భారతదేశమే శ్రీ పీఠం – భారతమాత నా పీఠాధిపతి

భారతదేశమే శ్రీ పీఠం – భారతమాత నా పీఠాధిపతి

శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామితో ముఖాముఖి

శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామితో జాగృతి ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖిలో స్వామి పాఠకుల కోసం చాలా వివరంగా, ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు. శివరాత్రి ఒక సాధన అని, పరమాత్ముడు ప్రకృతి కంటే వేరు కాదు అనేది హిందూ సంస్కృతి అని, దేవాలయం శక్తి కేంద్రం అని, దేవాలయం కేంద్రంగా విద్య, వైద్యం ఉచితంగా అందాలని, హిందూ ఆలయాల్ని ప్రభుత్వం కాకుండా హిందూ బోర్డు నిర్వహించాలని, హిందూ సమాజం ఐక్యంగా నిలబడాలని అన్నారు. ఆ వివరాలు..

ప్రశ్న : శివరాత్రి మహత్యం గురించి చెప్పండి. శివుని నుండి మనం నేర్చుకోగల విలువలు ఏమిటి?

సమాధానం : శివరాత్రి అనేది సాధకుడికి ప్రధానమైన భూమికను చూపించే అంశం. వాస్తవానికి శివరాత్రిని ఒక పండుగ అనుకొంటాం. పండుగ కన్నా అదొక సాధన. పండుగ రోజున పిండివంటలు చేసుకొంటాం. కొత్తబట్టలు ధరిస్తాం. కొన్ని విధానాలు అనుసరిస్తాం. శివరాత్రి దానికన్నా భిన్నంగా ఉంటుంది. ఈ రోజు ఉపవాసం వుంటాం, శుభ్రమైన వస్త్రాలు ధరిస్తాం. ఎక్కువ శాతం ఈ రోజు సాధనకు, వ్రతానికి ప్రాధాన్యమిస్తాం. మాఘకృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి పూట లింగోద్భవం జరుగుతుంది. భారతీయ సంస్కృతిలో రాత్రిపూట పూర్తిగా మేలుకొని చేసే పూజ కేవలం శివరాత్రి రోజు మాత్రమే. ఈ రోజు ఎందుకు ఆ విధంగా చేయాలి ? 24 గంటల పాటు ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పలుకుతూ రోజంతా జపం, అనుష్ఠానం, అభిషేకం చేస్తూ శివశక్తిని పొందడానికి చేసే సాధన ఈ శివరాత్రి.

ఈ పంచాక్షరీలో 5 అక్షరాలున్నాయి. కాని వాస్తవానికి ఇవి ఆరు అక్షరాలు. ఇదొక పెద్ద ప్రశ్న. ఓం హ్రీం నమశ్శివాయ అని పలుకుతాం. హ్రీం అనే బీజాక్షరం శక్తి సంబంధమైనది. అందుకే –

శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్‌

నచ దేవం దేవో నఖలు కుశలః స్పందితుమ్‌ ||

శివుడు కూడా శక్తియుతుడై ఉంటేనే ఈ సృష్టిలో ఏదైనా సృష్టిక్రమం జరుగుతుంది అని ఆదిశంకరా చార్యులు సౌందర్యలహరిలో చెప్పారు. శివ, శక్తులు రెండు కలిస్తేనే సృష్టి జరుగుతుంది. ఆధునిక విజ్ఞానశాస్త్రం ప్రకారం కూడా తల్లి కణం లేదా తండ్రి కణం ఒకటి కలిస్తే సృష్టి ఏర్పడదు. స్త్రీ పురుష కణాలు కలసి ఏక కణం కావాలి. ఆ విధంగా ఏకీభూతం అయ్యే సంధిని ‘ఆయుతం’ అంటాం. అంటే శివశక్త్యాయుక్తః అని అర్థం. కలయిక అనేది అద్భుతమైన సృష్టి. ఉదా|| హైడ్రోజన్‌ అనేది ఒక శక్తి, ఆక్సిజన్‌ అనేది ఒక శక్తి, ఈ రెండింటిని ఒక నిష్పత్తిలో కలిపితే నీరు ఏర్పడుతుంది. రెండు శక్తులు విడివిడిగా వుంటే శక్తి కాదు అనేది సృష్టి ధర్మం. రెండు పదార్థాల్లోని రెండు రకాల శక్తులు కలసి ఇచ్చిపుచ్చుకొని ఒకటైనప్పుడు బయటకు వ్యక్తమయ్యేది సృష్టి. ఇది ఒక జ్ఞానంతో కూడుకొన్న ప్రక్రియ. మన చేతికి హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ ఇచ్చి నీరు తయారు చేయమంటే చేయలేం. ఒక మామిడి విత్తనం ఇచ్చి చెట్టు చేయమంటే చేయలేం. అది ఎక్కడ పడితే చెట్టు అవుతోంది అక్కడ పడాలి.

కాబట్టి ఈ సృష్టిధర్మాన్ని, సృష్టిశక్తిని ‘హ్రీం’ అనే బీజాక్షరంతో చెప్పారు. నమశ్శివాయ అనగానే శివుడు అనుకొంటాం. అలాకాదు, న అంటే నభము (ఆకాశము), మ అంటే మరు (గాలి), శి అంటే శిఖ (అగ్ని), వా అంటే వారి (జలం), య అంటే యజ్ఞం (పృథివి) పంచభూతాలను మనం ఆవాహన చేసుకొంటున్నామని అర్థం. ఈ పంచభూతాలను జ్ఞానంతో శక్తియుక్తమైన విధానంతో సృష్టి చేయడానికి కావలసినది ‘హ్రీం’ అనే బీజం. నమశ్శివాయ అనేది పంచభూతాలకు సంకేతం. ‘హ్రీం’, నమశ్శివాయ కలిస్తేనే సృష్టి. అయితే ఆ పరమాత్మ హ్రీం అనే శక్తి కంటే అతీతుడు. పంచభూతాల (నమశ్శివాయ) కంటే అతీతుడు. ఆ పరమాత్ముడే ‘ఓం’. అందుకనే ఓం హ్రీం నమశ్శివాయ అనేది క్రమం. నమ శ్శివాయకు పైనున్న ‘హ్రీం’ అనేది పంచభూతాలను కలిపి సర్వశక్తివంతమైన సృష్టిగా మార్చగలిగే శక్తి. అన్నిటికీ అతీతమైన వాడు పరమాత్మ. అందుకే అన్నిటికన్నా పైన ‘ఓం’ ఉంది. ఈ ఓం హ్రీం నమశ్శివాయను షడక్షరీ అనిగాని, శక్తి పంచాక్షరి అనిగాని అంటారు. శక్తితో కూడుకొన్న పంచాక్షరి అని అర్థం. నమశ్శివాయ అనే పంచాక్షరి మంత్రానికి ‘హ్రీం’ కలిసినపుడు అక్కడ అమ్మవారిని, ఈశ్వరుని ఇద్దరినీ ఒకే పదంతో ధ్యానించినవార మవుతాం. పరమాత్ముడు ప్రకృతి కంటే వేరు కాదు అనేది హిందూ సంస్కృతి. ఇతర మతాలవారు సృష్టి వేరు, సృష్టికర్త వేరని అంటారు. అందుకని ఈ భూమిమీద వారు దేవుని పూజించరు. దేవుడు ఈ భూమిమీద లేడు, ఎక్కడో వున్నాడని నమ్ముతారు. కాబట్టి ఈ భూమిమీద వారెలా అయినా బ్రతుకవచ్చు అనుకొం టారు. దేవుడు దగ్గర మాత్రం బాగుండాలనేది వారి నియమం. ఉదా|| ఒక వ్యక్తి ఇంటిలో లేనప్పుడు పిల్లలు ఎలా పడితే అలా ఉండి, ఆ వ్యక్తి ఉన్నపుడు ఒక పద్ధతి ప్రకారం ఉన్నారంటే ఆ పిల్లలలో రెండు రకాల ధోరణులు అలవాటయ్యాయని అర్థం. మనస్తత్వ శాస్త్రం ప్రకారం దీనిని భిన్న వ్యక్తిత్వం అంటారు. ఇలా ఉండకూడదని ఒకే విధంగా వుండాలని మన హిందూ సంస్కృతి చెపుతుంది. అక్కడ, ఇక్కడ, సర్వత్రా ఉన్నది పరమాత్ముడేనని, ఎక్కడైనా ఒకేలా ఉండాలని మన సంస్కృతి చెపుతున్నది. ఉదాహరణకు సూర్యుడు (వెలుతురు) ఉన్నపుడు ఒక విధంగా, చీకటి పడిన తర్వాత మరొక విధంగా ఉండటం (ప్రవర్తించడం) హిందువులకు ఇష్టంలేదు. కనుక ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే విధంగా ఉండటమే మన సంస్కృతి మనకు నేర్పింది. ఇదే మన సనాతన భారతీయ సంస్కృతి. అద్వైతం అంటేనే రెండవ రకంగా ఉండకపోవడం. ఒకటిగానే ఉంటాను. ప్రాణం పోయినా మాట తప్పను అనేది మన నమ్మకం.

అందుకని శివరాత్రినాడు అఖండమైన జాగరణ కాని, ఉపవాసం కాని, వ్రతం కాని ఇవన్నీ ఎందుకు చెయ్యాలంటే ఈ రోజు కేవలం ఈశ్వరుని పేరుతో పరమాత్మ భావంతో పూర్తిగా ధ్యానించడం కొరకు చేయాలి. ఇది శివతత్వం. శివుని ఒక ఆకారంగా చూడాలనుకొన్నపుడు జటాజూటం, కళ్లు, ముక్కు ఇలా చూస్తాం. శివుడు బూడిద పూసుకొంటున్నాడంటే ఆయన పిచ్చివాడై కాదు. నీవు ఎపుడో ఒకప్పుడు కాలిబూడిదై పోయి నాలో కలసిపోతావని గుర్తు చేయడానికేనని మనం భావించాలి. 5 తలలున్న శివుని బొమ్మని చూస్తుంటాం. 5 రకాల మెదడు భాగాలుంటాయి (ముందు, వెనుక, ఎడమ, కుడి, మధ్యభాగాలు). ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తుందని ఈనాడు డాక్టర్లు చెప్పే విషయాన్ని ఏనాడో శివునికి ఆపాదించి 5 తలలు ఉన్నట్లు మనవారు చెప్పారు. ఇంతటి అద్భుత విజ్ఞానాన్ని ఆర్య సంస్కృతిలోని దేవాలయాల ద్వారా దేవుని రూపంతో చిత్రీకరించి మనిషి దేవుని కంటే వేరు కాదు అని మనకు బోధించారు. శివుని ఒక్కొక్క తలకు ఒక్కొక్క మంత్రం వుంది. 1.తూర్పు. 2. వామదేవ. 3. అఘోర. 4 తత్పురుష. 5. ఈశాన అనేవి పేర్లు. శివారాధనలో ఈ 5 ముఖాలపేర్లతో మంత్రోచ్ఛారణ చేస్తారు.

‘సద్యోజాతం ప్రపద్యామి – సద్యోజాతయవై నమో నమః

భవేభవేనాతి భవేభవస్యమామ్‌ – భవేద్భవాయ నమః’

శివుని సద్యోజాతుడు, వామదేవుడు, అఘోరుడు, తత్ఫురుషుడు, ఈశానుడు అని ఈ 5 పేర్లతో పిలుస్తాము. 5 ముఖాలు అంటే 5 పంచభూతాలు. శివుని ఆరాధన ద్వారా సాత్వికభావాలు కలగడానికి పంచభూతాలను ఆవాహన చేసి వాటితో మమేకం అవుతాం. అందుకని ఈశ్వరాధన చేసేవారికి ప్రకృతి అనేది పరమాత్మకంటే వేరు కాదనే భావన కలుగుతుంది. ఉదాహరణకు నీళ్ళకు హారతి నిస్తాం. ఆకాశాని (సూర్యుని) కి, నిద్రలేవగానే భూమికి నమస్కరిస్తాం. వాయువు, అగ్నికి దణ్ణం పెడతాం. ఈ విధంగా పంచభూతాలను ఆరాధించి ప్రకృతిని గౌరవించే గుణం ఈ భూమి మీద కేవలం హిందువులకే దక్కింది. ఆ సృష్టికర్తయైన పరమాత్మ ప్రతి జీవి హృదయస్థానంలో ఉన్నాడని కృష్ణుడు గీతలో చెప్పాడు. ప్రతి జీవికి కేంద్ర బిందువై ఉన్నాడు, ఆ కేంద్ర బిందువు నుండే ప్రాణికి శక్తి అందుచున్నది.

ప్రతిరోజు శివుడిని ఆరాధిస్తాం. శివరాత్రి పౌరాణికంగా లింగోద్భవ దర్శనం అయిందని, ఆ సమయంలో బ్రహ్మ, విష్ణువులిద్దరికీ శివుడు దర్శనం ఇచ్చాడని ప్రతీతి. ఆ తత్వానికి గుర్తుగా మనం శివరాత్రిని ఆరాధిస్తాం.

ప్ర : శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేస్తే ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మీరేమంటారు?

స : ముక్తి 2 రకాలు. 1) ఐహిక ముక్తి. ఇందులో మనకున్న కష్టాలు, బాధల నుండి బయట పడటానికి మన ప్రయత్నించాలి. దీనికి పరమాత్మ అనుగ్రహం చాలా ముఖ్యం. 2) పరమాత్మ అనుగ్రహం కొరకు చేసే సాధనల్లో అన్నం, నిద్ర మాని, ప్రపంచాన్ని పక్కనపెట్టి తపస్సుచేసే రోజు శివరాత్రి. మన ఋషులు జీవితకాలం తపస్సు చేశారు. కలియుగంలో జీవితకాలం చేయలేం కనుక ఒకరోజు అవకాశం ఇచ్చాడు. సంవత్సరంలో ఒకరోజు చేసినా శక్తివంతులవుతారని మన ఋషులు చెపుతున్నారు. అందుకే జన్మకో శివరాత్రి అంటారు. అంటే జీవితకాలానికి ఒక శివరాత్రి కాదు. సంవత్సరానికి ఒక రోజు (శివరాత్రి).

ప్ర : ఈ రోజుల్లో యువత దేవాలయానికి రావడం ఎక్కువైంది? అలా వారు వస్తున్నది వారి కోరికను తీర్చమని అడగడానికి తప్ప దేవునిపై నిజమైన భక్తితో కాదని కొందరి అభిప్రాయం. మీరేమంటారు?

స : భగవంతుడిని 2 రకాలుగా చూస్తాము. 1) ధ్యానంతో పరమాత్మ తత్వంతో అనుసంధాన మవడం అనేది జ్ఞానమార్గం. 2) అలా కాకుండా ఒక గుడి, ఒక మూర్తి, ఒక ఆరాధన, ఒక ప్రక్రియ మొదలైన పద్ధతులు పెట్టామంటే అక్కడ కష్టాలు, బాధల నుండి మనల్ని బయట పడేయడానికి అదనపు శక్తి మనకి కావాలి. కాబట్టి ఆ శక్తి అనుగ్రహం కోసం మనం దేవాలయానికి వెళుతుంటాం. నేను బయట తిరుగుతున్నపుడు గాలి పుష్కలంగా ఉంటుంది కనుక ఫ్యాన్‌ అవసరం లేదు. అదే గదిలో కూర్చున్నపుడు ఫ్యాన్‌ కావాలి. అంటే ఉన్న గాలిని కేంద్రీకృతం చేసి యంత్రం ద్వారా నేను గాలిని పొందుతున్నట్లే పరమాత్మ అనుగ్రహం కావాలనున్నపుడు నేను ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి. దైవానుగ్రహం కొరకు అనుష్ఠానం చేయడం ద్వారా నా మనసు అక్కడ లగ్నం చేయడం, నా కోరికను పరమాత్మునికి సమర్పించడం ఇవన్నీ ప్రక్రియలు. అయితే నేను పొందాల్సిన వాటికంటే తృప్తిగా ఉన్నాను. పరమాత్మ అనుగ్రహం పొందాలని భావించిన వ్యక్తికి ఈ మార్గం అవసరం లేదు. అతను కూర్చొన్నచోట నుండే సాధన చేసి అంతర్ముఖుడై పరమాత్మతో అనుసంధానమవ్వచ్చు. ఆ ధ్యానమార్గంలో జ్ఞానాన్ని పొందుతారు. ఆ స్థితిని పొందలేనివారు, నా ప్రయత్నంతోబాటు భగవంతుని అనుగ్రహం ఉండాలనుకొనేవాళ్ళు గుడికి వెళ్ళడంలో తప్పులేదు. దేవాలయం ఉండేది అందుకే. దేవాలయంలో దేవుని విగ్రహం కింద యంత్ర ప్రతిష్ఠ ఉంది. మంత్ర ఆవాహన ద్వారా శక్తి జాగరణ జరుగుతుంది. నిత్య అనుష్ఠానం, పారాయణం, ¬మం, జపాలతో శక్తి జాగృతమవుతుంది. కనుక దేవాలయం అంటే దేవునికి ఆలయం మాత్రమే కాదు- శక్తికి కేంద్రం. దేవాలయంపై దాడిచేసి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మరొక విగ్రహం పెట్టుకోవచ్చు. కాని అక్కడ ధ్వంసం చేయబడింది శక్తి, మన నమ్మకం. కనుక ఇలాంటి సమయంలో ఇంకొక విగ్రహం పెట్టుకోవడంతో హిందువులు సరిపెట్టుకోకూడదు. దీనిని సహించరాదు.

ఇలాంటి శక్తి కేంద్రానికి యువతరం తప్పక వెళ్ళాలి. ప్రపంచంలోనే గొప్పగా ఉన్నతాశయాలను సాధించాలని, దీనికి భగవత్‌ శక్తిని ఆసరాగా పొందాలనే నమ్మకంతో వెళ్ళాలి. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికెళ్ళి అక్కడ కరెంటుందా అని అడిగితే ఎలా ఆక్షేపణీయమో అలాగే గుడికెళ్లి అక్కడ శక్తి ఉందా అని అడగటం కూడా ఆక్షేపణీయమే. గుడికెళ్ళి విగ్రహం ముందు నిలబడగానే తెలియని అలౌకిక స్థితిలోకి మనం వెళ్ళిపోతుంటాం. అదే శక్తి. అలాగే కొందరి వ్యక్తుల పరిసరాల్లో కూర్చోగానే కొంతసేపటికి మనకి తెలియకుండానే అలౌకిక స్థితిలోకి వెళ్ళిపోతుంటాం. దానికి కారణం ఆ వ్యక్తి సంకల్పం, మంచి ఆలోచనలు, అతని అనుష్ఠానం మొదలైనవి. ఒక వ్యక్తే ఇంతగా ప్రభావితం చేస్తుంటే, దేవాలయాలలో శక్తి ద్వారా ఇంకెంతో ప్రభావితులవుతార. అయితే నేడు యువతరం వేలం వెర్రిగా గాకుండా సాధనా భావంతో గుడికి వెళ్ళాలి. వెళ్ళి భగవంతుని ధ్యానించి, ఆ శక్తిని ఆవాహన చేసుకొని అనుభూతికి లోనైన వ్యక్తికి తప్పక భగవత్‌ శక్తి లభిస్తుంది.

ప్ర : దేవాలయం ఉన్నది కేవలం భక్తి కోసమేనా? దేశభక్తి గురించి ప్రవచనాలు చెప్పే వ్యవస్థ దేవాలయాల్లో ఎందుకు లేదు?

స : పూర్వం దేవాలయాలు అంటే ఆధ్యాత్మిక, సామాజిక స్ఫూర్తి కేంద్రాలుగా ఉండేవి. ఆధ్యాత్మిక స్ఫూర్తి అంటే ఒక వ్యక్తి గుడికెళ్ళినపుడు ఆ వ్యక్తిలో శుద్ధ సాత్విక భావన పెంపొందుతుంది. అతనిలో రుగ్మతలు, మానసిక దారిద్య్రం, అలజడి తగ్గించి శాంతినిస్తుంది. అక్కడ ఇచ్చే తీర్థం ఔషధం, అకాలమృత్యు హరణం అని చెప్పే మంత్రంలోని భావం ఎంతో గొప్పది. మానసిక స్థితిని కోల్పోయి తన్ను తాను చంపుకోవడం, చంపడం వంటి ప్రమాదాలు నివారణవ్వాలని మంత్రం మొదటి పాదంలో ఉంది. సర్వవ్యాధి నివారణం అంటే వాత, కఫ, పిత్త ప్రకోపాల ద్వారా కలిగే అన్ని వ్యాధులు నివారణకు తీర్థం ఇస్తారు. తీర్థంలో కలిపే పచ్చ కర్పూరం కఫాన్ని, తులసి వాతాన్ని, గంధం పిత్తాన్ని సమతౌల్యం చేయడానికి ఉపయోగపడతాయి. సమస్త పాప క్షయం అని 3వ పాదంలో ఉంది. ఈ ఔషధాన్ని భగవంతుని ముందుపెట్టి జపంచేసి దేవతా శక్తిని అందులోకి ఆవాహన చేసి, స్వామీ! నీ దగ్గరకు వచ్చిన నీ బిడ్డలు ఆరోగ్యకరంగా ఉండాలని పూజారి కోరుకొంటూ ఇచ్చే తీర్థం అది. దాని వెనక ఇంత తత్వం వుంది. అందరికీ కలిపి ఒకేసారి మంత్రాన్ని చెప్పకుండా ప్రతి వ్యక్తికి తీర్థం ఇచ్చి మంత్రం పఠిస్తాడు. ప్రతి వ్యక్తిని గౌరవిస్తాడు. ప్రతి వ్యక్తిని స్పృశిస్తాడు. ఇదీ మనదైన గొప్ప సంస్కృతి. వైద్యాన్ని అనుసరించి మంత్ర విద్యను అనుసంధానం చేస్తారు.

దేవాలయం కేంద్రంగా విద్య, వైద్యం ఉచితంగా అందించేవారు. ఆకలి తీర్చేవారు, బాటసారులకు వసతి ఉండేది. వీటన్నింటిని కలిపే దేవాలయం అన్నారు. వీటన్నింటినీ తీసివేసి దేవాలయాన్ని ‘కో’వెల చేశారు. అర్చనకో వెల ప్రసాదానికో వెల, దర్శనానికో వెలగా మార్చేసారు. ఇది కేవలం మెకాలే భావజాలం. దేవాలయం కేంద్రంగా విద్యతోబాటు సంస్కృతిని, వైద్యంతోబాటు సంస్కారాన్ని అన్నంతో బాటు సామాజిక స్ఫూర్తిని ఇచ్చారు మన పూర్వులు. మెకాలే వచ్చాక వీటన్నింటిని వేరుచేసి, మన నడ్డి విరిచాడు. అందుకే నేడు ¬టళ్ళు, కార్పొరేటు హాస్పిటళ్లు, లాడ్జిలు, కార్పొరేటు విద్యాసంస్థలు వచ్చాయి.

ఆనాడు ఉచితంగా సమాజానికి అందించిన దేవాలయ వ్యవస్థ గొప్పదా? అన్ని సౌకర్యాలను డబ్బుతో కొనుక్కోమని కార్పొరేటు వ్యవస్థల కప్ప చెప్పిన ప్రభుత్వం గొప్పదా? ఈ వ్యవస్థ దూరమైనందున మతమార్పిడులు జరుగుతున్నాయి. ఇంకా గుడి కేంద్రంగా సాంస్కృతిక వినోద కార్యక్రమాలు, నృత్యాలు, సత్సంగాలు ఉచితంగా ప్రజలకు లభించేవి. నేడు వాటి స్థానంలో సినిమా హాళ్లు వచ్చాయి. పిల్లలకు ఆటల మైదానంగా దేవాలయం ఉండేది. తల్లిలాంటి దేవాలయ వ్యవస్థలను ముక్కలు చేసి కేవలం విగ్రహాన్ని మిగిల్చి- దాని దర్శనానికి కూడా డబ్బులు దండుకొనే స్తితికి తీసుకొచ్చింది నేటి ప్రభుత్వం. తిరిగి పూర్వ స్థితి రావాలంటే ప్రజా పోరాటం రావాలి. దేవాలయ వ్యవస్థ మారితే మనం మారినట్లే.

రాజకీయ కబంధ హస్తాల నుండి ఒక స్వచ్ఛమైన హిందూ వ్యవస్థలోకి దేవాలయాలు రావాలి. ప్రసాదాలు, పూజలు, దర్శనాలు, చివరకు వాహనం నిలబెట్టాలన్నా అన్నిచోట్ల డబ్బులు చెల్లించాలి. సినిమా చూడాలని సినిమాహాల్‌కెళ్ళినా, భగవద్దర్శ నార్థం గుడికెళ్ళినా తేడా ఏముంది ? అక్కడా సినిమాకు టికెట్టు, తినుబండరాలకు డబ్బు, పార్కింగ్‌కు టోకన్‌. రెండింటికి తేడా లేకుండా పోయింది. సినిమా ఎంతో దేవాలయం అంతే అనే సందేశం ప్రజల్లోకి వెళ్ళింది. ఇది మారాలంటే ప్రజా పోరాటాల ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. మన దేవాలయ వ్యవస్థ పునరుద్ధరించాలనే సంకల్పంతో ఉద్యమిద్దాం. దానికి శివుని అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం.

ప్ర : హిందూత్వ వ్యవస్థలో స్వామీజీల పాత్ర ఏమిటి?

స : స్వామీజీలే హిందూ వ్యవస్థలో అసలు పాత్రధారులు. కాని ఈ రోజుల్లో స్వామీజీలకు రకరకాల పాత్రలు వచ్చేసాయి. ఇక తప్పనిసరి పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వాలకు అణిగిమణిగి ఉండకపోతే జైళ్ళలో పడేస్తున్నారు. ఈవాళ ధర్మం మీద జరిగినన్ని దారుణాలు స్వామీజీల మీద కూడా జరుగుతున్నాయి. అందరి గురించి చెప్పడం లేదు. కొందరిలో వ్యక్తిగత అవకతవకలు, వారి బలహీనతలు వలన ఇబ్బందిపడే వారున్నారు. వ్యక్తిగత స్వార్థాలను, వ్యక్తిత్వాలను, పక్కనపెట్టి ధర్మం నా లక్ష్యం అని ఎంచుకొని ముందుకు సాగే సాధువులపై కూడా అకారణంగా, అమానుషంగా దాడులు ఎక్కువ య్యాయి. ఒక వ్యక్తి గాయం తగిలినా స్పందించకపోతే మరణించినవాడితో సమానం. ధర్మాచార్యులు కూడా హిందూత్వానికి దెబ్బ తగిలినపుడు స్పందించాలి. హిందుత్వమే వారి వ్యక్తిత్వం. స్పందిస్తే నాకేమవు తుందో, ప్రభుత్వం తొక్కేస్తుందో, సమాజం అంగీకరిస్తుందో లేదో అని భయపడరాదు. మఠాలు, ఆస్తులు నీవి కావు, అన్ని వదిలేసే గదా సన్యసించింది. మఠంను పరమాత్ముడే కాపాడుకొంటాడు. ‘హిందుత్వమే నా ఆస్తి, ఈ ధర్మమే నా ఉనికి’ అని దీని కోసం ఎంత దూరమైనా వెళ్లాని సాధువులు అనుకోవాలి. దానికోసం లౌకికమా, వ్యవహారికమా, ఆధ్యాత్మికమా, రాజకీయమా ఈ నాల్గింటిలో ఏ మార్గాన్నైనా అనుసరించి ధర్మస్థాపన చేయాలి. ఆ తర్వాత దులుపేసుకొని తన యథాస్థితిలోకి రావాలి. అడవిలో రాత్రి నడుస్తున్నపుడు ముందు ఏ క్రూర మృగముందో, నూయి ుందో అవి భయపడకుండా బాటసారి ముందుకే వెళ్ళినట్లు సాధువు కూడా ద్వంద్వ భావనతో గాకుండా ధర్మస్థాపన కోసం ముందుకే సాగాలి. ముందుకు అడుగులు భగవంతుడే వేయిస్తున్నపుడు భయపడే అవసరం లేదు. స్వచ్ఛతే కాపాడుతుంది. స్వార్థం ఉంటే అందరికీ తెలుస్తుంది. ప్రకృతి ముందు ఏదీ దాగదు. ఏమీ దాచలేం.

ప్ర : ఒక సాధారణ హిందువు తనను, తన కటుంబాన్ని పోషించుకుంటూ వీలైనపుడు దైవచింతన చేస్తుంటాడు ? ఇటువంటివారు ముక్తిని పొందే అవకాశం ఉందా ?

స : సాధారణంగా తాను బ్రతకాలి, తన కుటుంబం సుఖంగా ఉండాలనేది వ్యక్తికి ప్రధాన కర్తవ్యం. దీనితోబాటు మనం ఈ భూమి మీద పుట్టాం. మన జీవిత కాలంలో మన కుటుంబం కోసం, మన కోసం బ్రతుకుతూ, ఈ భూమి మీదకు దేనికి వచ్చాం, దేనికి వెళ్ళిపోతున్నాం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తుంది. ఆ అవగాహన అతనిని ముక్తివైపు నడిపిస్తుంది.

ప్ర : హిందూ దేవాలయాలను తేలిక భావనతో చూస్తున్నారు. ఉదాహరణకు కోటప్పకొండపై శివునిపక్కన శిలువ ఏర్పాటు చేశారు? ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి కారణం ఏమిటి?

స : ప్రభుత్వాల వైఖరి, ప్రభుత్వ నిర్లిప్తత, సెక్యులరిజం పేరుతో హిందుత్వంపై దాడి జరుగుతూ న్నది. హిందువుల పట్ల వివక్ష ఉంది. దేవీదేవతలను నిర్లజ్జగా నోటికొచ్చినట్లు దూషించేవారిని ఎమ్‌.ఎల్‌.ఏ., ఎమ్‌.పి.లుగా మనం భరిస్తూ వారిని ఏమీ అనలేని స్థితి. అదే పాకిస్థాన్‌లో బొట్టుపెట్టుకొని బయట తిరిగినందుకు నరికేసారు. కాని భారత్‌లో విధర్మీయులై ఉండి హిందూ దేవతలను తిట్టవచ్చు; దుర్గామాతను సెక్స్‌వర్కర్‌ అని, గణపతి తొండాన్ని పురుషాంగంతో పోల్చి వ్యంగ్యంగా, అసహ్యంగా మాట్లాడుతుంటే వారిని పల్లెత్తు మాట అనలేని స్థితి. అంతేకాదు ప్రజా ప్రతినిధులుగా, మంత్రులుగా చలామణి అయి తిష్ఠవేస్తున్నారు. అందుకే విధానాల్లో మార్పు రావాలి. ఒక హిందువుగా, పరిపూర్ణా నందంగా ఇతరులు నమ్మిన దేవుడిని తిట్టరాదు. వారి దేవునిపై నమ్మకం వారి ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కులను భంగపరిస్తే ఎవరూ సహించరు. ప్రభుత్వాల ఉదాసీనత వల్లే ఇలా జరుగుతోంది. హిందూసంస్కృతి హిందువుల ప్రాథమిక హక్కు. దానికి రక్షణ కల్పించకపోతే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్లు ? పైగా వాళ్ళ ప్రార్థనా స్థలాలకు స్వేచ్ఛనిచ్ఛారు. మన గుడులను ప్రభుత్వం గుప్పెట్లో పెట్టుకొంది. వారికి స్వేచ్ఛ, మనకు శిక్ష. ఈ పరిస్థితి మారాలి.

ప్ర : హిందూ దేవాలయాల నిర్వహణ ఏ పద్ధతిలో ఉండాలనుకుంటున్నారు? ఉదాహరణకు మన దక్షిణాదిలోని మందిరాలు ఎండోమెంట్‌ చేతుల్లో ఉన్నాయి?

స : ఎండోమెంటు అనేది హిందువుల కొరకు ప్రభుత్వం తయారుచేసిన మహాభూతం. హిందువులను, హిందూసంస్కృతిని మింగడానికే ఈ భూతాన్ని తయారుచేసారు. ప్రతిరోజూ తిరుపతిలో 3 కోట్లు, శ్రీశైలంలో 2 కోట్లు హుండీ ఆదాయం అనీ, టికెట్ల ఆదాయం ఇంత, అంత అని దేవాల యాలను ఆదాయ వనరులుగా తయారుచేసారు. నేను నమ్మకంతో హుండీలో వేసిన రూపాయి కావచ్చు, పూజకు చెల్లించిన సొమ్ము కావచ్చు ఏమవుతున్నాయో తెలుసుకొనే హక్కు హిందువులకుంది. జవాబుదారీ తనం ప్రభుత్వానికి లేదా? అప్పు కోసం బ్యాంకుకు వెళ్ళినపుడు మన ఆస్తిపత్రాలు పెట్టినా అప్పు దేని కోసం తీసుకొంటున్నామనే వివరాలు (ప్రాజెక్టు రిపోర్టు) అడుగుతున్నపుడు గుడిలో మనం శ్రద్ధగా సమర్పించే ప్రతి పైసా లెక్క మనం తెలుసుకోగోరడం తప్పు కాదు. తెలుసుకోవడం మన ప్రాథమిక హక్కు. ప్రతి వ్యక్తి దీనిని ప్రశ్నించాలి. విచ్చలవిడితనం దేవాలయ వ్యవస్థల్లో పెరిగి, రాజకీయాలకు అడ్డాగా మారుతున్నాయి. దీనిని తరిమికొడదాం. దేవాలయాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉండాలి. కానీ దానికి సమాంతరంగా ఒక హిందూ బోర్డు ఉండాలి. ఈ బోర్డులో ఉండే వారు శ్రేష్ఠమైన వ్యక్తులై ధర్మానికి కట్టుబడిన వారుగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వ యంత్రాంగం, హిందూ బోర్డు కలసి తీసుకోవాలి. అపుడే ఎండోమెంటు అనే భూతం నుండి బయటపడతాం. అవినీతి నిరోధక శాఖవారు ఒకరిని పట్టుకొంటే 100 కోట్లు, ఇంకొకరిని పట్టుకొంటే 200 కోట్లు మింగేసారని తేలింది. మన దేవాలయాల సంవత్సరాదాయం 3450 కోట్ల రూపాయలు. ఈ డబ్బుతో నేను ఉభయ రాష్ట్రాల్లోని 1200 మండలాల్లో ప్రతి మండలానికి దేవాలయ కేంద్రంగా విద్య, వైద్యం, రైతులకు విత్తనాల పంపిణీ, గో సంరక్షణ, స్త్రీలకు స్వయం ఉపాధి ఉచితంగా కల్పించడం ద్వారా సంస్కారవంత మైన సమాజాన్ని తయారుచేయగలను. మూతబడ్డ 15 వేల దేవాలయాలను మళ్ళీ తెరిపించగలను. ఆ డబ్బు భగవంతునిది కూడా కాదు. కష్టపడి శ్రమించిన భక్తునిది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చెత్తశుద్ధి తప్ప. ఆ చెత్త పోవాలి.

ప్ర : అద్దంకి రంజడిత్‌ ఓఫిర్‌ రాసిన ‘హైందవం – క్రైస్తవం’ పుస్తకం పట్ల హిందూ సమాజంలో స్పందన ఉండాల్సినంత ఉందనుకుంటున్నారా? ఇలాంటి పరిస్థితులు మరల తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి?

స : సమాజంలో ఓఫిర్‌ లాంటి వారే కాదు, మేం పావులం అని చెప్పుకొనేవారు చాలామంది ఉన్నారు. వీరంతా ముందు ఈ పాపపు పనులు మానుకోవాలి. నీవు ఈ మతాన్ని నమ్మనపుడు దీనిలో వేలు పెట్టవద్దు. ప్రతిసారి పాపపు పనులు చేస్తుంటే ఎన్నిసార్లు క్షమించాలి. ఉదయం పాపం చేసి సాయంత్రం క్షమాభిక్ష అడిగితే ఎలా? అలా మనం క్షమిస్తూ పోతుంటే అది మంచిగుణం అనిపించుకోదు. మన చేతగానితనం అవుతుంది. దానికి తగు రీతిలో సమాధానం చెప్పాలి. మనం అడవిలోకి వెళ్ళినపుడు క్రూరమృగం మనపై దాడిచేస్తే తప్పు దానిది కాదు. అదే క్రూర మృగం ఒక ఊరిలో ప్రవేశించి నీపై దాడిచేస్తే తప్పు దానిదే. దాన్ని చంపమంటారు. అడవిలోకి వెళ్ళి, వేటాడి చంపితే మనల్ని జైల్లో పెడతారు. నేను ఇతర మతాల్ని విమర్శిస్తే నన్ను జైల్లో పెట్టాలి. కాని ఇతర మతస్థులు వచ్చి నా దేవుడిని తిట్టి, నా నమ్మకాన్ని, నా ధర్మాన్ని వమ్ము చేస్తుంటే భరించే ప్రసక్తే లేదు. ప్రభుత్వాల చేతగానితనంతో పట్టించుకోవడం లేదు. కనుక ప్రజలే దీనిని అడ్డుకోవాలి. నన్ను నేను కాపాడుకొనే మార్గంలో కూడా ప్రభుత్వాలు అడ్డు తగలవచ్చు. అందరినీ రక్షిస్తామని ప్రతిజ్ఞ తీసుకొన్న ప్రభుత్వాలే హిందువులకు అడ్డు తగులుతున్నపుడు హిందూ సమాజం మేలుకోవాలి.

ప్ర : శ్రీ పీఠం గురించి ఏమైనా చెప్పుతారా?

స : శ్రీ అంటే జ్ఞానం. భారతదేశమే ఒక శ్రీ పీఠం. ప్రత్యేకించి నా దృష్టిలో భారతమాతే పీఠాధిపతి. నిరంతరం జ్ఞానాన్నిచ్చేది ఈ భారత భూమి. ప్రపంచంలో జ్ఞానానికి వేదిక భారతభూమి. దానికి పీఠాధిపతి ఎవరు అంటే నేను పూజించే భారతమాతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *