనందం, మాధుర్య రసమునూ కలిపి దైవానుభూతి ప్రధానంగాగల భాగవతాన్ని లిఖంచు: అలా లోకకల్యాణ కారణమయ్యే రచనవల్ల నీకు బాధానివారణం కల్గుతుంది” అని!

ఆ అమూల్య సలహా మేరకే శ్రీకైవల్యపథంగా వ్యాసుడి ద్వారా సంస్కృత భాగవతం వెలసిందట!

పోతన15వ శతాబ్దానికి చెందినవాడు. ఉమ్మడి వరంగల్‌ జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించిన పోతనామాత్యుడు ఒక చంద్రగ్రహణం నాటిరాత్రి గంగా స్నానాంతరం ఇసుక తిన్నెపై కూర్చుని మహేశ్వర ధ్యానం చేస్తుండగా సతీసమేత శ్రీరాముడు సాక్షాత్కరించాడని ప్రతీతి. భాగవతమును తెనుగున రచించి తనకంకితమిమ్మని… తద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందని తెల్పగా… ఆ తదనంతరం పోతన ఏకశిలా నగరానికేతించి భాగవత రచన ప్రారంభించాడట!

”పలికెడిది భాగవతమట

పలికించు విభుండు రామభద్రుండట నే

బలికిన బవహరమగునట..

పలికెద వేరొండుగాథ పలుకగనేలా”

అంటూ ఆ మహాభారతాన్ని తెలుగువారి మహాభాగ్యంగా కృష్ణార్పణ భావంతో రాశారట.

చేసింది శివధ్యానం.. గోచరించింది శ్రీరామం….భాగవత వర్ణనం.. కృష్ణలీలా మాధుర్యం.

దీన్నిబట్టి శివకేశవారామాలకు భేదమే లేదని, అంతా ఒకేమతం.. అదే

భాగవతం.. అని విదితపరుస్తుంది.

ఈ భాగవత గ్రంథం రచనాక్రమంలో ప్రారంభం నుండి ప్రథమ స్కంధం 31వ వచనముల వరకు పోతన తానే స్వతంత్రంగా రచించెనట! ఆ తర్వాతిదంతా వ్యాస భాగవతానికి అనువాదమని అంటారు.

ప్రథమ పద్యం గ్రంథావతారికలో కృష్ణస్తుతి, రెండవ పద్యం పరమేశ్వర ప్రార్థనం… ఫలశృతిలో శ్రీకైవల్యపథ ప్రశంస… బహు సుందరంగా, భక్తి బంధురంగా కొనసాగిన ఈ భాగవతంలోని ప్రముఖ పాత్రలు బ్రహ్మ, నారద, శుక, పరీక్షిత్తులు. ప్రభువు మాత్రం కృష్ణుడు కావటం విశేషం.

త్రిగుణాత్మకమైన భాగవత భక్తులలో తమో గుణానికి గజేంద్రుడు, రజోగుణానికి ధ్రువుడు, సత్త్వగుణ సంపన్నుడు ప్రహ్లాదుడుగా.. కడు ఆహ్లాదకంగా సాగింది భాగవత రచనామృతం!

పోతన భక్తి పాండిత్యాల తడి నాల్కపై నాట్య మాడుతూ ఆ హృద్య తరంగాలు పద్య ప్రబంధాలుగా ప్రభవిస్తూ తెలుగింటి ముంగిట జేగంటలై నాటికీ నేటికీ ప్రణవనాదాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

పోతన పద్యంలోని ఆరంభ ప్రాస అంతిమం దాకా కొనసాగటం అనేది… మూలం కంటే మూడింతలు అందం పెరిగిందనటం అతిశయోక్తి కాదు! శబ్దాలంకారం రస బంధురమైన ఈ అనల్ప రచనాశిల్పం నాద లయానిలయమైన ఆనందాలయం!

”వేద కల్ప వృక్ష విగళితమై శుక

ముఖ సుధాద్రవమున మొనసియున్న

భాగవత పురాణం ఫల రసాస్వాదన

పదవి గనుడు రసిక భావ విదులు”

అనితర సాధ్యమన్పించేలా అద్భుతంగా చెప్పిన ఈ పద్యంలో సుధానిధులెన్నో నిండివున్న భాగవతం అనే అమృతఫలం వేదకల్ప వృక్షఫలంగా… అదీ శుక ముఖాన జారిపడిందని ప్రకృతి సహజంగా వర్ణించిన విధానంలో కవి ప్రతిభ కన్పిస్తుంది! చెట్టునుండి జారిన పండు చిలక ముఖాన పడిందనటం! చిలక కొరికిన పండు.. ఎరుగ తీపులుమెండు..!! అన్నట్టుగా ఒక అర్థం.. జ్ఞానవృక్షసారమైన భాగవతమనే అమృతఫలం వరమై శుకయోగి పరమైందని మరొక అర్థంగా భాగవత మూలాన్ని శ్లేషగా.. మధుర భాషగా అతి చమత్కారంగా అభివర్ణించాడీ పద్యంలో!

”కలడందురు దీనుల యెడ

గలడందురు పరమయోగి గణముల పాలన్‌…” అనే ఈ పద్యంలో …

మడుగులోని మకరి నోటిలో తన పాదం పడిన గజేంద్రుడు ఆర్తిగా.. ఆ నశ్వర పరంజ్యోతి ఈశ్వరుని ప్రార్ధించి అర్థించి అలసిపోయి ..”కలడు కలండనెడు వాడు కలడో లేడో” అన్న శంకాపూరిత మనస్కుడవటం అనేది..కష్టకాలంలో సాధారణ భక్తుడికి సర్వసాధారణమేనని ప్రాణి సహజ గుణ నైజమును సూచించినాడు!

అంతలోనే ‘లావొక్కింతయు లేదు.. నీవే తప్ప నిహః పరంబెరుగ… కావవే వరదా… సంరక్షించు భద్రాత్మకా’ అంటూ సర్వశక్తులు ఉడిగినవేళ ఆ గజేంద్రునికి సర్వ సమర్పణా భావన కల్గిన సమయాన, పరమాత్మ పరిపూర్ణ వునికినంగీకరిస్తూ, సంపూర్ణ శరణాగతినొంది విపత్తు నుండి విముక్తుడైనాడని .. భక్తునికి చివరకు భగవత్‌ శరణాగతియే శరణ్యమని విపులీకరిస్తుంది!

”నయనముల విభుమూర్తి బానంబుసేయు

పగిది దన ముఖమునను జుంబనముసేయు…

అంటూ ఆరంభమైన ఈ పద్య పాదములు…, ఐదేండ్ల బాలుడైన ధ్రువుడొనర్చిన తీవ్ర తపమునకు లోకాలెల్ల కంపించగా, కరుణించిన హరి కన్పించగా… ఆ మహాద్భుత సంఘటన కచ్చెరు వొందుతూ ఆ మహావిష్ణువును ఆ బాలుడెలా దర్శించి నమస్కరించెనో వివరించిన విధం విలక్షణంగా బాలభక్తి సలక్షణంగా నున్నది!

కన్నులతో విష్ణుని రూపమును త్రాగుచున్నట్లుగా, తన ముఖముతో హరి ముఖమును చుంబించు చున్నట్లుగా, తన భుజములతో స్వామిని కౌగలించు కున్నట్లుగా…, దర్శించి స్పర్శించి నమస్కరించెనని… ధ్రువభక్తిని ధృవీకరించిన దృశ్యం… గ్రహ నక్షత్రాల నడుమ ధ్రువుని దర్శనా భావనం కల్గింపజేస్తుంది- మనకు ఇలలోనే… బాల భక్త కళగానే!

‘మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు వోవునే మదనములకు…”

‘మందారాలూ, మకరందాలూ, మాధుర్యాలు…’ అంటూ ఆరంభించిన ఈ పద్యంలో ఎంతో విశేషమైన అర్థమున్నది! భక్తి సహజత్వమున్నది! భగవత్‌ పాదపద్మములకంకితమైన మనసుకు భౌతిక సుఖాలన్నీ అల్పములేనని తెల్పటంలోని అందం, పోతన మనోభావనా గంధం అనవచ్చు!

”ఇంతింతై… వటుడింతై….” అంటూ ఒక పద్యం….

”రవిబింబంబుపమింప…” అంటూ మరో పద్యం, ఒకే పాదులో పుట్టిన రెండు పద్యపాదాలుగా మన తెలుగింటి భక్తి వాకిట బలంగా పాదుకున్నవి! బలి శిరంపై మోపే వామనుని మూడో అడుగు అడుగడుగునా ఆ పొట్టి వడుగు అనంత తత్త్వానికి గొడుగు పడుతున్నది.

మొదటి పద్యంలోనేమో ‘గగన వీధి మొదలు సత్యలోకందాకా’ అని…., ఆ తర్వాతి పద్యంలోనేమో వామన విశ్వరూపం వివరించిన విధం ఎంతో విబుధం!

అంతకంతకూ అంతై ఇంతై ఎంతెంతో అయి ఎదుగుతున్న వామనుడికి మొదట సూర్యబింబం ఒక గొడుగై…., ఇంకొంచెం పెరిగిన వాడికి శిరోరత్నమై, మరింత పెరిగిన వటువుకు చెవి కమ్మలమటుకై, ఆ తదుపరి మెడలో మణిహారమై… అనంతరం దండ కడియంగా, ఆ తదనంతరం కరకంకణమై… ఇంకా ఆ పైన… నడుం పైన నగకు ఘంటికయై, పిదప పాదనూపురమై…చివరికి పద వేదికయైనదను ఆ నిరుపమాన ఉపమానం పోతన భక్తిదా, లేక పోటీపడే కవితాశక్తిదా అన్పించక మానదు!

”చదివించిరి నను గురువులు….” అంటూ

” చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ…”

అనగా… మోహక్షయం కాగల విద్యను మించిన విద్యలేదని, సయోధ్యగా తండ్రికి బాల ప్రహ్లాదుని ప్రబోధం ఈ పద్యం! ‘చదువులెన్ని నేర్చినా మన సంస్కృతీ సాంప్రదాయాలను గూర్చి చదివినపుడే, ఆ బ్రహ్మ విద్యను గురించి తెలుసుకున్నపుడే… అన్ని విద్యలకూ సార్థకత’ అని ఈ జ్ఞానగని… నేటి మన చదువులకని మంచి సందేశమందించింది!

”ఇందుగలడందు లేడని

సందేహము వలదు…”

అన్న పద్య ప్రసూనం… వయసుతో నిమిత్తం లేని ప్రగాఢ విశ్వాసాన్ని ‘పరిమిళింపజేస్తూ….’ ‘కంబము కూడా దైవీ కదంబమేనని నిరూపిస్తూ దుష్టశిక్షణకూ శిష్టరక్షణకూ భగవంతుడెంత వింత రూపమైనా ధరించి తరింప జేయగలడని వివరింపజేస్తుంది!

”మాటి మాటికి వ్రేలుమడచి నూరించుచు..” అను పద్య భాజ నము. ఆనాడే వన భోజనమును గురించి వర్ణించుచూ… కృష్ణుడూ, గోపకులూ అంతా కలిసి ఆడుతూ పాడుతూ, నవ్వుతూ తుళ్లుతూ, ఒకరి చల్దులనొకరారగిస్తూ, ఒకరి ఎంగిలినొకరాస్వాదిస్తూ…. తారతమ్యం లేనిదే నిజమైన స్నేహ మాధుర్యం అని, ఏ వ్యాకులం లేని గోకులాన్ని మన కళ్లముందుంచినాడు మహానుభావుడు.

”నల్లనివాడు…. పద్మనయనంబులవాడు…” అంటూ మనోహరంగా వర్ణించిన ఈ పద్య పారిజాతము, గోపికల మధురభక్తిని, జీవాత్మ పరమాత్మల అనురక్తిని అభివర్ణించింది. ఇందులో నాయకుడు కృష్ణుడు! ప్రధానరసం శృంగారం! కానీ.. పైకి కన్పించే సాధారణ రసం కాదది…. తమ స్వామి అన్వేషణలో పిచ్చివాళ్లై ఎద ఎదలోని వెన్నుని గురించి పొదపొదనూ విచారించడం ప్రేమ పరాకాష్టను పరిఢవిల్లజేస్తుంది! తమ సర్వస్వం…. అనగా… భర్తా, ఇల్లూ, పిల్లలూ, పరిసరాలూ, పరికరాలూ, తమ దేహేంద్రియాలూ, మానప్రాణాలూ అన్నీ కృష్ణమయమైపోగా… బాహ్య తృష్ణ మాయమైపోయిన జీవన్‌ ముక్త దశ అది! అది… ఆకాశంతో పెండ్లి వంటిదిగా, ఆ శుభ శోభనంలోని దేవుని సంస్పర్శతో జీవునకు కలుగు తన్మయాతీత చిన్మయానంద స్థితి! అదే గోపికాంత రంగంలోని కృష్ణలీలా తరంగం!!

వైవిధ్య హృద్య నైవేద్యమైన ఈ పద్య మహాభాగవత పఠనం వల్ల ఏకకాలంలో ఇద్దరి దర్శనం కల్గుతుంది. ఒకరు భక్త శిఖామణి పోతనామాత్యుడు కాగా, మరొకరు ఆ పోతన భక్తిచేత అభిషేకించబడిన భగవంతుడు కాడా?

పోతన మాధుర్యభక్తికీ…. పాండితీ శక్తికీ…., ఆ పద్య గానలహరికీ… అతని అంతరంగ హరికీ, అనంత భాగవత సిరికీ పునఃపునః నమఃసుమాంజలులు.

– కె.వీణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *