పంచారామాలు

పంచారామాలు

పరమ శివుడు కొలువైన పంచారామ క్షేత్రాలు (అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు.

పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.

రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ.

మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు.

నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా గునుపుండి (భీమవరం) లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజ లందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది.

ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు.

పంచారామాలన్ని ఒకే రోజులో సందర్శించాలను కుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు.

1. అమరారామం

శంకరుడులో ‘శం’ అంటే శుభాన్ని, ‘కరుడు’ అంటే కలిగించే వాడనే అర్థం దాగుంది. స్థల పురాణం ప్రకారం తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి తారకుని కంఠంలో ఉన్న శివలింగాన్ని చేధించగా ఏర్పడిన అయిదు శకలాల్లో (ముక్కలు) పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం. ఈ అమరావతి పూర్వ నామం ‘ధాన్య కటకం’.

కృష్ణా నదీ తీరంలో వెలసిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. అందువల్లే ఇక్కడి శివయ్య అమరేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాలలో చెప్పారు. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్థంభాలున్నాయి. దక్షిణ ముఖంగా ముఖ మండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణవేణి ప్రవాహం ఉంది. దీనినే ‘పంచాయతన క్షేత్రం’ అంటారు. దీనికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. మూల విరాట్‌ శ్రీ అమరలింగేశ్వర స్వామి. ఈయన మూడు అడుగుల ఎత్తులో లింగాకారుడై కొలువు తీరాడు. పై అంతస్తులో తొమ్మిది అడుగుల ఎత్తైన లింగం ఉంది. అమరావతి క్షేత్రం నుంచి కృష్ణానది ఎనిమిది వందల మైళ్ళు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.

కృష్ణానదీ తీరానికి దగ్గరున్న ఈ అమరావతి క్షేత్రంలో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకునే భక్తులు జీవన ముక్తులవుతారని పురాణాలలో చెప్పారు. త్రిలోక ప్రసిద్ధమైన ఈ అమరేశ్వర తీర్థం ఉత్తమమైంది. అమరేశ్వరస్వామిని దర్శించడం వలన వేయి గోవులను దానమిచ్చిన ఫలితంతో పాటు, పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం. ఇక్కడ శివుణ్ణి ప్రణవేశ్వరుడు, అగస్తేశ్వరుడు, కోసలేశ్వరుడు, సోమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలతో కీర్తిస్తున్నారు. ఈ క్షేత్రంలో మూడు రోజులు ఉండి అమరేశ్వరున్ని భక్తితో సేవించినట్లయితే మంచి జరుగుతుందని శివ భక్తులు నమ్ముతారు.

2. ద్రాక్షారామం

ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ శివయ్య భీమేశ్వరుడిగా, స్వయంభువుగా, తత్పురుష వదనంతో మాణిక్యాంబను తన దేవేరిగా కొలువుదీరి ఉన్నాడు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ద్రాక్షారామ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లో గౌతమీ తీరంలో మహా మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో అమ్మ మాణిక్యాంబ దేవి శక్తిపీఠముంది. ఈ క్షేత్రాన్ని భోగ, మోక్షాలకు అనువైనదిగా పేర్కొంటారు.

త్రిలింగ క్షేత్రాలలో ద్వితీయమైనదిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉపలింగ క్షేత్రంగా ద్రాక్షారామం వర్ధిల్లుతోంది. పరమేశ్వరుడి అమృత లింగం రెండవ భాగం ఇక్కడ పడిందని స్థల పురాణం. తుల్యభాగుడనే రాక్షస ఋషి మధ్యవర్తిగా ఉండి గోదావరిని అంతర్వాహినిగా ప్రవహించేటట్లు చేశాడు. దీనిని సప్తఋషులైన కశ్యప, అత్రి, జమదగ్ని, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, భరద్వాజులు తీసుకొచ్చారు కావున దీన్ని సప్త గోదావరి అంటారు. నవ బ్రహ్మలలో ఒకరైన దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసినట్లు చెబుతారు. ఆ కారణంగానే ఈ ప్రాంతం ‘దక్షవాటిక’ అయింది. దక్షుని కుమార్తెలలో ఒకరైన సతీదేవిని దక్షుడు తన నివాసమైన ఈ ద్రాక్షారామంలో శంరునికి ఇచ్చి వివాహం చేశాడు. యాగ సమయంలో సతీదేవిని పిలవకపోయినా అక్కడికి వచ్చి ఆమె అవమానం పాలయింది. అల్లుడైన శివుడిని నిందించినందుకు ఆమె యోగాగ్నిలో దూకి దహనమైపోయింది. ముక్కంటి సతీదేవి శరీరాన్ని భుజంపై వేసుకుని విలయతాండవం చేస్తుంటే, మహావిష్ణువు తన చక్రంతో ఆమె దేహాన్ని 18 ముక్కలు చేశాడు. అవి పడిన ప్రాంతాలు 18 శక్తి పీఠాలయ్యాయి. ద్రాక్షారామం 12వ శక్తిపీఠమయింది. వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ఇది పౌరాణిక గాథ.

ద్రాక్షారామం ఎత్తైన రాతి ప్రహారి గోడతో, నాలుగు వైపులా నాలుగు రాజ గోపురాలతో ఐదు ప్రాకారాల మధ్య ఉంది. భక్తులు ముందు ప్రథమ ప్రాకార మండపం నుంచి కుడివైపు నాట్య గణపతిని, ఎడమవైపున ఉన్న ‘డుండి గణపతి’ని దర్శించి లోనికి వెళ్ళి, కుడివైపున శ్రీరామ ప్రతిష్ఠితమైన క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణుని దర్శించాలి. ప్రాకార దేవతలందరినీ దర్శించిన తర్వాత ప్రధాన ఆలయంలోకి ప్రవేశించాలి. అక్కడ స్వామి 14 అడుగుల ఎత్తు గల స్ఫటిక లింగాకారంలో ఉంటాడు. ఈ స్ఫటిక లింగం కింది అంతస్థు నుండి పై అంతస్థుకు ఉంటుంది. మొదట్లో కింది భాగంలో ఉన్న శ్రీ సురేశ్వరస్వామి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి, 108 శివసాల గ్రామాలతోనున్న ‘భీమసభ’కు మధ్యనున్న మూలవిరాట్‌కి ప్రదక్షిణ చేసి మూడవ ప్రాకారంలోకి ప్రవేశించాలి. ఇక్కడ పూజ, అభిషేకాలు ఉండవు. పై అంతస్థు గర్భాలయంలో మూడు వైపులా విశాలమైన కిటికీలతో కింద నుంచి పైకి వచ్చి భీమేశ్వర మహాలింగాన్ని దర్శించవచ్చు.

ఈ క్షేత్ర మహత్యాన్ని అనేకమంది కవులు, గాయకులు పొగిడినట్లుగా గ్రంథ ఆధారాలున్నాయి. క్రీ.పూ. ఒకటవ శతాబ్దం నుంచి ఈ క్షేత్రం సుప్రసిద్ధమైనట్లు ‘గాథా సప్తశతి’లో వర్ణించారు. మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి రోజులలో మాణిక్యాంబ, భీమేశ్వరస్వామితో పాటు లక్ష్మీనారాయణులకు ఉత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. మాస శివరాత్రికి, శరన్నవరాత్రులలో అమ్మవారికి విశేష కుంకుమ పూజలు, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, జ్వాలా తోరణం, మార్గశిర మాసంలో వర్ణదేవసేన సమేత కుమారస్వామికి షష్టి నుంచి, దశమి వరకు ఐదు రోజులు కళ్యాణోత్సవాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది.

3. కుమారారామం

ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ స్వామి భీమేశ్వరుడు, అమ్మవారు బాలా త్రిపుర సుందరి. ఈ కుమారారామ క్షేత్రంలో వామదేవ ముఖంతో, సత్యసుందర స్వరూపంతో కుమార స్వామి ప్రతిష్ఠించిన నీలకంఠుడు దర్శనమిస్తాడు. సామర్లకోటకు సమీపంలోని భీమవరంలో ఈ క్షేత్రం కొలువుతీరింది. దీనికి ‘స్కంధారామమని’ మరొక పేరుంది. సామర్లకోటే ‘శ్యామల కోట’గా నాడు ప్రసిద్ధి పొందింది. బొబ్బిలి యుద్ధంలో సామర్ల కోట ప్రధాన పాత్ర పోషించిందని స్థానికులు చెబుతారు. శ్యామలాదేవి విగ్రహం ఇప్పుడు ఈ కుమారారామ భీమేశ్వరాలయంలో ప్రాకార దేవతగా కొలువై ఉంది. శ్రీనాథ మహా కవి తన ‘భీమఖండం’లో కుమారారామ ప్రశస్తి గురించి తెలిపాడు.

ఈ భీమేశ్వరాలయం చుట్టూ 18 అడుగుల ఎత్తైన ప్రాకారం, నాలుగు వైపులా నాలుగు అందమైన గోపురాలున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్నే ఇదీ పోలి ఉండటం విశేషం. ఆలయం లోపలికి ప్రవేశించగానే దక్షిణ ముఖంగా వెళ్లి ప్రదక్షిణ చేస్తూ తూర్పు దిక్కునున్న కోనేరులో స్నానం చేయాలి. ఇక్కడ కొనేరును భీమగుండం, పుష్కరిణి, కుమార నది, కుమార సరస్సు అని అంటారు. ఈ కుమారారామానికి దగ్గరలో ‘కొమరేవు’ ప్రవహిస్తోంది. అమ్మవారి దర్శనం చేసుకుని రెండు మెట్లు దిగి చతురస్రాకార గర్భగుడిలో భీమేశ్వరుని పానవట్టంపై తెల్ల పాలరాతి రంగులో ఉన్న పన్నెండు అడుగుల ఎత్తైన శివలింగాన్ని దర్శించుకోవాలి. ఈ శివలింగం పై అంతస్థు వరకు ఉంటుంది. కింది అంతస్థుల్లో పూజలు ఉండవు. సూర్య, చంద్ర ద్వారాలను గర్భగుడికి నాసికా రంధ్రాలు అంటారు.

చాళుక్య భీముడనే రాజు ఈ కుమారారామ భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు. భీముడు మూడు వందల యుద్ధాలలో విజేతగా నిలిచి, తన విజయాలకు ప్రతీకగా ఈ క్షేత్రాన్ని నిర్మించాడు. భీమేశ్వరాలయానికి పడమర దిక్కున రెండు కి.మీ. దూరంలో ‘రాజా నారాయణస్వామి’ ఆలయం ఉంది. ఇక్కడ శైవ సంబంధమైన అన్ని మాసాలలో, తిథులలో పర్వదినాలలో విశేష పూజలు, కుంకుమార్చనలు, గ్రామోత్సవం, కళ్యాణోత్సవం, రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇది కాకినాడకు 11.కి.మీ. దూరంలో, రాజమండ్రికి 50 కి.మీ. దూరంలో ఉంది. గర్భగుడి లేని శివలింగం యోగలింగంగా ప్రసిద్ధి పొందింది. గొప్ప విషయమేమిటంటే ఇక్కడ గుడికి సంబంధించి చైత్ర, వైశాఖ, మాసాలలో సూర్యుని కిరణాలు ఉదయం స్వామివారి పాదాలను, సాయంకాలం అమ్మవారి పాదాలను తాకటం విశేషం.

4. సోమారామం

ఇది పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి (భీమవరం) లో వెలిసిన పవిత్ర క్షేత్రం. నీలకంధరుడు ఇక్కడ సద్యోజాతముఖుడై, నిత్య నూతన స్వరూపుడై దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఇది పంచారామాలలో నాల్గవది. గునుపూడి సోమారామంలో స్వామి ‘శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి’గా దర్శనమిస్తాడు. పంచారామాలన్నీ మహామహులు ప్రతిష్టించినవే.

అయితే మూడవ శతాబ్దికి చెందిన చాళుక్య భీముడు దీనిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ‘గౌతమీ తీరంబున, దక్షిణ కూలంబున, గునుపూడి అను గ్రామంబున, సోమునిచే ప్రతిష్టితంబగుట చేత సోమలింగంబన ప్రఖ్యాతంబై సోమారామంబును’ అని వర్ణించాడు.

స్థల పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెబితే పూర్వం తారకాసురుడనే రాక్షస శివ భక్తుడుండేవాడు. ఆ తారకుని కంఠంలో ఉన్న అమృత లింగం అతనికి ప్రాణరక్షగా నిలిచింది. అతడు అందరినీ హింసించే వాడు. ఆ బాధలు భరించలేక దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసనా లింగంలో ఉందని గ్రహించి తన అస్త్రంతో దానిని ఛేదించాడు. ఆ లింగం ఐదు ముక్కలై పలు ప్రాంతాలో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలయ్యాయి. అందులో గునుపూడిలో పడినది సోమారామమై వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ నాగభూషణుడిగా స్ఫటికలింగ రూపంలో సోమేశ్వరుడు అవతరించాడు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

అయితే ఇక్కడ సోమేశ్వర లింగం గోధుమ, నలుపు ఛాయలోను; పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోను ప్రకాశిస్తూ ఉంటుంది. సోమేశ్వర పీఠం నుండి రెండు అడుగుల ఎత్తు గల ఈ లింగాన్ని స్ఫటిక లింగంగా పేర్కొంటారు. లింగాకారం చంద్రశిల అని, చంద్రశిలలు శుక్ల, బహుళ పక్షాలలో చంద్రునిలో వచ్చే మార్పులకు అనుగుణంగా రంగు మార్చుకునే అవకాశం ఉందని కొందరు చెబుతారు. ఈ శివలింగం పై భాగంలో అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇటువంటి నిర్మాణం దేశంలో మరెక్కడా కనిపించదు. ఈశ్వరుడు గంగమ్మను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఇక్కడ ఇలా దీన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ ఆరామానికి తూర్పు వైపున చంద్రపుష్కరిణి (సోమగుండం) చెరువు ఉన్నది. ప్రతీ ఏడాది మహాశివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథయాత్ర చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. సోమగుండంలో నిర్వహించే తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సమీప గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని కనులారా చూసి ఆనందిస్తుంటారు.

5. క్షీరారామం

ఇది పశ్చిమగోదావరి జిల్లా ‘పాలకొల్లు’లో శివయ్య ఈశాన్య ముఖంతో లోకమంతా తానై, శ్రీరాముడు ప్రతిష్టించిన క్షేత్రంగా చెబుతారు. శివుని ఆత్మలింగం ఐదవ శకలమైన ఈ లింగం రామునిచే ప్రతిష్టితమైనది. బ్రహ్మ సేవించినది. ఇక్కడ పరమశివుడు అమ్మ పార్వతీ దేవితో కొలువై ఉన్నాడు. ఈ గ్రామం గురించి పూర్వం కావ్యాలలో, శాసనాలలో క్షీరపురిగా, పాలకొలనుగా, దుగ్దోపవనపురంగా, ఉప మన్యుపురంగా, పాలకోటగా వివిధ నామాలతో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పాలుకారే మర్రి, రావిచెట్లు అధికంగా ఉండటం వల్ల కూడా ఇది కాలక్రమంలో ‘పాలకొల్లు’గా రూపాంతరం చెందింది.

స్థలపురాణం ఆధారంగా చెప్పాల్సి వస్తే పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలం నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. మరో కథనం ప్రకారం ఇక్కడ ప్రతిరోజూ చేసే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరు వచ్చింది.

క్షీరారామం ఆలయంలో పార్వతీ, పరమేశ్వరులు, లక్ష్మీ, జనార్దనులు, సరస్వతీ సహిత బ్రహ్మలు కొలువై ఉండటం విశేషం. క్షేత్రపాలకుడుగా ఇక్కడ శ్రీజనార్దన స్వామివారు ఉన్నారు. ఈ క్షేత్ర శిఖరం 120 అడుగుల ఎత్తు ఉండి, దూరానికీ దర్శనమిస్తుంటుంది. గోపురంపై తపోనిష్ఠతో గల శివుడు ఇంద్రాది దిక్పాలురు, పంచముఖ పరమేశ్వరుడు, నాట్యగణపతి, లక్ష్మీగణపతి, సరస్వతి, గజలక్ష్మి, కాళీయమర్దనం, శివలీలలు, దశావతారాలు వంటి ఎన్నో శిల్పాలు దర్శనమిస్తాయి. 1774 ఏప్రిల్‌ 14వ తేదీన చిచ్చు అమ్మయ్య గౌరీ గోపుర నిర్మాణానికి పూనుకున్నట్లు స్థానికులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉత్తరాయన దక్షిణాయన కాలాలలో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పెద్ద గోపురం రెండవ అంతస్థు నుండి ప్రాకారాలను అధిగమించి రామేశ్వర లింగం మీద ప్రసరించడం అద్భుతమైన విషయం. ప్రాకార మండపంలో శిల్పకళా విరాజమాన నందీశ్వర విగ్రహం ఉంది. పడమర దిక్కున ‘రుణహార గణపతి’కి ప్రదక్షిణలు చేసి శ్రీ క్షీరారామ లింగేశ్వరుని దర్శించాలి. ఇక్కడ గణపతిని దర్శనం చేసుకుంటే అప్పుల బాధలు ఉండవని భక్తుల విశ్వాసం.

శంకర భగవత్పాదులు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ నాగేశ్వరస్వామిని దర్శించుకొని నైవేద్యం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీ రామచంద్రమూర్తి రావణ వధ దోషాన్ని పోగొట్టుకునేందుకు 108 శివలింగ ప్రతిష్ఠలతో 106 లింగాల్ని ఇక్కడ ప్రతిష్టించినట్లు పురాణాల్లో ఉంది. అందువల్లే పాలకొల్లును అపరకాశీగా పిలుస్తున్నారు.

ఈ ఆలయంలో 75 శిలాశాసనాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని చాళుక్యులు, రెడ్డిరాజులు, కాకతీయులు వంటి పలు రాజ వంశాలవారు అభివృద్ధి పరిచారు. 1176లో నాటి చోళరాజు భార్య గుండాంచిక అఖండ దీపారాధన కోసం భూదానం చేసిన ఆధారాలు కనిపిస్తాయి. చైత్ర శుద్ధ దశమినాడు స్వామివారి కళ్యాణోత్సవం, ఏకాదశి నాడు రథోత్సవం క్రమం తప్పకుండా నిర్వహిస్తారు.

శివుడు వెలసిన ఈ పంచారామ క్షేత్రాలను దర్శించి, తరించండి.

– డా|| మంతెన సూర్యనారాయణరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *